అన్ని నామముల కన్న పై నామము
అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచదగినది – క్రీస్తేసు నామమూ
యేసు నామము – జయం జయమూ
సాతాను శక్తుల్ – లయం లయమూ (2X)
హల్లేలూయ హోసన్న – హల్లేలూయ
హల్లేలూయ – ఆమేన్ (2X)
పాపములనుండి విడిపించును – యేసుని నామము (2X)
నిత్య నరకాగ్నిలోనుండి రక్షించును – క్రీస్తేసు నామము (2X)
…యేసు నామము…
సాతాను పై అధికారమిచ్చును శక్తి కలిగిన – యేసు నామము (2X)
శత్రు సమూహము పై జయము నిచ్చును – జయశీలుడైన యేసుని నామము (2X)
…యేసు నామము…
రోగములనుండి విడిపించును – యేసుని నామము (2X)
సమస్త బాధలను తొలగించును – శక్తిగల యేసు నామము (2X)
…యేసు నామము…
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను నాట్యమాడెదన్
నాట్యమాడెదన్ నేను
నాట్యమాడెదన్ నేను
దావీదువలె నేను నాట్యమాడెదన్
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను పాటపాడెదన్
పాటపాడెదన్ నేను
పాటపాడెదన్ నేను
దావీదువలె నేను పాటపాడెదన్
ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను స్తుతించెదను
స్తుతించెదన్ నేను
స్తుతించెదన్ నేను
దావీదువలె నేను స్తుతించెదను
యెహోవ మా ప్రభువా యేషువా మా రక్షకా
యెహోవ మా ప్రభువా యేషువా మా రక్షకా
యెహోవా షాలోం యెహోవా రాఫా
మా ఇమ్మానుయేలు దేవా
రక్షణ స్తోత్రం బలము ప్రభావం
శుద్ధి ఐశ్వర్యం ప్రభు యేసుకే
స్తుతి ఘన మహిమ ఇహపరములలో
రాజుల రాజునకే
దేవా నీ కృపాబాహుళ్యముతో
కరుణచూపితివే
మా దోషశిక్షను భరియించి
మమ్మును ధన్యుల చేసితివే
రక్షణ స్తోత్రం బలము ప్రభావం
శుద్ధి ఐశ్వర్యం ప్రభు యేసుకే
స్తుతి ఘన మహిమ ఇహపరములలో
రాజుల రాజునకే
ప్రభువా నీ ఉపకారములకు
ఏమి చెల్లింతుము?
రక్షణపాత్రను చేతబూని
ఆరాధించెదము
యెహోవ మా ప్రభువా యేషువా మా రక్షకా
యెహోవా షాలోం యెహోవా రాఫా
మా ఇమ్మానుయేలు దేవా
రక్షణ స్తోత్రం బలము ప్రభావం
శుద్ధి ఐశ్వర్యం ప్రభు యేసుకే
స్తుతి ఘన మహిమ ఇహపరములలో
రాజుల రాజునకే
ఆరాధన వర్తమానం
సోమవారము నుండి శనివారము వరకు లోకానికి ప్రాముఖ్యమైన దినములు. ఈ రోజులన్నీ కూడా ఉద్యోగాలకొరకు, చదువులకొరకు ఇతర పనులకొరకు చాలా ముఖ్యమైనవి. అందుకనే పరిస్థితులు అనుకూలముగా ఉన్నా లేకపోయినా కూడా ఎదో ఒకలాగా ఆ పని కొరకు ప్రయాసపడుతాం. మనకు మాత్రము ఆదివారము ఎంతో ప్రాముఖ్యము. ఈ దినము ప్రభువు ఏర్పాటుచేసిన దినము. ఈ దినమును గనుక ప్రభువుకు మహిమకరముగా, ఆయన సన్నిధిలో గడిపినట్టయితే, మిగతా అన్ని దినములు ఆ ప్రభువు ప్రభావము కనుపరచబడేదిగా ఉంటుంది.
