08-10-2023 – ఆదివారం రెండవ ఆరాధన – ఫలించే జీవితం

స్తుతిగీతము – 1

యేసే నా పరిహారి
ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్ల
ప్రియ ప్రభువే నా పరిహారి (2)
||యేసే నా||

ఎన్ని కష్టాలు కలిగిననూ
నన్ను కృంగించె భాదలెన్నో (2)
ఎన్ని నష్టాలు వాటిల్లినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)
||యేసే నా||

నన్ను సాతాను వెంబడించినా
నన్ను శత్రువు ఎదిరించినా (2)
పలు నిందలు నను చుట్టినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)
||యేసే నా||

మణి మాన్యాలు లేకున్ననూ
పలు వేదనలు వేధించినా (2)
నరులెల్లరు నను విడచినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)
||యేసే నా||

బహు వ్యాధులు నను సోకినా
నాకు శాంతి కరువైనా (2)
నను శోధకుడు శోధించినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)
||యేసే నా||

దేవా నీవే నా ఆధారం
నీ ప్రేమకు సాటెవ్వరూ (2)
నా జీవిత కాలమంతా
నిన్ను పాడి స్తుతించెదను (2)
||యేసే నా||

స్తుతిగీతము – 2


నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము
నేనూహించలేను యేసయ్య …… “2”

యేసయ్య నీకృప నాకు చాలయ్య
నీ కృపలేనిదే నేనుండలేనయ్యా
యేసయ్య! నీకృప నాకు చాలయ్య
నీకృప లేనిదే నే బ్రతుకలేనయ్యా

మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహినే నీవు మాధుర్యముగ మార్చి
మాదిరి చూపి మరు రూపమిచ్చావు
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది – నీ కృప “2”
“యేసయ్య”

ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకున్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు
నా … ఆశ తీర ఆరాధన చేసె
అదృష్టమిచ్చింది – నీ కృప “2”
“యేసయ్య”

స్తుతిగీతము – 3

వేటగాని ఉరిలో నుండి
నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద
నాకు ఆశ్రయమిచ్చావు (2)

లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా శృంగమా నా కేడెమా
ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2)

రాత్రి వేళ భయముకైననూ
పగటి వేళ బాణమైననూ
రోగము నన్నేమి చేయదు
నా గుడారము సమీపించదు (2)
||లేనే లేదయ్యా||

వేయిమంది పడిపోయినా
పదివేల మంది కూలిపోయినా
అపాయము రానే రాదు
నా గుడారము సమీపించదు (2)
||లేనే లేదయ్యా||

మానవుల కాపాడుటకు
నీ దూతలను ఏర్పరచావు
రాయి తగులకుండా
ఎత్తి నన్ను పట్టుకున్నావు (2)
||లేనే లేదయ్యా||

ఆరాధన వర్తమానము

మనము దేవుని పేరట కూడుకున్నప్పుడు, దేవుని సన్నిధి మన మధ్య నిలిచి ఉంటుంది. దేవుని సన్నిధిలో ఆయన బలము, ప్రభావము ఉంటాయి. అయితే ఎవరైతే ఆశ కలిగి ఆయన సన్నిధికి వస్తారో, వారు ఆ బలము ప్రభావమును అనుభవించేవారుగా ఉంటారు. మనము బైబిల్ లో చూస్తే, ఆయన నుండి ప్రభావము బయలువెడలి కార్యము జరిగినట్టుగా మనము చూడగలము. గనుక మనము దేవుని సన్నిధిలో కూడుకున్న ప్రతిసారీ, ఆయన బలము, ప్రభావము అనుభవించగలిగిన అవకాశము పొందుతున్నాము.

మోషే అరణ్యములో ఉన్నప్పుడు, ఒక పొదలో దేవుని స్వరము వినబడగానే ఆ స్థలమంతా పరిశుద్ధముగా మార్చబడింది. అంతవరకు అది మామూలు పొదయే గానీ, ఒక్కసారి దేవుని సన్నిధిలో ఆయన ప్రభావమును బట్టి అది ప్రత్యేకించబడింది, పరిశుద్ధపరచబడింది.

