స్తోత్ర గీతము 1
సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభూ
ఆధారము ఆశ్రయము నీవే నా యేసు
నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి
చిన్న చిన్న గొర్రె పిల్లలము కాపరివై మము కాయుము
అమ్మ నాన్న అన్నీ నీవే ఆదరించి సేదదీర్చుము
నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి
పరుగెత్తినా కొండ కోనలలోన పచ్చని పచ్చికలో
అండదండ కొండా కోనా నీవే యేసు
నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి
స్తోత్ర గీతము 2
ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా
ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా
పగిలిపోయిన ప్రతీ పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా
గొర్రెల కాపరి అయిన దావీదున్ – నీవు రాజుగా చేసినావుగా
గొలియాతును పడగొట్టుటకు – నీ బలమునే ఇచ్చినావయ్యా
ప్రతి బలహీన – సమయములో – నీ బలము నా తోనుండగా
భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద
ఘోరపాపి అయిన రాహాబున్ – నీవు ప్రేమించినావుగా
వేశ్యగా జీవించినను – వారసత్వమునిచ్చినావుగా
నా పాపమై – నా శాపమై – మరణించిన నా యేసయ్య
నా నీతియై – నిత్య శాంతియై – నా తోడుండు నా దైవమా
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా
ఆరాధన వర్తమానము
తన సన్నిధిలో మరొకవారము మనలను నిలువబెట్టిన దేవదేవునికే మహిమ ఘనత కలుగునుగాక! మన దేవుడు మన పక్షముగా సమస్తమును జరిగించేవాడుగా ఉన్నాడు.
నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలోనుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు. -యెషయా 43:11-12
ఈరోజు దేవుని సన్నిధిలో మనము తెలుసుకొనవలసిన సత్యము – “ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు”. అలాగే ఆయనకు మనమే సాక్షులము. దేవుడు మానవునికి అసాధ్యమైనదానిని అది ఏదైనా సరే చేయగలిగినవాడు.
మనము సాక్షులు అంటే, ఆయన దేవుడుగా చేస్తున్న, చేయబోతున్న కార్యములకు మనము సాక్షులుగా మనము ఉండబోతున్నాము. ఎటువంటి కార్యములను బట్టి మనము ఆయనను దేవుడు అని ఒప్పుకొంటాము?
అబ్రహాము దేవునిని విశ్వసించడానికి కారణము? లేని దానిని ఉన్నట్టుగా చేయగలవాడు, మృతమైనదానిని సజీవముగా చేయగలవాడు అని నమ్మాడు.
ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? -యెషయా 43:13
దేవుడు కార్యము చేయ మొదలు పెట్టగా దానిని త్రిప్పివేయగలవాడు ఎవడూ లేడు. ఇశ్రాయేలు జనమును మనము చూస్తే, వారికి దేవుడి గూర్చి ఏమీ తెలియదు. అప్పుడు వారికి తాను ఏమి చేయగలడో కనపరుస్తూ, వారు ఆయనే దేవుడు అని ఒప్పుకోగలుగునట్లుగా వారి యెదుట కార్యము చేసినవాడుగా ఉన్నాడు.
ఎర్రసముద్రమును పాయలుగా చేయగలుగుట అనేది మానవులకు అసాధ్యము. అటువంటి సముద్రాన్ని పాయలుగా చేసినవాడు మన దేవుడు. అంటే ఆయన పాయలుగా చేయగా సముద్రము యొక్క బలము పని చేయలేదు. అందుకే ఆయన కార్యము చేయగా త్రిప్పివేయగలవాడు ఎవడూ లేదు.
అటువంటి దేవునికి నీవు నేను సాక్షిగా ఉండుటకు తీర్మానము తీసుకుందాము. మన దేవుడు అసాధ్యమైన కార్యములు మన జీవితములోనే జరిగేవిగా ఉంటాయి. ఎర్రసముద్రమును పాయలుగా చేసినా, బండనుండి నీళ్ళను తెప్పించినా, ఆకాశమునుండి మన్నాను తెచ్చినా దేనికొరకు జరిగాయి?
అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మాంసము లేదని, నీళ్ళు లేవు అని వాళ్ళు ఏడ్చినవారుగా ఉన్నారు. ఆ సమయములో వారిని తృప్తిపరచడానికి ఆయన సూపర్నేచురల్ కార్యములు చేసారు. మన పితరుల జీవితములో చేసిన దేవుడే మన జీవితములో కూడా చేసినవాడుగా ఉన్నాడు.
