స్తోత్రగీతము – 1
హల్లెలూయా ఆరాధన
రాజాధి రాజు యేసునకే
మహిమయు ఘనతయు
సర్వాధికారి క్రీస్తునకే (2)
చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ
ఆ ప్రభుని కీర్తించెదం
నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో
స్తోత్రార్పణ చేసెదం ||హల్లెలూయా||
రూపింప బడక ముందే
నన్ను ఎరిగితివి
నా పాదములు జారకుండా
రక్షించి నడిపితివి (2) ||చప్పట్లు||
అభిషేక వస్త్రము నిచ్చి
వీరులుగా చేసితివి
అపవాది క్రియలను జయించే
ప్రార్థన శక్తినిచ్చితివి (2) ||చప్పట్లు||
స్తోత్రగీతము – 2
మహోన్నతుని చాటున నివసించువారు
సర్వశక్తుని నీడన విశ్రమించువారు “2”
ఆయనే నా ఆశ్రయము నా కోటయు నా దేవుడు “2”
“మహోన్నతుని”
1. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును
ఆయన తన రెక్కల క్రింద ఆశ్రయమునిచ్చును “2”
ఆయనే సత్యము కేడెము డాలును “2”
కృతజ్ఞతలర్పించుడి మనసారా ఆ రాజుకు హల్లెలూయ
కృతజ్ఞతలర్పించుడి మనసారా మహారాజుకు
“మహోన్నతుని”
2. నీకు ప్రక్కను వేయిమంది పడినగాని
నీ కుడి ప్రక్కన పదివేలమంది కూలినగాని “2”
కీడు నీ యొద్దకు ఎన్నడు రానియ్యడు “2”
“కృతజ్ఞతలర్పించుడి”
3. నీకు అపాయమేమియు రానే రాదుగా
ఏ తెగులు నీ గుడారము సమీపించదుగా “2”
ఆయన నిన్ను గూర్చి దూతలకాగ్నపించును “2”
“కృతజ్ఞతలర్పించుడి”
స్తోత్రగీతము – 3
బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు
శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము
సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2)
హల్లెలూయా……..హల్లెలూయా (2)
హల్లెలూయా……..హల్లెలూయా హోసన్న
హల్లెలూయా……..హల్లెలూయా
1. ఎల్ ఓలామ్ (2)
అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2)
నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు
నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2)
హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా
2. ఎల్ షద్దాయ్ (2)
పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు (2)
రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా
నీ మాటున దాచె దేవా మాటను నెరవేర్చేదేవా (2) ||హల్లెలూయా||
3. అడోనాయ్ (2)
ప్రభువైన దేవుడవు -ప్రభువులకు ప్రభువు నీవు (2)
సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు
నీవే నాకు ప్రభువు -నీవేనా యజమానుడవు (2) ||హల్లెలూయా||
ఆరాధన వర్తమానము
మనలను సజీవుల లెక్కలో ఉంచి మనము ఆయన సన్నిధికి వచ్చులాగున కృప చూపించిన దేవునికే మహిమ ఘనత కలుగును గాక! మనము మన దేవుని గూర్చి తెలుసుకున్నప్పుడు ఆయన మనలను నడిపించేవాడు అనే సత్యము మనము తెలుసుకుంటాము.
యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. -కీర్తనలు 136:1
మన దేవుడు దయ కలిగినవాడు. ఈ మాట ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన దయగల హృదయము గలవాడు కాబట్టే, మనము అనేకసార్లు తిరిగి చేర్చుకున్నారు. ఆయన దయను బట్టి, మన స్థితిని ఎరిగినవాడుగా ఉన్నాడు.
ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముండును. -కీర్తనలు 136:4
ఎక్కడ దయ కనపరచబడుతుందో, అక్కడ కృప ప్రత్యక్షపరచబడుతుంది. ఆ కృపను బట్టి మహాశ్చర్యకార్యములు చేసేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలును పిలిచి, నడిపించినంత కాలము ఆయన దయ కృప కనపరచబడుతూనే ఉన్నాయి.
అరణ్యమార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను ఆయన కృప నిరంతరముండును. -కీర్తనలు 136:16
అరణ్యమార్గమున వారు వెళుతున్నప్పుడు దేవుని దయ అవసరమైన పరిస్థితులు వచ్చాయి అని అర్థము చేసుకోగలము. అరణ్యమార్గము అంటేనే ఏ సహాయము అందించబడని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఆయన దయను కనపరచేవాడుగా ఉన్నాడు. ఆయన దయనుబట్టి కృప విడుదల అవుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది, మన పరిస్థితి చక్కబడుతుంది.
గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధినొందిన రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. బాషానురాజైన ఓగును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. -కీర్తనలు 136:17-20
ప్రసిద్ధి చెందిన రాజులు ఇశ్రాయేలు ప్రజలకు ఎదురుగా అడ్డగించినప్పుడు, ఆ రాజులను జయించే శక్తి వారికి లేనపుడు దేవుని దయ వారి స్థితిని గ్రహించేదిగా ఉంటుంది.
మన జీవితములో కూడా మనము ఎదుర్కోలేని కష్టతరమైన పరిస్థితి అడ్డుగా వచ్చినపుడు, దేవుని దయ మనపై ఖచ్చితంగా ఉంటుంది.
దేవుని దయ, కృప ఆయన సమస్త కార్యములపై ఉన్నది అని లేఖనములు సెలవిస్తున్నాయి. నీవు నేను కూడా ఆయన కార్యము, చేతిపని అయి ఉన్నాము. కాబట్టి ఆయన దయ మరియు కృప మన మీద కూడా ఉంటుంది. మనము కొన్ని సందర్భములలో పరిస్థితిని ఎదుర్కోలేక కృంగిపోయేవారముగా ఉంటాము. అయితే దేవుని దయ మనపై ఉంటుంది అనే సత్యము మనము ఎరిగినవారిగా ఉంటే నిశ్చింతగా ఉంటాము.
ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును. -కీర్తనలు 136:21
స్వాస్థ్యము సంపాదించుకునే సామర్థ్యము మనము లేకపోయినప్పటికీ, ఆయన కృపను బట్టి స్వాస్థ్యము దయచేసేవాడుగా ఉన్నాడు. కృప అంటేనే మన సామర్థ్యముతో సంబంధములేనిది.
తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును. -కీర్తనలు 136:22
“తన సేవకుడైన” అనే ఒక కండిషన్ మనము చూడవచ్చు. నీవు నేను కూడా దేవునికి సంబంధించిన వారమే! గనుక “దానిని” స్వాస్థ్యముగా అప్పగిస్తారు అని వ్రాయబడింది. “దానిని” అంటే, ఆయన ముందుగా నిర్ణయించిన వాగ్దానము. ఆయన మనకు చేసిన వాగ్దానమును మనకు స్వాస్థ్యముగా ఇచ్చేవాడుగా ఉన్నాడు.
సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండును. -కీర్తనలు 136:25
ఆహారము అనగా మనము జీవించి ఉండటానికి అవసరమైన ప్రతీదీ. తినే పదార్థము ఒక భాగం. అయితే ఆరోగ్యము కలిగి ఉండుట, వనరులు కలిగి ఉండుట కూడా మనము జీవించి ఉండుటకు అవసరమైనవే. మనము కలిగినది ఏదీ కూడా మనలను జీవించులాగున చేయలేదుగానీ, దేవుని కృప మాత్రమే జీవింపచేయునది. ఆహారము అనేది ప్రతిరోజు అవసరమైనది అని మనకు తెలిసినదే కదా! అనగా దేవుని కృప మనకు దిన దినమూ అందుబాటులో ఉంది అని గ్రహించగలగాలి. మనము కలిగిన జీవితము ఎంతో విలువైనది, ప్రశస్తమైనది. దేవుని కృపను కోరుకొని, దానికొరకు కనిపెట్టినపుడు మనము తృప్తికలిగి జీవించగలుగుతాము.
నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ లేమిలో ఉన్నా, దేవుని కృప నీకు తోడుగా ఉంది అని మర్చిపోవద్దు.
యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షముననుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు. -యెషయా 26:12
మన దేవుడు ఎటువంటి దేవుడో గ్రహించు. నిజముగా నీ పక్షమున ఉండి నీ పనులన్నిటినీ సఫలము చేయువాడు ఆయనే.
ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముండును. -కీర్తనలు 136:4
ఆహారము అనగా నీ జీవితము కొనసాగించబడటానికి అవసరమైన తిండి, ఆరోగ్యము, అప్పు తీరుట, అవకాశము కలుగుట, బాధ తొలగించబడుట ఇలా అనేకమైనవి. నీవు జీవము కలిగి ఉండుటకు అవసరమైన ప్రతీదీ నీకు ఆహారమే. చర్చ్ స్థలము విషయములో మనలను సిగ్గుపడనివ్వని దేవుడు, ఆ చర్చ్ లో ఆరాధించే నిన్ను నన్ను అస్సలు సిగ్గుపడనివ్వడు. మనము బలము లేని వారమే గానీ మన పక్షమున పనిచేసే దేవుని కృప బలమైనది.