లోకానుసారముగా ఉద్యోగదినములన్నీ, వారి జ్ఞానానుసారముగా వారి ఉద్యోగము సరియైన విధానములో చెయ్యడానికి ఎంతో ప్రయాస పడతారు. అయితే మనము ఈ ఆదివారము మనము ప్రభువు సన్నిధిలో ఆరాధించడానికి కూడుకున్నట్టయితే, మిగతా అన్ని దినములకు కావలసిన కృపను మనకొరకు కురిపించేవాడుగా ఉన్నాడు.
సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యముగలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయనయందు భయభక్తులు కలిగి యుందురు – యోబు 37:23
దేవునిలో ఉన్న మహాత్మ్యము, దేవుని సన్నిధిలో నీవు ఉన్నప్పుడు, నీ జీవితములో ఆయన కృప విడుదల అయ్యి ఆ కృపామహదైశ్వర్యము స్థిరపరచబడుతుంది. ఉదాహరణకు నీ ఉద్యోగ జీవితములో, నీ రాకపోకలలో ప్రతి అపాయము, ప్రతి అపజయము నుండి విడుదలచేసేది నీ దేవుని నుండి విడుదల అయ్యి నీ జీవితములో స్థిరపరచిన ఆయన కృపయే.
దేవుడు మనకొరకు సమస్తము సిద్ధపరచినవాడుగా ఉన్నాడు. సమస్తము అనే మాటకు, అర్థము ఏమిటి? సమస్తము అంటే, మన జీవితమునకు కావలసిన సమస్తము ఒకేసారి ఇవ్వడు గాని, ఏ దినమునకు కావలిసిన సమస్తము ఆ దినము కొరకు దయచేస్తాడు. మన దేవుడు సమస్తము కలిగినవాడు గనుక, వట్టి చేతులతో ఉండడు, ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో గడుపుతామో, అప్పుడు ఆయన ప్రేమతో మన జీవితములో ఎక్కడైతే లేమి ఉందో, ఖాళీగా ఉందో ఆ ప్రతి పరిస్థితి నింపబడుతుంది. నీ జీవితములో ఎప్పుడైనా ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది అని అనిపిస్తే దేవుని సన్నిధిలో నీవు గడుపు, ఖచ్చితముగా నీ ఖాళీ నింపబడుతుంది. ఉదాహరణకు, వాటర్ ట్యాంకును చూస్తే, అది నింపబడినతరువాత, ఎక్కడ నీళ్ళ కొరత ఉందో అక్కడికే వెళ్ళి ఆ నీళ్ళను అందుబాటులోనికి తెస్తుంది. ఆ ట్యాంకర్ లో నీళ్ళు అయిపోయాక అది మరలా నింపబడుతుంది. ఎందుకోసమంటే, ఎక్కడైతే నీళ్ళకొరత ఉందో అక్కడ నీళ్ళు సమకూర్చడానికి. అదే దాని ఉద్దేశ్యము. అలాగే దేవుని సన్నిధి ఉన్నదే నీలోని లేమిని, నీలోని ఖాళీలను, బలహీనతలను తొలగించి నిన్ను నిండుగా చేసి, బలపరచి ధన్యుడుగా జేయుటకే.
నీ జీవితములో దేవుని సన్నిధిలోనికి వచ్చిన ప్రతిసారీ ఆశీర్వాదమే! మన జీవితాలు గడ్డిపువ్వు వంటి జీవితాలు. అనగా అల్పమైన జీవితములు. అయితే అటువంటి అల్పమైన జీవితములకు ఆయనే ఆధారము అవాలి అని ఆయన కోరుకుంటున్నాడు. నీలో బలము కలిగించడానికి, శక్తిసామర్థ్యములు కలుగచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఉపవాసముతోనే వారిని పంపివేసినట్టయితే మార్గమధ్యములో మూర్ఛపోదురేమో అని ప్రభువు ఆలోచించేవాడుగా ఉన్నాడు. నీలో ఉన్న ఖాళీను పూడ్చడానికి, నీలోని బలహీనతను తొలగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నడు, అయితే నీవు ఆయన సన్నిధిలో నీవు కనపడకపోతే, నీలోని ఖాళీ, బలహీనత అలాగే ఉండిపోతాయి.