మన వ్యక్తిగతమైన జీవితములలో వాక్యము యొక్క ప్రత్యక్షత అనుభవించినప్పుడే మనము ఆయనలోని బలము, ప్రభావమును మనము అనుభవించగలుగుతాము. ఒక సత్యము ఏమిటి అంటే, మన భౌతికమైన జీవితాన్ని, మన ఆత్మీయమైన జీవితమును బట్టి మనము సరిచేసుకోవచ్చు. ఉదాహరణకు, దేవుని మాట ఒక ప్రవచనరూపములో విడుదల అయినప్పుడు, భౌతికమైన జీవితములో ఆ ప్రవచన నెరవేర్పు కనపడుతుంది.

అందుకే మనము దేవుని మీద ఆధారపడి, దేవుని మాట పట్టుకుని ముందుకి వెళ్ళినప్పుడు ఖచ్చితముగా ఆ కార్యము సఫలమే అవుతుంది.

యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. -కీర్తనలు 18:46

యెహోవా జీవముగలవాడు, మనము ఆరాధించడానికి వచ్చిన ఆయన జీవము కలిగినవాడు. ఆయన శక్తిని చూడాలి అని ఆశకలిగి నీవు నిలబడితే, ఖచ్చితముగా ఆయన తన శక్తిని ప్రత్యక్షపరచేవాడిగా ఉంటాడు.

ఈరోజు మనము ప్రభువుని ఆరాధించడానికి ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి. ఈరోజు మనకు తెలియచేయబడిన సత్యము – “యెహోవా జీవము గలవాడు”. అంతే కాక, ఆ జీవము గలిగినవాడు నీకు నాకు ఆశ్రయముగా ఉన్నాడు. ఈ సత్యము మనము ఎరిగినవరిగా మనము ఉండాలి.

కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. -కీర్తనలు 121:1-2

“కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను” అంటే, మన వ్యక్తిగతమైన జీవితములో ఉన్నతముగా కనపడినవారిన వైపు మనము సహాయము కొరకు చూసేవారిగా ఉంటాము. అయితే నిజమైన సహాయము యెహోవా వలననే అనే సత్యము మనము ఎరిగినవారుగా ఉండాలి.

జీవము గలిగిన దేవుడు నా ఆశ్రయదుర్గము అని స్వీకరించినప్పుడు ఆ ఆశ్రయదుర్గము యొక్క సహాయము మనము పొందుకోగలుగుతాము. “ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు” అనగా ఒకవేళ నీవు నీ చుట్టూ ఉన్న గొప్పవారి సహాయము కొరకు గనుక నీవు చూస్తే, ఆ గొప్పవారిని సైతము సృష్టించినవాడు నీ నా దేవుడు.

“నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక” అంటే జీవము గలిగినవాడు అయిన నా దేవుడు ఆశ్రయ దుర్గముగా నా జీవితములో ఉన్నాడు. ఆయనను బట్టి నీ, నా జీవితములో నెరవేరే అద్భుత కార్యములను బట్టి, ఆయన బహుగా స్తుతించబడేవాడుగా నీ జీవితములో ఉంటాడు.

దేవుని కార్యం చూడాలి అనే ఆశ గనుక నీలో నాలో ఉంటే, తన కార్యము జరిగించడానికి మన దేవుడు ఎప్పుడూ సిద్ధమే! మన దేవుడు మార్పు చెందని దేవుడు. అబ్రహాము మాటలు చూస్తే, “బలికి కావలసిన పశువును ఆయనే చూసుకొనును” అని చెప్పగలిగాడు. అబ్రహాము ఆశ, విశ్వాసమును బట్టి అద్భుత కార్యము జరిగింది. అయితే దేవుడు మనలను ఎంతో శ్రేష్టమైన వారిగా చూస్తున్నాడు. నీవు నేను కూడా ఆశను కనపరిస్తే, దేవుడి అద్భుత కార్యములు ఖచ్చితముగా చూసేవారిగా ఉంటాము. అబ్రహాము కత్తి పైకెత్తేవరకు బలి పశువు దొరకలేదు గానీ, సరైన సమయానికే తన కార్యం చేసినవాడుగా ఉన్నాడు. ఈ సత్యమును మనము ఎరిగే ఉండాలి, “మన దేవుడు సమయాన్ని పోనివ్వడు”. దేవుడు మన కొరకు సిద్ధపరచినది ఒక్కటి కూడా మనము పోగొట్టుకొనము.

