ఆరాధన వర్తమానము
మనము దేవుని స్తుతించి మహిమపరచే సమయములో అనేకమైన ఆటంకముల ద్వారా అపవాది ప్రయత్నిస్తాడు. అందుకే ఆయనను స్తుతించడానికి మనము మనలను సిద్ధపరచుకోవాలి. కొన్ని సార్లు మనము ఆయన సన్నిధిలోనే ఉంటాము గానీ, మన ఆలోచనలు అన్నీ మనము కలిగి ఉన్న పరిస్థితులను బట్టి అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. గనుక దేవునిని నిజముగా స్తుతించడానికి మనలను మనమే సిద్ధపరచుకోవాలి.
అపవాది పడద్రోయకమునుపు, దేవునిని ఆరాధించే ఆధిక్యత కలిగినవాడుగా ఉన్నాడు. అయితే అసూయ చేత పడద్రోయబడిన తరువాత, మనలను దేవుని స్తుతించకుండా ప్రయత్నములు చేస్తాడు.
అపవాది యొక్క ప్రయత్నము ఎప్పుడూ ఆత్మీయమైన జీవితమునుండి తప్పించడమే. గనుక నీవు అపవాది తంత్రములను ఎరిగి ఉండాలి. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మహత్మ్యము కలిగినవాడు అని లేఖనములు చెప్పుచున్నాయి.
యెహోవా మహా దేవుడు దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు -కీర్తనలు 95:3
అపవాది ఎన్ని ప్రయత్నములు చేసినా, నిన్ను వాటినుండి తప్పించగలిగిన సమర్థుడు నీ దేవుడు అనే సత్యము నీవు ఎరిగినపుడు నీవు నిజముగా నీ దేవునిని స్తుతించగలుగుతావు.
భూమ్యగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వతశిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను -కీర్తనలు 95:4-6
మన దేవుడు మహా దేవుడు, మహాత్మ్యముగల మహారాజు, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. అటువంటి నీ దేవుడు ఎంత శక్తిమంతుడు? అయితే నీవు ఈ సత్యము ఎరిగి ఉన్నట్టయితేనే నీవు ని జీవితపు పరిస్థితులను ధైర్యముగా ఎదుర్కోగలుగుతావు.
ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. -కీర్తనలు 95:6
ఇటువంటి గొప్ప కార్యములు చేసిన దేవుడు గొప్ప దేవుడు మరియు నీ దేవుడు అయి ఉన్నాడు. ఆయన నిన్ను పాలించేవాడుగా ఉన్నాడు, నిన్ను మేపేవాడుగా ఉన్నాడు. అటువంటి సర్వశక్తిమంతుడే నీకు కాపరి, రాజుగా ఉంటున్నాడు.
నీ దేవుడు మహారాజు నీ జీవితములో శత్రువు రాకుండా నిన్ను పాలించేవాడుగా ఉన్నాడు. శత్రువు నిన్ను ఎప్పుడు మింగుదునా అని ప్రయత్నము ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. మన దినములు ఎలా అయితే నూతనముగా పుడుతూ ఉంటాయో, అపవాది ప్రయత్నములు కూడా నూతనముగానే పుడతాయి. గనుక మనము ఉదాసీనత అసలు మనము కలిగి ఉండకూడదు. ఈ పరిస్థితులలో మనలను మనము కాపాడుకోవాలి అంటే, మనకు మహారాజైన దేవుని పరిపాలనలోనే ఉండాలి.
యోబు జీవితము చుట్టూ దేవుని కంచె ఉన్నంతవరకు అపవాది ఏమీ చేయలేకపోయాడు. ఒక్కసారి ఆ కంచె తొలగించబడగానే భయంకరమైన దాడి చేసాడు. అలాగే మనము మన దేవుని పరిపాలనలో ఉన్నంతవరకు మనము క్షేమముగా ఉంటాము. అయితే ఎప్పుడైతే మనము ఆయన పరిపాలనలోనుండి బయటకు వెళతామో, అపవాది యొక్క దాడి భయంకరముగా ఉంటుంది.