ఒకరోజు నీవు మిస్స్ అయిపోతే, ఆరోజు నింపబడవలసినది నింపబడదు. అది అలాగే ఖాళీగా ఉండిపోయి, తరువాత నీవు నింపబడే విషయాలకు బీటలువారే పరిస్థితి వస్తుంది. అందుకే మనకు ప్రభువు దినమైన ఆదివారము ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ దినము ప్రభువు సన్నిధిలో నీవు గడిపే సమయమును బట్టి విడుదల అయ్యే ప్రభావము, మిగతా ఆరు దినములలో కూడా ప్రత్యక్షపరచబడుతుంది.
జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవిఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు – యోబు 12:13
దేవుడు కలిగిన జ్ఞానము, శౌర్యము, బలము ఎవరికోసము వెల్లడిపరుస్తున్నారు? నీ జీవితము, నా జీవితములో వెల్లడిపరుస్తున్నారు. ఈ సత్యము మనము గ్రహించాలి. ఆయన జ్ఞానము చొప్పున నీ జీవితము స్థిరపరచబడుతుంది. దేవుని చిత్తము జరిగే విధముగా నీవు ప్రార్థించాలి. ఉదయకాల సమయములో లేవగానే ఆయన కృపను వేదుకోవాలి. ఆయన చిత్తము నెరవేరునట్టుగా వేడుకోవలి. ఎవరు కోరుకుంటారు అంటే, దేవుని జ్ఞానమును బట్టే నా జీవితములో దేవుని చిత్తము నెరవేరుతుంది అని ఎరిగినవారు మాత్రమే!
నీకు ఉన్న ప్రతి అవసరతలో జ్ఞానము కొరకైనా, ఆలోచన కొరకైనా, ఆర్థిక అవసరతల కొరకైనా, బలము కొరకైనా ప్రభువును అడగటమే. ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి. వాడు ఎందుకు సంపాదిస్తున్నాడు? వాడి ఆలోచన ఎంతవరకు ఉంటుంది? వాడు సంపాదించింది, వాడు తృప్తిగా తినాలి, అలాగే వాడి తరువాత తరముకూడా తృప్తిగా తినగలుగులాగున సంపాదిస్తాడు. అలాగే నిన్ను కనిన తండ్రియైన దేవుడు, నీ తరతరములు ఆశీర్వదించబడునట్టుగా ఆయన ఐశ్వర్యము కలిగి ఉన్నాడు.
బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడై తన శక్తిచేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే – కీర్తనే 65:6
ఆయన కలిగిన ఆ బలము ఎందుకోసము ఉంది? ఆ బలము ప్రత్యక్షపరచబడటానికి, స్థిరపరచబడటానికి. ఎక్కడ? నీ జీవితములో. ఈరోజు నీ జీవితములో ఎక్కడ ఖాళీ గా ఉందో అది నింపబడుతుంది. ఆమేన్! ఈ సత్యము స్థిరపరచబడాలి అంటే, నీవు చెయ్యవలసినది ఒకటి ఉంది. అదే ఆరాధన. నీవు ఆరాధించినప్పుడు రక్షణమార్గము సిద్ధపరచుకుంటాడు.
స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచు చున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను – కీర్తన 50:23
అందుకే ఈరోజు నీవు ఆరాధించు, దేవుని నామమును మహిమపరచు. దేవుని చిత్తము, ఆయన జ్ఞానము, బలము, శౌర్యము నీ జీవితములో స్థిరపరచబడును గాక. ఆమేన్!
