ఆరాధన వర్తమానము
మనలను ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మనలను సృష్టించింది, నియమించింది తన మహిమ కొరకే. దేవునిని స్తుతించుట మంచిది అని వాక్యము చెప్తుంది. ఆయనను స్తుతించుటలో ఉన్న గొప్ప శక్తి భూలోకమందు స్థిరపరచబడుతుంది.
స్తుతించుట అంటే దేవుని నామమును ఒప్పుకోవడమే! ఏమైతే ఒప్పుకుంటున్నామో ఆ సత్యమే మన జీవితములో, పరిస్థితిలో స్థిరపరచబడుతుంది. ఉదాహరణకు ఆయన శక్తిమంతుడు అని ఒప్పుకుంటే, ఆయన శక్తి మన జీవితములో స్థిరపరచబడుతుంది.
యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము. -కీర్తనలు 18:1-2
ఈ మాటలు కీర్తనాకారుడు ఏ సందర్భములో చెప్పుచున్నాడు అని ఆలోచిస్తే –
మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీదపడి బెదరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను -కీర్తనలు 18:4-5
ఆయనే తన సన్నిధికి మనలను ఆకర్షించినవాడై, తన యొక్క శక్తి మన జీవితములో చూపించుటకు మనకు అవకాశము ఇచ్చాడు. మన స్థితిగతులు ఎలా ఉన్నా సరే, మనము దేవునిని స్తుతించాలి. మన ఆత్మకు కాపరిగా మన దేవుడు ఉన్నాడు.
పౌలు సీలలను కొట్టి చెరసాలలో బంధించినపుడు వారు దేవునిని కీర్తించి స్తుతించారు. మన పరిస్థితులు సుఖముగా ఉన్నా, దుఃఖముతో ఉన్నా సరే మనము స్తుతించాలి. ఉదయకాలములో ఒక మాట తెలియచేయబడింది. నీవు ఏ విషయములో నీవు మారుమనసు పొందుతున్నావో, ఆ విషయములో నీవు ఆశీర్వదించబడతావు. మరి స్తుతించుట కూడా ఆత్మీయమైన కార్యమే గనుక, నీవు స్తుతించినపుడు ఖచ్చితముగా నీవు ఆశీర్వదించబడతావు.
దేవుడు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశము మనము సద్వినియోగము చేసుకుందాము. నీతిమంతుని జీవితము దేవుని యందలి విశ్వాసము చేతనే కొనసాగుతుంది. మనము దేవుని స్తుతించినపుడు ఆయనను నమ్మి స్తుతిస్తున్నాము. అనగా ఆయన యందు విశ్వాసము కనపరుస్తున్నాము. అలా విశ్వాసము మనము కనపరచినపుడు, మన పరిస్థితి మార్చబడుతుంది.
దేవుని శక్తి కనపరచునట్లుగా ఈ దినము ఇవ్వబడింది. దేవుని ఆశీర్వాదము కుమ్మరించబడునట్లు నీకు అవకాశము ఇవ్వబడింది. నీవు విశ్వాసము కనపరచునట్లు మరొక అవకాశము ఇవ్వబడింది.
నీవు భౌతికముగా జీవించడానికి ఆహారము తింటున్నావు. అయితే ఆ ఆహారము ఎలా అది నీ శరీరమునకు శక్తిని ఎలా ఇస్తుందో నీకు తెలుస్తుందా? అయితే ఆ శక్తి యొక్క ప్రభావము నీకు తెలుస్తుంది. అలాగే నీవు విశ్వాసము ఉంచి ప్రకటన చేసినపుడు, నీకు తెలియకపోయినా సరే, దేవుని శక్తి నీ జీవితములో కనపరబడుతుంది.
నీవు ఎలా అయితే ఆహారము తిన్న ప్రతిసారీ ఎలా అయితే నీ శరీరమునకు శక్తి అందించబడుతుందో, అలాగే నీవు స్తుతించిన ప్రతిసారీ, దేవుని ఆశీర్వాదము స్థిరపరచబడుతుంది. నీ జీవితములో ఉన్న ఆ వ్యతిరేక పరిస్థితి మార్చబడటానికే నీవు సజీవులలెక్కలో ఉన్నావేమో, ఈరోజు నీవు చేసే స్థితి, ఆ వ్యతిరేక స్థితి మార్చబడుటకు కావలసిన శక్తిని ప్రత్యక్షపరస్తుంది. ఈరోజు నీవు చేసే స్తుతి ఆరాధన రాబోయే దినములలో, నీ జీవితమును స్థిరపరస్తుంది.
