ఆరాధన వర్తమానము
ఈ పరిశుద్ధమైన దినమున, ఆయన సన్నిధిలో ఉండులాగున ఆయనే మనకు తన కృపను అనుగ్రహించాడు గనుక ఆయనకే మహిమ కలుగును గాక. వాక్యము జీవమై ఉంది, వెలుగు అయి ఉంది. దేవుని సన్నిధిలో ఉండటము అనేది మనకు మనమే అనుకుంటే జరిగేది కాదు, ఆయన కృపను బట్టే ఉండగలుగుతున్నాము.
దేవుని వాక్యము మన ఆత్మకు పట్టిన ప్రతి దానినుండి విడుదల చేస్తుంది.
ఇట్టి స్థితిగలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. -కీర్తనలు 144:15
ఏ స్థితి గలవారు? అని ఆలోచిస్తే దేవుని వాక్యము వినునట్లుగా అవకాశము దొరికినవారు ధన్యులు. ధన్యులు అనగా సంతోషముగా జీవించేవారు.
యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. అయనే మనకు దేవుడు అయి ఉన్నాడు గనుక, మనము ఆయన జనులమే! గనుక మన జీవితములు సంతోషముగా జీవించునట్లు సిద్ధపరచబడతాయి.
ఎందుకు మన జీవితములు ధన్యకరమైనవి అని ఆలోచిస్తే, మనకు వాక్యము వినునట్లుగా దేవుడే తన సన్నిధిలోనికి మనలను తీసుకువచ్చాడు.
నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తిపొందెదము. -కీర్తనలు 65:4
ఆయన ఆవరణములో ఉండులాగున నీవు నేను ఏర్పరచుకోబడ్డాము అంటే మనము ఎంత ఆధిక్యత పొందినవారము? మనము పొందబోయే మహిమ ముందు, మనము ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమ ఎన్నదగినది కాదు.
నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తిపొందెదము. మనము తృప్తిపరచబడు నిమిత్తమే ఈ సమయాన్ని అనుగ్రహించాడు. ఈ సమయము గనుక మనకు లేకపోతే, దేవుని వాక్కు మనకు అనుగ్రహించబడేది కాదు, దాని వలన వచ్చే మేలు మనము అనుభవించలేకపోయేవారము. ఆయన ఆవరణములలో నీకు కావలసిన సమృద్ధి ఉన్నది. అది దేవుని వాక్కును బట్టి నీ కొరకు విడుదల అయ్యేదిగా ఉంది.
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.౹ -ఎఫెసీయులకు 1:3
ఈ దినమున మన దేవుని బట్టే ప్రతీ ఆశీర్వాదమును మనము పొందుకుంటాము. ఉదాహరణకు వివాహము జరిగి పిల్లలు లేరు అనే స్థితిలో ఉంటే, మీరు పిల్లలు అనే ఆశీర్వాదమును మీరు పొందుకుంటారు. ఆశీర్వాదము అని చెప్పబడుతున్న ప్రతీ దానిలో నీకు భాగము ఉంది. ఆశీర్వాదమునకు కారకుడైన ఆయనను బట్టియే, మన జీవితములో ప్రతీ ఆశీర్వాదము అనుగ్రహించబడుతుంది.
మన దేవుడు సంపూర్ణమైన వాడు. ఆశీర్వాదము అని చెప్పబడుతున్న ప్రతి దానిలో మనకు భాగముంది. నీవు నేను ధనవంతులము అగునట్లు ఆయన దరిద్రుడైనవాడిగా పుట్టాడు.
అలాగే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దావీదు చెప్పాడు. పౌలు కూడా ఆయనను బట్టి నేను ఏమైనా చేయగలను అని చెప్పుచున్నాడు. లోకమంతా పాపముతో నిండి ఉంటే, నీవు మాత్రము పరిశుద్ధముగా ఉండులాగున సిద్ధపరచాడు.
మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.౹ -యోహాను 15:16
మనము ఫలించు నిమిత్తము దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు, నియమించాడు. ఆ ఫలింపు మన జీవితమూలో చూడాలి అంటే, లోకముతో సంబంధములేకుండా ప్రత్యేకముగా ఉండాలి. షద్రకు, మేషాకు అబెద్నగోలు లోకముతో పాటు ప్రతిమకు మొక్కలేదుగానీ, ప్రత్యేకత కాపాడుకొన్నారు. అవకాశము దొరికినపుడు పాపము ఎవరైనా చేస్తారు. అయితే అవకాశము ఉన్నప్పటికీ పాపమునుండి పారిపోయినవాడు యోసేపు.
ఆయన ఎట్టివాడై యున్నాడో మనము కూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము.౹ -1 యోహాను 4:17
యేసయ్య ఎట్టివాడై ఉన్నాడో, మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నవాడు. దేవుని బిడ్డలు అయిన మనము పాపములో కొనసాగరు కానీ, శ్రేష్టమైన ఆశీర్వాదము పొందులాగున వారి పరిశుద్ధత కాపాడుకొంటారు.
