ఆరాధన వర్తమానము
మన అందరిని తన సన్నిధిలో నిలబెట్టిన దేవునికే మహిమ ఘనత కలుగును గాక. మన దేవుని ప్రేమ విడువనిది, ఎడబాయనిది. అటువంటి ప్రేమ మనపై ఉన్నంతవరకు, అపవాది ఎన్ని ప్రయత్నములు చేసినా దేవుని ప్రేమ మనలను కాచేదిగా ఉంది. మనము అగ్నిగుండములవంటి పరిస్థితులైనా, సింహపు బోనులో ఉన్న పరిస్థితులైనా మన దేవుని ప్రేమ మనలను విడువనిది.
విశ్రాంతి దినమున తన పిల్లలు తన సన్నిధిలో చేరి తన ప్రేమను అనుభవించాలి అనేది మన పరలోకపుతండ్రి ఆశ కోరిక. ఆ దేవుని ప్రేమను బట్టి మన జీవితములో తన కృపను విడుదల చేయులాగున, మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించులాగున ఆయన సన్నిధిలో మనము ఉండాలి.
ఆరాధించు వారు సత్యముతోను, ఆత్మతోను స్తుతించాలి. ఆయన నీ జీవితములో ఏమై ఉన్నాడో నీవు గ్రహించినపుడే నిజమైన ఆరాధన చేయగలుగుతావు. ఈ దినము నీవు ఆయన సన్నిధిలో ఎలా ఉండగలుగుతున్నావు అని ఆలోచిస్తే, ఆయన నిన్ను ఎన్నిక చేసుకున్నాడు గనుకనే. అయితే నీవు గొప్పవాడివనో, గొప్ప లక్షణములు కలవాడివనో కాదు గానీ, తన ప్రేమన్ను బట్టి నిన్ను నీవు గర్భములో పడకమునుపే ఎన్నిక చేసుకొన్నాడు.
ఈ దినము మనము ఎందుకు దేవునిని స్తుతించాలి అనే సంగతి చూస్తే, ఆయన కోసమే మనలను సృష్టించారు.
నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే. -యెషయా 43:7
ఇంత మంది జనములలో నేనే ఎందుకు? అనే ప్రశ్న వేసుకొన్నపుడు,
మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. -రోమా 8:30
నీవు దేవునిని మహిమ పరచడానికి ఎన్నిక చేయబడ్డావు, ఆయనను బట్టియే నీ యొక్క విలువ ఉన్నది. అందుకే నీవు ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి. అంతే కాదు గానీ, నిర్ణయించబడిన వారి జీవితములోనే, పిలువబడుట, నీతిమంతులుగా తీర్చబడుట మరియు మహిమపరచబడుట అనే సంగతులు జరుగుతున్నాయి.
ఆయన–ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి– ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. అందుకాయన–పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా -మత్తయి 15:24-26
మొదట ఇశ్రాయేలీయుల వద్దకు ఆయన పంపబడ్డాడు. ఇశ్రాయేలీయుల ఇంటివారై నశించిన వారి యొద్దకే అని చెప్పుచున్నాడు. అంటే అర్థము ఏమిటి? ఆయన పిల్లలుగా చేయబడినవారే మొదట ఆశీర్వదించబడాలి. అనగా నిర్ణయించబడిన వారి జీవితములలోనే ఆయన ఘనకార్యములు జరగాలి అనేది ఆయన ఆశ. అందుకే యేసయ్య ఉంటే మన జీవితములో అన్నీ ఉన్నట్టే! ఎందుకంటే యేసయ్య సమృద్ధియైన జీవాన్ని కలుగచేసేవాడు, ఆయనే మార్గమై ఉన్నాడు, బుద్ధిజ్ఞాన సర్వసంపదలు యేసయ్యలోనే గుప్తమై ఉన్నాయి.
