స్తోత్ర గీతము 1
ఆరాధనకు యోగ్యుడా ఆది నుండి ఉన్నవాడా
ఆనందముతో నింపేవాడా ఆశ్చర్యకరుడా నా యేసురాజా
యేసు రాజా యేసు రాజా యేసు రాజా
పరిశుద్ధమైన వాడా పూజింపదగినవాడా
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
కన్నీరు తుడిచేవాడా కౌగిటిలో చేర్చేవాడా
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
పరిపూర్ణమైన వాడా పరలోక మేలు వాడా
కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
నిబంధన స్థిరపరచువాడా వాగ్దానము నెరవేర్చువాడా కాలాలు మారిన యుగాలు మారిన మారనివాడా నా యేసురాజా
స్తోత్ర గీతము 2
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు
దేవా దేవా నీకే స్తోత్రం
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా
నేనే జీవము అని పలికిన దేవా
దేవా దేవా నీకే స్తోత్రం
స్తోత్ర గీతము 3
మహోన్నతుని చాటున నివసించు వారు
సర్వశక్తుని నీడలో విశ్రమించు వారు
ఆయనే నా ఆశ్రయము -నా కోటయు నా దేవుడు
అయన తన రెక్కలతో -నిన్ను కప్పును
అయన తన రెక్కల క్రింద -ఆశ్రయము నిచ్చును
ఆయనే సత్యము… కేడెము డాలును
కృతజ్ఞతలార్పించుడి మనసారా ఆ రాజుకు… హల్లెలూయా,
కృతజ్ఞతలార్పించుడి మనసారా మహ రాజుకు
హల్లెలూయా హల్లెలూయా.. హల్లెలూయా హల్లెలూయా
నీకు ప్రక్కన వేయి మంది- పడినగాని
నీ కుడి ప్రక్కన పది వేలమంది -కూలినగాని
కీడు నీ యొద్దకు ఎన్నడు రనీయడు
కృతజ్ఞతలర్పించుడి మనసారా ఆ రాజుకు.. హల్లెలూయా..
కృతజ్ఞతలర్పించుడి మనసారా మహ రాజుకు
నీకు అపాయము- రానేరాదుగా
ఏ తెగులు నీ గురము -సమిపించదుగా
అయన నిన్ను గూర్చి -దూతల కాజ్ఞపించును
కృతజ్ఞతలర్పించుడి మనసారా ఆ రాజుకు.. హల్లెలూయా…
కృతజ్ఞతలర్పించుడి మనసారా మహ రాజుకు
ఆరాధన వర్తమానము
దేవుని నామములో మీ అందరికీ శుభములు. మరొక దినము తన సన్నిధిలో మనలను నిలబెట్టిన ప్రభువుకే మహిమ కలుగును గాక, ఆమేన్! ఈరోజు ఆ ప్రభువు మనకొరకు ఏర్పాటు చేసిన దినము. నిజముగా వాక్యమును తెలుసుకోవాలి అనుకున్నవారు చాలా జాగ్రత్తగా విని గ్రహించాలి.
అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. -కీర్తనలు 42:8
మన జీవితములో పాటలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. పైన చూసిన వాక్యములో, కీర్తనాకారుడు దేవుని కీర్తనలు పాడటమును బట్టి దేవుని తోడును అనుభవించేవాడిగా ఉంటున్నాడు.
“ఆయనే నా ఆశ్రయము -నా కోటయు నా దేవుడు” అని మనము ఇంతవరకు పాటలు పాడి స్తుతించాము, దేవునికే మహిమ కలుగును గాక! ఈ మాటను బట్టి మనము దేవునిని స్తుతిస్తే, ఆ మాటలే మనకు తోడై ఉంటాయి అని లేఖనము చెప్పుచున్నది.
నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము; అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధపర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును. -కీర్తనలు 43:3
దేవుని గూర్చిన కీర్తన మనకు తోడుగా ఉంటుంది. “ఆయనే నా ఆశ్రయము -నా కోటయు నా దేవుడు” అనే సత్యమును బట్టి, మనము దేవునిని స్తుతించాము. ఇప్పుడు ఈ మాటలే మనకు త్రోవ చూపేవిగా ఉంటాయి. అంటే ఏమిటి? ఈ సత్యమును బట్టి ఈరోజు స్తుతించి, నీవు వెళ్ళిన తరువాత మిగతా ఆరు రోజులు, “నా దేవుడు” అని నీవు చేసిన స్తుతి, నిన్ను దేవుని నుండి దూరము చేయాలి అనే అపవాది కుతంత్రాలనుండి, పరిస్థితులనుండి నిన్ను విడిపించుటకు నీకు “దేవుడు” గా నీవు ఒప్పుకున్న దేవుడు నీతో ఉన్నాడు.
ఉదాహరణకు మనము కళ్ళుమూసుకుని ఉన్నాము, అప్పుడు మన ముందు ఏమి జరుగుతుందో కూడా మనకు తెలియదు. అప్పుడు ఏ వాక్యమైతే నీవు సత్యముగా నీవు అంగీకరించావో, ఆ సత్యము నిన్ను సరైన మార్గములో నడిపించేదిగా ఉంటుంది. నీవు నడిచే మార్గములో అడ్డంకులున్నా సరే, నీవు నమ్మిన దేవుని గూర్చిన సత్యము, వాటినుండి తప్పించి, నిన్ను నడిపించేదిగా ఉంటుంది.
ఈరోజు ఏ సత్యమైతే పట్టుకుని మనము దేవుని కీర్తించామో, ఆ సత్యము మరలా నిన్ను దేవుని సన్నిధికి తోడుకొస్తుంది. ఎలా అంటే, ఈరోజు ఆరాధన చేసిన తరువాత మరలా నిన్ను దేవుని సన్నిధికి రాకుండా, అపవాది అనేకరకములైన ప్రయత్నములు చేస్తుంది. అయితే ఆ ప్రతీ ప్రయత్నమునుండి, నీవు నమ్మి ప్రకటించిన సత్యమే నిన్ను తప్పిస్తుంది.
వాక్యములోని సత్యమును పట్టుకొని మనము దేవుని స్తుతించాలి ఆరాధించాలి, అప్పుడు ప్రభువు సన్నిధిలో మనలను సాక్షులుగా నిలబెడుతుంది.
దేవా, నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యె మాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితి వేమి? నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింప నేల? -కీర్తనలు 43:1-2
ఈ వాక్యములో కీర్తనాకారుడి యొక్క పరిస్థితి గమనించవచ్చు. ఆయన ఒక పోరాటములో ఉన్నాడు, కష్టములో ఉన్నాడు. అటువంటి పోరాటములో నీ వెలుగు, నీ సత్యము బయలుదేరనీయుము, అప్పుడు నేను చివరికి నీ సన్నిధికి నేను రాగలుగుతాను అని కీర్తనాకారుడు వేడుకొంటున్నాడు.
మనము మన కష్టములో సమస్యలో లోకములోని సహాయము కొరకు వెతుకుతాము గానీ, కీర్తనాకారుడైతే, దేవుని మాటలకొరకు కనిపెట్టుకొంటున్నాడు. ప్రతీ ఆదివారము గానీ, సూపర్‌నేచురల్ సర్వీస్ గానీ, ఎదోఒక సత్యము నీకు చెప్పబడుతుంది. ఆ సత్యమైన వాక్యమును పట్టుకోండి. వాక్యమును నమ్ముకున్నవారెవరు సిగ్గుపరచబడడు.
నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితి వేమి? నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింప నేల? -కీర్తనలు 43:2
కీర్తనాకారుడి పరిస్థితి ఎంతో కఠినముగా ఉంది. శత్రుబాధచేత దుఃఖముతో నిండిన పరిస్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ, దేవుని మాటలలోని శక్తిని గ్రహించాడు.
అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనందసంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించెదను -కీర్తనలు 43:4
మన దేవుడు ఎటువంటివాడు అంటే, ఆనందసంతోషములు కలుగజేయు దేవుడు. ఈరోజు మనము కూడా దేవుని బలి పీఠమునొద్దకే వచ్చాము. మనకు కూడా ఆయన ఆనంద సంతోషములు కలిగించేవాడుగా ఉంటాడు. దేవుడు ఒక్క మాట పలకగానే, ఆ మాట ప్రకారము ఆ సృష్టి కలిగింది. ఆయన మాట జీవము కలది.
నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను. -కీర్తనలు 43:5
శత్రుభయముతో కృంగిపోయినప్పటికీ, దేవుని మాటకొరకు, ఆయన తెలియచేసే సత్యము కొరకు కనిపెట్టుకుంటున్నాడు. ఎందుకంటే, ఆ సత్యమే స్వతంత్రునిగా చేస్తుంది అని గ్రహించాడు.
మనము మన జీవితము బాగుండాలి, మంచి పొజిషన్లో ఉండాలి అనే దానికొరకు వారి ప్రయత్నములు అన్నీ ఉంటాయి. మన జ్ఞానము వరకే ఆ ప్రయత్నములు ఉంటాయి. మన జ్ఞానమునకు మించిన సమస్య వచ్చినపుడు ఏమీ చెయ్యలేము. ఈ మధ్య ఒక యవ్వనస్తుడు క్రికెట్ ఆడుతూ చనిపోయాడు. అంటే, మనకు ఆరోగ్యము ఉన్నప్పటికీ, దేవుని కాపుదల లేకపోతే, మన జీవితము క్షణములో ఆవిరైపోతుంది.
ఈరోజు చేసే స్తుతి ఆరాధన, దేవుని కాపుదల నీకు ఉండేలా చేసి, మరలా దేవుని సన్నిధికి నీవు రాగలుగునట్లు నిన్ను నడిపిస్తుంది.
ఆరాధన గీతము
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా
నీ మాట సత్యముగలదయ్యా
నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా
నీ మాట మరిచిపోనిదయ్యా
ఏది మారినా నీ మాట మారదయ్యా
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా
నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట
బంధించబడిన వారిని విడిపించును నీ మాట
త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట
కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట
||ఏది మారినా||
సింహాల బోనులో నుండి విడిపించును నీమాట
అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట
మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట
ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట
||ఏది మారినా||
వారము కొరకైన వాక్యము
మన జీవితములో సీజన్స్ ఉంటాయి. దుఃఖ సమయము ఒక సీజన్ అయితే, సంతోషించే సీజన్ కూడా మనకోసము ఉంది. మన కష్ట సమయములో, నష్టసమయములో మనలను పడిపోకుండా, ఆయనను విడిచిపెట్టకుండా నిలబడ్డాము అంటే, అది దేవుని కృపయే.
మన కష్ట సమయములో మనకు తోడుగా ఉంటూ, ఆయన మంచిని అనుభవించి సంతోషించునట్టు, మంచి సమయములోనికి మనలను దేవుని కృప తీసుకువెళ్ళింది. ఈరోజు నీ దుఃఖము సంతోషముగా మారును అనే విషయము గూర్చి తెలుసుకుందాము.
మన జీసస్ కేర్స్ యూ మినిస్ట్రీస్ కి ఒక ప్రత్యేకమైన బాధ్యత ప్రభువు ఇచ్చాడు. అది జయకరమైన జీవితము. అనగా మన జీవితములోని అన్ని విషయములలో మనము జయకరముగా, ప్రభువుకు సాక్షిగా నిలబడే స్థితి. దీనికొరకే ప్రభువు మనతో ఈ మినిస్ట్రీ ద్వారా మాట్లాడతాడు.
దుఃఖముగా ఉన్న పరిస్థితి సంతోషముగా ఎలా మారుతుంది? అని తెలుసుకోవడానికి ఒక వాక్యము చూద్దాము.
నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. -కీర్తనలు 42:5
లోకములో చూస్తే, మనకు ఏమైనా కష్టము వచ్చినపుడు, నష్టము వచ్చినపుడు పక్కవారితో చెప్పుకున్నపుడు బాధ తగ్గుతుంది అని చెప్తారు. అయితే, ఇక్కడ కీర్తనాకారుడు తనకు తానుగా సిద్ధపరచుకుంటున్నాడు.
మన దుఃఖము సంతోషముగా మార్చబడాలి అంటే, మొదటిగా మనలను మనమే సిద్ధపరచుకోవాలి. కీర్తనాకారుడు ఎలా సిద్ధపరచుకుంటున్నాడు? “నా దేవుడే నా రక్షణకర్త” అని సిద్ధపరచుకుంటున్నాడు. ప్రభువు ఇచ్చే సంతోషమును అనుభవించాలి అంటే, ఈ సిద్ధపాటు ఎంతో ప్రాముఖ్యము. ఈరోజు ఎటువంటి పరిస్థితి అయినా సరే, మొదటిగా నీ హృదయమును సిద్ధపరచుకో, “నా ప్రాణమునకు నా దేవుడే రక్షణకర్త” అని సిద్ధపరచుకోవాలి.
రక్షణకర్త అనే ఏమిటి? కర్త అంటే సృషించేవాడు, అనగా నా ప్రాణము దేనిని బట్టి రక్షించబడాలో, దానిని సృష్టించగలవాడు మన దేవుడు. ఒకవేళ నీ ప్రాణము నశించిపోయే స్థితిలో ఉన్నాసరే, నీవు నీ దేవుని గూర్చి నీవిచ్చే డిక్లరేషన్ నిన్ను నిలబెడుతుంది. నీవు డిక్లేర్ చేస్తున్నావు అంటే, నీవు నీ దేవునిని గూర్చి ఒప్పుకుంటున్నావు అని అర్థము. నీవు కృంగిపోయినపుడు మనుష్యుల ఓదార్పు మాటలవరకే, దేవుని ఓదార్పు క్రియలతో కూడినదై ఉంటుంది.
హాగరు దుఃఖములో ఉంది ఎందుకంటే, తన కుమారుడు నీళ్ళు లేక చనిపోయే పరిస్థితిలో ఉంది. అయితే అబ్రహామును బట్టి, అక్కడ నీటి ఊటలు సృష్టించబడ్డాయి. అలాగే మనము కూడా దుఃఖములో ఉన్నపుడు నూతన సృష్టి చేయబడుతుంది. దీనికొరకు మనలను మనము సిద్ధపరచుకోవాలి.
ప్రభువును వెంబడించడములో మన మొదటి ప్రేమ ఎక్కడ వుంది? గతవారమునుండి, ఈ వారమువరకు మన జీవితము ఎలా ఉంది? ప్రభువును అంగీకరించినపుడు ఉన్న ఉజ్జీవము మరలా కలిగి ఉండుటకు సిద్ధపరచుకున్నావా?
మొదటిగా ప్రభువు అంగీకరించినపుడు నీవు దేవునితో చేసుకున్న తీర్మానమును నెరవేర్చుటకు, నీవు ఇప్పుడు మరలా సిద్ధపడతావా? ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన మరొక అవకాశమును స్వీకరిస్తావా?
దేవునిని వెంబడించడానికి ఏది అడ్డంకి ఉన్నా సరే, దానిని విడిచిపెడతావా? దేవునిని వెంబడించాలి అనే ఆశ మనకు కలగాలి, ఆయనను మహిమపరచాలి అనే కోరిక మనము కలిగి ఉండాలి. నిన్ను నీవు సిద్ధపరచుకున్నపుడే నీవు దేవునిని వెంబడించగలుగుతావు.
