స్తోత్రగీతము – 1
గీతం గీతం జయ జయ గీతం – చేయి తట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయ – జయ మార్భటించెదము.. (2)
ఆ ఆ ఆ
|| గీతం గీతం ||
1. చూడు సమాధిని మూసినరాయి – దొరలింపబడెను (2)
అందు వేసిన ముద్ర కావలి నిల్చెనా – దైవ సుతుని ముందు (2)
ఆ ఆ ఆ
|| గీతం గీతం ||
2.వలదు వలదు యేడువవలదు – వెళ్ళుడి గలిలయకు (2)
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను – పరుగిడి ప్రకటించుడి (2)
ఆ ఆ ఆ
|| గీతం గీతం ||
3.అన్న కయప వారల సభయు – అదరుచు పరుగిడిరి (2)
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి (2)
ఆ ఆ ఆ
|| గీతం గీతం ||
4.గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి – జయ వీరుడు రాగా (2)
మీ మేళతాళ వాద్యముల్ బూర – లెత్తి ధ్వనించుడి (2)
ఆ ఆ ఆ
|| గీతం గీతం ||
స్తోత్రగీతము – 2
యూదా రాజసింహం – తిరిగి లేచెను
తిరిగి లేచెను – మృతిని గెలిచి లేచెను
యూదా రాజసింహం – యేసుప్రభువే
యేసుప్రభువే – మృతిని గెలిచి లేచెను
యూదా రాజసింహం – తిరిగి లేచెను
1. నరక శక్తులన్నీ – ఓడిపోయెను
ఓడిపోయెను – అవన్నీ రాలిపోయెను
2. యేసు లేచెనని -రూఢియాయెను
రూఢియాయెను – సమాధి ఖాళీ ఆయెను
3. పునరుత్థానుడిక – మరణించడు
మరణించడు – మరెన్నడు మరణించడు
4. యేసు త్వరలో – రానైయున్నాడు
రానైయున్నాడు – మరల రానైయున్నాడు
స్తోత్రగీతము – 3
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త- నిత్యుడగు తండ్రి బలవంతుడు
లోకాన్ని ప్రేమించి-తన ప్రాణము నర్పించి
తిరిగి లేచిన పునరుత్థానుడు
రండి మన హృదయాలను – ఆయనకు అర్పించి
అత్మతో సత్యముతోను- ఆరాధించెదము.. ఆరాధించెదము..
ఆరాధన… ఆరాధన… యేసయ్యకే.. ఈ ఆరాధన….
పరిశుద్దుడు… పరిశుద్దుడు మన దేవుడు అతి శ్రేష్టుడు
రాజులకే.. రారాజు ఆ ప్రభువుని పూజించెదం
హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా
సత్యస్వరూపి.. సర్వాంతర్యామీ.. – సర్వాధికారి మంచి కాపరి
వేలాది సూర్యుల – కాంతిని మించిన మహిమ గలవాడు మహా దేవుడు
రండి మనమందరము – ఉత్సాహ గానములతొ ఆ దేవ దేవుని
ఆరాధించెదము ఆరాధించెదము -ఆరాధించెదము ఆరాధించెదము
ఆరాధన వర్తమానము
ఈరోజు పునరుత్థాన ఆదివారము. మన ప్రభువైన యేసుక్రీస్తు మరణమును జయించి తిరిగి జయోత్సాహముతో లేచిన దినము.
యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను. -మత్తయి 27:57-60
శుక్రవారము మన పాపములకు వెల చెల్లించబడింది. మనకు విరోధముగా ఉన్న ఋణపత్రమును యేసయ్య ఆ సిలువకు కొట్టి మనలను విడిపించినాడు. ఆతరువాత సమాధి చెయ్యబడ్డాడు.
మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి –అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడుదినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రముచేయ నాజ్ఞా పించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి –ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదు రేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి. అందుకు పిలాతు–కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి. -మత్తయి 27:62-66
ఇక్కడ పరిసయ్యులకు యేసయ్య మూడు దినముల తరువాత తిరిగిలేస్తాను అని చెప్పిన మాటలు జ్ఞాపకము ఉన్నట్టుగా మనము గమనించగలము.
మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను. -అపొస్తలుల కార్యములు 2:24
భౌతికముగా చూస్తే ఆ సమాధి ముద్రవేయబడింది. కావలివారు కాపలాగా ఉన్నారు. అయినప్పటికీ ఆత్మీయముగా ఆలోచిస్తే మరణము ఆయనను బంధించియుంచుట అసాధ్యము.
ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి -మత్తయి 28:6
ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ?౹ -1 కొరింథీయులకు 15:55
యేసయ్య మరణాన్ని జయించినతరువాత చెప్పిన మాటలు ఇవి. నిజానికి మరణము ఎంతో బలము కలిగినది. మరణము సమీపిస్తుంది అంటే, మనిషి ఎంతో భయకంపితుడైపోతాడు. ఎన్ని కోట్ల సంపదకలిగినా సరే మరణ భయము ఎంతో భయంకరమైనది. యేసయ్య సిలువపై చనిపోయినప్పుడు తాను గెలిచానని అపోహపడ్డాడు. అయితే దేవుని ప్రణాళిక, దేవుని సంగతులు ఎరగక ఆ విధముగా అనుకున్నాడు, అయితే మరణము మీద యేసయ్య విజయము పొందగానే, సాతాను సంపూర్ణముగా ఓడిపోయాడు. అంతే కాక, యేసయ్య పొందిన విజయము ఆయన యందలి విశ్వాసముగలిగిన మనకు కూడా ఇవ్వబడుతుంది.
అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.౹ -1 కొరింథీయులకు 15:57
నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను. -యోహాను 16:33
యేసయ్య బలము కలిగిన దానిని జయించి ఆ జయమునే మనకు ఇచ్చి ఉన్నాడు.
దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే౹ -1 యోహాను 5:4
యేసయ్య మరణాన్ని గెలిచి ఆ విజయాన్ని నీకు నాకు ఇచ్చాడు. దానిని బట్టి ఎట్టి శ్రమ వచ్చినా సరే ఆ జయము మన శ్రమలలో కూడా ప్రత్యక్షపరచబడుతుంది. నీ గెలుపుకు అవసరమైన ముఖ్యమైన కార్యము దేవుడే చేసి ఆ విజయమును నీకు ఇచ్చాడు. మరణము ఆయనను బంధించియుంచుట అసాధ్యము గనుక, ఆయన తిరిగిలేచిన కారణాన్ని బట్టి మనలను కూడా మరణము బంధించి ఉంచుట అసాధ్యము.
మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తునుగూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.౹ -2 కొరింథీయులకు 2:14
ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము;౹ -2 కొరింథీయులకు 4:8
వెళ్ళిన ప్రతిచోట శ్రమ కలిగిననూ వారు ఇరికింపబడలేదు అని పౌలు చెప్పుచున్నాడు. ఎందుకు అంటే ఆ పునరుత్థాన కార్యమును బట్టి ఆ కార్యము యొక్క సత్యమును ఎరిగినవాడుగా ఆ సత్యమందు తాను జీవిస్తూ, జయిస్తున్నాడు అని అర్థము. ఒకానొక సందర్భములో పౌలును రాళ్ళతో కొట్టి మరణించాడు అనుకొని ఈడ్చి ఊరి అవతల పడవేసినప్పటికీ, యేసయ్య ఇచ్చిన విజయమును నమ్మినవాడిగా తెల్లవారగానే మరలా సమాజమందిరములో వాక్యము బోధించాడు. నీ శ్రమ పై నీకు విజయము ఇవ్వబడింది అనే సత్యము పౌలుకు మాత్రమే కాదు కానీ యేసయ్య పునరుత్థానమును నమ్మి ఆయన ఇచ్చిన విజయమును నమ్మి విశ్వసించే నీకు కూడా వర్తిస్తుంది. నిన్ను బంధించుటకొరకు, నిన్ను అడ్డగించుటకొరకు బలముకలిగినది ఏది ఈ లోకములో ఉన్నాసరే, నీ మీద దానికి విజయము కలుగదు. ఎందుకంటే యేసయ్య లోకమును జయించి ఉన్నాడు ఆ జయము నీకు ఇచ్చాడు.
ఆరాధన గీతము
మరణాన్ని గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న
ప్రాణముతో గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న
ఆత్మతో నింపిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
అభిషేకనాధుడా నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న
పరిశుద్ధమైన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
సింహాసనాసీనుడా నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న
పరిపూర్ణమైన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
సర్వాధికారి నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న
పునరుత్థాన ఆదివారపు సందేశం
పునరుత్థానము నిజముగా అవసరమా? అని మనము ఈరోజు ధ్యానము చేస్తాము.
విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. దూత ఆ స్త్రీలను చూచి–మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును -మత్తయి 28:1,5
సిలువ వేయబడిన యేసును సమాధులలో ఆ స్త్రీలు వెతుకుతున్నారు. సత్యము తెలియక వారు ఆవిధముగా చేయుచున్నారు.
ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు -మత్తయి 28:6
వెతకవలసినది ఎక్కడ వెతకాలి, ఎక్కడ వెతుకుతున్నారు. ఆయన చెప్పినట్టే లేచి యున్నాడు గనుక ఆయనను ఎక్కడ వెతకాలి? ఆయన చెప్పినట్టు గలిలయలో వెతికేవారు. ఎందుకంటే యేసయ్య వారికంటే ముందుగా గలిలయకు వెళతానని యేసయ్య చెప్పిన మాటలు చెప్పాడు.
