08-12-2024 – ఆదివారం మొదటి ఆరాధన

స్తోత్ర గీతములు 

హల్లెలూయ స్తుతి మహిమ

ఆరాధన వర్తమానము

ఈ దినము ప్రభువు మనకొరకు సిద్ధపరచి ఇచ్చిన దినము. ఈ దినము చూడని వారు అనేకులు ఉండగా, మనకు మాత్రము తన విశ్వాస్యతను కనుపరచి, ఈ దినము చూడగలగే అవకాశము, ఆయన సన్నిధిలో ఉండగలిగే భాగ్యము దయచేసారు.

మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. -కీర్తనలు 92:2

దేవుడు ప్రతి రాత్రి తన విశ్వాస్యత కనబరుస్తున్నారు అని వ్రాయబడింది. అంటే ఏమిటి? ఏ దినము ఏమి జరుగుతుందో మనకు తెలీదు. ఎప్పుడు ప్రభువు రాకడ వస్తుందో ఎవరికీ తెలియదు. అలా తెలియకుండానే క్షణమాత్రములో తనవారిని ప్రభువు తీసుకువెళ్ళిపోతాడు, లేదా దానికి ముందే మన జీవితం ముగించబడిపోవచ్చు. అయితే చివరికి దేవుని యెదుట నిలబడినపుడు ధైర్యముగా ఉండాలి అంటే ఈ జీవితం ఈ లోకములో ఉన్నపుడే మనము సరిచేసుకోవాలి. అదే ఆశకలిగి, మనకొరకు మరొక దినము ప్రభువు సిద్ధపరుస్తున్నారు అంటే అది తన విశ్వాస్యతే కదా?
అంతే కాక, తన సన్నిధికి మనము వచ్చినపుడు, తన ప్రణాళికలను గూర్చిన మాటలు, మనము సరిచేసుకోవలసిన దాని గూర్చిన హెచ్చరికలు అన్నీ ముందుగానే మనకొరకు పంపి, తన విశ్వాస్యతను కనపరుస్తున్నారు కదా!

కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను.౹ -ఎఫెసీయులకు 1:8

కృప పనిచేసేదిగా ఉంది, అయితే ఈ పని జరగకమునుపే, తన చిత్తమును గూర్చిన మర్మము తెలియచేయబడుతుంది. దీనిని గ్రహించకపోతే నష్టపోయేది మనమే. అపవాది మనపై పన్నే ఉచ్చులను గూర్చి కూడా ప్రభువు ముందుగానే తెలియచేస్తాడు. దానిని గ్రహించకపోతే, ఆ ఉచ్చులో పడిపోయేవారముగా ఉంటాము.

మనము ప్రతీ దినము ప్రభువు కొరకు ఏమి కనపరచాలి? క్రీస్తునే కనపరచాలి. మన మాట, చూపు, జీవితం అంతా క్రీస్తునే ప్రతిబింబించాలి. వాక్యము లోతు తెలియకుండా క్రీస్తును కనపరచలేము.

మనము చదివిన వాక్యము, “ప్రతి రాత్రి నీ విశ్వాస్యత” అనే వాక్యమును గమనిస్తే – ఆ విశ్వాస్యత గనుక ప్రభువు కనపరచకపోతే మరొక దినమును మనము చూడలేము.

అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను. -హబక్కూకు 3:17-18

ఈ వాక్యములో చూస్తే, హబక్కూకు తన పరిస్థితి ఎలా ఉన్నాసరే, దేవుని యందు సంతోషిస్తాను అని చెప్పుచున్నాడు. అలా నీవు నేను చెప్పగలుగుతామా? అపవాది కార్యములు అన్నీ రాత్రి కాలములో అత్యధికముగా జరుగుతాయి. రాత్రి మనము పడుకుంటాము, ఆ రాత్రి అపవాది చేసే ప్రతీ ప్రయత్నమునుండి మనలను దేవుడు తప్పించకపోతే, మన జీవితములు ఎప్పుడో ముగించబడేవి. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. నీవు నేను హాయిగా పడుకుంటున్నాము మన దేవుడు కునుకక నిద్రపోక మనలను కాపాడుచున్నాడు.