యేసయ్య బాప్తీస్మము తీసుకొని బయటకు రాగానే, “ఈయన నా ప్రియ కుమారుడు” అని మాట వినబడింది. ఎందుకు అని ఆలోచిస్తే, నీతి యావత్తూ జరుగులాగున, దేవుని చిత్తము జరిగించులాగున మనము కూడా మన జీవితాలను సిద్ధపరుచుకుంటే, మనము కూడా బహు శ్రేష్టులుగా ఆయన యెదుట కనపరచుకోగలుగుతాము.

మన దేవుడు జీవము గలిగినవాడు, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన స్తోత్రార్హుడుగా ఉన్నాడు. మన జీవితములో దేవునికి కాక మరెవరికీ మహిమ చెల్లించకూడదు. మనము దేవునిని ఆరాధించినప్పుడు, అనగా ఆయన నామమును ఒప్పుకొని, జిహ్వఫలము అర్పిస్తున్నాము అని వ్రాయబడింది.

ఈరోజున మనము విన్న సత్యములను అనగా, “యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక” అని ఒప్పుకొంటూ మనము ప్రకటించినప్పుడు, అదే సత్యము మన జీవితములలో ప్రత్యక్షపరచబడుతుంది.

యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ దేవుని అద్భుతము జరుగుతూ వచ్చింది. రోగమైనా, బాధ అయిన, లేమి అయినా మార్పు ఖచ్చితముగా జరిగింది. మన జీవితములు ముందుకే గానీ వెనుకకు వెళ్ళడానికి కాదు. ఈ సత్యములన్నీ వినడానికి కాదుగానీ, అనుభవించడానికే! గనుక మనము సత్యము ఒప్పుకొంటూ ఆత్మతో ప్రభువును ఆరాధిద్దాము. నీవు చేసే ఆరాధన ప్రభువు విడుదల చేసే వాక్కును స్వీకరించగలుగులాగున సిద్ధపరుస్తుంది.

ఆరాధన గీతము

ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను
తన గుడారపు మాటున నన్ను దాచెను
ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను

యెహోవా నా ప్రాణ దుర్గము
నేను ఎవరికి వెరతును
నా చేయి విడువని దేవుడుండగా
నేను భయపడను

ఇహలోక దుఃఖ బాధలలో
నీవు నాతో ఉన్నావు
ముదిమి వచ్చువరకు నన్ను
ఎత్తుకొనే దేవుడవు
నీవుగాక వేరే ఆశ నాకు లేనేలేదు

నిత్యము నీ పై ఆనుకొని
నిశ్చింతగా సాగేదన్
ఆ…హల్లెలూయ….హల్లెలూయ

లెక్కించలేని అధ్భుతములు
మక్కువతో చేసిన దేవా
నీవు చేసిన కార్యములకై నేను
ఏమి అర్పింతును స్వచ్ఛమైన
నిత్య ప్రేమను నా పై చూపినదేవుడవు
కొట్లా కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా

 

వారము కొరకైన వాక్యము

మన జీవితములు మన దేవుని మహిమ కొరకే అని లేఖనములు తెలియచేస్తున్నాయి. తన వాక్కును పంపి, మనము పడిన గుంటలలోనుండి మనలను లేవనెత్తే వాడుగా మన దేవుడు ఉన్నాడు.

