స్తుతిగీతము – 1
స్తుతి గీతముల్ సంగీతముల్ రారాజు యేసునికే
మహిమ ఘనత యుగయుగములకు నా యేసుకే చెల్లును
పాడి కొనియాడి నిన్నారాధించెదన్ (2)
హల్లెలూయా లూయ లూయ హల్లెలూయా (2)
లోకమంతయు తోచినవారిని పూజించుచుండగా
నేను మాత్రం యేసు ప్రభునే ఆరాధించెదన్
పాడి కొనియాడి నిన్నారాధించెదన్ (2)
హల్లెలూయా లూయ లూయ హల్లెలూయా (2)
కెరూబులు సెరాపులందరూ పూజించుచుండగా
నేను కూడా పరిశుద్ధులతో ఆరాధించెదన్
పాడి కొనియాడి నిన్నారాధించెదన్ (2)
హల్లెలూయా లూయ లూయ హల్లెలూయా (2)
నన్ను కోరి నా దరిచేరి నను ప్రేమించితివే
అందరువిడిచిన నా చేయి విడువక నను నడిపించితివే
పాడి కొనియాడి నిన్నారాధించెదన్ (2)
హల్లెలూయా లూయ లూయ హల్లెలూయా (2)
స్తుతిగీతము – 2
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచొస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య
స్తుతిగీతము – 3
మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు
మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికి (2)
ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో (2)
||మంచివాడు||
ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు
దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును (2)
||ఆదరణ||
ఓటమి అంచున పడియుంటివా మేలుకో ఓ సోదరా
యేసయ్య నీ తల పైకెత్తి శత్రువును అణగద్రొక్కును (2)
||ఆదరణ||
దుష్టుడా శత్రు సాతానా విజయము నాదిప్పుడు
నీ తల నా కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కెదను (2)
||ఆదరణ||
ఆహా ఆహా ఆనందమే యేసయ్యతో జీవితం
సంతోషమే సమాధానమే ఎల్లప్పుడు ఆయనలో (2)
||ఆదరణ||
ఆరాధన వర్తమానము
ఆత్మతోను సత్యముతోను చేసే ఆరాధన అంగీకరించబడుతుంది గనుక ఈరోజు ఒక సత్యము మనము నేర్చుకుందాము.
రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వనిచేయు దము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానముచేయు దము -కీర్తనలు 95:1
యెహోవా ఏమై ఉన్నాడో నీవు గ్రహించినప్పుడు ఖచ్చితముగా ఆయనను గూర్చి నీవు ఉత్సాహ ధ్వని చేయగలుగుతావు. ఆయన ఎలా నీకు రక్షణ దుర్గము అయ్యాడో నీవు ఎరిగి ఉన్నప్పుడు నీవు సంతోషముగా గానము చేయగలుగుతావు.
ఆయన నాకు దేవుడుగానూ, మనము ఆయన ప్రజలుగానూ ఉండటము అనేది నియమము. అనగా ఆయన తప్ప వేరేదేదీ దేవుడుగా మనకు ఉండకూడదు అలాగే మనము ఆయన ప్రజలుగా ఉండకుండా తప్పిపోకూడదు. అప్పుడు మనము చేసే ఆరాధన, ప్రార్థన మరేదైనా సరే అంగీకరించబడుతుంది.
ఈలోకములో సమస్తము దేవుని చేత సృష్టించబడ్డాయి గానీ, మనము మాత్రమే ఆయన పోలిక చొప్పున సృష్టించబడ్డాము. అనగా మనము దేవుని కుమారులుగా సృష్టించబడ్డాము. దానిని బట్టి ఆయనను స్తుతించవద్దా! నీ రూపు గౌరవపూర్వకమైనది ఎందుకంటే నీవు నేను దేవుని పోలికలో సృష్టించబడ్డాము. గనుక ఈరోజు మనకు ఇవ్వబడిన జీవితమును బట్టి దేవునికి ఉత్సాహ గానము చేయాలి.
ఒకవేళ బురదలో దొర్లే పందిని చూస్తే, ఎంతగా దానిని శుభ్రము చేసినా సరే మరలా అది బురదలోనికే వెళుతుంది. ఒకవేళ నీవు నేను దేవునిచేత పరిశుద్ధపరచబడిన తరువాత మరలా పాపమనే బురదలోనికి వెళ్ళకుండా మహిమా జీవితము జీవిస్తుంటే అప్పుడు నీవు నీ జీవితమును బట్టి నీవు సంతోషగానము చేసేవాడివిగా ఉంటావు. అలాకాని యెడల నీ నోట ఆరాధన రాదు, ఒకవేళ వచ్చినా అది అంగీకరించబడదు.
మన జీవితము ఆయన సొత్తు గనుక ఆయన తనకు తగినట్టుగా సిద్ధపరచుకుంటాడు. అనగా మహిమా జీవితములుగా సిద్ధపరుస్తాడు.