అయితే యేసు–నాతండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను.౹ -యోహాను 5:17

పనిచేసేవారు పడుకుంటారా? దేవుడు కునుకడు నిద్రపోడు అని వ్రాయబడింది. అంటే, దేవుడు పనిచేసేవాడుగా ఉన్నాడు. నీవు నిద్రపోయే సమయములో, అపవాది చేసే ప్రతీ ప్రయత్నమును లయపరచే పని దేవుడు చేస్తున్నాడు. ఈ విశ్వాస్యత ప్రభువు కనపరుస్తున్నారు గనుకనే మనము ఆయనను స్తుతించేవారిమిగా ఉండాలి.

ఒకవేళ మన దగ్గర ఏమీ లేకపోయినా సరే, మన దేవుడు ఎటువంటివాడో ఎరిగి ఉంటే, హబక్కూకువలే ఏమి ఉన్నా లేకపోయినా, చేసిన పనికి ప్రతిఫలం వచ్చినా లేకపోయినా నా దేవునినే స్తుతించెదను అని చెప్పగలుగుతాము.

అయితే నోటితో దేవుడే నాకు బలము అని ఎవ్వరైనా చెప్పగలుగుతారు. అయితే అది నిజమని ఎలా తెలుసుకోవాలి? నిజముగానే దేవుడే బలము అని నమ్మినపుడు, వ్యతిరేకమైన ఆలోచన వచ్చినా సరే, ఆ ఆలోచనను కొనసాగనియ్యక, నీ దేవుని గూర్చి ఏమి నీవు నమ్మి బలము అని ప్రకటించావో, దానిని బట్టి విశ్వాసముతో నిలబడితే, అప్పుడు నీవు చెప్పే మాట, నీవు చేసే క్రియ ఒక్కటే అప్పుడు నీవు కలిగిన విశ్వాసము యదార్థమైనది అని అర్థము.

ఇప్పుడు ఇంకొంచెము లోతుగా చూస్తే, రాత్రి సమయములో మనము పడుకుంటాము, ఆ సమయములో మన మనస్సు, శరీరము ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంటాయి. అనగా ఒకవేళ శత్రువు దాడిచేసినా ఏమి ప్రతిఘటించలేని నిస్సహాయ స్థితిలో ఉంటాము. గనుక రాత్రి కాలము అనేది, ఉన్న పరిస్థితిలో ఏమి చెయ్యాలో తెలియని స్థితి. ఉదయమున అయితే మన మనస్సు, శరీరము పనిచేయగలుగుతాయి. అయితే నీ దేవుని విశ్వాస్యత ఏమిటి అంటే, నీవున్న పరిస్థితిలో ఏ దారీ నీకు తెలియనపుడు, ఏమి చెయ్యాలో తోచనపుడు, తన విశ్వాస్యతను బట్టి, ఆ పరిస్థితినుండి నిన్ను తప్పించి సంతోషకరమైన ఉదయములో నిన్ను ప్రవేశపెడుతున్నాడు. గనుక ఈ దినము మనము జీవించడానికి ఆధారము ఆయనే.

శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది భూమి మొలకను మొలిపించునట్లుగాను తోటలో విత్తబడినవాటిని అది మొలిపించునట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల యెదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప జేయును. -యెషయా 61:10-11

పెళ్ళి జరిగే ఇంటిలో దుఃఖము ఉండదు గానీ సంతోషము మాత్రమే ఉంటుంది. ఎవరైతే దేవుడే బలముగా, ఆధారముగా చేసుకొని జీవించేవారిగా ఉంటారో, వారి పరిస్థితి ఎలా ఉన్నాసరే, వారి స్థితి సంతోషముగా మార్చబడవలసిందే. అన్నీ కలిగిన ఉన్నతమైన స్థలములలో మనము జీవించేవారముగా, సంతోషించేవారముగా ఉంటాము. నీవు దేవుని బిడ్డవుగా మార్చబడ్డావు గనుకనే ఈ ఆధిక్యత. నీ దేవుని యొక్క విశ్వాస్యత నిన్ను ఖచ్చితముగా జీవింపచేస్తుంది.

 

ఆరాధన గీతము

నన్ను కాపాడు నా దేవుడు కునుకడు కునుకడు

 

 

వారము కొరకైన వాక్యము

విశ్వసించితిని గనుక మాటలాడితిని. ఏమైతే విశ్వాసముంచామో దానిని క్రియలలో కనపరచాలి. ఈరోజు మనము విశ్వసించి తెలియచేసిన మాట – నా ఆధారము, బలము మరియు అతిశయము నీవే అనే సత్యమే. ఈ మాట కేవలము మాట మాత్రము కాక, క్రియలలో కనపరచుదుము గాక!