మనము ఆయన మేపు గొర్రెలము అయి ఉన్నాము. ఆయన మంచి కాపరి గనుక పచ్చిక ఎక్కడ ఉంటుందో, అక్కడికే నడిపిస్తాడు, అక్కడే వాటిని మేపుతాడు. జీవము వద్దకే ఆ కాపరి నడిపించేవాడుగా ఉన్నాడు. మన జీవితములో ఎక్కడైనా జీవము లేని పరిస్థితులు ఉంటే, నిన్ను మేపేవాడు ఆయనే అనే సత్యము నీవు గ్రహించు. నీ కాపరి నమ్మదగినవాడు.
ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు -మత్తయి 6:26
గొర్రెలు పచ్చిక ఉన్న చోటనే ఉంటాయి. ఆ గొర్రెలకు కావలిసిన జీవాన్ని సిద్ధపరచేవాడు, అక్కడకి నడిపించేవాడు వాటి కాపరే గనుక, ఒకచోట పచ్చిక అయిపోతే మరొకచోటకి నడిపించబడతాయి గనుక నిత్యము జీవముతో ఉంటాయి. మనకు కూడా ఆయనే కాపరి గనుక, మనకు లేమి అనేది ఉండదు.
జీవము లేని స్థితిలో నీవుంటే, జీవమును సిద్ధపరచి, ఆ జీవము వద్దకు నడిపించేది నీ దేవుడే. గనుక ఆ జీవము నీ జీవితములో ప్రత్యక్షపరచబడుతుంది. దేవుని సన్నిధికి వచ్చేవారిలో కొంతమంది అలవాటుగా వచ్చేవారు ఉంటారు, మరికొందరు ఖచ్చితముగా ఉండాలి అని సిద్ధపడి వస్తారు. అయితే నీ దేవుడు నీ కొరకు సిద్ధపరచడానికి చాలా సమయమును వెచ్చించాడు అనే సత్యమును నీవు ఎరిగి ఉన్నట్టయితే, యదార్థముగా ఆయన సన్నిధిలోనికి రాగలుగుతావు.
నీవున్న నీ స్థితిలోనికి రావడానికి దేవుడు అనేకరకములైన విధానములలో నీ జీవితములో తన కార్యములు జరిగించినవాడుగా ఉన్నాడు. అందుకే మనము మన మొదటి స్థితిని ఎప్పుడూ మర్చిపోకూడదు. మన ప్రయాణము చూస్తే, ఎప్పుడూ పడటము లేవడముతోనే మన జీవితము అయిపోతే, ఇంక ఆయన నీ జీవితము ద్వారా సిద్ధపరచిన గొప్ప ఆలోచన ఎప్పుడు నెరవేరుతుంది?
నా కుమారుడవైన తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.౹ -1 తిమోతికి 1:18
వాటిని బట్టి అంటే – “నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములను బట్టి”. ముందుగా నీ గూర్చి దేవుడు చెప్పిన ప్రవచనముల నెరవేర్పు కొరకు నీవు పోరాడాలి. దినములు గడిచే కొలదీ మనకు సౌకర్యవంతమైన జీవితము దేవుడు సిద్ధపరుస్తుంటే, మనలో కొంచెము కొంచెముగా అలసత్వము, నిర్లక్ష్యము మొదలై, మొదటి ఆసక్తి తగ్గిపోయిన స్థితిలోనికి మనము వెళ్ళిపోతున్నాము. అయితే మనము ఇకముందు జాగ్రత్త కలిగి ఉందాము.
నీ కాపరి నమ్మదగినవాడు గనుక, నీ యెదుట పచ్చిక అయిపోయినా సరే నీవు భయపడవలసిన అవసరము లేదు. నిన్ను నడిపించేవాడు, నీ కాపరి, నిన్ను జీవము వైపు నడిపించేవాడు నీ దేవుడు, గనుక నీ దేవుడు ఎటువంటి వాడో నీవు ఎరిగి ఉండాలి.