ఆరాధన గీతము
మేలు చేయక నీవు ఉండలేవయ్య – ఆరాధించక నేను ఉండలేనయ్య || 2 ||
యేసయ్యా యేసయ్యా || 2 || || మేలు చేయక ||
నిన్ను నమ్మినట్లు నేను – వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం – తొలగించావు వదిలుండలేక
నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా
నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా
క్రియలున్న ప్రేమా నీదీ – నిజమైన ధన్యతనాది || యేసయ్యా ||
ఆరాధించే వేళలందు – నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపము కలిగే నాలో – నేను పాపినని గ్రహింయిన్చగానే
నీ మేళ్లకు అలవాటయ్యి – నీ పాదముల్ వదలకుంటిన్
నీ మేళ్లకు అలవాటయ్యి – నీ పాదముల్ వదలకుంటిన్
నీ కిష్టమైన దారి – కనుగొంటిని నీతో చేరి || యేసయ్యా ||
పాపములు చేసాను నేను – నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించగల్గే నీ మనసు – ఓదార్చింది నా ఆరాధనలో
నా హృదయము నీతో అంది – నీకు వేరై మనలేనని
నా హృదయము నీతో అంది – నీకు వేరై మనలేనని
అతిశయించెద నిత్యమూ – నిన్నే కలిగి ఉన్నందుకు || యేసయ్యా ||
Main message| మెయిన్ మెసేజ్
దేవుని సన్నిధిలో పొందిన వాక్యము ఎలా నీ జీవితములో ఎలా సిద్ధపరచబడుతుంది అని నీవు ఖచ్చితముగా గమనించాలి. దేవుడు ఈ సంవత్సరమంతా కూడా ఆశీర్వదించబడతాము అని ప్రభువు మనతో చెప్పాడు కదా! మీరు ధన్యులు. దేవునికే స్తోత్రము కలుగునుగాక.
మనమే ఎందుకు ధన్యులు?
యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు – కీర్తన 33:12.
మనము ఎందుకు ధన్యులము అంటే, మనము కలిగిన దేవుని బట్టి. నీకు యెహోవాయే దేవుడు అయినట్టయితే నీవు ధన్యుడవే. ధన్యుడు అంటే, సంతోషముగా జీవించడము, మహాభాగ్యము కలిగి జీవించడము. అనేకమంది ఈ భాగ్యము లేనివారుగా ఉంటున్నారు. అనాదికాలములోనే నీవు నిర్ణయించబడ్డావు.
మన భారతీయులు అమెరికాలో ఉన్నావాడికి గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి, అబ్బా వాడు ఎంత ధన్యుడో కదా అని అనుకుంటాము. ఎందుకు? అమెరికాలో జీవన ప్రమాణము మనకంటే గొప్పగా ఉంది కాబట్టి, ఆ జీవితము అనుభవించడానికి అవకాశము దొరికినవాడిని ధన్యుడుగా మనము చూస్తున్నాము. అలాగే యెహోవా దేవుడుగా కలిగిన వాడు ధన్యుడు ఎందుకంటే, దేవుడు కలిగిన సమస్తము ఆయనను దేవుడుగా కలిగిన ప్రతి వాడు అనుభవించగలుగుతాడు. ఈ సత్యమును బట్టి, మన జీవితములు ధన్యకరములు. అయితే ఈ ధన్యకరమైన జీవితము అనుగ్రహించబడటానికి నీవు చేసింది ఏమీ లేదు. సమస్తము ఆయనే, అనాదికాలములోనే నిన్ను ఎన్నుకుని జరిగించాడు.
నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను – ద్వితీయోపదేశకాండము 7:6
నీవు గ్రహించవలసిన ఒక సత్యము, నిన్ను దేవుడు అత్యధికముగా ప్రేమిస్తున్నాడు. ఒకవేళ ఆయన నిన్ను ఏర్పాటు చేసుకోకపోతే, ఆయన కలిగినది నీవు అనుభవించలేవు. ఈరోజు మనము కలిగిన ధన్యత, ఆయనకు మనమీద ఉన్న ప్రేమను బట్టియే అనే సత్యము మనము ఎల్లప్పుడు జ్ఞాపకము పెట్టుకోవాలి.
ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు. ద్వితీయోపదేశకాండము 33:29
ఈ సత్యము నీవు అనుభవపూర్వకముగా ఎరగనంతవరకూ, ఆచారయుక్తమైన భక్తినే చేస్తావు. అయితే నిన్ను వెదికి తన కుమారుడైన యేసు క్రీస్తు రక్తముచేత రక్షించినాడు. మనము గొప్పవారము అనికాదు కానీ, ఆయన ప్రేమను బట్టి మాత్రమే. ఎప్పుడైతే ఆ విలువ నీకు తెలిస్తుందో, అప్పుడు సరియైన విధానములో జాగ్రత్తగా కాపాడుకుంటావు. మనలో అనేకులు కొన్ని రోజులు ఎంతో భక్తికలిగి ఉంటారు, అయితే తరువాత మరలా మామూలుగా అయిపోతారు. అయితే నీవు అలా ఉండకూడదు. నీవు అనుభవిస్తున్న ధన్యకరమైన జీవితము దేవుడు అమూల్యమైన వెల చెల్లించి దయచేసాడు. ఆ అమూల్యమైనది నీ కొరకు చెల్లించబడింది కాబట్టి, నీ విలువకూడా పెరిగింది. అప్పటివరకు నశించబడేవారమే కానీ, ఇప్పుడు జీవించబడే గుంపులో చేర్చబడ్డాము.
మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? 1 కొరింథీ 3:16
దేవుడు మనలో నివాసము ఉండటము బట్టి మన జీవితములు ధన్యకరములుగా చేయబడ్డాయి.
సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము – లూకా 1:49
యేసుక్రీస్తు ప్రభువు భూలోకములోనికి పుడతాడు అని ఎరిగిన అనేకమంది రాజ కుమార్తెలు కన్యకలుగా ఉండిపోయారు. అయితే వారికి ఎవ్వరికి దక్కని మహాభాగ్యము మరియకు దక్కింది. అలాగే సర్వశక్తుడు అయిన దేవుడు మరియ గర్భములో నివాసము చేసినాడు. అందుకే ఆమె ధన్యురాలు అని గ్రహించింది.
ఈరోజు నీవు కూడా తెలుసుకోవలసినది ఏమిటంటే, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించి తనవాడిగా చేసుకున్నాడు.
నీవు సత్యము ఎరిగినప్పుడు, ఈ తరములు అనగా సమయములు, సంతోషమైన సమయములైనా, కష్టము కలిగిన సమయములైనా తరములన్నిటను, నీవు ధన్యుడవే. అనగా నీ సమయము ఎలా ఉన్నప్పటికీ ఆయన కృప నీ జీవితములో స్థిరపరచబడి, నీవు ధన్యుడుగా జీవిస్తావు.
అలాగే ఆయన స్వాస్థ్యముగా ఏర్పరుచుకున్నావారు ధన్యులు.
యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటి వాడు కాడు; ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము; సైన్యములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు. యిర్మీయ 10:16
ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను – కీర్తన 147:19.
యాకోబునకు వాక్యము తెలియచేయబడుతుంది. ఎందుకు? యాకోబు స్వాస్థ్యముగా ఏర్పరుకోబడినాడు. అనగా దేవునికొరకు స్వాస్థ్యముగా ఏర్పరుచుకోబడినవాడికి వాక్యము తెలియచేయబడుతుంది. దానిని బట్టి మీరు ధన్యులు. అనగా మీ జీవితము సంతోషముగా ఉంటుంది. నీలో అశీర్వాదము, ఏ న్యాయమైతే నీ జీవితములో జరగాలో, అది జరిగించుటకు ఆయన ఏర్పరుచుకున్నాడు.
మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. యోహాను 15:16
మనలో నివాసము ఉండటానికి, అలాగే మన జీవితము ఫలభరితముగా ఉండుటకు ఆయన మనలను ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతము మన జీవితము ఫలభరితముగా లేనప్పటికీ, ఆవిధముగా మారడానికి తన న్యాయ విధులు ఆయన తెలియచేసేవాడుగా ఉన్నాడు.