09-04-2023 – పునరుత్థానం వలన కలిగిన ఆశీర్వాదం

స్తోత్రగీతము – 1

గీతం గీతం జయ జయ గీతం – చేయి తట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయ – జయ మార్భటించెదము.. (2)
ఆ ఆ ఆ
|| గీతం గీతం ||

1. చూడు సమాధిని మూసినరాయి – దొరలింపబడెను (2)
అందు వేసిన ముద్ర కావలి నిల్చెనా – దైవ సుతుని ముందు (2)
ఆ ఆ ఆ
|| గీతం గీతం ||

2.వలదు వలదు యేడువవలదు – వెళ్ళుడి గలిలయకు (2)
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను – పరుగిడి ప్రకటించుడి (2)
ఆ ఆ ఆ
|| గీతం గీతం ||

3.అన్న కయప వారల సభయు – అదరుచు పరుగిడిరి (2)
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి (2)
ఆ ఆ ఆ
|| గీతం గీతం ||

4.గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి – జయ వీరుడు రాగా (2)
మీ మేళతాళ వాద్యముల్ బూర – లెత్తి ధ్వనించుడి (2)
ఆ ఆ ఆ
|| గీతం గీతం ||

స్తోత్రగీతము – 2

నిన్ను పోలిన వారెవరు
నీతో సమముగా లేరెవరు
పరమును వీడి నా దరికొచ్చిన
నా ప్రభువా నిన్ను స్తుతియించెదన

యేషూవ యేషూవ – నా రాజు మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా
యేషూవ యేషూవ – నా సర్వం మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా….

 

1) సిలువలో నాకై – మరణించి
నా పై నీ ప్రేమను – కనుపరచి
మూడవ దినమున – తిరిగి లేచి
మరణమునే జయించి
వేలాది దూతలతో మధ్యఆకాశములో
నన్ను కొనిపోవా రానైయున్న

యేషూవ యేషూవ – నా రాజు మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా
యేషూవ యేషూవ – నా సర్వం మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా….

2) నా పేరుతో- నన్ను పిలచి
నీ సాక్షిగా- నిలువబెట్టి
నీ ఆత్మతో- అభిషేకించి
నీ సొత్తుగా- నన్ను మార్చి
కృప వెంబడి కృపతో- యెనలేని ప్రేమతో
నీ సేవకునకు తోడైయున్న

యేషూవ యేషూవ – నా రాజు మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా
యేషూవ యేషూవ – నా సర్వం మీరయ్య
యేషూవ యేషూవ – హల్లెలూయా….

స్తోత్రగీతము – 3

నీటిపైనా నడిచెను
గాలి సముద్రమును గద్దించెను
మృత్యుంజయుడై లేచెను
నాతో నిత్యము జీవించును

ఆయనే కాపాడు దేవుడు
ఆయనే నడిపించే దేవుడు
ఆయనే తోడైయుండు దేవుడు
ఆయనే

మనకొరకై మరణించి
సిలువలో ప్రాణమునిచ్చెను
జయశీలుడై లేచెను
పాపికి విడుదలనిచ్చెను
“ఆయనే కాపాడు దేవుడు”

మేఘముల మధ్యలో
బూర ధ్వని శబ్దముతో
రారాజుగా దిగివచ్చును
ఈ భూలోకమును ఏలుటకై
“ఆయనే కాపాడు దేవుడు”

ఆయనే అధికారముతో యేసయ్యా
ఆయనే రాజ్యమేలుటకు యేసయ్యా
ఆయనే న్యాయాధిపతి యేసయ్యా

ఆరాధన వర్తమానము

ఈరోజు పునరుత్థాన ఆదివారము. మన ప్రభువైన యేసుక్రీస్తు మరణమును జయించి తిరిగి జయోత్సాహముతో లేచిన దినము. 

నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను,౹ లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.౹ -1 కొరింథీయులకు 15:3-4

లేఖనములలో దేవుని చిత్తము, ఆయన ఆలోచన గూర్చి వ్రాయబడిన మాటలు. దేవుని ఆలోచన ఏమై ఉంటుంది? నిన్ను ప్రేమించుట. ఆ ప్రేమను బట్టే, యేసు క్రీస్తు ప్రభువు భూలోకములోని రావటం జరిగింది. ఈ లోకములోనికి వచ్చి మరణమును జయించాడు. అయితే ఏ మరణమును? ఎవరి మరణమును జయించాడు? నీ, నా పాపముల నిమిత్తము ఆయన ఆ సిలువలో మరణముపొందాడు. ఆ తరువాత సమాధి చేయబడ్డాడు.

