ఆరాధన వర్తమానము
తన సన్నిధిలో ఈరోజు మనలని నిలువబెట్టిన దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఈ దినము మనము దేవునిని స్తుతించడానికి వచ్చాము. ఆయన మన స్తుతులకు అర్హుడై ఉన్నాడు.
తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.౹ -2 పేతురు 1:2
తన దైవశక్తి మన జీవమునకు, భక్తికి కావలసినవన్నీ దయచేయుచున్నది. తన శక్తి మన జీవితములలో పరిపూర్ణమవుతుంది. ఎలా పరిపూర్ణమవుతుంది లేదా ఎలా కనపరచబడుతుంది? గడచిన వారమంతా మనకు కావలసిన జీవము అనుగ్రహించబడింది, అయితే ఎలా అది అనుగ్రహించబడింది? పౌలు ఒక అద్భుతమైన మాట చెప్తారు –
అందుకు–నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.౹ -2 కొరింథీయులకు 12:9
“బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను” ఈ మాట గమనిస్తే – దేవుని కృప నాకు చాలు, ఎందుకంటే, నా బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది అని చెప్పుచున్నాడు. యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును అని అనుదినము మనము ఒప్పుకున్నపుడు, తన వాక్కును బట్టి తన కార్యములు జరిగించే దేవుడు మన దేవుడు.
ప్రభువు వాక్యము నిన్ను రక్షిస్తుంది, నీ పైకి వచ్చే ప్రతి దానిని సంహరిస్తుంది. దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము. మనము చివరి దినములలో ఉంటున్నాము. మనము గమనించినా గమనించకపోయినా రాకడకు సంబంధించిన అనేక సూచనలు జరిగిపోతూనే ఉన్నాయి. అయితే రాకడలోపు మనము జీవించి ఉంటామో లేమో తెలియదు కానీ, మనము పిలువబడినప్పుడు మనము ఎక్కడ ఉండబోతున్నామో అనే ఎరుక కలిగి ఉండాలి.
ఆచార యుక్తమైన భక్తిలో మనము ఉండకూడదు. వాక్యములో నిన్ను సాక్షిగా నిలబెట్టే శక్తి ఉంది. మనము విన్న వాక్యమును పట్టుకుని ఆ వాక్యముపై మనము నిలబడి ఉన్నప్పుడు ఆ శక్తి నెరవేరుతుంది. అందుకే ఈ చివరి దినములలో వాక్యమే మనకు ఆధారమయి ఉంది.
ఆయన మనకు కావలసిన జీవమునకు, తన దైవశక్తిని అనుగ్రహిస్తున్నాడు. అయితే ఆ దైవశక్తి మన కళ్ళకు కనపడదు అయితే ఆ శక్తి యొక్క క్రియలు కనపరచబడతాయి. మనము జీవించి ఉన్నాము అంటేనే, ఆయన శక్తి మనలో క్రియ చేయటము వలననే.
దేవుని కృప అనుదినము మనకు అనుగ్రహించబడుతుంది. మన జీవితము కొనసాగించబడుతుండగా, దేవుని కృప కూడా కొనసాగించబడుతుంది. మన జీవితములో అనేక సందర్భములలో అనేకమైన బలహీనతలు ఉంటాయి. అవి శరీర సంబంధమైనది గానీ, జీవితమునకు వ్యతిరేకముగా పనిచేసేది గానీ, ఎడైనా సరే, ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది.
ఒక సమస్య నుంచి బయటపడ్డావు అంటే, దానికి కారణము దేవుని కృప. మనము జీవించి ఉన్నాము అంటేనే దేవుని కృప.
దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. -యెషయా 55:1
రూకలు లేవు కానీ కొని భోజనము చేయమని చెప్పుచున్నాడు. అలా ఎలా చెయ్యగలుగుతాము? రూకలు లేకుండా ఎలా కొనగలుగుతాము?