ఆదివారము దినాన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మన ఆత్మకు పట్టిన కల్మషమంతా వాక్యము చేత శుద్ధీకరించబడుతుంది. అలాగే మన జీవితములు తన మహిమ కొరకు సిద్ధపరచబడులాగున తన వాక్కును విడుదల చేసేవాడుగా ఉన్నాడు. ఆ వాక్కు మనము పడిన గుంటలలోనుండి లేవనెత్తేదిగా ఉంటుంది. వాక్యములోని సత్యము యొక్క లోతులను తెలుసుకొనేవారిగా మనము ఉండాలి. కేవలము పై పై విషయములు ధ్యానించుట ద్వారా మనము అంత్యదినములను కొనసాగించలేము, ఖచ్చితముగా వాక్యము లోతులను మనము తెలుసుకోవాలి.

యేసయ్య అనేకమైన ఉపమానములను ఉపయోగించి తన బోధను చేసినవాడుగా ఉన్నాడు. ఆ ఉపమానములలోని సత్యము మనము గ్రహిస్తే మనము కూడా దానిలోని ఆశీర్వాదమును పొందగలుగుతాము. ఈరోజు ఫలించే జీవితము కలిగి ఉండాలి అంటే ఏమి చేయాలి? ఎవరు కలిగి ఉంటారు అని వాక్యము ద్వారా తెలుసుకుందాము.

వాక్యము లోని లేఖనములన్నీ ఎవరికొరకు ఇవ్వబడ్డాయి? ఇవి జరిగిపోయిన వాటిని గూర్చి మాట్లాడుతున్నాయా? మన జీవితపు ప్రస్తుతము కొరకు మాట్లాడుతున్నాయా? ఈ స్పష్టత మనము ఎరిగి ఉండాలి.

విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను – లూకా 8:5

ఈ మాటలో ప్రభువు మనతో ఏమి మాట్లాడుతున్నాడు అని ధ్యానిస్తే, విత్తువాడు “తన విత్తనములు” విత్తుటకు బయలుదేరెను అని వ్రాయబడింది. విత్తనము గూర్చి మనము ధ్యానిస్తే, విత్తనములో జీవము ఉంటుంది. అలాగే జీవమును ఆశీర్వాదముగా కూడా మనము చూడవచ్చు. అనగా విత్తువాడైన దేవాది దేవుడు తన విత్తనము అనగా తాను సిద్ధపరచి మనకొరకు ఇవ్వలనుకుంటున్న ఆశీర్వాదము విత్తుటకు బయలుదేరెను.

ఆదివారము మనము కూడుకొనుట అనేది దేవుడి నియమించిన నియమము. ఈ దినములో మన జీవితమునకు పట్టిన కల్మషమును తీసివేయుటకు, తన ఆశీర్వాదమును ఇవ్వడానికి బయలుదేరినవాడై ఉన్నాడు.

అతడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశపక్షులు వాటిని మ్రింగివేసెను. -లూకా 8:5

విత్తనము అనగా మనము ఆశీర్వాదము మరియు జీవముగా మనము నేర్చుకున్నాము. అయితే ఏ ఆశీర్వాదము నా జీవితములో స్థిరపరచబడుతుంది? అనే ఆలోచన కలిగి ఉండాలి. ఏ ఆశీర్వాదము ఇవ్వడానికి బయలుదేరాడు?

దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.౹ -ప్రసంగి 3:11

దేని కాలమందు అనగా ఈ సమయమందు మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. ఈ సమయానికి మన జీవితము చక్కగా ఉండుటకు నియమించాడు. యవ్వనస్తులు చదువు ముగించుకున్న తరువాత ఉద్యోగము చేయుట అనేది చక్కగా ఉండుట అనేది ఉదాహరణగా చూస్తే, ఒకవేళ ఉద్యోగము లేకపోతే చక్కగా లేనట్టు అని అర్థము చేసుకోవచ్చు. అలాగే, పెళ్ళైనవారు సంవత్సరాలు గడిచినా సరే పిల్లలు లేనివారుగా ఉన్నట్టయితే వారు చక్కగా లేనట్టుగా మనము అర్థము చేసుకోవచ్చు.