ఆయన జగత్తు పునాది వేయబడకమునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవునియందు ఉంచబడియున్నవి.౹ -1 పేతురు 1:20

దేవుని ప్రణాళిక జగత్పునాది వేయబడక మునుపే యేసయ్యను సిలువ మరణము కొరకు, సమాధి చేయబడుట కొరకు మరియు తిరిగి లేపబడుటకొరకు నియమించాడు. యేసయ్య మరణించిన దినాన మన పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. యేసయ్యతో పాటు మన పాపములు కూడా సమాధి చేయబడ్డాయి. అయితే ఆయన తిరిగి లేచుట ద్వారా మాత్రమే నిత్యజీవము మనకు కలిగింది. ఒకవేళ యేసయ్య తిరిగి లేవకపోతే మనకు నిత్య జీవము లేదు. యేసు మృతులలోనుండి లేచాడు అని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరూ రక్షణ పొందుదురు.

మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతోకూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.౹ -1 పేతురు 1:3

యేసయ్య తిరిగిలేచిన కారణాన మనము మారు జన్మ పొందాము. శుక్రవారాన వెల చెల్లించబడింది. రెండవ దినాన మన పాపములను సమాధి చేసాడు. మూడవ దినాన తిరిగిలేచి మనలను తిరిగి జన్మింపచేసాడు. దానిని బట్టి ఇంక మనము జీవించు జీవితము మనకొరకు ప్రాణము పెట్టిన యేసుకొరకు జీవించాలి.

ఆరాధన గీతము

జుంటె తేనె కన్నా తీయనిది
వెండి పసిడి కన్నా మిన్న అది
పొంగి పొర్లుచున్న ప్రేమ నీది
యేసు నీ నామము

సూర్య కాంతి కన్నా ప్రకాశమైనది
పండు వెన్నెల కన్నా నిర్మలమైనది
మంచు కొండల కన్నా చల్లనిది
యేసు నీ నామము

యేసూ అసాధ్యుడవు నీవు
మరణాన్ని జయించిన వీరుడవు
సర్వాన్నీ శాసించే యోధుడవు
నీకు సాటి లేరెవరు

రక్షకా నీవేగా మా బలము
దేవా మా దాగు స్థలము నీవే
నీవే నిజమైన దేవుడవు
ప్రణమిల్లి మ్రొక్కెదము ||జుంటె||

ఆకాశము కన్నా విశాలమైనది
విశ్వమంతటిలో వ్యాపించియున్నది
ఊహలకందని ఉన్నతమైనది
యేసు నీ నామము

లోకమంతటికి రక్షణ మార్గము
జనులందరిని బ్రతికించు జీవము
సర్వ కాలములో నివసించు సత్యము
యేసు నీ నామము ||జుంటె||

పునరుత్థాన ఆదివారపు సందేశం

ఈ సమయములో యేసు పునరుత్థానము చెందుట ద్వారా మనము ఏమి పొందుకున్నాము అనే విషయము గూర్చి తెలుసుకుందాము.

విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి. దూత ఆ స్ర్తిలను చూచి–మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును; ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు -మత్తయి 28:1-6

“తాను చెప్పినట్టే” అనే మాట చాలా ప్రాముఖ్యమైనది గనుక గమనించండి.

మీరు బాప్తిస్మమందు ఆయనతోకూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ లేచితిరి.౹ -కొలొస్సయులకు 2:12

అనగా యేసు ఎలా లేచాడో, ఆయననది విశ్వాసముంచినవారు కూడా అలాగే లేచారు అని వాక్యము చెప్తుంది. అయితే యేసు ఎలా లేచాడు అని చూద్దాము.

వారు– అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె–నా ప్రభువును ఎవరో యెత్తికొనిపోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను.౹ ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.౹ -యోహాను 20:13-14

యేసు నిలిచి ఉండుట చూసింది కానీ, యేసు అని గుర్తుపట్టలేదు. తిరిగిలేస్తాను అని యేసు చెప్పినది మగ్దలేనే మరియ గ్రహించలేదు.

యేసు–అమ్మా యెందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని–అయ్యా, నీవు ఆయనను మోసికొనిపోయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను.౹ యేసు ఆమెను చూచి–మరియా అనిపిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అనిపిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము.౹ -యోహాను 20:15-16

ముందు గుర్తుపట్టలేదు కానీ “మరియా” అని పిలవగానే యేసు స్వరమును గుర్తుపట్టింది. తోటమాలికి మరియ పేరు తెలియదు, ఎప్పుడైతే “మరియా” అని పిలిచాడో, అప్పుడు యేసు స్వరమును గుర్తుపట్టింది. అయితే మరొక సందర్భము చూద్దాము, సౌలు దమస్కు వీధిలోనికి వెళుతున్నప్పుడు యేసు దర్శించగానే “ప్రభువా” అని సంబోధిస్తున్నాడు. ప్రభువు మహిమాపూర్ణుడుగా తిరిగిలేచినప్పుడు ఆయన మాటలో కూడా మహిమ ఉంటుంది. మరణాన్ని జయించి యేసయ్య లేచాడు, మనము కూడా మరణమును యేసులో జయించే మనము తిరిగి జన్మించాము.