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.౹ -రోమా 3:23
అనగా దేవుడు మహిమను అనుగ్రహిస్తున్నాడు అని అర్థము అవుతుంది కదా! నీ దేవుని ఉద్దేశ్యము నీవు గ్రహించినట్టయితే నీవు సంతోషముతో నీ దేవునిని ఆరాధించగలుగుతావు. అందుకే ఈ సత్యము నీవు గ్రహించడము ఎంతో అవసరము. మహిమా జీవితము దేవుని చేత పొందినందుకు ఆయనను స్తుతించాలి. ఈ సత్యము నీవు ఎరిగి జీవిస్తుంటే, దేవుని మహిమ నీ జీవితములో ఆవరిస్తుంది. ఎందుకంటే, నీవు చేసే స్తుతులపై ఆయన ఆసీనుడై ఉంటాడు గనుక.
ఈరోజు మనము తెలుసుకున్న సత్యములో రెండవ భాగము, ఆయన మన రక్షణ దుర్గమై ఉన్నాడు. ఈ మాటను మనము అనుభవించగలుగుతున్నామా? “నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు” అనే వాక్యము మన అందరికీ ఎన్నోసార్లు జ్ఞాపకము వచ్చేదే కదా! అయితే ఆ మాటలో సత్యము గ్రహిస్తున్నావా?
–నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది. -కీర్తనలు 94:18
పడిపోయిన స్థితిలో మన జీవితములో ఉన్నప్పుడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు గనుక ఆయన కృప నిన్ను విడువక లేపబడుటకు బలపరచుచున్నది. గనుక మరెప్పుడు వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చినప్పటికీ ఈ సత్యము మనము గ్రహించి నిలబడితే మనము ఎంతో సంతోషముగా మన దేవుని కృప తోడై ఉన్న విధానమును బట్టి ఆయనను స్తుతించగలుగుతాము.
పాపము ఎక్కడ విస్తరింపచేయబడుతుందో, అక్కడ కృప మరింతగా విస్తరించబడుతుంది. పాపము అనగా మరణకరమైనది. మన జీవితములో ఎక్కడ మరణకరమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడ జీవము ప్రత్యక్షపరచబడుటకు కృప మనలను వెంబడించేదిగా ఉంది. గనుక కృప మనపై ఉన్నంత కాలము మనపై మరణము జయము పొందదు.
అందుకే నీ దేవుడు ఎటువంటివాడో, ఏవిధముగా నిన్ను సృష్టించాడో, ఎటువంటి జీవితమును నీకిచ్చాడో, ఎలా తన కృప నీ యెడల విస్తరింపచేస్తున్నాడో ఎరిగి ఉంటే, నీవు ధైర్యముగా ప్రకటిస్తావు. నీవు ప్రకటించే సత్యమే స్థిరపరచబడుతుంది. నీవు నిజముగా ఆరాధిస్తావు, నీవు చేసే ఆరాధన కూడా అంగీకరించబడుతుంది.
యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. -కీర్తనలు 94:14
నీవు నేను ఆయన స్వాస్థ్యము అయి ఉన్నాము. గనుక ఆయన కృప మనలను వెంబడిస్తూ వస్తుంది. అందుకే పౌలు ఇలా అంటున్నాడు – “నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను” అని చెప్పగలుగుతున్నాడు. నీవు నేను కూడా ఆయన రక్షణదుర్గముగా ఎలా పనిచేస్తున్నాడో గ్రహిస్తే పౌలు వలే మనము చెప్పగలుగుతాము ఆయనను స్తుతించగలుగుతాము.
ఆరాధన గీతము
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ (2)
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని||
శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2)
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగ (2)
కృపా కనికరముగల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి (2)
||ఎడబాయని||
విశ్వాస పోరాటంలో – ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2)
దుష్టుల క్షేమమునే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2)
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి (2)
||ఎడబాయని||
నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2)
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగ (2)
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి (2)
||ఎడబాయని||
వారము కొరకైన వాక్యము
ఈరోజు మనకు ప్రభువు కొన్ని ప్రశ్న వేస్తున్నాడు. ఈ ప్రశ్నను బట్టి మన ఆత్మీయ జీవితములను పరీక్షించుకుందాము.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున౹ మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.౹ -హెబ్రీయులకు 12:1-2
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియుండుటకు ఏమైనా కారణము ఉందా? మన జీవితాలకు ముందు ఒక సాక్షి సమూహము దేవుడు ఉంచిఉన్నాడు. మనము దానిని చూసి దేవుని కొరకు సిద్ధపడగలుగులాగున ఈ సాక్షి సమూహము ఉంచబడింది.
మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.
ప్రభువు మనలను అడుగుతున్న ప్రశ్నలు.
“మనము” అనే మాటలో నీవున్నావా?
నీవు ఏ పరుగు పందెములో ఉన్నావు?