మరొక విధానములో చూస్తే, మనము కూడా యేసయ్య రక్తము చిందించి వెల చెల్లించి ఆ పాపము యొక్క అధికారమును నీ మీదనుండి తీసివేసాడు. అయినప్పటికీ, మరలా పాపము నుండి విడుదల చెయ్యమనే అలోచన గలిగి ఉన్నాము, అయితే ఆయన జయమునిచ్చిన తరువాత పాపము నిలిచి ఉన్నట్టుగా మన ధోరణి ఉంటుంది.
ఉదాహరణకు అనారోగ్యము వచ్చింది అనుకోండి మన ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది దానిని బట్టి నన్ను స్వస్థపరచు అని ప్రార్థిస్తాము. అయితే పునరుత్థానపు విశ్వాససహితమైన ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, “పునరుత్థాన విజయమును ఆధారము చేసుకొని ఉంటుంది”.
దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే౹ -1 యోహాను 5:4
క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమునుగూర్చి చెప్పెను.౹ -అపొస్తలుల కార్యములు 2:31
ఆయననుగూర్చి దావీదు ఇట్లనెను –నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువు ను చూచు చుంటిని ఆయన నా కుడిపార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను.
కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు. నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. -అపొస్తలుల కార్యములు 2:25-28
నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పుచున్నాడు? -మత్తయి 22:44
మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.౹ -1 కొరింథీయులకు 15:21
ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీర మున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది.౹ -1 కొరింథీయులకు 15:44
క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది.౹ -1 కొరింథీయులకు 15:53
పునరుత్థానము ద్వారా శరీరము ద్వారా సమాధిచేయబడి, మహిమ శరీరముగా చేయబడ్డాడు. మరొకలా చూస్తే, క్షయమైన శరీరము సమాధిలో విత్తబడింది. తరువాత అక్షయతను ధరించుకొనిన మహిమ శరీరము గా లేపబడింది.
యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను.౹ యేసు–రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త–ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.౹ -యోహాను 11:38-39
లాజరు చిపోయి 4 దినాలు అయింది. యేసయ్య చనిపోయి 3 దినాలు అయింది. ఇద్దరూ సమాధి చేయబడ్డారు.
ఆయన ఆలాగు చెప్పి–లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా౹ చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు– మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను. -యోహాను 11:43-44
లాజరు వెలుపలకు వచ్చాడు, యేసయ్య కూడా వెలుపలకి వచ్చాడు. అయితే లాజరు సమాధిచేయబడ్డప్పుడు ఎలా అయితే పెట్టబడ్డాడో అలాగే లేచాడు. అయితే యేసయ్య సమాధిచేయబడ్డలాగున తిరిగి లేవలేదు. ప్రేతవస్త్రమలు తొలగించబడ్డాయి. మరి లాజరుకు ఆ విధముగా లేదు. దానికి కారణము యేసయ్య ఇంకనూ పునరుత్థానము కానందువలన. అందుకే యేసయ్య పునరుత్థానుడవుట ఎంతో అవశ్యకము.
ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను – కొలస్సీ 2:13.
ఆయన జగత్తు పునాది వేయబడకమునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవునియందు ఉంచబడియున్నవి.౹ -1 పేతురు 1:20
నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను,౹ లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.౹ -1 కొరింథీయులకు 15:3-4
లేఖనములు అనగా దేవునిచేత ముందుగా చెప్పబడి వ్రాయబడినవి తెలియచేయబడినవి. నీ, నా పాపములకు వెల చెల్లించబడినది ఆ తరువాత సమాధి చేయబడి, తిరిగి లెచాదు.
ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, -ఎఫెసీయులకు 1:20
మృతులలోనుండి యేసును లేపినవాని ఆత్మ రోమా 8:11
యేసయ్యతో పాటు నీ నా పాపములు సమాధి చేయబడ్డాయి అనే సత్యము మనము గ్రహించాలి. అప్పుడు మనము పునరుత్థాన జీవితము జీవించగలుగుతాము.
ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.౹ -ఫిలిప్పీయులకు 3:10
జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.౹ -2 కొరింథీయులకు 5:15
ఈ మూడు రోజులు జరిగినది ఒకసారి జ్ఞాపకము చేసుకొంటే,
1. మొదటి దినము: సిలువలో వెల మన పాపములకు చెల్లించబడింది.
2. రెండవ దినము: సమాధి చేయబడ్డాడు ఆయనతో పాటు మన పాపములను సమాధిచేసాడు. చెరను విడుదలచేసాడు.
3. మూడవ దినము: పాప పరిహారము ముగించిన యేసయ్యకు తండ్రి ఆత్మ ద్వార పునరుత్థాన శక్తి అనుగ్రహించి మృతులలో నుండి లేపినాడు.