దేవుడు మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి అని యోహాను జ్ఞాపకము చేస్తున్నాడు. దేవుని ప్రేమ నీవు జీవింపచేయబడునట్లు ఆయన సన్నిధిలోనికి నడిపించింది. ఆయన సన్నిధిలో నీవు ఆయనను స్తుతించులాగున సిద్ధపరచింది. దానిని బట్టి, నీవు తప్పించబడవలసిన చోట నీవు తప్పించబడతావు, రక్షించబడవలసిన చోట నీవు రక్షించబడతావు.
దేవుని సన్నిధికి రాకుండా అపవాది అనేక ప్రయత్నములు చేస్తాడు. దేవుని కృప లేకుండా మనము దేవుని సన్నిధిలో ఉండలేము. గనుక మనము మన హృదయములను పరీక్షించుకుని ఆయనను ఆరాధిద్దాము.
ఆరాధన గీతము:
ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా
వారము కొరకైన వాక్యము
ఆత్మీయ జీవితమంటే చాలా మందికి బైబిల్ చదవడము, చర్చ్ కి వెళ్ళడము, చెడు చెయ్యకపోవడం మాత్రముగానే ఉంటుంది. అయితే అది పునాది మాత్రమే. పౌలు మనవంటి మనిషే, అయినప్పటికీ, మూడవ ఆకాశమునకు వెళ్ళాడు. యోహాను ఆత్మ యందు పరలోకమును చూసి వచ్చాడు. ఆయన భవిష్యత్తులో జరగబోయే విషయాలుగా ఆయన చూసి రాసిన విషయములు ఇప్పుడు నెరవేరుతున్నాయి. మనము రాకడ సమయములో ఉన్నాము, యేసయ్య రాజుగా రానై ఉన్నాడు.
యూఫ్రటిస్ నది ఎండిపోయిన పరిస్థితి చూస్తే, యేసయ్య రాకడ ఎంత దగ్గరగా ఉందో మనకు తెలుస్తుంది. యూఫ్రటిస్ నది ఎండిపోయిన తరువాత, నాలుగు ఆత్మలు విడిచిపెట్టబడతాయి. వాటి వలన మూడవ వంతు మనుష్యులు చనిపోతారు అని వ్రాయబడింది. ఇన్ని సూచనలు జరుగుతున్నా సరే, పట్టింపులేక ఉన్నట్టయితే అది ఎంతో భయంకరము. అయితే మనము మాత్రము మన ఆత్మీయమైన జీవితమును సరిచేసుకుందాము. దయచేసి అలక్ష్యముగా ఉండవద్దు. మనకు ఇవ్వబడిన రక్షణ గట్టిగా పట్టుకుని కొనసాగుదాము.
మీరు గొఱ్ఱెలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు. -1 పేతురు 2:25
మన ఆత్మయే ప్రభువు దగ్గరకు వెళ్ళేది. ఇప్పుడున్న పరిస్థితిలో మనము కృంగిపోయే పరిస్థితిలో ఉన్నాసరే, మన ఆత్మకు కాపరిగా ఉన్న ఆయన ఏమి చేస్తాడో ఈరోజు మనము తెలుసుకుందాము. ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు నాశనము అనేది అసాధ్యము.
పోరాటము అంటే మనము ఒక్క అడుగు ముందుకేస్తే, నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళే పరిస్థితి. నీవు ఒక్క దెబ్బ వేస్తే, శత్రువు నాలుగు దెబ్బలు వేస్తాడు. అయినా సరే నీవు నిలబడి ఉంటేనే పోరాటములో ఉన్నట్టు. అయితే అటువంటి పోరాటములో దేవుడు జ్ఞాపకము చేస్తున్న సత్యము – “నేను నీ ఆత్మకు కాపరిని”.
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. -కీర్తనలు 23:1
ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. -ప్రకటన 7:17
ఈ మాట నిజముగా గ్రహించినపుడు మనమున్న పరిస్థితిలో ఎంతో నిరీక్షణ కలుగుతుంది. బాష్పబిందువు అంటే ఒక చిన్న కన్నీటి బొట్టు. దేనిగురించి అయితే నీవు బాధలో ఉన్నావో, దేని గురించి కన్నీరు కారుస్తున్నావో, ఆ బాధ తీరునట్లు అవసరమైన దానివద్దకు దేవుడు నడిపిస్తాడు.