ఆయన మాట చొప్పున చేసిన పేతురు జీవితములో ఊహకు మించినది అనుభవించాడు. ఈ దినము ఆయన మాట చొప్పున మనము చేసినపుడు మన ఊహకు అందనంతగా అనుభవించేవారిగా ఉంటాము. ఆయన మాట వింటాము అని చెప్పినంత మాత్రాన సరిపోదుగానీ, అది సమయము వచ్చినపుడు క్రియలలో కనపరచాలి.

నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి౹ దానిని విరిచి–యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.౹ ఆప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని–యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.౹ మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.౹ -1 కొరింథీయులకు 11:23-26

ప్రతి ఆదివారము ఆయన శరీరము, రక్తములలో పాలు పంచుకుంటున్నాము. అలా మనము చేస్తున్న ప్రతీ సారీ, ప్రభువు యొక్క మరణము ప్రచురింపబడుతుంది.

ప్రభువు యొక్క మరణము గూర్చి ఆలోచిస్తే, ఆ కలువరి సిలువలో నీగురించి మరణించారు. అయితే ఆ మరణము వెనుక ఉద్దేశ్యము మనము జ్ఞాపకము చేసుకోవాలి, ఆ ఉద్దేశ్యము నీ జీవితములో ప్రచురించబడాలి. ప్రభువు మరణించడం వెనుక ఏమిటి ఉద్దేశ్యము? వెల చెల్లించబడింది.

మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను; ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. -కొలొస్సయులకు 2:13

కలువరి సిలువలో జరిగిన ఉద్దేశ్యము ఈ వాక్యములో మనము చూడగలము. అయితే ప్రతీ ఆదివారము సత్యము ఎరిగి మనము ఆయన శరీరములో పాలు కలిగి ఉంటే, అప్పుడు ఆ మరణము యొక్క ఉద్దేశ్యమును ప్రచురపరచేవారిగా ఉంటాము.

జ్ఞాపకము చేసుకొన్నప్పుడు, ప్రభువు యొక్క మరణము యొక్క ఉద్దేశ్యము మనము ప్రచురము చేసేవారిగా ఉంటాము. ఈ దినము మనము ఏమి జ్ఞాపకము చేసుకోవాలి? యేసయ్య రాకమునుపు, ధర్మశాస్త్రము ప్రకారము నీవు చేసిన ప్రతి పాపమును బట్టి నీవు శిక్ష అనుభవించేవాడివిగా ఉంటావు. ఏదైతే నీకు వ్యతిరేకముగా రాయబడిన పాపము చిట్టా ఆ సిలువపై మేకులతో కొట్టి, నీ మీద అది మోపబడకుండా తీసివేసాడు. అనగా పాపిగా కనపడవలసిన నిన్ను పరిశుద్ధునిగా నిన్ను మార్చినవాడుగా నీ దేవుడు ఉన్నాడు.

పరిశుద్ధులకు స్వాస్థ్యము ఉంది. ఆ పరిశుద్ధమైన జీవితము కొరకు ఆయన సిద్ధపరచిన సమస్తము నీవు పొందుకుంటావు. ఆయన మరణము ద్వారా నీ జీవితములో జీవము ప్రచుర పరచబడుతుంది. “ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను” ఆయన శరీరము నీలో ఉన్నంతవరకు, దేవుడు నిర్ణయించిన కాలము సంపూర్ణమయ్యేవరకు ఏ మరణము నీ దరిచేరదు.

“ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను”- దీని అర్థము ఏమిటి అని ఆలోచిస్తే, మన జీవితాలలో అపవాది అనేమైన ఉచ్చులు బిగించేవాడుగా ఉన్నాడు. అపవాది తన దూతలతో కలిసి, మన జీవితమును లోబరచుకోవడానికి అనేకమైన ప్రయత్నములు చేస్తాడు. అయితే వారి ప్రయత్నములు, ఉచ్చులు, ప్రణాళికలు అన్నీ లయపరచబడతాయి.

మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతోకూడ బ్రదికించెను.౹ మీరు వాటినిచేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.౹ -ఎఫెసీయులకు 2:1-2

సిలువలో నీ పాపపు చిట్టా మేకులతో కొట్టబడకవరకు, అపవాది ప్రేరేపణతో నీవు పాపపు పనులు చేస్తూ ఉండేవాడివి. అయితే ఎప్పుడైతే, నీ కొరకు విరువబడిన శరీరమును బట్టి, నీకొరకు చిందించిన రక్తమును బట్టి, దానిని నుండి నీవు తప్పించబడుతున్నావు.