స్తోత్రగీతము – 1
ఆరాధించెదను నిన్ను
నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2)
ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2)
||ఆరాధించెదను||
నీ జీవ వాక్యము నాలో
జీవము కలిగించె (2)
జీవిత కాలమంతా
నా యేసయ్యా నీకై బ్రతికెదను (2)
||ఆరాధించెదను||
చింతలన్ని కలిగిననూ
నిందలన్ని నన్ను చుట్టినా (2)
సంతోషముగ నేను
నా యేసయ్యా నిన్నే వెంబడింతును (2)
||ఆరాధించెదను||
స్తోత్రగీతము – 2
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నేను నమ్మిన నా యేసుడు
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నాకు దొరికిన నా యేసుడు (2)
మాటలలో చెప్పలేనంత
చేతలలో చూపలేనంత (2)
చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు
చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు (2)
||చాలా||
నా పాప శిక్షను తాను మోసెను
నా కొరకు కలువారిలో త్యాగమాయెను (2)
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం (2)
||మాటలలో||
యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు
జగమంతా వెదకినా కానరారులే (2)
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం (2)
||మాటలలో||
ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు
వింతైన ప్రేమ అంతు చిక్కదు (2)
కలువరిలో చూపిన ప్రేమ
శాపమునే బాపిన ప్రేమ (2)
||మాటలలో||
ఆరాధన వర్తమానము
దేవుని యొక్క కృప ఎప్పుడు మనలను వెంబడిస్తుంది. ఆ కృప మనతో ఉన్నంతకాలము కూడా మన జీవితాలలో ఆశీర్వాదముల వెంబడి ఆశీర్వాదములు చూసేవారముగా ఉంటాము. మన జీవితము శ్రేష్టకరమైన జీవితము. ఈ జీవితము ఆయనను బట్టియే మనకు అనుగ్రహించబడినది.
సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. -1 తిమోతికి 1:17
మన దేవుడు రాజై ఉన్నాడు. ఆ రాజైనవాడు యుగయుగములకు మనకు రాజై ఉన్నాడు. అంతే కాక యుగయుగములు ఘనత, మహిమ కలుగును గాక! అటువంటి రాజు ఎటువంటివాడో చూద్దాము.
యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.౹ ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.౹ -1 దినవృత్తాంతములు 29:11-12
మనకు రాజుగా ఉన్న దేవుడు మనము కలిగి ఉన్న సమస్తము మీద రాజుగా ఉన్నాడు. సకల యుగములు అనగా, మంచి స్థితిలో మరియు కష్ట స్థితిలోను అని అర్థము. అంతే కాక మన దేవునికి సమస్తము సాధ్యమే. మన కష్ట స్థితిలోను మనకు తోడై ఉండి ఆ స్థితిని మార్చగలిగినవాడు.
దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై యున్నాడు దేవుడు తన పరిశుద్ధిసంహాసనముమీద ఆసీనుడై యున్నాడు. జనముల ప్రధానులు అబ్రాహాముయొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారు. భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయెను. -కీర్తనలు 47:6-10
“భూనివాసులు ధరించుకొను కేడెములు” అంటే, ఈ లోకములో రక్షించబడుట అనేది దేవుని బట్టియే జరుగుతుంది. మన జీవితములో అవసరమైన సమస్తము సింహాసనాసీనుడైన వాని యొద్దనుండియే మనకు కలుగును. మన జీవితములో మనము ఇంతవరకు పొందిన సమస్తము ఆయనను బట్టియే మనకు లభించినవి. అలాగే మన దగ్గర లేని వాటి విషయములోనూ, మన వల్ల కాని విషయములలోనూ, సింహాసనాసీనుడైనవానిని బట్టి మన జీవితములో సమకూరేవిగా ఉన్నాయి.