దేవుడు కార్యము చేయగా త్రిప్పగలవాడు ఎవడూ లేడు అయితే, దేవుడు నీ పక్షముగా కార్యము చేస్తున్నాడా లేదా అని నీవు గ్రహించాలి. ప్రతిసారి, పరిస్థితి ఏదైనా సరే ఆయన దేవుడిగా ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, సూపర్నేచురల్ కార్యములు జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా ఆయన సూపర్నేచురల్ కార్యములకు మనమే సాక్షులము.
గతములో నీవు నమ్మని దానిని బట్టి నీవు కొన్ని సూపర్నేచురల్స్ మిస్స్ అయిపోయావేమో, అయితే దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, “మీరు సాక్షులు అయి ఉన్నారు” అంటే, ఆయన సూపర్నేచురల్ కార్యములు నీవు అనుభవిస్తావు అని అర్థము. అయితే నీవే నాకు దేవుడవై ఉన్నావు అని ఒప్పుకుందాము.
ఈ సమయములో ప్రత్యక్షపరచబడవలసిన స్థితిలో ప్రభువును వదలక, నిలబడండి. దేవుడు నీ జీవితములో చేసే సూపర్నేచురల్ కార్యమునకు సాక్షిగా ఉంటావా?
ఆరాధన గీతము
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా నే వెనుదిరుగా
నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు
నిన్నే పూజింతును నే వెనుదిరుగా
నీ సాక్షిగా జీవించి నీ మహిమకై ఉండెదన్
నిరసించక సాగెదా నే వెనుదిరుగా
నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా
నీ సాక్షిగా జీవించి నీ మహిమనై ఉండెదా
నిరసించక సాగెదా నే వెనుదిరుగా
వారము కొరకైన వాక్యము
జీసస్ కేర్స్ యూ మినిస్ట్రీ గమ్యము ఏమిటి అంటే, రక్షించబడిన ప్రతి ఒక్కరూ, వారి జీవితమును విజయవంతముగా జీవించుటయే. అలా జీవించి ప్రభువు కొరకు సాక్షిగా ఉండాలి అనేది దేవుని ఆకాంక్ష. దీనిని బట్టి దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అని గ్రహించాలి.
అయితే ఆచారయుక్తముగా ప్రభువును వెంబడించడం వల్ల ఏమీ ప్రయోజనము లేదు. మా దేవుడు రక్షించగల సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా ఆయనను విడిచిపెట్టము అని ఎలా అయితే షద్రకు, మేషాకు అబెద్నగోలవలే నిలబడాలి.
నీ ప్రభువు నీలో తన కార్యము జరిగే వరకు విడిచిపెట్టడు. ఆయనకు నీపై ఉన్న తన ప్రణాళికయే నిన్ను బ్రతికిస్తుంది. అందుకే మనము ధైర్యముగా చెప్పగలము – “ప్రభువును నా జీవితములో మహిమపరచుకొనే వరకు నేను ఈ భూమిని విడిచిపెట్టను”.
నీ కొరకు దేవుడు సిద్ధపరచాడు అనే విషయము గూర్చి తెలుసుకుందాము. దేవుడు అసలు ఏమి సిద్ధపరచాడు, ఏ విధముగా సిద్ధపరుస్తాడు.
యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడనుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. జనసమూహములు ఆ సంగతి విని, పట్టణములనుండి కాలినడకను ఆయనవెంట వెళ్లిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలమైనప్పుడు శిష్యు లాయనయొద్దకు వచ్చి ఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజనపదార్థములు కొనుక్కొనుటకై వారినిపంపివేయ మని చెప్పిరి. యేసు–వారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా -మత్తయి 14:13-16
ఇక్కడ జన సమూహమంతా యేసయ్య దగ్గరకు వచ్చారు. ఆయన అక్కడ ఉన్న రోగులను స్వస్థపరచారు. సాయంకాలము అయ్యే సరికి వారు ఆహారము కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పగా, యేసయ్య మీరే వారికి భోజనము పెట్టండి అని చెప్పారు.
అయితే ఈరోజు మనము గ్రహించవలసిన మాట – “అవసరము తీర్చబడుటకు, ఎక్కడికీ వెళ్ళనవసరము లేదు”. ఆయన అద్భుతము జరిగించి తన కార్యము చేసేవాడిగా మన యేసయ్య ఉన్నాడు.
