09-07-2023 – ఆదివారం రెండవ ఆరాధన – నీకు విజయమే

స్తోత్రగీతము -1

హల్లెలూయా ఆరాధన
రాజాధి రాజు యేసునకే
మహిమయు ఘనతయు
సర్వాధికారి క్రీస్తునకే (2)
చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ
ఆ ప్రభుని కీర్తించెదం
నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో
స్తోత్రార్పణ చేసెదం ||హల్లెలూయా||

రూపింప బడక ముందే
నన్ను ఎరిగితివి
నా పాదములు జారకుండా
రక్షించి నడిపితివి (2) ||చప్పట్లు||

అభిషేక వస్త్రము నిచ్చి
వీరులుగా చేసితివి
అపవాది క్రియలను జయించే
ప్రార్థన శక్తినిచ్చితివి (2) ||చప్పట్లు||

స్తోత్రగీతము-2

పల్లవి:
యుద్ధము యెహోవాదే – యుద్ధము యెహోవాదే (2)

చరణం1.
రాజులు మనకెవ్వరులేరు శూరులు మనకెవ్వరులేరు
సైన్యములకు అదిపతియైన యెహోవా మన అండ (2)
యుద్ధము యెహోవాదే – యుద్ధము యెహోవాదే (2)

చరణం2.
వ్యాధులు మనలను పడద్రోసినా భాదలు మనలను కృంగదీసిన
విశ్వాసమునకు కర్తయైన యేసయ్య మన అండ (2)
యుద్ధము యెహోవాదే – యుద్ధము యెహోవాదే (2)

చరణం3.
యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రం ఎదురైన
అద్భుత దేవుడు మనకుండ భయమేల మనకింక (2)
యుద్ధము యెహోవాదే – యుద్ధము యెహోవాదే (2)

చరణం4.
అపవాది యైన సాతాను గర్జించు సింహమువలె వచ్చినా
యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ
యుద్ధము యెహోవాదే – యుద్ధము యెహోవాదే (2)

స్తోత్రగీతము-3

జయం జయం జయం జయం
యేసులో నాకు జయం జయం (2)

Verse 1
విశ్వాసముతో నేను సాగివెళ్ళెదా
ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా
నీ వాక్యమే నా హృదయములో
నా నోటిలో నుండినా

Verse 2
గొప్ప కొండలు కదిలిపోవును
సరిహద్దులు తొలగిపోవును
అసాధ్యమైనది సాధించెదా
విశ్వాసముతో నేను

ఆరాధన వర్తమానము

తండ్రి ఆకర్షించితేనేగానీ ఎవ్వరూ ఆయన సన్నిధికి రాలేరు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. గనుక ఈరోజు ఈ వర్తమానం వింటున్న చదువుతున్న వారైన మీరు ధన్యులు.

ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను -యెషయా 12:2
నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము -కీర్తనలు 109:1

ఉదయాన కూడా మనము తెలుసుకున్నాము అరణ్యములోను, బలమైన పరిస్థితి ఎదురొచ్చినప్పుడు, వాగ్దానమును స్వతంత్రించుకొనుటలోను, ఆహారము దయచేయుటలోనూ మన దేవుని కృప మనకు నిత్యము తోడై ఉంటుంది.

నీవు ఐగుప్తుదేశములో చేసినట్టు నేటివరకు ఇశ్రాయేలు వారిమధ్యను ఇతర మనుష్యులమధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు.౹ -యిర్మీయా 32:20

ఐగుప్తులోనుండి ఇశ్రాయేలీయులను తీసుకువచ్చేటప్పుడు అద్భుత కార్యములు జరిగించి వారిని వెలుపలకి రప్పించాడు. అయితే అన్ని అద్భుతము ఎందుకు జరిగించాడు అంటే, ఆయన ఏమి చేయ్యగలడో ఎరగగలుగులాగున జరిగించాడు. దేవుడు చేసిన మహత్కార్యములు తరతరములకు తెలియచేయుమని మన పితరులకు ఆజ్ఞ ఇచ్చాడు గనుక ఆయన ఐగుప్తులో చేసిన అద్భుతములు మనకొరకే అనే సత్యము మనము గ్రహించుకోగలుగుతాము.