ప్రతీ భాష్పబిందువు అనేది, ప్రతీ చిన్న సమస్యగా మనము చూడవచ్చు. మనకు కనిపించే సమస్యలే కాక, తరువాత రాబోయే సమస్యలనుండి మనలని తప్పించి జీవము వైపు నడిపేవాడు మన ఆత్మల కాపరి. అందుకే నీకు ఎదురైన ప్రతి దానిలోనుండి నీవు తప్పించుకుంటావు. దేవుని సన్నిధిలో నీవు యదార్థముగా నిలబడ్డప్పుడు దేవుడు ఖచ్చితముగా మాటలాడతాడు. ఆయన తప్ప మనకు ఎవరూ ఆధారము కాదు.
ఇదే మాట దావీదు మాటలలో చూస్తే,
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. -కీర్తనలు 23:1-2
శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు అని దావీదు చెప్పుచున్నాడు. అయితే జీవ జలముల బుగ్గల వద్దకు యేసయ్య నడిపేవాడుగా ఉంటున్నాడు. దావీదుకు ఎప్పుడూ కూడా శత్రుభయముతోనే కొనసాగించబడింది. అయితే మనకు మన జీవితములో జీవము కావాలి.
బుగ్గ అంటే ఎప్పుడూ ఊరేది. అనగా ఈరోజు ఉన్న సమస్యను తీర్చడము మాత్రమే కాదు గానీ, రాబోయే సమస్యను కూడా తీర్చగలిగినది.
అయితే గొఱ్ఱెలవలె ఆయన తన ప్రజలను తోడు కొనిపోయెను ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయనవారిని నడిపించెను -కీర్తనలు 78:52
అరణ్యము అనగా ఏ సహాయము అందించబడని స్థలము. అంటే ఏ సహాయము అందించబడని స్థితిలో నేను నిన్ను నడిపిస్తాను, నేనే సహాయకుడుగా ఉంటాను అని చెప్పుచున్నాడు. ప్రభువు యొక్క సహాయము అనేది సూపర్నేచురల్ సహాయముగా ఉంటుంది.
మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలోనుండి నా గొఱ్ఱెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను; అవి అభివృద్ధిపొంది విస్తరించును.౹ -యిర్మీయా 23:3
దేవుడు తోలివేసాడు, దేవుడే పంపించివేసాడు అంటే ఏమిటి? మనము దేవునికి వ్యతిరేకముగా ఉన్నపుడు చాలా విషయములు మనము కోల్పోయినవారిగా ఉంటాము.
వారు–రండి మన దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించు వాడు గదా; నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు.౹ మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము.౹ -యిర్మీయా 5:24-25
మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. మన ఆశీర్వాద క్రమము మన పాపములను బట్టే కోల్పోయాము అని, ఈ మాటను బట్టి మనకు అర్థము అవుతుంది. అంటే మన ఆడవడిని బట్టి ఏ ఆశీర్వాదమును కోల్పోయామో, ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టి మరలా నీవు ఉండవలసిన స్థానములో నిన్ను పెట్టేవాడుగా ఉంటాడు.
మన అజ్ఞానము చేత మనము పోగొట్టుకున్నవి, మన కాపరిగా ఉన్న యేసయ్య మరలా తిరిగి ఇస్తాను అని ఎందుకు చెప్పుచున్నాడు. ఇప్పుడు మనము పొందుకున్నదానిని బట్టి ప్రభువును స్తుతిస్తాము. పొందుకోబోయేదానిని బట్టి ప్రభువుని స్తుతిస్తాము. అలాగే నీవు పొందుకోలేక పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకొని ప్రభువుని స్తుతించాలి. అనగా ఏ రకముగానైనా నీ ఆత్మను కృంగనియ్యడు.
ఇటువంటి అనుభవములో నీవు దేవుని మంచితనము అనుభవించగలుగుతాము. దేవుని అనుభవము లేకుండా మనము దేవుని గూర్చి చెప్పలేము. పెదాలతో చెప్పేది కాదు గానీ, రుచి చూసి యెరిగి స్తుతించుటను బట్టి దేవునికి సంపూర్ణమైన మహిమ కలుగుతుంది. నీ పరిస్థితి మార్చగలిగిన శక్తి కలిగినవాడు నీ కాపరి. నా గొర్రెలు నా స్వరమును వినును అవి నన్ను వెంబడించునూ అని ఆయన చెప్పాడు.
1. జీవజలముల యొద్దకు నడిపించేవాడు.
2. సహాయము అందించబడని పరిస్థితిలో సహాయము అందించేవాడు.
3. నీ గతములో నీవు కోల్పోయినది నీ కాపరి తిరిగి ఇచ్చేవాడు. నీ వర్తమాన, భవిష్యత్తుకు కావలసినది సమకూర్చేవాడు.