ఇశ్రాయేలు ప్రజలు అరణ్యమార్గములో వెళుతున్నపుడు వారి బట్టలు చిరిగిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. మన జీవితములు యేసయ్యలోనే కొనసాగించబడాలి అప్పుడు ఇటువంటి అద్భుతమైన అనుభవము మనము కూడా కలిగిఉండగలుగుతాము.
నిన్ను నిర్ణయించినవాడు, నిన్ను కొనసాగించువాడు, నిన్ను సాక్షిగా నిలబెట్టేవాడు కూడా ఆయనే!
ఏమీ లేని వాడు ముప్పదంతలుగా ఎదిగినపుడు సంతోషిస్తాడు. ఎప్పుడూ అదే ముప్పదంతలలోనే ఉండిపోతే, వాడు అదేవిధానములో స్తుతించలేదు. అయితే నీ జీవితములో ఆయన మహిమపరచబడాలి, గనుక నిన్ను అక్కడనుండి అరువదంతలుగాను, నూరంతలుగాను అభివృద్ధి పరచడానికి నీవు నిర్ణయించబడ్డావు. నూరంతలుగా నీవు ఎదిగినతరువాత, నీ గిన్నె నిండిపొర్లిపోయే అనుభవములోనికి వస్తావు.
ఆరాధన గీతము
నీ కృపయే కావలెను
వారము కొరకైన వాక్యము
మన దేవుడు ఆశీర్వదించేవాడు గా ఉన్నాడు. తన బిడ్డలను ఎప్పుడూ దీవించేవాడు. మన దేవుడు సమస్తము తన బిడ్డలకు అనుకూల పరిచేవాడు. ఆయన పలికిన ప్రతీ మాటలో నీకు క్షేమమే దాగి ఉంది. అయితే ఆయన మనకై దాచిన దీవెనలన్నీ ఏమైపోతున్నాయి?
–వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను. పక్షులువచ్చి వాటిని మ్రింగివేసెను. -మార్కు 4:3-4
విత్తనము అనేది జీవముతో కూడినది అయి ఉన్నాది. ఈ జీవము మనకు ఇవ్వబడి ఉన్నది, అయితే ఆ జీవము ఎత్తుకుపోబడుతున్నది లేదా ఆ జీవము కోల్పోతున్నాము.
కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండ నందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను. –వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను. -మార్కు 4:5-9
జ్ఞానము లేకనే నా జనులు నశించుచున్నారు అని ప్రభువు చెప్పుచున్నారు. అయితే ప్రభువు సిద్ధపరచిన ప్రతీ ఆశీర్వాదము మనము అనుభవించాలి అనే ఆలోచన కలిగి మనము ఈ దినము సిద్ధపడదాము.
మొదటిగా “కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను”. త్రోవ పక్కన ఉండటము అంటే ఏమిటి? “నేనే మార్గమును” అని ప్రభువు చెప్పాడు గనుక యేసయ్యలో నిలబడి ఉంటే, నీవు త్రోవలో ఉన్నట్టు, యేసయ్యలో నిలబడి లేకపోతే త్రోవ పక్కన ఉన్నట్టే.
యేసయ్య అంటే వాక్యము, మన జీవితము వాక్య ప్రకారము ఉన్నట్టయితే అది త్రోవలో ఉన్నట్టే, అలా కాకపోతే త్రోవ పక్కన ఉన్నట్టు. మన దేవుడు ఆశీర్వాదము దేని కాలమున అది ఉండులాగున ఆయన అంతా సిద్ధపరిచారు. అయితే ఆ సిద్ధపరచినది మనము పొందుకోలేకపోతున్నాము అంటే ఒక కారణము త్రోవ పక్కన ఉండటము, లేదా విన్న వాక్యము ప్రకారము జీవించలేకపోవడము.
