08-09-2024 – ఆదివారం మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

తన సన్నిధిలో నిలబడే భాగ్యము మనకు దయచేసిన దేవునికే ఘనత, మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ దినము దేవునిని స్తుతించవలసిన, మహిమ పరచవలసిన దినము. మన దేవుడు మనలను ప్రేమించి, మన పక్షమున నిలబడి, మనకు ఎదూరైన ప్రతీ పరిస్థితినుండి విడిపించేవాడిగా ఉన్నాడు.

యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించెదను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి -యెషయా 25:1

దేవుడు మన జీవితములఓ ఒక భాగమై ఉండాలి. మన జీవితములలో ఉద్యోగము అనేది ఒక భాగము, భోజనము చేయుట ఒక భాగము. అలాగే దేవుడు కూడా మన జీవితములో ఒక భాగమై ఉన్నట్టయితే, అప్పుడు ఆయనను గూర్చిన విషయములు తెలియచేయబడతాయి. అనగా ఆయన ఏమి చేయగలడో నీవు గమనించగలుగుతావు.

దేవుడు తన శక్తిని బట్టి అనేకమైన కార్యములు చేసేవాడివిగా ఉంటావు. మనము చేసే ఉద్యోగమును బట్టి నీకు జీతము వస్తుంది. ఆ జీతమును బట్టి నీవు నీ అవసరములను తీర్చుకుని సంతోషించేవాడివిగా ఉంటావు. అలాగే దేవుడు మన జీవితములో ఒక భాగమైపోతే ఆయనను బట్టి మన జీవితములో అనేకమైన విషయములు సమకూర్చబడి మనము సంతోషించేవారిమిగా ఉంటాము.

ధనమును బట్టి మనము పొందే సంతోషము కొంచెము సమయమే ఉంటుంది. అయితే దేవునికి సంబంధించిన విషయములలో కలిగిన అనుభవము సాక్ష్యము ఎల్లప్పుడు అదే సంతోషమును మనము పొందేవారిగా ఉంటాము.

ఇప్పటివరకు మన జీవితములో ఆయన ఆలోచనలే నెరవేర్చబడ్డాయి దానిని బట్టి మనము ఆయనను స్తుతించాలి. మన జీవితములలో చూస్తే, అనేకరకములుగా మరణము మనలను కబళించడానికి ప్రయత్నము చేస్తుంది. అయితే మనము ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నాము అంటే, అది దేవుని ప్రేమ, మరియు ఆయన ప్రణాళిక.

నీ పైన దేవుని ఆలోచన ఉంది అనే సత్యము నీవు ఖచ్చితముగా ఎరిగి ఉండాలి. ఆ కారణము చేతనే మనము ఇంకా జీవించి ఉన్నాము. దేవుడు కార్యము చేయకపోతే, ఈ లోకాధికారి యొక్క అధికారమునుండి తప్పించుకోవడము మన వల్ల కాదు.

యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను. -నిర్గమకాండము 15:2

మన దేవుని బలము మాత్రమే అపవాది యొక్క అధికారమునుండి మనలను తప్పించింది. గనుక యెహోవాయే నా బలము అని చెప్పగలిగిన అనుభవము మనది అయి ఉండాలి. హృదయాన్ని ఈ సత్యముతో సిద్ధపరచుకుందాము. అప్పుడు మాత్రమే ఆయనను ఆత్మతో సత్యముతో మనసారా స్తుతించి ఆరాధించగలుగుతాము.

మన హృదయములో లోకానుసారమైన ఆలోచనలు, వినోద మాధ్యమములో చూపించే వివిధ రకములైన మోసకరమైన ఆకర్షణలు నిండిపోయి ఉంటే దేవునిని సత్యముతో ఆరాధించలేము. మన హృదయమును దేవునికొరకు ఖాళీ చేసుకోవాలి, ప్రయోజనము కాని వాటినుండి మనము తప్పించుకుని దేవునికొరకు సిద్ధపడాలి.

మనము సంతోషించలేని పరిస్థితి గనుక మనము కలిగి ఉన్నట్టయితే, ప్రభువు నీ యెడల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు అని చెప్పుచున్న మాటలు ఈరోజు నీ వద్దకు వస్తున్నాయి. అయితే మనము ఉన్న పరిస్థితిని బట్టి వచ్చిన దేవుని వాక్కును మనము నమ్మలేని పరిస్థితిలో ఉంటాము. అయితే ఆ సత్యమును మనమున్న పరిస్థితిలో ఎలా నమ్మాలి?

యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు. -కీర్తనలు 40:5

నీ మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలు మా యెడల నీకున్న తలంపులు. ఈ రెండింటినీ మనము ఆలోచించాలి. మరొక వాక్యము కూడ చూసి మనము ధ్యానిద్దాము.

నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము -కీర్తనలు 103:1-2

ఈ భాగములో కీర్తనాకారుని పరిస్థితి మరణము తరుముతున్న పరిస్థితి. ఈ సందర్భములో తన ప్రాణమును ఏ విధముగా బలపరచుకుంటున్నాడు అని చూస్తే, ఇంతకు ముందు తన జీవితములో చేసిన అద్భుతములను, ఆశ్చర్య కార్యములను, ఉపకారములను జ్ఞాపకము చేసుకుని బలపరచుకుంటున్నాడు.