మహిమా జీవితము పొందడము వలన మనము పొందినది ఏమిటి?

నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను. -యోహాను 16:33

ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చిమధ్యను నిలిచి–మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.౹ -యోహాను 20:19

శిష్యులు యూదులకు భయపడి ఇంటికి తలుపులు మూసికొని ఉండగా, మహిమా శరీరముతో ఉన్న యేసు ఆ తలుపులు దాటుకుని వారి దగ్గరకు వెళ్ళారు. అలాగే మన జీవితములో కూడా యేసును బట్టి విశ్వాసముతో కలిగిన మహిమా జీవితములో భౌతికముగా మనలను అడ్డగించగలిగినది ఏదీ ఉండదు. అలాగే మనము దేవుని చిత్తానుసారముగా కలిగిన ఆశను నెరవేర్చుటకు అడ్డు ఏదీ ఉండదు.

ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే గాక రాబోవు యుగమునందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనియున్నాడు.౹ -ఎఫెసీయులకు 1:20

యేసు క్రీస్తును మృతులలోనుండి లేపినది దేవుని శక్తి. యేసు శరీరము మహిమతో నింపబడి ఉన్నది. ఆయన శరీరములో దేవుని శక్తి ఉంది. ఆయనను నమ్మిన మనము కూడా దేవుని మహిమ మరియు శక్తి చేత నడిపించబడతాము.

ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?౹ -రోమా 8:31

“ఇట్లుండగా” అంటే, దేవుని శక్తి నాలో ఉండగా, దేవుని మహిమ నాలో ఉండగా నాకు విరోధముగా ఎవరుండగలరు? ఏమి ఉండగలదు?

మృతులలోనుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. -రోమా 8:11

దేవుని ఆత్మ యేసుని మృతమైన దానిలోనుండి లేపినట్టుగా మనము గమనిస్తాము. అలాగే బాప్తీస్మము పొందినప్పుడు మనలోనికి పరిశుద్ధ ఆత్మ మనలోనికి వస్తారు.

నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మ ను మీకనుగ్రహించును.౹ లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును.౹ -యోహాను 14:16-17

యేసు పునరుత్థానమందు విశ్వాసముంచిన మనలో యేసును మృతులలోనుండి లేపిన దేవుని పరిశుద్ధాత్మ నివసిస్తారు.

మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు -1 కొరింథీయులకు 2:10

వేటిని బయలుపరచారు అని చూస్తే, “దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు”. ఇంతకు మునుపు నీకొరకు సిద్ధపరచినది నీ కంటికి కనపడలేదేమో గానీ, యేసు పునరుత్థానమందు విశ్వసించిన నీకు ఇప్పుడు ఆత్మవలన బయలుపరచబడుతుంది.

మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.౹ ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మ కే గాని మరి ఎవనికిని తెలియవు.౹ -1 కొరింథీయులకు 2:10-11

దేవుని సంగతులన్నీ పరిశుద్ధాత్మకు తెలుసు. అటువంటి పరిశుద్ధాత్మ మీలో ఉంటున్నారు.

క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?౹ కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలుపొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి.౹ -రోమా 6:3-4

ఎలా అయితే యేసయ్య జీవముతో లేచాడో, నీవు కూడా జీవముతో లేచావు.

మనము క్రీస్తుతోకూడ చనిపోయినయెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదు మని నమ్ముచున్నాము.౹ -రోమా 6:8

“క్రీస్తుతోకూడ చనిపోయినయెడల” అంటే క్రీస్తు పాపముల విషయములో చనిపోయినట్టే మనము కూడా పాపము విషయములో చనిపోతే, ఎలా అయితే యేసు క్రీస్తు మరలా చనిపోడో, మనము మరలా పాపములోనికి వెళ్ళకూడదు. మరణమునకు యేసయ్య మీద అధికారము లేదు. అలాగే ఆయనయందు విశ్వాసముంచిన మన మీద కూడా మరణమునకు అధికారము లేదు.

ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు౹ అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి. -రోమా 6:10-11

జీవించువారు ఇకమీదట వారి కొరకు కాక వారికొరకు ప్రాణము పెట్టిన యేసయ్య కొరకు జీవించాలి. మనకు ఇవ్వబడిన మహిమా జీవితము దేనికొరకు ఇవ్వబడినది అంటే దేవుని కొరకు ఇవ్వబడింది. దేవుని శక్తిచేత నడిపించబడేది.