బలహీనత అనగా మన జీవితములో ఆర్థికముగా అనేకమైన పరిస్థితులు ఉంటాయి. ఆ ప్రతి పరిస్థితి దాటుకుని వెళుతున్నాము అంటే, ఆయన కృపయే.
చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును. -యెషయా 55:3
దావీదుకు చూపబడిన కృప ఏమి చేసింది? అరణ్యములో గొర్రెలు కాచుకొనేవాడుగా ఉన్నాడు. తన వద్ద గొప్ప సంపద ఏమీ ఉండదు కదా? అటువంటి దావీదును సింహాసనముపై కూర్చునేవాడిగా దేవుని కృప కార్యము చేసింది.
అటువంటి కృప మీపై కూడా చూపిస్తాను అని దేవుడు చెప్పుచున్నాడు. దావీదు సమయములో యేసయ్య రాలేదు అయితే మనకు యేసయ్య ఉన్నాడు దానిని బట్టి ఏమి జరిగింది అంటే –
ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.౹ -యోహాను 1:17
దావీదు సమయములో కృప చూపుదును అంటున్నాడు. అయితే యేసయ్య వచ్చిన తరువాత, కృప కలిగెను అని చెప్పుచున్నాదు.
ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి.౹ -యోహాను 1:16
ఆ కృప మనము ఎప్పుడు బలహీనముగా ఉంటున్నామో, ఆ సమయములో మనలను లేపేదిగా ఉంటుంది. అందుకే కీర్తనాకారుడు, నీ కృప నా జీవముకంటే ఉత్తమమైనదయా అని చెప్పుచున్నాడు.
మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని చూసినపుడు మనము డీలా పడేవారిగా ఉంటాము. అయితే నిజానికి ఆయన కృపపై ఆధారపడే మనము ఎల్లపుడూ జీవము కలిగి ఉంటాము. మనము బలహీనతలో ఉన్నపుడు మరి ఖచ్చితముగా ఆయన కృప పనిచేస్తుంది.
“రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి”. ఇప్పుడు మన వద్ద రూకలు లేవు. అయితే మన వద్ద కృప మాత్రమే ఉంది. పాత కాలములో వస్తు మార్పిడి విధానములో కొనుక్కోనేవారు. మన వద్ద ఉన్న దేవుని కృప అక్కడ ప్రత్యక్షపరచబడి ఆ భోజనముగా చెప్పబడిన జీవమును పొందుకోగలుగుతాము.
మన జీవితములో అత్యంత శ్రేష్టమైనది దేవుని కృప. దేవుని కృపను మనము వెలకట్టలేము. ఆ కృప మనతో ఉన్నంత కాలము మనము జీవింపచేయబడతాము. దేవుని కృప ఆయన సంపూర్ణతలోనుండి మనకు దయచేస్తుంది.
బుద్ధిజ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. మన వద్ద కృప ఉంది గానీ రూకలు లేవు. అయితే ఈ కృప ఆయన పరిపూర్ణతలోనుండి మనకొరకు అవసరమైనది తీసుకువచ్చేది గా ఉంది. ఈ సత్యము ఎరిగిన పౌలు, “దేవుని కృప మీకు తోడై ఉండును గాక” అని చెప్పగలిగాడు.
“రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి”. అంటె ఇది ఒక రికమండేషన్ లాంటిది. దేవుని రికమండేషన్ మనకు ఉన్నపుడు ఆపగలిగినది ఏదీ లేదు.
క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?౹ -రోమా 8:35
“క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు” అంటే, క్రీస్తునుండి అనుగ్రహించబడిన కృపనుండి మనకు రావలసినదానిని ఆపగలిగినవారు ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. దానిని అడ్డుకొనగలిగినవారు ఎవరూ లేరు. అంటే దేవుని కృప మనకు ఉండగా మన ఆశీర్వాదమును అడ్డుకొనగలిగిన వారు ఎవ్వరూ లేరు.
అపవాది అనేకరకములుగా మన ఆశీర్వాదమును దొంగిలించడానికి ప్రయత్నించినాసరే దేవుని కృపను బట్టి మన ఆశీర్వాదము దొంగిలించడము వాడి తరము కాదు.