దేవుడు నీ చుట్టూ వేసిన కంచె ఒక్కసారి తొలగించబడగానే, శత్రువు భయంకరమైన దాడి నీ మీద చేసేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు నీ జీవితమును సరిగా సిద్ధపరచుకోకపోతే నీ తరువాత తరములు దాని ప్రభావమును అనుభవిస్తారు. అందుకే దేవుని కంచెలోపల ఉండటానికి మనము ఇష్టము కలిగి ఉండాలి.
నీ దేవుడు నీ యెడల గొప్ప ప్రణాళికలు కలిగినవాడుగా ఉన్నాడు గనుక, ఆ ప్రణాళికల నెరవేర్పు కొరకు నీవు సిద్ధపడు! ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఆశ నీవు కలిగి ఉంటే, ఆయన ఏమై ఉన్నాడో నీవు గ్రహించాలి.
ఆరాధన గీతము
నా తండ్రీ నా తండ్రీ
నా తండ్రీ నా తండ్రీ
నీ బిడ్డను నేను
నిను నిత్యము స్తుతియించి
ఆరాధించి మహిమ పరచెదను
నా తండ్రీ నా తండ్రీ
నా తండ్రీ నా తండ్రీ
నా కాపరి నీవే
నను జీవానికి నడిపించువాడా
నిను ఆరాధింతును
నా రాజా నా రాజా
నా రాజా నా రాజా
నను పరిపాలించువాడా
నిను నిత్యము స్తుతియించి
ఆరాధించి మహిమ పరచెదను
వారము కొరకైన వాక్యము
ప్రభువు మనతో ఏ మాట మాటాడినా సరే, లోబడే స్వభావము మనము కలిగి ఉండాలి. ఈలోకములో ఉన్న మనము, మన జీవితాన్ని కొనసాగిస్తున్న సమయములో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. మనమున్న లోకము మాలిన్యముతో నిండినది. మనము ఎంతో జాగ్రత్తగా వెళుతున్నప్పటికీ, ఈ లోకములోని మాలిన్యము మనకు అంటుకొనేదిగా ఉంది. కేవలము దేవుని వాక్యము మాత్రమే శుభ్రపరచగలదు.
మనము స్నానము చేయకపోతే ఎలా అయితే దుర్వాసన క్రమముగా పెరుగుతుందో, అలాగే దేవుని వాక్యములో ఉదకస్నానము చేయకపోతే, మన ఆత్మకు పట్టిన కల్మషము కూడా నీ నుండి ఆత్మీయ దుర్వాసన పెరుతుంది, అది నీ భౌతికమైన జీవితములో కూడా ప్రభావము చూపిస్తుంది.
అయితే నీ మాలిన్యము తొలగించే దేవుని వాక్యము నిన్ను హెచ్చరించేదిగానే వస్తుంది. అది నీ క్షేమముకొరకే గనుక దానికి నీవు లోబడునట్లు జాగ్రత్తపడాలి. అసలు మొదట దేవుని భయము మనము కలిగి ఉంటే, మనలను మనము సిద్ధపరచుకోగలుగుతాము.
నా కుమారుడవైన తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.౹ -1 తిమోతికి 1:18
“మంచి పోరాటము పోరాడవలెనని…” అని వ్రాయబడింది. మనము పోరాడాలి అంటే ఎలా మనలను సిద్ధపరచుకోవాలి? పోరాడాలి అనేది ఆజ్ఞ అని వ్రాయబడింది. మరొక లేఖనము చూస్తే – “యుద్ధము యెహోవాదే గనుక నీవు పోరాడవలసిన నిమిత్తమే లేదు” అని వ్రాయబడింది. మనము దేని విషయములో పోరాడాలి? దేని విషయములో పోరాడవలసిన అవసరము లేదు.
నీతిమంతుడు విశ్వాసము మూలమున జీవించును. ఒకవేళ విశ్వాసము లేకపోతే, నీ జీవితము కొనసాగించబడదు. గనుక, నీ విశ్వాసమును చెడగొట్టే ప్రయత్నము అపవాది చేస్తాడు. విశ్వాసము అనేది ఒక వరము. ఆ వరమును వేరేవాడు దొంగిలించుకుపోతుంటే ఊరకనే ఉంటామా? పోరాడాలి కదా? అటువంటి అపవాదితో చేసే పోరాటములో మనము విజయము సాధించాలి అంటే మనము విశ్వాసము, మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి.