ఆమె యేసునుగూర్చి విని–నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని, జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. -మార్కు 5:27
ఈ స్త్రీ యేసునుగూర్చి విని, తన పరిస్థితిని బట్టి తనను తాను సిద్ధపరచుకుంటుంది. అంతకుముందు అనేకమైన వైద్యులవద్దకు వెళ్ళింది. మనము కూడా మన జీవితమును బాగుచేసుకోవడానికి అనేకమైన ప్రయత్నములు మనము చేసుకుంటాము. అయితే ఆ స్త్రీ, యేసయ్య గురించి విని, విశ్వాసముతో సిద్ధపరచుకుంది. ఇప్పుడు మన జీవితములో కూడా, ప్రభువు చెప్పిన మాటల మీద విశ్వాసము కలిగి మనము సిద్ధపరచుకోవాలి.
దేవుడు మీ జీవితముల గురించి మాట్లాడాడు అని మీరు నమ్ముతున్నారా? అయితే దేవుని మాట తన కార్యము ముగించకుండా తిరిగి వెళ్ళదు. అయితే అనేకమైన మాటలు ఎందుకు నెరవేరకుండా ఆగిపోయాయి. పైన చూసిన స్త్రీ, యేసును గూర్చి విన్న మాటల పై విశ్వాసము కనపరచడానికి తనను తాను సిద్ధపరచుకుంది. నీవు సిద్ధపరచుకుని, నిశ్చయించుకున్న దాని ప్రకారము నీకు జరుగుతుంది.
అబ్రహాము కూడా తన కుమారుని అర్పించమని చెప్పినపుడు, తనను తాను సిద్ధపరచుకున్నాడు అందుకే, మేము తిరిగి వస్తాము అని చెప్పగలిగాడు.
అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు–నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను. నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను. -లూకా 15:17-19
ఇక్కడ ఉన్నతమైన స్థానములో ఉన్నవాడైన చిన్న కుమారుడు, తన జీవితమంతా పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ, తన తండ్రి ఇంట కూలివానికి కలిగిన జీవితమును గూర్చి తాను ఎరిగిన సత్యమును బట్టి, తనను తాను సిద్ధపరచుకున్నదానిని బట్టి, శూన్యమైన పరిస్థితిలోనుండి తాను మార్చబడ్డాడు. కూలివానిగా ఉండటానికి సిద్ధపడి వెళితే, కుమారుడిగా స్వీకరించబడ్డాడు.
నిన్ను నీవు సిద్ధపరచుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలి అనుకున్నపుడు, నీవు ఊహించినదానికంటే ఎక్కువగా దేవుడు చేసేవాడిగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు రాక ముందు, వాడు తినడానికి ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. అయితే ఎప్పుడైతే, తండ్రి దగ్గరకు వచ్చాడో, అప్పుడు తనను బట్టి అనేకులకు విందు భోజనము సిద్ధపరచబడింది.
తప్పిపోయిన కుమారుడు పందులను కాసే కూలివాడివలే జీవించాడు, ఎప్పుడైతే సిద్ధపరచుకుని తండ్రి వద్దకు వెళ్ళాడో, అప్పుడు తనను బట్టి, అనేకమైన కూలివాళ్ళు విందులో పాలు కలిగి సంతోషించారు.
నీవు కూడా, నిన్ను బట్టి అనేకులు జీవించునట్లు, సాక్షిగా ఉండునట్లు సిద్ధపరచుకుంటావా?
తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దనుండి బయటకు వచ్చి, సమస్తము పోగొట్టుకొని, ఒక పందుల యజమానుడి వద్ద చేరిన తరువాత, ఆ పందుల యజమానుడు అతని జీవితము బాగాచేయలేకపోయాడు. అయితే ఎపుడైతే తన తండ్రి వద్ద అనేకులు జీవము కలిగి ఉన్నారు అనే సంగతి ఎరిగి తిరిగి వచ్చాడో, అతని జీవితము మారిపోయింది.
నీ క్షేమము నీ తండ్రి యొద్దనే! నీ దుఃఖము సంతోషముగా మరునట్లు నీవు సిద్ధపరచుకో!