మన దేవుడు నీవు నేను స్తుతించడానికి అర్హుడు. మన పితరులకు ప్రతీ శ్రమలోను, ఇరుకులోను, ఇబ్బందిలోనూ తోడై ఉన్నదేవుడు ఇప్పుడు మనము ఉన్న ప్రతీ పరిస్థితిలోనూ మనకు తోడై ఉండేవాడు.

జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. -యెషయా 64:3

మన జీవితములలో కూడా అనేకమైన క్రియలు మనము అనుకొననివి జరిగించినవాడుగా ఉన్నాడు.

యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షముననుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు. -యెషయా 26:12

ఆయన మన పక్షమున నిలబడుతున్నాడు గనుకనే మన కార్యములు సఫలము అవుతున్నాయి. మనము ఎన్ని లేఖనాలు చూసినా, ఎన్ని విషయాలు మన జీవితమునుండి జ్ఞాపకము చేసుకున్నా ఆయన స్తుతించదగినవాడు.

యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను. -నిర్గమకాండము 15:2

మనము వెళ్ళే అనేకమైన సందర్భములలో మనకు లేఖనమే ఆధారమై ఉన్నది. “యెహోవాయే నా బలము నా గానము” అంటే నా స్తుతికి కారణభూతుడవు నీవే దేవా! నీ దేవుడు ఎటువంటివాడో నీవు ఎరిగి ఉండాలి. అప్పుడే ఆయనను సరైన విధానములో ఆరాధించగలుగుతావు.

ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే.౹ -ద్వితీయోపదేశకాండము 10:21

“నీవు కన్నులార చూచుచుండగా” అనగా నీకు తెలిసి జరిగేవి. “ఇది జరుగునని అనుకొనని” అనగా నీకు తెలియనివి అనేకమైన కార్యములు దేవుడు మన పక్షమున జరిగించువాడు.

మా పితరులు నీయందు నమ్మిక యుంచిరివారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి. -కీర్తనలు 22:4

నీ దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి, నీవు నమ్మకముంచిన ప్రతీ సారీ నీ పక్షమున కార్యము జరగవలసినదే.

ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము.౹ -1 సమూయేలు 12:24

మనము దేవుడు చేసినవి మరచిపోయి, ఇంకా జరగని వాటిని బట్టి కృంగిపోయేవారిగా ఉంటాము. అయితే ఇంతకు ముందు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చెయ్యగలడు. అయితే పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అనగా అయన మాట ప్రకారము జరిగించుట అవసరమై ఉన్నది. అలా వాక్య ప్రకారము జీవితాన్ని సిద్ధపరచుకున్నపుడు మన జీవితములో అద్భుతములే! అయితే మనము వాక్య ప్రకారము నిలబడటానికి వెనకడుగు వెయ్యకూడదు. మన కళ్ళముందు ఏమి జరిగినా సరే దేవుని వాక్యమును సందేహించకూడదు. పరిస్థితులు కఠినముగానే ఉన్నాసరే, ఆ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నీతో నీ పక్షాన ఉన్నాడు. మన జీవితములలో నష్టము కలిగించే కార్యము మన దేవుడు చెయ్యడు. ఈ మనసు మనము కలిగి ఉండాలి.

మనము అనుకున్నది జరగని సందర్భములో మనము దేవుని యెడల తిరుగుబాటు చేసేవారిగా ఉంటాము.

ఇహమందు ధనవంతులైనవారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.౹ -1 తిమోతికి 6:17

“సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవుడు”. ఎంత గొప్ప దేవుడో కదా మన దేవుడు? మన భవిష్యత్తులో ఒకవేళ నీవు సుఖముగా ఉండలేవు అని దేవుడు అనుకుంటే, ఆ పరిస్థితిని కలిగించే దేనినీ ఆయన నీకు దయచేయడు. ఎందుకంటే, ఆయనే భవిష్యత్తును ఎరిగినవాడు.