త్రోవప్రక్క నుండువారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్య మెత్తికొనిపోవును. -మార్కు 4:15
మనకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము ఎత్తుకుపోబడటానికి కారణము, మనము మరణమే లేని దేవుని త్రోవలో లేకపోవడమే! పాపము మనలను మరణము వద్దకే తీసుకువెళుతుంది. నీతి మనలను జీవము వద్దకు తీసుకువెళుతుంది. పాప మార్గములో ఉన్నదంతా మరణమే!
దేవుడిచ్చిన ఆశీర్వాదము నీవు చూడాలి అంటే, నీవు త్రోవలోనే ఉండాలి, అంటే యేసయ్య చెప్పిన మాటల ప్రకారము నీ జీవితము ఉండాలి. ఈ దినమునుంచైనా త్రోవలో ఉండు, అనగా వాక్య ప్రకారము జీవించడానికి సిద్ధపడు. అప్పుడు పడిన విత్తనము నాటబడి, ఎదిగి ఫలిస్తుంది.
“కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండ నందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను.” ఇది ఎంతో జాగ్రత్తగా గమనించాలి. విత్తనము పడిన భూమి చూస్తే, కొంచెము మన్ను ఉంది గాని, రాళ్ళు కూడా ఉన్నాయి. వెంటనే మొక్క మొలిచింది గానీ, దాని వేరు ఎదగడానికి రాళ్ళు అడ్డుగా ఉన్నాయి గనుక, వేరు లేని కారణాన ఎదగలేక మాడిపోయింది.
ఆ రాతి నేల మన హృదయమే. మన హృదయము కొన్ని సందర్భములలో మంచిగా ఉంటుంది, మరికొన్ని సమయములలో కఠినముగా మారిపోతుంది. అనగా నాటబడిన సమయములో హృదయము బాగుంది, అయితే మొలిచే సమయమునకు, హృదయము కఠినము అయిన కారణమున ఆశీర్వాదములు పోగొట్టుకుంటున్నాము.
దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము కనపరచబడకుండా నీ హృదయము కఠినము చేసుకొన్న దానిని బట్టి, ఆ ఆశీర్వాదము అణిచివేయబడుతుంది గనుకనే పోగొట్టుకొంటున్నాము.
మన తండ్రి వ్యవసాయకుడు గనుక, నీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న రాళ్ళను, నీ ఆశీర్వాదమునకు అడ్డుగా ఉన్న రాళ్ళను ఆయనే తీసివేస్తాడు.
లోతుగా నాటబడుట అంటే వాక్యములో లోతైన రివలేషన్ గ్రహించి ఆ ప్రకారము జీవితము సిద్ధపరచుకోవడము.
“కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు.” అనగా –
ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు; వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలును లోపల చొచ్చి, వాక్యమును అణచివేయుటవలన అది నిష్ఫలమగును. -మార్కు 4:18
ముండ్లపొదలు అనగా లోకసంబంధమైన విచారములు, ధనమునకు సంబంధించిన ఆలోచనలు, మరి ఇతరమైన ఆలోచనలు హృదయములోనికి చొచ్చి వాక్యమును అణిచివేస్తున్నాయి గనుక ఆశీర్వాదము నిష్ఫలము అయిపోతుంది.
మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును. -మత్తయి 7:10
గనుక, నీ పరలోకపు తండ్రి మంచి ఆశీర్వాదములను నీకొరకు సిద్ధపరచుచున్నాడు. అయితే, నీవు త్రోవలో లేని కారణమున, ఒకవేళ త్రోవలో ఉన్నప్పటికీ, హృదయము కఠినము చేసుకోవడము బట్టి, లేదా హృదయములో నిండిపోయిన అనేకమైన లోకసంబంధమైన విషయములచేత నిండ నిండిపోవడము బట్టి ఆ ఆశీర్వాదము కోల్పోతున్నాము.
“కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను”. మంచి నేల అంటే ఏమిటి? త్రోవలోనే నిలబడి ఉండే హృదయము. ఐహిక విచారములు లేనిది, ధనము గూర్చిన అపేక్ష లేనిది.