వివాహము అనేది దేవుని ఆశీర్వాదము. ఆశీర్వాదము వెనుక మనము పరిగెట్టే అవసరము లేదు గానీ, ఆయన నీ దేవుడు గనుక, ప్రతీ ఆశీర్వాదము మన వెనుకనే వెంబడించాలి.
అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.౹ -1 పేతురు 2:9
“మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము” అని వ్రాయబడింది. ఆయనను కలిగి ఉన్నవాని జీవితములలో, ఆయన గుణాతిశయము ప్రచురము చేయబడుతుంది. ఆయన దయకలిగినవాడు గనుక, ఆ దయ నీ జీవితములో కనబరచబడుతుంది. ఆయన శక్తివంతుడు గనుక ఆయన శక్తి నీ జీవితములో కనపరచబడుతుంది. ఇలా ఆయన గుణాతిశయములను నీ జీవితములో ప్రచురము చేయబడుటకే నిన్ను ఏర్పరుచుకున్నాడు గనుక, ఆయనను కలిగిన నీవు ధన్యులము.
విన్న వాక్యమునకు అనుగుణముగా నీ జీవితము సరిచేసుకొంటే, ఆ చెప్పబడిన వాక్యములోని సత్యము నీ జీవితములో ప్రత్యక్షపరచబడుతుంది. నిన్ను ప్రత్యేకముగా ఉండటానికే ప్రభువు ఏర్పరచుకున్నాడు. లోకము వలే ఉండటానికి నిన్ను ఏర్పరచుకోలేదు.
నీవు నియమించబడ్డావు అనే సంగతి నీకు తెలుసా? దానికి సాక్ష్యము ఏమిటి అంటే –
మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. -రోమా 8:30
నీవు నిర్ణయించబడ్డావు కాబట్టే, నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు. నీవు ఆయన జనము గనుక, నీవు ప్రత్యేకమైన వాడవు. ఆ ప్రత్యేకత నీవు కొనసాగించుకుంటే చాలు ఆయన కలిగిన గుణములన్నీ నీ జీవితములో కనపరచబడుతుంది.
షద్రకు మేషాకు అబెద్నగోల జీవితములలో చూస్తే, ఏడు రెట్లు ఎక్కువగా అగ్నిగుండమును సిద్ధపరచినప్పటికీ వారు ప్రకటించిన దేవుని సత్యమును బట్టి, అబ్ధుతమైన కార్యము జరిగించబడింది.
ఆరాధన గీతము
ఈ లోకము నన్ను విడిచినను
నన్ను విడువని నా దేవుడవు
ఎవరు లేని ఈ జీవితములో
నా తోడు నీవై నన్నాదుకొంటివి
నా హృదయమంతా నీ కొరకే
సమర్పింతును దేవా
నా జీవితమంతా నీ సాక్షిగా
నిలిచెదను యేసూ
నీ మార్గములో నే నడిచెదను
నీ చిత్తములో నే సాగెదను
నా చింతలన్ని తీరెనయ్యా
నిన్ను చేరిన క్షణమే
నిత్య జీవితం దొరికెనయ్యా
నిన్ను చూసిన క్షణమే
నా అడుగులన్నీ స్థిరపరచువాడా
నా త్రోవలను సిద్ధపరచువాడా
నీ చిత్తములో నన్ను నడుపుమయ్యా
నీ వాక్యముతో నన్ను నింపుమయా
వారము కొరకైన వాక్యము
ఈ దినము ఆత్మలో ఎదుగుదల ఎలా పొందగలము అని మనము నేర్చుకుందాము. మన ఆత్మీయమైన జీవితము ఖచ్చితముగా అభివృద్ధి చెందాలి. దినదినము అది వృద్ధి చెందాలి. అప్పుడు ఆశ్చర్యమైన రీతిలో నీ జీవితము ఆశీర్వదించబడుతుంది.
వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచి–నేను నీయొద్దనుండి తీయబడకమునుపు నీకొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని చెప్పగా ఎలీషా–నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను.౹ -2 రాజులు 2:9
ఇక్కడ ఎలీషా రెండంతల అభిషేకము కోరుకుంటున్నాడు. మనకు కూడా ఇటువంటి కోరిక ఉంటుంది. అటువంటి ఆశ మంచిదే! అయితే దాని కొరకు సిద్ధపాటు మాత్రము ఖచ్చితముగా అవసరమే!