ఆయన మన పక్షమున చేసిన కార్యములన్నిటిని బట్టి ఆయనను పూర్ణ హృదయముతో స్తుతిద్దాము, ఆరాధిద్దాము.

ఆరాధన గీతము

ఇది జరుగునని నేననుకొనని భీకరకార్యములు
ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు (2)
చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

సంద్రమే రహదారిగా మారాయే మధురముగా
ఆకాశం ఆహారన్నే కురిపించేదిగా (2)
బండయే నీటిని రప్పించేదిగా (2)
చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

నీటిని ద్రాక్షరసముగా నీటిపైనే నడువగా
గాలి తుఫానే భయముతో నిమ్మళమవ్వగా(2)
మృతులనే సజీవులయి లేచువారిగా(2)
చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

ఇది జరుగునని నేననుకొనని భీకరకార్యములు
ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు (2)
చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

నీవు ఏమి ఒప్పుకొంటున్నావో అదే స్థిరపరచబడుతుంది అని వాక్యము స్పష్టముగా తెలియచేస్తుంది. నీవు ఏమి జరగాలని దేవుని సన్నిధిలో ఉంటున్నావో, ఏమి కావాలని, ఆయన సన్నిధిలో ఉన్నావో అది చేయగవాడవు అని ఆయనతో నమ్మి ఆరాధించు. నీ స్థితి జ్ఞాపకము చేసుకుని ఆయనను ఆరాధించు తరువాత ఏమి జరుగుతుందో అనుభవపూర్వకముగా చూడు. షద్రకు మేషాకు అబెద్నగోలు మా దేవుడు సమర్థుడు అని ఒప్పుకొన్నప్పుడు దేవా కార్యము జరిగించి విడిపించినవాడవు. మేము కూడ మేము ఎదురుచూచునది జరిగించగల సమర్థుడవు అని మేము ఒప్పుకొన్నపుడు, మా పక్షమున నిలిచి కార్యము సఫలము చేయగలవాడవు, నీవే మా ఆధారము తండ్రీ.

ఈ వారము సెట్టిల్మెంట్స్ జరిగిస్తున్నందుకై నీకే స్తోత్రములు

వారము కొరకైన దేవుని వాక్కు

ఆత్మీయ మర్మములు ఎవరైతే ఎరిగినవారుగా ఉంటారో, వారు బలము కలిగి ఉంటారు. అందుకే మన హృదయమును లోకములోని చెత్తతో కాదు గానీ, ఆత్మ సంబంధమైన విషయాలతో నింపబడాలి. ఈ రోజు మనము “నాకు విజయమే” అనే విషయము గురించి నేర్చుకుందాము. మనకు విజయమే అంటే ఒక పోరాటము ఉంది అనే కదా దాని అర్థము. మనము ఆత్మీయముగా ముందుకు వెళ్ళేకొద్దీ, శరీరము వ్యతిరేకముగా పోరాటము చేస్తుంది. మన జీవితమే అనేకమైన పోరాటములతో కూడినది. మనకు ఏమి పోరాటమున్నాసరే మనకు విజయమే!

అనేకసార్లు మనము అన్యులను చూసి వారి జీవితమే బాగుంది అని అనుకుంటాము. అయితే నీవు చూసి, ఊహించినదానికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన సమర్థుడు. మనకైతే మన జీవితములు ఎటువంటివో అర్థము కావటము లేదు. నిజానికి పోరాటము ఏమైనా సరే మనకే విజయము. మన ముందు తరములలో ఉన్న దావీదు చెప్పిన మాటలు చూస్తే, “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు”. యేసయ్య ఏమి చెప్పాడు? “నేనిచ్చు జీవజలమును మీరు త్రాగినప్పుడు ఇంక ఎన్నడూ దప్పిగొనరు” అని చెప్తూ ఉన్నారు. నీవు కూడా నీవు వెంబడించేవాడు ఎవరో నీవు ఎరిగి ఉంటే, నీవు కూడా అదేవిధముగా సాక్ష్యము ఇస్తావు.