ఆరాధన గీతము
నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2)
రాజులకే……… మహారాజవు
కృపచూపే…….. దేవుడవు
నడిపించే……… నజరేయుడా
కాపాడే……….. కాపరివి (2)
శ్రమలలో – బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను
వాక్యమే – కృపావాక్యమే – నను వీడని అనుబంధమై (2)
నీమాటలే – జలధారాలై – సంతృప్తి నిచ్చెను
నీమాటలే – ఔషధమై – గాయములు కట్టెను
నీ మాటే మధురం
రాజులకే……… మహారాజవు
కృపచూపే…….. దేవుడవు
నడిపించే……… నజరేయుడా
కాపాడే……….. కాపరివి
మేలులకై – సమస్తమును – జరిగించుచున్నావు నీవు
ఏదియు – కొదువ చేయవు – నిన్నాశ్రయించిన వారికి (2)
భీకరమైన కార్యములు – చేయుచున్నవాడా
సజీవుడవై – అధిక స్తోత్రము – పొందుచున్నవాడా
ఘనపరుతును నిన్నే
ప్రేమించే ………………యేసయ్యా
నీవుంటే ……………….చాలునయా
నడిపించే …………….. నజరేయుడా
కాపాడే …………………కాపరివి
సంఘమై – నీ స్వాస్థ్యమై - నను నీ యెదుట నిలపాలని
ఆత్మతో – మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2)
వరములతో – ఫలములతో – నీకై బ్రతకాలని
తుదిశ్వాస – నీ సన్నిధిలో – విజయం చూడాలని
ఆశతో ఉన్నానయా
కారుణించే………యేసయ్యా
నీ కోసమే…….. నా జీవితం
నిను చేరే ఆశయం తీరాలయ్యా
నిను చూసే………. ఆక్షణం. రావాలయ్యా
మెయిన్ మెసేజ్
వాక్యమే మన జీవితాలను కట్టేది, స్థిరపరచేది. అందుకే మనము వాక్యము పై ఆధారపడి జీవించాలి. మన దేవుడు అదృశ్యలక్షణములు కలిగినవాడు, మనకొరకు ఆయన చేసే కార్యములు మన వెనుక జరుగుతూనే ఉంటాయి. అందువలననే మన జీవితములు సురక్షితముగాను, సుఖముగాను నడిపించబడుతున్నాయి.
ఈరోజు మన ధ్యానము, “ఆశ ఉంది కానీ… “. మనలో ప్రతీఒక్కరికీ చాలా దేవుని విషయములలో, ఆత్మీయమైన ఎదుగుదలలోను, కుటుంబజీవితములో ఆశీర్వాదముల కొరకు ఆశ ఉంటుంది. అయితే ఆ ఆశ నెరవేర్చబడుతుందా లెదా అనేది మనకు మనమే ప్రశ్నించుకుని, ఒకవేళ నెరవేరకపోతే, ఎందుకు నెరవేరట్లేదు అనే సంగతి నేర్చుకుందాము.
అయితే లేఖనము ఏమి చెప్తుంది అంటే, “ఆయన ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచువాడు”. మరి మన జీవితాలలో ఆ మాట స్థిరపరచబడక పోవడానికి కారణము ఏమిటి?
యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టివాడైనందున జనులు గుంపుకూడి యుండుటవలన చూడ లేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. -లూకా 19:3-4
జక్కయ్యకు యేసయ్యను చూడాలనే ఆశ కలిగి, యేసయ్య రాకమునుపే ఆ ప్రదేశములోనికి వచ్చి వేచి ఉన్నాడు. అయితే తాను పొట్టివాడైనందున ఆ జనసమూహమును దాటి చూడలేకపోతున్నాడు. తనకు కలిగిన “అవిటి తనము”, “ఆటంకము” అడ్డుగా వచ్చాయి. మన జీవితములో కూడా జక్కయ్యవలే ఆశ కలిగి ఉన్నప్పటికీ, మన “అవిటితనము” అడ్డుగా ఉంది. ఏమిటి ఆ అవిటితనము? అది ఏమిటి అనేది మనము కనుగోవాలి. ప్రతి ఒక్కరి జీవితములో రెండు విషయాలు ఉంటాయి వాటిలో అవిటితనము కనబరచేవారముగా ఉంటాము. అవి ఏమిటో చూద్దాము.
రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు–ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి – ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను. వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. -మత్తయి 14:25-31
నీళ్ళ మీద నడుస్తున్న యేసును చూసి శిష్యులు భూతమనుకుని భయపడ్డారు. అయితే యేసయ్య, “నేనే భయపడకుడి” అని చెప్పారు. అప్పుడు పేతురు, “నీవే అయితే నీళ్ళపై నడచి నీ యొద్దకు వచ్చుటకు సెలవిమ్ము” అని అడిగాడు. మొదట భూతమని భయపడిన వ్యక్తి, యేసయ్య మాట వినగానే, ఆయన మాట ప్రకారము వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అయితే ఒక విషయము మనము జ్ఞాపకము చేసుకోవలసినది ఏమిటి అంటే, నేనే యేసును అని నిర్ధారణ యేసయ్య ఇవ్వలేదు. అయినప్పటికీ, యేసయ్య మాటను నమ్మి, అది యేసయ్యే అని నమ్మి పేతురు నీళ్ళలో దిగడానికి సిద్ధపడ్డాడు. అంటే, “యేసయ్యను పోలి అసాధారణమైన కార్యము జరిగించడానికి”, పేతురు ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఆశకలిగిన ప్రాణమును తృప్తి పరచేవాడు గనుక ఆయన రమ్మన్నాడు. వెంటనే పేతురు నడవగలిగాడు. అనగా ఆయన “ఆశ” తీరడము ప్రారంభమయ్యింది. అయితే,
గాలిని చూచి భయపడి మునిగిపోసాగి – ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను. -మత్తయి 14:30
దీనికి కారణము ఏమిటి అని ఆలోచిస్తే, “సందేహపడుట”. ఆశ పడినప్పటికీ, “సందేహపడుట” అనే అవిటితనము అతనిలో ఉండుటను బట్టి అతని ఆశ తీరలేకపోయింది.