శ్రమ మన జీవితములో కలిగినప్పటికీ, మనతో ఉన్న కృపను బట్టి ఆ శ్రమను మనము జయిస్తాము. కరువులోనైనా దేవుని కృపను బట్టి తప్పించబడుతుంది. దేవుని కృప ఎంతో శక్తివంతమైనది. మనలను నిలబెట్టేది దేవుని కృపయే. అటువంటి కృపను కలిగిన నీవు ఎలా ప్రభువును వెంబడిస్తున్నావు? నీ కృప నాకు చాలును నీ కృపలేనిదే నేను బ్రతకలేను అని స్తుతించగలుగుతావా?
“దావీదుకు చూపిన శాశ్వతమైన కృప” యేసయ్య ద్వారా మనము పొందుకున్నాము. ఇప్పుడు మనతో ఆ కృప నిలిచి ఉంది. ఆ కృపను బట్టి మన ప్రతీ శ్రమలో, బాధలో, కరువులో జీవము ప్రత్యక్షపరచబడవలసినదే.
అందుకు–నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.౹ నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. -2 కొరింథీయులకు 12:9-10
“నేను ఎప్పుడు బలహీనుడనో, అప్పుడే బలవంతుడను” అని పౌలు చెప్పుచున్నాడు. “క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును” అని పౌలు చెప్పుచున్నాడు.
శ్రమ లేదా కరువు ఒక బలహీనతగా ఉంది అనుకుందాము అప్పుడు క్రీస్తు శక్తి ఆ పరిస్థితిలో మనపై నిలిచి ఉండి, ఆ పరిస్థితిలో మనకు జీవము అనుగ్రహించి, ఆ స్థితినుండి తప్పిస్తుంది.
ఈ సత్యము ఎరిగి మనము దేవుని స్తుతిద్దాము. ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాము.
ఆరాధన గీతము:
కృపామయుడా నీలోనా
వారము కొరకైన వాక్యము
ఆత్మీయమైన జీవితములో ఎదుగుటకు నీవు తీసుకొనే నిర్ణయము ఎంతో విలువైనది. అందుకే బైబిల్ చెప్తుంది, “మారుమనస్సుకు తగిన ఫలము” ఫలించుడి. ఈ వాక్యము చెప్పబడిన సందర్భము వేరైనప్పటికీ, ఈ దినము మన జీవితములో ఎలా వర్తింపచేసుకోవాలో చూద్దాము. నీవు నిజముగా దేవునిని వెంబడించడానికి దినదినము నీవు నిన్ను మార్చుకొని వెళుతున్న ప్రతిసారి ఆ మారుమనస్సుకు తగిన ఫలము పొందుకుంటావు.
ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టివాడైనందున జనులు గుంపుకూడి యుండుటవలన చూడ లేకపోయెను. -లూకా 19:1-3
ఇక్కడ జక్కయ్య యేసయ్యను చూడటానికి సిద్ధపడినవాడుగా ఉన్నాడు. యేసయ్య జక్కయ్య ఉన్న స్థలమునకు వచ్చినపుడు, జక్కయ్యా దిగి రమ్ము, నేడు నీ ఇంట ఉండవలసినది అని చెప్పగానే, సంతోషముతో దిగి వచ్చి యేసయ్యను చేర్చుకున్నాడు.
అందరు అది చూచి–ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి–ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. -లూకా 19:7-8
సుంకపు గుత్తదారులు ఎక్కువ సుంకమును తీసుకొనేవారిగా ఉండేవారు. వారి మనస్సు ధనముపై ఉంటుంది. జక్కయ్య కూడా అదేవిధముగా ధనముపై మనస్సుకలిగినవాడుగా జీవించేవాడు. అన్యాయముగానైనా సరే ధనము సంపాదించాలి అనే ఆశ కలిగినవాడుగా ఉండేవాడు. అయితే ఎప్పుడైతే యేసయ్యను అంగీకరించాడో, జక్కయ్య మనసు మార్చబడింది. ఇంతకు ముందు ధనాశ కలిగినవాడుగా ఉన్నాడు, ఇప్పుడైతే తన ఆస్తిని బీదలకు ఇచ్చినవాడుగా ఉన్నాడు.