“నా గొర్రెలు నా స్వరమును వినును అవి నన్ను వెంబడించును” అని వాక్యము చెప్తుంది. ఆయన నీ ముందు వెలుగై ఉన్నాడు. ఆయనను వెంబడిస్తున్న నీ జీవితములో చీకటి ఇంక ఉండదు. సామెతల గ్రంథములో కూడా, “నీతిమంతుల మార్గములో మరణమే లేదు” అని వ్రాయబడింది. అందుకే మన జీవితము ఎలాంటిదో నీవు ఎరిగి ఉండాలి. “మా దేవుడు మమ్ములను రక్షించ సమర్థుడు” అని షద్రకు, మేషాకు మరియు అబెద్నగోలు అగ్నిగుండములో వేసేమునుపు ఆ విషయము ఎరిగి సహితము చెప్పగలిగారు. ఈ జ్ఞానము, ధైర్యము మనము కూడా సంపాదించుకోవాలి.

నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను. -యోహాను 16:33

ఈలోకములో శ్రమ ఎవరు అనుభవిస్తారు? మనమే! కానీ ఈ శ్రమను నేను జయించి ఉన్నాను అని యేసయ్య చెప్పుచున్నారు. ఆయన జయమునకు, మన జీవితమునకు ఏమిటి సంబంధము అని మనము ఎరిగి ఉండాలి. ఆయనకు నీకు సంబంధము ఉన్నంత సేపు కూడా జయము నీదే!

సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడై యుండును గాక. -2 థెస్సలొనీకయులకు 3:16

సమాధానకర్తయగు అంటే సమాధానమును కలుగచేసేవాడు. లోకమును జయించువాడు ఎటువంటివాడు అని చూస్తే, సమాధానమునకు కర్తగా ఉన్నాడు. ఆ ప్రభువు, తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును. అనగా నీ పరిస్థితిలో ఏమి జరిగిస్తే సమాధానము కలుగుతుందో ఆ ప్రకారముగా కార్యము జరిగించి సమాధానమును అనుగ్రహిస్తారు! అందుకే లోకమును జయించినవానిని బట్టి మనకు జయము కలుగుతుంది.

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.౹ -రోమా 8:28

“దేవుని ప్రేమించువారు” అంటే ఆయనతో సంబంధము కలిగినవారే కదా! వారికి మేలు కలుగుటకు అనగా వారున్న శ్రమలో మేలుజరగాలి అంటే, సమస్తమునూ అనగా ప్రతివిధముచేతనూ, సమకూడి జరుగుచున్నవి అనగా శ్రమ జయకరముగా ముగించబడి, సమాధానము కలుగుతుంది.

మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.౹ -గలతీయులకు 1:4

క్రీస్తు జయించినవాడుగా ఉన్నాడు. ఆ జయించినవాడు చెప్తున్న మాటలు ఏమిటి అంటే, “మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని”, “మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను”. అనగా మనము ప్రస్తుతము వెళుతున్న శ్రమలనుండి విడిపించబడటానికి ఆయన కార్యమును ముందుగానే జరిగించి విజయమును సంపాదించి ఉంచాడు. మన జీవితములను ఆశీర్వాదము వెంబడించడానికి అవసరమైన వెల యేసుక్రీస్తు ముందుగానే చెల్లించినాడు. నా శ్రమలో అవసరమైన సొల్యూషన్ ఆయన వెతికినవాడుగా ఉన్నాడు. అందుకే మనము ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగాలి. క్రీస్తు మర్మమై ఉన్నాడు, యేసయ్య గురించి ఎంతగా తెలుసుకుంటే అంతగా మనము విజయము పొందుకుంటాము.