యెహోవా సుడిగాలిచేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీషాయు కూడి గిల్గాలునుండి వెళ్లుచుండగా -2 రాజులు 2:1
ఏలీయా ఆరోహణము ఆయే సందర్భములో, మొదట వీరిద్దరు గిల్గాలులోనుండి బయలుదేరారు. ఇక్కడ గిల్గాలు అనుభవము గూర్చి తెలుసుకోవడము ఎంతో అవసరము.
అప్పుడు యెహోవా–నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసి యున్నానని యెహోషువతోననెను. అందుచేత నేటివరకు ఆ చోటికి గిల్గాలను పేరు. -యెహోషువ 5:9
ఐగుప్తు అవమానము అనగా గతకాలములో ఉన్నవంటి స్థలము. అక్కడ ఇశ్రాయేలీయులకు జరిగిన అవమానము దొర్లించబడింది. అంటే మన గత జీవితము మార్చివేయబడుట అని అర్థము.
నీవు ఆత్మీయముగా ఎదగాలి అంటే, గిల్గాలు అనుభవము నీవు కలిగి ఉండాలి. గిల్గాలు అనుభవము ఏమిటి అంటే- “అవమానకరమైన నీ గత జీవితము యొక్క సాక్ష్యము మార్చబడాలి”. గతకాలములోని అదే పాపములో ఇంకా నీవు ఉంటే, నీవు ఆత్మీయముగా ఎదగలేదు అని అర్థము.
ఏలీయా– యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా–యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి.౹ -2 రాజులు 2:2
గిల్గాలు అనుభవము నీవు కలిగి ఉంటే ప్రభువు నిన్ను నిన్ను బేతేలు అనుభవములోనికి ఆహ్వానిస్తున్నాడు. ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నాడు. దేవుడు ఎలీషాను సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ ఎలీషా ఆశ చూస్తే, ఏలియాను విడిచిపెట్టే ఆలోచన లేనే లేదు. గిల్గాలులోనే ఆగిపోలేదు కానీ బేతేలులోనికి నడవాలి అని ఆశ కలిగి ఉన్నాడు. బేతేలు ఏమిటి ఆలోచిస్తే –
యాకోబు నిద్ర తెలిసి–నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని భయపడి–ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమేగాని వేరొకటికాదు; పరలోకపు గవిని ఇదే అనుకొనెను.౹ తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.౹ మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.౹ -ఆదికాండము 28:16-19
నీవు ఆత్మీయముగా ఎదగాలి అంటే, గిల్గాలు నుండి బేతేలునకు నీవు రావాలి. బేతేలు యొక్క అనుభవము ఏమిటి అంటే, మనము దేవుని మందిరమై ఉండుటయే!
ఎలీషా ఏలియాను వెంబడించాడు, గనుక ఏలియా కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు ఎలీషా పొందుకొన్నాడు. ఈ దినము మనము యేసయ్యను వెంబడిస్తున్నాము. యేసయ్య కలిగిన ఆత్మ కొలతలేని ఆత్మ. గనుక మనము బేతేలు అనుభవము కలిగి ఉంటే, మనము పొందబోయే ఆత్మ కూడా కొలతలేని ఆత్మయే పొందుకొంటాము.
కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను– తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.౹ -యోహాను 5:19
తండ్రి పరలోకములో ఉన్నాడు, యేసయ్య భూలోకములో ఉన్నాడు. మరి తండ్రి ఏమి చేయుచున్నాడో ఎలా చూస్తున్నాడు? బేతేలు అనుభవము కలిగి ఉంటే, మనము దేవుని మందిరముగా మనము మారిపోతాము గనుక, అప్పుడు తండ్రి ఏమి చేయుచున్నాడో మనము చక్కగా చూడగలుగుతాము.
సాక్ష్యము మార్చబడిన మాత్రాన, కేవలము పరిశుద్ధత కలిగి ఉండుట మాత్రమున మనము ఆత్మలో ఎదగలేము. రాత్రి అంతా తండ్రి సన్నిధిలో గడిపిన కారణమున ఉదయమున యేసయ్య తన పరిచర్య తండ్రి చిత్తానుసారముగా చేయగలిగాడు.
అయిదువేలమందికి భోజనము సిద్ధపరచే సమయములో అయిదు రొట్టెలు, రెండు చేపలే ఉన్నాయి. అయితే తాను ఏమి చేయనున్నాడో ఎరిగి అక్కడ యేసయ్య ఉన్నాడు. అది ఎలా జరిగింది అంటే, రాత్రి తాను పరలోకపు గవిని యొద్ద కనిపెట్టుకొనుటవలనే!
పిమ్మట ఏలీయా–ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువననెను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసిరి.౹ -2 రాజులు 2:4
అంతట ఏలీయా–యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు–యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్లిరి.౹ -2 రాజులు 2:6
ఎరికో మూడవ అనుభవము, యోర్దాను నాల్గవ అనుభవము ఈ అనుభవముల గూర్చి వచ్చే వారము తెలుసుకుందాము.