అంతకు ముందు ధనవంతుడుగా పిలవబడ్డాడు అయితే మారుమనసును బట్టి అబ్రహాము కుమారునిగా పిలువబడుతున్నాడు. అయితే ధనవంతునిగా పిలువబడటానికి అబ్రహాము కుమారునిగా పిలువబడటానికి ఏమైనా వ్యత్యాసము ఉందా? మారు మనసుకు తగిన ఫలము ఎటువంటిదో నీవు నేను ఎరిగి ఉండాలి.
ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును – లూకా 1:75
అబ్రహాముకు దేవుడు పరిశుద్ధ నిబంధన చేసాడు. ఈ నిబంధన బట్టి తన కుమారుడైన ఇస్సాకు జీవితములో గొప్ప కార్యములు దేవుడు చేసాడు.
అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను.౹ అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై–నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము.౹ -ఆదికాండము 26:1-2
ఇస్సాకు జీవితములో ఒక కరువు వచ్చింది. ఆ దేశమును విడిచి వెళ్ళడానికి ఆలోచించినపుడు – “నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము” అని చెప్పి –
ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.౹ ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను. -ఆదికాండము 26:4-5
ఇస్సాకు ఉన్న కష్టకాలములో తండ్రితో చేసిన నిబంధన, దేవుని కార్యము జరిగించే విధముగా సిద్ధపరచినది. ఇస్సాకుకు కావలసిన ఆశీర్వాదము కొరకు అబ్రహాము కావలసినదంతా నెరవేర్చాడు. దానిని బట్టి ఒక నిబంధన నియమించబడింది. ఆ నిబంధన ప్రకారము మారు మనస్సు పొందిన జక్కయ్యకు ఒక ఫలము ఉంటుంది.
ప్రభువు వాక్యము ఫలానా విధముగా చెయ్యవద్దు అని చెప్పింది. దాని ప్రకారము మార్చుకుని నిన్ను నీవు సరిచేసుకొన్నపుడు, ఆ వాక్యమునకు లోబడటానికి నీవు సిద్ధపడినపుడు ఆ మారుమనసుకు తగిన ఫలము ఉంటుంది. నీవు మార్చుకున్న ప్రతీ సారీ ఆ మారుమనస్సుకు తగిన ఫలము ఉంటుంది.
అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును.౹ అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతినిబట్టి అతడు బ్రదుకును.౹ -యెహెజ్కేలు 18:21-22
ఇంతకు ముందు దుష్టుని ఆలోచన చొప్పున నడిచినప్పటికీ, దానిని విడిచిపెట్టి దేవుని మాట ప్రకారము మారు మనసు పొంది, సరిచేసుకుని నిన్ను నీవు సిద్ధపడ్డప్పుడు ఖచ్చితముగా “జీవింపచేయబడటము” అనే ఫలము పొందుకుంటావు.
మరణము అంటే మన సంతోషమును దూరముచేసే ప్రతీ నెగటివ్ పరిస్థితిగా చూడవచ్చు. మనము మారుమనస్సు పొంది ఆ ప్రకారము నడుచుకున్నపుడు, ఆ ప్రతీ నెగటివ్ పరిస్థితి మార్చబడుతుంది.
అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతినిబట్టి అతడు బ్రదుకును.౹ -యెహెజ్కేలు 18:22
నీవు నేను మారుమనస్సు పొందినపుడు ఇంతకు ముందు మనము చేసిన అపరాధము, పాపము ఒకటి కూడా జ్ఞాపకము చేసుకోను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ మారు మనస్సు అంటే, పాపి పొందే మారు మనస్సు ఒక్కటే కాదు గానీ, దేవుని వాక్యము విని, ఆ వాక్యము ప్రకారము సరిచేసుకుని ఆ పరిస్థితిలో ఆ మార్పు కనపరచుట.