ఆరాధన గీతము
యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు
ఆయన కృప నిత్యముండును (2)
ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు (2)
యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు
యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు
జై జై యేసు రాజా – జయ యేసు రాజా (4) ||యెహోవా||
సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే
మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే (2) ||యెహోవా నాకు||
దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనే
విలువైన రక్షణలో నను కడ వరకు నడిపించు వారాయనే (2) ||యెహోవా నాకు||
మందిరపు స్థలమును స్వాస్థ్యముగా ఇచ్చిన వారాయనే
బలహీన చేతులను బలపరిచి నడిపిన వారాయనే
||యెహోవా నాకు||
యెహోవా నీకు తోడుండగా, నీకు భయమే లేనే లేదు, యెహోవా నీకు తోడుండగా – నీకు దిగులే లేనే లేదు! నమ్మి ఆరాధించు.
నీవు అరణ్యములో ఉన్నాసరే, బలమైనదానిని ఎదుర్కొంటున్నాసరే, వాగ్దానముకొరకు కనిపెడుతున్నా సరే, ఆహారముకొరకు ఎదురుచూస్తున్నాసరే, దేవుని కృప నీతో నిత్యము ఉంది అనే సత్యము గ్రహించు.
వారము కొరకైన వర్తమానము
దేవుడు మనలను బలపరచేవాడు, మనలను నిలబెట్టేవాడు. మన ఆశ, మన గురి ప్రభురాజ్యము కొరకే అయి ఉండాలి. దానికొరకే మనము సిద్ధపడాలి. మనం ఆత్మీయము గా ఎదగటానికి ఏమి చేయ్యాలి? ప్రభువుకు మహిమకరముగానూ, ప్రభువు సంతోషించులాగున ఎలా ఉండగలము? “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను బట్టి నేను ఆనందిస్తున్నాను” అనే సాక్ష్యము మనముకూడా పొందుకోవాలి. ఉదాహరణకు పిల్లలు ఏమైనా సాధిస్తే వారి తల్లిదండ్రులు ఎంతగా సంతోషిస్తారు? ఇహలోకములోని తల్లిదండ్రులే అలా ఉంటే, మరి నీకొరకు ప్రాణము పెట్టిన వాడు ఇంకెంతగా కోరుకుంటాడు.
మనము ఆత్మీయ జీవితములో ఒక గురి కలిగి జీవించాలి. తండ్రి యొద్దనుండి ఒక సాక్ష్యము సంపాదించుకోవాలి అనే గురి మనము కూడా కలిగిఉండాలి. యేసయ్య గురించి ఎందుకు ఆ సాక్ష్యము ఇవ్వగలిగాడు? మనము ఏమి చేస్తే అటువంటి సాక్ష్యము పొందుకోగలుగుతాము? ఈ విషయము మనము ఎరిగి ఉండాలి.
క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.౹ -ఫిలిప్పీయులకు 2:5
క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు నేనునూ కలిగియుందును అనే తీర్మానము నీవు కూడా తీసుకోవాలి. అయితే ఆయన మనస్సు ఎటువంటిది?
నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.౹ -యోహాను 6:38
యేసయ్య మనసు ఎలా ఉంది అంటే, తన ఇష్టము కాదుగానీ, తండ్రి చిత్తమును నెరవేర్చే మనసు కలిగి ఉన్నాడు. మనము కూడా ఇదే మనసు కలిగి ఉండాలి. మనము కూడా దేవుని చిత్తము నెరవేర్చగలిగే మనసు కలిగి ఉండాలి. ఆత్మీయముగా జన్మించిన ప్రతిఒక్కరము ఈ మనస్సు కలిగి ఉన్నాము అని వాక్యము వినినప్పుడు చెప్పగలుగుతాము. అయితే దైనందిన జీవితములో తొలగిపోయేవారిగా ఉంటాము. మరి యేసయ్య ఎలా ఉండగలిగే వాడు అని చూస్తే,
ఆ లోగా శిష్యులు–బోధకుడా, భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి.౹ అందుకాయన–భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా౹ శిష్యులు–ఆయన భుజించుటకు ఎవడైన నేమైనను తెచ్చెనేమో అని యొకనితో ఒకడు చెప్పు కొనిరి.౹ యేసు వారిని చూచి–నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.౹ -యోహాను 4:31-34
యేసయ్యకు మనకూ తేడా ఇదే. “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది” అని యేసయ్య చెప్పగలుగుతున్నాడు. ఆహారము అనగా జీవితమును కొనసాగించగలిగినది అని అర్థము. దేవుని చిత్తము జరిగించుటయే నాకు ప్రాణము అయి ఉన్నది అనే ఆలోచన ప్రకారము జీవించాలి. నీవు నేను, “దేవుని చిత్తము” నా జీవితమును కొనసాగించేది అని మనము గ్రహించినట్టయితే, మనము కూడా అదే ప్రకారము జీవించాలి. పౌలు కూడా అదేవిధముగా “జీవించునది నేను కాదు, నాయందున్న క్రీస్తే” అని చెప్పగలిగాడు. అనగా నా ఇష్టము, నా కోరిక అంటూ ఏమి లేదు. నాలో ఉన్న క్రీస్తు ఇష్టమే, ఆయన కోరికే నా జీవితములో నెరవేరుతాయి. ఆ నెరవేర్పు కొరకు నా జీవితాన్ని ఆయనకే అర్పిస్తాను అని అర్థము. క్రీస్తు యొక్క మనస్సు దేవుని చిత్తము తోనే నడిపించబడాలి అనే సంపూర్ణమైన నిశ్చయతతో నిండి ఉంది. మనము కూడా అదే సంపూర్ణమైన నిశ్చయత కలిగి జీవించాలి. అంతే కాక, యేసయ్య ప్రతిసారీ, దేవుని చిత్తము కనుగొనడానికి ఆశకలిగినవాడుగా ఉన్నాడు.
కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను– తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.౹ -యోహాను 5:19.
మనము కూడా అంతే, ఒకవేళ దేవుని చిత్తము నెరవేర్చాలి అనే ఆశ ఉన్నప్పుడు, ఆ దేవుని చిత్తము కనుగోవాలి అనే ఆశ కూడా కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు సిద్ధపడితే, దేవుడే నీకు సహాయకుడుగా ఉంటాడు.
అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాము.౹ -కొలొస్సయులకు 1:9
“ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై ఉండాలి”. ఇది కేవలము కొలస్సీ సంఘమునకో, పరిచారకులలో మాత్రమే కాదు గానీ, ప్రతీ విశ్వాసికీ అవసరమై ఉన్నది.
నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను.౹ -యోహాను 11:42
దేవుని చిత్తము నెరవేర్చే హృదయము మాత్రమే కాదుగానీ, తండ్రి ఏమై ఉన్నాడో ఎరిగి ఉండాలి. తండ్రి తన మనవిని ఎల్లప్పుడూ వింటాడు అనే సత్యమును యేసయ్య ఎరిగినట్టుగా, మనము కూడా ఎరిగి ఉండాలి. అనగా సంపూర్ణమైన విశ్వాసము పరిస్థితితో సంబంధము లేకుండా కలిగి ఉన్నాడు. లాజరు చనిపోయి, సమాధి చేయబడి నాలుగు దినములు గడిచినతరువాత, యేసయ్య చెప్పిన మాటలు “నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును”. మనము కూడా అదే ఆలోచన, విశ్వాసము కలిగి ఉండాలి. నేను అడిగినది అది ఉన్నదైనా, లేనిదైనా, చనిపోయిన స్థితి అయినా నా మనవి ఆలకించి అడిగినదానిని దయచేసే వాడు అని నమ్మకము, నిరీక్షణ కలిగి ఉండాలి.
ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? -మత్తయి 26:53
ఇక్కడ యేసయ్య తండ్రి మీద ఎంత నమ్మకము విశ్వాసము ఉందో మనము చూడగలము. మనము అదే సాక్ష్యము ఇవ్వగలుగుతామా! అయితే, మనము ఇదే మనస్సు కలిగి ఉండాలి అని దేవుని ఆశ. ఈ మనస్సు మనము కలిగినప్పుడు మనకు ధైర్యము కలుగుతుంది. మన కళ్ళకు సాధ్యముగా కనబడేదే కాదు గానీ, అసాధ్యమైనదైనా సరే దేవుని శక్తిమీద విశ్వాసము మనము కలిగి ఉండాలి.
మరియు ఆయన –తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను. -యోహాను 6:65
నేను ఏమి కలిగి ఉండాలి అన్నాసరే అది దేవుని కృప ఉండవలసినదే. నా బలము బట్టికాదు గానీ, దేవుని కృపను బట్టియే నాకు సమస్తము కలిగుతుంది.
వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;౹ -యోహాను 10:29
అనగా తండ్రి కృప ద్వారా పొందుకున్న దానిని ఎవరూ అపహరింపలేరు. ఎందుకంటే ఇచ్చినవాని శక్తి స్థిరపరచబడుతూనే ఉంటుంది. నీకొరకు సిద్ధపరచినవాడు సర్వ శక్తిమంతుడు గనుక నీకొరకు సిద్ధపరచినది నీవు పోగొట్టుకొనవు.
1. దేవుని చిత్తము నెరవేర్చాలి అనే మనస్సు కలిగి ఉండాలి
2. దేవుడు ఎటువంటివాడో ఎరిగిన మనసు కలిగి ఉండాలి.
3. నేను కలిగి ఉన్న సమస్తమూ దేవుని కృపను బట్టే అనే మనసు కలిగి ఉండాలి.