అయితే జక్కయ్య విషయములో చూస్తే, తన శారీరకమైన అవిటితనమును అధిగమించి తన “ఆశ” కొరకు అక్కడ ఉన్న మేడి చెట్టును ఆసరాగా చేసుకొన్నాడు. అనగా మనము కూడా మన ఆశ తీరకుండా అడ్డుపడుతున్న “అవిటితనమును” అధిగమించకుండా “ఆశ” తీరదు. జక్కయ్య అయితే మేడి చెట్టు సపోర్ట్ తీసుకున్నాడు, అయితే పేతురు సపోర్ట్ తీసుకోలేకపోయాడు. ఏమి సపోర్ట్ తీసుకోవాలి? దేవుని శక్తి మీద విశ్వాసము యొక్క సపోర్ట్ తీసుకోవాలి. అయితే సందేహము ఎలా వస్తుంది? మన చుట్టూ ఉన్న పరిస్థితులు అసాధ్యముగా కనబడుటను బట్టి సందేహము కలిగుతుంది. అయితే అబ్రహాము జీవితములో చూస్తే, ఒంటరిగా అడుగువేసాడు కానీ, ఆ అడుగులు కొనసాగించబడుతుండగా పెక్కుమంది అయ్యెను. ఆశ కలిగి, సందేహములేకుండా ముందుకు వెళ్ళడము బట్టే మన జీవితములలో ఆశ నెరవేరుతుంది.
పేతురును చూస్తే, అనేకమైన అనుభవములు యేసయ్యను గూర్చి ఎరిగినవాడు. నీళ్ళు ద్రాక్షారసముగాను, అయిదు రొట్టెలు రెండు చేపలు విస్తారముగా చేసిన సందర్భములు జ్ఞాపకము చేసుకొని ఉంటే, ఆ సందేహమును జయించేవాడుగా ఉండేవాడు. “సందేహము” అనేది ఆశ నెరవేర్చబడకుండా అడ్డుపడే అవిటితనము. ఎప్పుడైతే ఈ సందేహము మనకు కలుగుతుందో, అప్పుడు మనము వాక్యము యొక్కయూ, ఇంతకు ముందు జరిగించిన కార్యమును యొక్కయూ ఆసరా మనము తీసుకొని నిలబడాలి.
–నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.౹ –నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.౹ మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడైయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,౹ అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక౹ దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.౹ -రోమా 4:18-21
అబ్రహాము జీవితములో కూడా తన శరీర బలహీనతను బట్టి అవిశ్వాసమూలమైన ఆలోచన కలిగినప్పటికీ, “వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు” అనే సత్యమును, అనుభవమును ఆసరాగా చేసుకొని, తన అవిటితనమును జయించాడు. “అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక౹ దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను”. మనకు కూడా నెగటివ్ ఆలోచనలు ఖచ్చితముగా కలుగుతాయి అయితే మనకు వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి ఆ నెగటివ్ ఆలోచనలను జయించాలి.
యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి–జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా -లూకా 19:5
ఆశకలిగి, అవిటితనమును అధిగమించినపుడు ఏమి జరుగుతుంది అనే విషయము ఈ వాక్యములో మనము నేర్చుకోగలము. “యేసు ఆ చోటికి వచ్చినపుడు” అనగా దర్శన కాలములో జక్కయ్యను దాటిపోలేదు. మన జీవితములో కూడా, “అవిటితనమును” అధిగమించి ఆశ నెరవేరుటకు సిద్ధపడిన నీ జీవితములో, నీ ఆశ నెరవేరకుండా ఆయన నిన్ను దాటిపోడు. అంతే కాక, పరలోకములో ఏ చిత్తమైతే లిఖించబడిందో, ఆ చిత్తమంతా నీ జీవితములో నెరవేరుతుంది.
అనేకమైన సందర్భములలో ఈ అవిటితనమును అధిగమించలేని కారణముచేత దేవుని చిత్తమును పోగొట్టుకునేవారిగా ఉంటున్నాము. అయితే ఈరోజు విన్న వాక్యము ప్రకారము సరిచేసుకుని, సందేహమనే అవిటితనమును అధిగమించి, దేవుని చిత్తము మన జీవితములో నెరవేర్చుకుని, మన ఆశ నెరవేర్చుకుని ఆయనను మహిమ పరచుదాము.