“అతని నీతినిబట్టి అతడు బ్రదుకును”. అయితే మన నీతి మన యేసయ్యే. మనము ఆయన శరీరమును రక్తమును స్వీకరిస్తున్నపుడు ఆయన నీతి మనకు దయచేయబడుతుంది.
దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹ -యెహెజ్కేలు 18:23
అంటే నీవు నేను మనసు మార్చుకుని దేవుని వెంబడించాలి అని సిద్ధపడిన ప్రతీ సారీ దేవుడు సంతోషిస్తున్నాడు. ఈ సత్యము మనము గ్రహించాలి. దేవుని మాటల ప్రకారము మనము నడుచుకున్న ప్రతి సారీ, నిన్ను సృష్టించిన తండ్రి సంతోషిస్తున్నాడు. ఆయన సంతోషముగా ఉన్నపుడు ఏమి జరుతుంది అంటే?, “ఇదిగో ప్రియమైన కుమారుడు” అని దేవుడు సాక్ష్యము ఇచ్చేవాడుగా ఉంటున్నాదు.
అపవాది అనేకమైన ఆలోచనలు ఇస్తాడు, అవే దుష్టుని ఆలోచనలు. యవ్వనస్తులకు ఎక్కువ ఆలోచనలు వస్తాయి. అపవాది కూడా పడగొట్టడానికి ప్రయత్నించేది కూడా వారినే. నీకు వచ్చే ఆలోచన దేవుని మహిమకరము కాకపోతే, దాని విడిచిపెట్టి వెళ్ళినపుడు, “నా సేవకుడైన నా కుమారుని చూసావా” అని దేవుడు సాక్ష్యము చెప్పుతాడు.
అపవాది ఆలోచన పుట్టించినా సరే, దేవుని వాక్యమును బట్టి నీవు ఆ ఆలోచనను తోసివేసి, దేవుని వాక్యము ప్రకారము నీవు నిలబడితే, దేవుడు సంతోషిస్తాడు.
దేవుడు అలా మనకొరకు సాక్ష్యము పలకగానే, మనలో పరిశుద్ధాత్మదేవుడు నివాసము ఉంటాడు. అప్పుడు మన జీవితము వెలుగు మయమై ఉంటుంది.
నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. -కీర్తనలు 1:6
నీవు మారుమనసు పొంది ఆ ప్రకారము నడుచుకుంటే, నీ మార్గము యెహోవాకు తెలియును. అనగా, దేవుడు ఉద్దేశ్యము ప్రకారముగానే నీ జీవితము ఉంటుంది అని అర్థము. ఆయన ఉద్దేశ్యము ప్రకారము నీ జీవితము కట్టబడుతుంది.
అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును. -కీర్తనలు 1:3
మారుమనసుకు తగిన ఫలము, ఏమిటి అంటే – “తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును”. అంటే ఫలభరితమైన జీవితమును నీవు కలిగి ఉంటావు. అంటే నీ జీవితములో ఏ సమ్యములో ఏది జరగాలో అదే జరిగేదిగా ఉంటుంది.
అందుకే ఒక ఆలోచన పుట్టగానే, అది దేవుని వాక్యనుసారమా కాదా అనే పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ అది దేవునికి మహిమకరము కాకపోతే, ఆ ఆలోచనను త్రుంచివేయాలి. “ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను” అని యేసయ్య గూర్చి చెప్పబడింది.
నీవు నేను మారుమనసు పొంది ఆ ప్రకారము జీవిస్తే, మన జీవితమే కాక, మనలను బట్టీ అనేకులు ఆ ఫలమును అనుభవించేగలుగుతారు. అందుకే మనము వాక్యమును మాత్రమే వెంబడించాలి అనే ఆశ కలిగి ఉండాలి. ఆకువాడక అంటే, నీ జీవితములో ఎండిన స్థితి ఉండదు. నీవు తీసుకొనే నిర్ణయము ఎంతో విలువైనది.