మన మనస్సు ఎంతో ప్రాముఖ్యమైనది. నీ మనస్సులో ఉన్నదే నీవు యదార్థముగా కనపరచాలి. అపవాది దాడి చేసే రెండు ప్రాముఖ్యమైన విషయములు, మన విశ్వాసము మరియు మన మనస్సాక్షి.
నీ గురించి ప్రభువు ఏమి చెప్తూ వచ్చాడు? అనేది నీ గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనము. దానిని బట్టే నీ పోరాటము యొక్క గమనము ఉండాలి.
అబ్రహాము జీవితము చూస్తే, తన శరీరము మృతతుల్యమైనది అనే విషయము తన శరీరమును చూడటమును బట్టే తెలిసింది. అయితే తనకు ముందుగా ఇవ్వబడిన ప్రవచనము ఏమిటి? నిన్ను అనేకమైన జనములకు తండ్రిగా చేస్తాను అని. అప్పుడు అపవాది అబ్రహాములో నా శరీరము మృతతుల్యమైనది అనే ఆలోచన పుట్టించాడు. అలాగే నీవు కూడా నీ పరిస్థితులను చూస్తే, నీవు కూడా వ్యతిరేకమైన ఆలోచనలే ఆలోచిస్తావు. ఈ ఆలోచనను బట్టే విశ్వాసము చెడిపోతుంది. గనుక మనము ఎన్నడూ పరిస్థితులను చూడకూడదు, దేవుని మాటను బట్టి మాత్రమే మనము ముందుకు సాగాలి.
మనము విశ్వాసముంచుచున్న కాలమంతా అపవాది నిన్ను ఏమీ చెయ్యలేడు. నీవు విశ్వసించినకాలమంతా నీలో ఆయన కలిగిన సామర్థ్యము కలుగుతుంది. ఆయన అపవాది క్రియలను లయపరచగలిగే సామర్థ్యము కలిగినవాడు. గనుక మనము విశ్వాసము కలిగి ఉన్నపుడు, మనము కూడా అపవాది క్రియలను లయపరచగలుగుతాము.
నీవు విశ్వాసము కనపరిస్తే, నీలో దేవుని సామర్థ్యము ప్రత్యక్షపరచబడుతుంది, దానిని బట్టే నీవు అపవాది ప్రయత్నములను, క్రియలను లయపరచగలుగుతావు. నీవు విశ్వాసము కోల్పోతే, నీ ఆశీర్వాదము కోల్పోయేవాడిగా అయిపోతావు.
నీకు వ్యతిరేకముగా ఒకటి జరుగుతుంది అంటే, నీ విశ్వాసమును నీవు భద్రపరచుకోవాలి. అయితే మన విశ్వాసమును ఎలా కాపాడుకోగలుగుతాము?
మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడైయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,౹ అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక౹ దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.౹ -రోమా 4:19-21
విశ్వాసమును కాపాడుకోవాలి అంటే, నీవు మొదటిగా సందేహము రానివ్వకూడదు. షద్రకు మేషాకు అబెద్నగోలు, అచంచలమైన విశ్వాసము కనపరచారు, అప్పుడు వారిని కాపాడే పోరాటము దేవుడే చేసాడు. గనుక, నీవు విశ్వాసము కాపాడుకోవడానికే నీవు చేసే పోరాటము, నీవు విశ్వాసమును కాపాడుకుంటే, నీ పరిస్థితులపై పోరాటము నీ దేవుడే చేస్తాడు.
నీవు దేవునిని ఆరాధించడము అనేది అపవాదికి అస్సలు ఇష్టము ఉండదు. గనుక నీ విశ్వాసము ఆటంకపరచబడే సమయములో నీవు దేవునిని ఆరాధించడము మొదలు పెడితే, ఆ ఆటంకము తొలగించబడే మార్గము తెరువబడుతుంది.