వారు– ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని ఆయనతో చెప్పిరి. అందు కాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి పచ్చికమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి, ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరు తిని తృప్తిపొందిన తరు వాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపల నిండ ఎత్తిరి స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు. -మత్తయి 14:17-21
ఐదువేలకంటే ఎక్కువగా ఉన్నవారికి యేసయ్య భోజనము పెట్టాడు. అక్కడ ఆ అద్భుతము చేసిన దేవుడే మన జీవితములో ఉన్నాడు. ఆయన ద్వారా మనము పుట్టించబడినవారము. ఆయన జీవితము సూపర్నేచురల్ అయితే మన జీవితము కూడా సూపర్నేచురలే కదా!
వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకువచ్చి– మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని యడుగగా–చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడకమునుపే యేసు ఆ సంగతి యెత్తి సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలుచేయుదురు? కుమారులయొద్దనా అన్యుల యొద్దనా? అని అడిగెను. అతడు–అన్యులయొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి, గాలము వేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దాని నోరు తెరచినయెడల ఒక షెకెలు దొరకును; దానిని తీసికొని నా కొరకును నీకొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. -మత్తయి 17:24-27
ఇక్కడ అరషెకెలు పన్ను కట్టుటకు, వారి వద్ద ఏమీ లేవు. అయితే ఆ పన్ను కట్టుటకు ప్రభువే ఒక చేపద్వారా సిద్ధపరచాడు. సముద్రములో ఎన్నో చేపలు ఉండగా, ఒకదానిని ఆ పన్ను కట్టుటకు సిద్ధపరచాడు. ఇదే కదా అద్భుతం!
ఆకలి తీర్చబడే సందర్భమైనా, పన్ను కట్టవలసిన సందర్భమైనా అనగా శారీరకమైన అవసరమైనా, ఆర్థికమైన అవసరమైనా, నీ కొరకు అద్భుతము చేసి నీ అవసరము తీర్చేవాడు నీ దేవుడు.
జన సమూహములు యేసయ్య దగ్గర ఉన్నారు, శిష్యులు యేసయ్య దగ్గర ఉన్నారు. అనగా యేసయ్యతో ఉంటేనే అద్భుతము అనుభవించగలము. అంటే, అద్భుతముల కొరకు యేసయ్యను వెంబడించక్కరలేదు గానీ, ఆయనను కలిగిఉంటే చాలు, అద్భుతమే. నీ అవసరము తీర్చుటకే ఆయన అద్భుతము చేసేవాడుగా ఉన్నాడు.
అద్భుతము కొరకు, పేతురు వలే ప్రభువు చెప్పే మాటను నమ్మి నీవు ముందుకు వెళ్ళగలుగులాగున, మిమ్మును మీరే సిద్ధపరచుకొనుడి. నీ జీవితమునకు కావలిసినదాని కొరకు ముందుగానే సిద్దపరచాడు అని వాక్యము చెప్పుచున్నది. అంటే, అవన్నీ అద్భుతముతోనే సిద్ధపరచబడ్డాయి. అందుకే మన జీవితము అద్భుతమే! నీ జీవితమును చూసినవారు ఆశ్చర్యపడే విధముగా నీ జీవితము ఉంటుంది.
అబ్రహాము బలికి కావలసిన గొర్రెపిల్ల దేవుడే చూసుకుంటాడు అని చెప్పాడు. వెంటనే దేవుడూ అద్భుతము చేసి అక్కడ గొర్రెపిల్ల కనపడింది. గొడ్డలి నీళ్ళలో పడిపోతే, ఒక కర్రముక్క వేస్తే అది తేలడము అద్భుతము కాదా? ఇలా చూస్తే, దేవుడు చేసే అన్ని కార్యములు అద్భుతములే! ఇప్పుడు నీవున్న స్థితిలో అద్భుతము జరగవలసినదే!
అందుకే నీవు అవసరములో ఉన్నపుడు, ఇప్పుడు దేవుడు ఏ మార్గము తెరుస్తాడో అని మనము గమనించేవారిమిగా ఉండాలి. ఏలియా కొరకు సారెఫతు విధవరాలిని సిద్ధపరచారు. పేతురు కొరకు చేపను సిద్ధపరచారు. నీ కొరకు నా కొరకు కూడా ప్రభువు సిద్ధపరచారు.