అయితే ఎందుకు తాను తరమబడుతున్న పరిస్థితిలో గతములో చేయబడిన ఉపకారములు జ్ఞాపకము చేసుకొమ్మని చెప్పుకుంటున్నాడు అని ఆలోచిస్తే, ఇంతకుముందు అద్భుతము చేసిన దేవుడు ఇప్పుడు కూడా చెయ్యగలడు అని నమ్ముట చేతనే కదా! అయితే అలా చేయడానికి కారణము ఏమిటి అని ఆలోచిస్తే –

నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.౹ -యిర్మీయా 29:11

ఈరోజు మన జీవితములో అనేకమైన పరిస్థితులు మన జీవితమును ముగించడానికే అపవాది చేత ఉచ్చు పన్ని ఉన్నాయి. అయితే దేవునికి మాత్రము మన పై ఎంతో మేలైన ఆలోచనలు కలిగి ఉన్నాయి గనుక మనము నాశనము కాము. రాబోవు కాలముకొరకైన నిరీక్షిణ మనము కలిగి ఉండుటకు ఆధారముగా దేవుడు మన యెడల ఇంతకు ముందు చేసిన ఆశ్చర్య కార్యములు ఉన్నాయి. దానికి కారణము దేవునికి మనపై ఉన్న ఉద్దేశ్యములే, ఆలోచనలే.

నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను. -కీర్తనలు 118:28

మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. గతవారము దైవజనుడు మందిర నిర్మాణము కొరకైన ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు. దేవుడు ఒక మాట ద్వారా ప్రభువు బలపరుస్తూ వచ్చారు. అదేమనగా-

నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చి ఉల్లసింతురు. -కీర్తనలు 5:11-12

ఈ మాటల ద్వారా అప్పటివరకు ఉన్న నిరాశ, దుఃఖము తొలగించి, దేవుడు మార్గము తెరువగలడు అనే నిరీక్షణ కలిగింది. అప్పుడు దేవుని ద్వారా చూపించిన మార్గము ద్వారా ఆగిపోవలసిన కార్యము కొనసాగించబడే విధముగా సిద్ధపరచబడింది.

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.౹ -రోమా 8:28

మన సంఘము కొరకు మందిరము కట్టబడటము అనేది దేవుని సంకల్పము. దానికొరకు సమస్తము సమకూర్చబడతాయి. ఈ మాటలు మనలను నడిపించేవిగా ఉన్నాయి. అయితె, ఈ మేలులు అన్నీ ఎందుకు జరిగిస్తున్నాడు అంటే, మనపై గొప్ప ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్న కారణము చేతనే!

గనుక దేవుడు ఇంతకు ముందు చేసిన ప్రతీ మేలును జ్ఞాపకము చేసుకుని ఆయనను ఆరాధిద్దాము.

ఆరాధన గీతము

బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు

 

వారము కొరకైన వాక్యము

క్రైస్తవ జీవితము అనేది అనుభవముతో కూడినదిగా ఉండాలి. మనము క్రీస్తును కలిగినవారమైతే మన అనుభవము ఆయనను ప్రకటించేదిగా ఉంటుంది. మనము క్రీస్తుని క్రియల చేత ప్రకటించాలి అంటే ఆయనను కలిగి ఉన్న అనుభవము మనము కలిగి ఉండాలి. ఆయనను అనుభవించాలి, అనే ఆశ కలిగి ఉంటే, ఆయన ఏమై ఉన్నాడో అనే సత్యము మనము గ్రహించాలి.

అనేక సందర్భములలో దేవుడిని అపార్థము చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కొంతమంది అయితే దేవుడు నాకు అన్యాయము చేసాడు అనే ఆలోచన కూడా కలిగి ఉంటారు. కొన్ని పరిస్థితులు అన్యాయము చేసినట్టుగానే కనబడతాయి గానీ, దానిలో సహితము మేలు దాచబడి ఉంటుంది.

విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము -యోబు 34:10

దేవుడు అన్యాయము చేయుట అనేది జరగనే జరగదు. ఈ సత్యము పై మన జీవితము ఆధారపడాలి. మనము ఏ స్థితిలో ఉన్నా సరే ఈ మాట మనము చెప్పగలగాలి. అయితే చాలా సందర్భములలో దీనికి వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉంటాము. ఈ దినము మనము ఈ సత్యమును గట్టిగా పట్టుకుందాము.

ఆయన సముద్రతీరమున నుండగా సమాజమందిరపు అధికారులలో యాయీరను నొకడు వచ్చి, ఆయనను చూచి ఆయన పాదములమీదపడి –నా చిన్నకుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీచేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితోకూడ వెళ్లెను; బహుజనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. -మార్కు 5:22-24

యాయీరు జీవితములో తన చిన్న కుమార్తెను పోగొట్టుకునే పరిస్థితిలో యేసయ్య వద్దకు వచ్చి వేడుకొనగా యేసయ్య కూడా ఆయనతో బయలుదేరారు. అయితే మార్గము మధ్యలో ఒక దుర్వార్త వచ్చింది.