అయితే దేవుని కృప ఈ సమయమునకు దేవుని సన్నిధికి మనలను తీసుకువచ్చింది. తన విత్తనములు తీసుకుని బయలుదేరాడు. విత్తనములు అనగా అనేకమైనవి ఒక్కటి కాదు. అనగా ఇన్ని దినములు దేవుని చేత నియమించబడి, నేను కోల్పోయిన వాటినన్నింటినీ తిరిగి పొందుకోవడానికి తన ఆశీర్వాదములు చేతపట్టుకుని బయలుదేరాడు. అనగా రెస్టొరేషన్ దినముగా ఈ దినమును ప్రభువు నియమించాడు.

ఆయన పరిపూర్ణతలోనుండి మనము పరిపూర్ణులుగా మనము మార్చబడతాము. సగము సగము ఆశీర్వాదములు తీసుకువచ్చేవాడు కాదు గానీ, పరిపూర్ణమైన ఆశీర్వాదములు ఇచ్చేవాడు. పోయిన సమయమును బట్టి ఎంతో బాధ పడేవారిగా ఉంటాము, అయితే ఇంక ఆ విషయమును గూర్చి మర్చిపోతాము. అయితే మన ప్రభువు మాత్రము మర్చిపోయేవాడుకాదు.

దేవుడైతే విత్తనములతో బయలుదేరాడు, ఆశీర్వాదములు చేత బట్టుకొని బయలుదేరాడు. అయితే మనము ఎలా ఉంటున్నాము?

అతడు విత్తుచుండగా – లూకా 8:5

అనగా ఈరోజు దేవుడు మన జీవితములకు కావలసిన ఆశీర్వాదములు ఇచ్చియున్నాడు. అయితే మనము వాటిని పొందుకునే వారిగా ఉన్నామా లేదా? అని పరీక్షించుకుందాము.

కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశపక్షులు వాటిని మ్రింగివేసెను – లూకా 8:5
దేవుడు ఆశీర్వాదములు ఇచ్చినప్పటికీ, మనము సరైనమార్గములో నిలువక, త్రోవ ప్రక్కన పడ్డాయి. అయితే త్రోవపక్కన ఉండువారు ఎవరు? త్రోవ ప్రక్కనుండువారు, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములోనుండి వాక్యమెత్తికొని పోవును. -లూకా 8:12

ఇప్పుడు మనము సరైన త్రోవలో ఉన్నామా అని చూస్తే, “నమ్మి రక్షణ పొందినవారు సరైన త్రోవలో ఉన్నవారు”. గనుక ప్రభువైన యేసయ్యను అంగీకరించి, ఆయనను వెంబడించేవారిగా మనము ఉంటే మనము సరైన త్రోవలో ఉన్నవారము. అంతే కాక, దేవుని మహిమకరము కానిదానిని విడిచిపెట్టి ఆయననే వెంబడించేవారు సరైన త్రోవలో ఉండేవారు.

వెంబడించడము అంటే, గొర్రెలు ఎలా అయితే కాపరి వెళ్ళిన వైపునే నడుస్తాయో, మనము కూడా మన కాపరి అయిన యేసయ్య తన వాక్కు ద్వారా ఎలా చెయ్యమంటే అలా, ఎలా వెళ్ళమంటే అలా వెళ్ళుట సరైన త్రోవలో వెళ్ళుట. జరిగిపోయిన దానిగూర్చి చితపడవద్దు కానీ, ఈరోజు నీ వద్దకు వచ్చిన వాక్కుకు లోబడుటయే నీవు చేయదగినది. అదే సరైన త్రోవ. అలాకాని యెడల దేవుడి ఇచ్చిన ఆశీర్వాదము ఫలించదు అనగా నీవు అనుభవించలేవు.

నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.౹ -యోహాను 10:9

కాపరి ముందు వెళుతున్నాడు, గొర్రెలు ఆ కాపరిని వెంబడిస్తున్నాయి. ఆ గొర్రెలు లోపల బయట కూడా మేత మేసేవిగా ఉన్నాయి. కాపరి యొక్క కాపరత్వములో ఉన్నవారు లోపల అనగా ఆత్మీయమైన విషయములలో, బయట అనగా భౌతికమైన విషయములలో కూడా ఆశీర్వదించబడేవారిగా ఉంటారు. వారి ఆశీర్వాదమునకు కాపరి కారకుడుగా ఉన్నాడు. కాపరిని మనము వెంబడిస్తున్నాము అంటే ఆ కాపరిని బట్టి కలిగే ఆశీర్వాదములుకూడా మనలను వెంబడిస్తాయి. సరైన త్రోవలో ఉన్నవారికి ఆ ఆశీర్వాదములు ఖచ్చితముగా ప్రత్యక్షపరచబడతాయి.

మరి కొన్ని రాతినేలను పడి, మొలిచి, చెమ్మలేనందున ఎండిపోయెను. -లూకా 8:6
రాతినేలనుండు వారెవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధనకాలమున తొలగిపోవుదురు. -లూకా 8:13

రాతి నేలమీద కూడా విత్తనాలు విత్తబడ్డాయి. రాతి నేల అంటే, దేవుని వాక్కు వినినప్పుడు సంతోషముతో అంగీకరించువారు. అయితే, వేరు లేనందున, కొంచెము కాలము మాత్రము నమ్మి, శొధన కాలమున తొలగిపోవుదురు.

దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టువారియందు ఆయన ఆనందిస్తున్నాడు. నీవు కూడా ఆయన కృప కొరకు కనిపెడుతూ ఉన్నట్టయితే, నీ యందు ఆయన కూడా ఆనందించేవాడుగా ఉన్నాడు. అయితే కొన్ని దినములు అయిన తరువాత ఇంకా ముగించబడకముందే వదిలిపెట్టేసేవారుగా ఉన్నట్టయితే, ఫలించే జీవితము కాదు. అయితే ఇకముందు ఇలా ఉండవద్దు. నీతి మంతుని ప్రార్థన బహు బలము గలది. అటువంటి ప్రార్థన ఎలా తప్పిపోతుంది? ఈ సత్యమును గ్రహించి మనము ఆ ప్రకారము నిలబడితే, మన రాతినేల స్వభావము మారినట్టే!

మరి కొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటి నణచివేసెను. -లూకా 8:7
ముండ్ల పొదలలో పడిన (విత్తనమును పోలిన) వారెవరనగా, విని కాలము గడిచినకొలది యీ జీవనసంబంధమైన విచారములచేతను ధనభోగములచేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. -లూకా 8:14

దేవుడు మన జీవితమునకు కావలిసిన ఆశీర్వాదమును ఇచ్చాడు. ఆ ఆశీర్వాదమును సంతోషముగా అనుభవిస్తున్నాము. అయితే, మరొక విషయములో విచారము కలిగి ఉన్నట్టయితే, రాను రాను ఆ విచారము పెరిగిపోవుటను బట్టి సంపూర్ణముగా సంతోషించలేని వారిగా ముండ్లపొదల జీవితము ఉంటుంది. అయితే, ఒక విషయములో ఆశీర్వదించిన దేవుడు, నీవు విచారము కలిగి ఉన్న దానిలో కూడా చేయగలడు అనే సత్యము ఎరిగి మనము జీవించాలి అలా మన జీవితమును సిద్ధపరచుకోవాలి. దావీదువలే, “నా ప్రాణమా నాలో నీవేల కృంగియున్నావు? నీవేల తొందరపడుచున్నావు? దేవుని యందు నమ్మిక ఉంచు” అని మనము కూడా చెప్పుకొనేవారిగా మన్ము మార్చుకోవాలి.

మరికొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను -లూకా 8:8
మంచి నేల నుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. -లూకా 8:15

సరైన త్రోవలో నిలిచి, రాతి స్వాభావము లేనిది, ముండ్ల గచ్చపొదలు లేనిది అయిన జీవితము కలిగినవారు మంచినేలను వున్నవారు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము పొందుకోవడానికి నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి. ఆయన తన ఆశీర్వాదమును ఇచ్చేవున్నాడు, అయితే ఇప్పుడు మనము దానిని స్వతంత్రించుకోనేవారిగా మనము మార్చుకుందాము.