నేను జయించాను అని చెప్పిన వాడు, సమాధానమునకు కర్త మరియు, నీ శ్రమలోనుండు నిన్ను విడిపించడానికి సొల్యూషన్ సిద్ధపరచినవాడు.

మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.౹ -1 యోహాను 4:9

యేసయ్య ఒక ఉద్దేశ్యము కలిగినవాడుగా ఉన్నాడు. ఆ ఉద్దేశ్యము నీవు నేను జీవింపచేయబడుట. అపవాది యొక్క తంత్రములు ఏమిటి అంటే, వాక్యమును నిన్ను విననివ్వదు. ఎందుకంటే, నీవు వాక్యములోని సత్యము నీవు గ్రహిస్తే, ఆ సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. గనుక అపవాది అడ్డగిస్తూనే ఉంటుంది. అందుకే నీవు జాగ్రత్తకలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. నీవు సత్యము గ్రహించినట్టయితే, నా శ్రమలో ఆయన ద్వారా నేను జీవింపచేయబడతాను అని ప్రకటించగలుగుతావు. నిన్ను శ్రమలోనుండి లేవనెత్తటమే, నీకు సొల్యూషన్ దయచేసి విడిపించడము, నికు జీవము కలిగించుట ఆయన ఉద్దేశ్యము అని యేసయ్య చెప్పుచున్నాడు.

అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.౹ -1 కొరింథీయులకు 15:57

అన్యజనులలో ఈ మర్మముయొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీయందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి యిప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను.౹ -కొలొస్సయులకు 1:27

క్రీస్తు అనగా సమాధాన కర్త, సొల్యూషన్ సిద్ధపరచినవాడు, జీవము దయచేయువాడు ఇప్పుడు నీలో ఉన్నాడు.

చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.౹ -1 యోహాను 4:4

ఒకవేళ మీరు శ్రమలో ఉన్నారు అనుకోండి, నీలో ఉన్న క్రీస్తు లోకమునులో ఉన్న శ్రమకంటే, నీవు ఎదుర్కొంటున్న శ్రమ కంటే గొప్పవాడు గనుక, ఆ శ్రమలో నీకే విజయము. ప్రతీదీ అది శ్రమ అయినా అధికారమైనా అది క్రీస్తు ముందు వంగవలసినదే! మన శ్రమలో మనము చేయ్యగలిగినదీ, చెయ్యవలసినది ఒక్కటే, ఆయనను కలిగి ఉండటమే! ఆయనను కలిగి ఉండటమే జీవిత లక్ష్యము అయి ఉండాలి. అప్పుడు మనము కూడా దావీదు వలే, నాకు లేమి కలుగదు అని చెప్పగలుగుతాము.

అయితే క్రీస్తు పరిశుద్ధమైన ప్రదేశములో ఉంటాడు గనుక, నీ హృదయమును పరిశుద్దము గా ఉంచుకోవాలి. నీవు యదార్థముగా ఉన్నప్పుడు దేవుని చూసేవారిగా ఉంటావు. అనగా మనము మాట్లాడే మాటల ప్రకారము మన జీవితము కూడా ఉండాలి. యదార్థత లేని జీవితములు గనుక ఉంటే, ఓటమి పాలవుతాము. నీ మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ తప్పు చేసినయెడల, తప్పుచేసాను అని ఒప్పుకొని, సరిచేసుకొనిన యెడల, ప్రభువు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నీ శ్రమలన్నిటినోనుండి నిన్ను విడిపించి సమాధానము కలుగచేసేవాడు మన దేవుడు. దేవుని మాట ప్రకారము మార్చుకోవడానికి సిద్ధపడినప్పుడు నీలో ఆయన నివాసము ఉండేవాడుగా ఉంటాడు. ఆ ప్రకారము మనలను సిద్ధపరచుకుందాము.