ఆయన ఇంకను మాటలాడుచుండగా, సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చి–నీ కుమార్తె చనిపోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు వనిరి. -మార్కు 5:35

ఒకవేళ యేసయ్య గనుక రక్త స్రావము కల స్త్రీ వద్ద సమయము వృధా చెయ్యక త్వరగా వెళ్ళి ఉన్నట్టయితే ఆ చిన్న కుమార్తె చావక బ్రతికి ఉండేది. మన జీవితములో కూడా చాలా ఉపవాసము ఉండి ప్రార్థించాను, అయినా సరే జరగలేదు అని దేవుని పై అపార్థము చేసుకొనే విధముగా మనము ఆలోచన చేసేవారముగా ఉంటాము. అంతే కాక దేవుని వెంబడించే విధానములో కూడా వ్యత్యాసము కనబడుతుంది. లాజరు విషయములో కూడా ఇదే విధమైన పరిస్థితి.

మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి . గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగియాయెను.౹ ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.౹ అతని అక్కచెల్లెండ్రు – ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.౹ -యోహాను 11:1-3

లాజరును ప్రభువు ప్రేమించాడు. అటువంటి లాజరు రోగిగా ఉన్నపుడు యేసయ్య వద్దకు మరియ మార్త వర్తమానము పంపించారు. వారు నమ్మారు గనుకనే యేసయ్యవద్దకు వర్తమానము పంపించారు. అలాగే మనము కూడా దేవునిని నమ్ముతున్నాము కాబట్టే ఎంతో శ్రద్ధగా ప్రార్థిస్తాము.

అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.౹ -యోహాను 11:6

ఇక్కడ చూస్తే, రోగి అయి ఉన్నాడు అని తెలిసినప్పటికీ వెంటనే వెళ్ళకుండా, రెండు దినములు యేసయ్య ఆలస్యము చేసాడు గనుక ఆయన అన్యాయము చేసాడు అనే ఆలోచన సరి అయినది కాదు.

యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై యున్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు. యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును. -కీర్తనలు 9:7-8

దేవుడు శాశ్వతముగా సింహాసనాసీనుడై యున్నాడు అంటే, సింహాసనముపై ఉన్నదే పరిపాలించడానికి. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు. అయితే ఈ న్యాయము మనలోని యదార్థత మరియు నీతి అనగా ఆయన యందలి నమ్మిక ఉన్నట్టయితే ఖచ్చితముగా నీకు న్యాయము జరిగిస్తాడు.

మనము దేవునిని అడిగిన సందర్భములో మనలో యదార్థత లేని కారణము చేత మనము ఆలస్యమును చూస్తున్నాము. కుమార్తె విషయములో మరియు లాజరు విషయములో వారు చనిపోలేదు కానీ నిద్రిస్తుంది అని యేసయ్య చెప్పారు, అప్పుడు వారు యేసయ్య మాటను నమ్మగలిగారు. అలాగే మన నమ్మిక కూడా అలాగే ఉండాలి. అప్పుడు లోకము ఆశ్చర్యపడే రీతిలో మన జీవితములో ఆశ్చర్యకార్యము జరిగించబడుతుంది.

గనుక మనము యాదార్థత మరియు దేవుని యందలి నమ్మిక ఈ రెండు మనకు ఎంతో ప్రాముఖ్యమైనవి గనుక మనము ఈ రెండు విషయములు మనము సరిచేసుకోవాలి.

అయితే చనిపోయిన చిన్నది తిరిగి జీవింపచేయబడటానికి కారణము ఏమిటి? సమాధి చేయబడిన లాజరు తిరిగి లేపబడటానికి కారణము ఏమిటి? అని ఆలోచిస్తే – యాయీరు వెళ్ళి యేసయ్యను అడిగాడు అలాగే మార్త, మరియలు వర్తమానము యేసయ్యకు పంపించారు గనుకనే అక్కడకు యేసయ్య రాగలిగాడు.

గనుక మనము యదార్థముగా, దేవుని నమ్మి కలిగి ప్రార్థించినపుడు, పరిస్థితి ఎలా కనబడినా సరే దేవుని యందలి విశ్వాసముపై నిలబడి ఉంటే ఖచ్చితముగా ఆశ్చర్య కార్యములు మన జీవితములో చేసేవాడిగా ఉంటాడు.

మనము యదార్థత కలిగిన హృదయము కలిగి ఉన్నాము అని ఎలా చెప్పగలుగుతాము? ఈ హృదయము మోసకరము కానీ ఎలా యదార్థముగా మార్చబడుతుంది అని ఆలోచిస్తే – వాక్యము మన హృదయములో నివాసము ఉన్నప్పుడు మన హృదయము యదార్థమును కలిగి ఉండగలుగుతుంది. ఆ విధముగా మనము మన హృదయమును సిద్ధపరుచుకుందాము.

మనము పోగొట్టుకొనేవారము కాదు గానీ, స్వతంత్రించుకొనే వారము!