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.౹ -ఫిలిప్పీయులకు 3:14
మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.౹ -2 తిమోతికి 4:7
పౌలు విషయములో అయితే, క్రీస్తునందు దేవుని యొక్క పిలుపు ఉంది అని గ్రహించి. ఆ పిలుపుకు ఒక బహుమానము కూడా ఉంది అని ఎరిగి దానికొరకు గురి యొద్దకు పరిగెడుతున్నాను అంటున్నాడు.
మరి నీవు ఏ గురి కలిగి ఉన్నావు? ఇహలోక సంబంధమైన విషయములలోనా? దేవుడు నీ యెదుట ఉంచిన గురి ఏమైనా ఉందా? నీ సమాధానము ఏమిటి?
కాబట్టి– ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. -మత్తయి 6:31-33
ఈరోజులలో అనేకమంది క్రైస్తవులు గురి లేని జీవితములు జీవిస్తున్నారు. కేవలము ఇహలోక సంబంధమైన విషయములపైనే దృష్టి ఉంచి జీవితములు ముగిస్తున్నారు. అయితే నీ జీవితము నీ దేవుని సొత్తై ఉన్నది గనుక ఆయన నీకు ఇహలోకములో అవసరమైనవాటి విషయము ఆయనకు తెలుసు అని ఆయనే చెప్పుచున్నాడు. నీవు తినడానికి, ఉండటానికి, ధరించుకొనటానికి అవసరమైన ప్రతీదీ ఆయన సమకూరుస్తాను, అయితే నా రాజ్యమును, నీతిని మొదట వెతుకుము అని చెప్పుచున్నాడు. అంటే నీ భౌతికమైన జీవితములో అవసరమైన ప్రతిదాని గూర్చి నేను ఆలోచన కలిగి ఉన్నాను, నీవు ఆత్మీయమైన జీవితము గూర్చి చింత కలిగి ఉండుము అని ప్రభువు చెప్పుచున్నాడు.
మనము ముగింపు దినములలో ఉన్నాము. ఒకవేళ మనము ఏ పందెములో ఉన్నామో ఎరగక జీవితమును ముగిస్తే ప్రభువు యెదుట నిలబడినప్పుడు ఏమి సమాధానము చెప్పగలుగుతాము?
దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను.౹ -యోహాను 1:6
సాక్షి సమూహములో యోహాను ఒక వ్యక్తి. అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్య మిచ్చుటకుదేవుడు అతనిని పంపబడెను. యేసయ్య రాకముందు ప్రజలను మారుమనస్సుకొరకు ప్రకటిస్తూ ఆయనకు ఇవ్వబడిన పందెములో పరిగెట్టినాడు.
మన జీవితము కూడా దేవుని చేత ఇవ్వబడిన జీవితము. మనము కూడా దేవుని చేత పంపబడినవారము, మనకు కూడా ఒక పని ఇవ్వబడింది. ఎలా అయితే యోహాను ఇవ్వబడిన పనిని నెరవేర్చాడో, మనము కూడా అదేవిధముగా ఇవ్వబడిన పనిని నెరవేర్చుటకు గురి కలిగి జీవించాలి.
ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా – –ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. -లూకా 4:17-19
యేసయ్య కూడా దేవుని చేత పంపబడినవాడు. ఆయన కూడా మనముందు ఉన్న సాక్షి సమూహములో ఉన్నాడు. దేవుడు ఏమైతే సిద్ధపరచి ఉంచాడో, అది చేయడానికి మనము సిద్ధపడితే, నెరవేర్చడానికి ఆయన సన్నద్ధుడై ఉన్నాడు.
ఆత్మీయ జీవితములో ఖచ్చితముగా ఒక పని నీకు ఇవ్వబడింది. గనుక నీకు ఇవ్వబడిన పని ఏమిటో తెలుసుకుని సిద్ధపడు.
అయినను తల్లిగర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని౹ ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు.౹ -గలతీయులకు 1:15-16
దేవుడు నిన్ను నన్ను కూడా ఎన్నిక చేసుకున్నాడు. అయితే దేనికొరకు నిన్ను ఎన్నిక చేసుకున్నాడో నీవు గ్రహిస్తున్నావా? లేఖనములలో నీకొరకైన దేవుని చిత్తము ఖచ్చితముగా పొందుపరచబడి ఉంటుంది. అయితే దాని ద్వారా దేవుని చిత్తము కనుగొనడానికి నీవు కనిపెట్టాలి.
మన అందరికీ కామన్ గా ఇవ్వబడిన పందెము ఏమిటి అంటే పరిశుద్ధమైన జీవితమును కలిగి, కొనసాగించుట. అయితే ఎలా మనము పరిశుద్ధముగా ఎలా ఉండగలుగుతాము? దేవుని వాక్యము ఆధారముగా మాత్రమే జీవించుటను బట్టి మనము పరిశుద్ధత కొనసాగించుకోగలము. అలా కాని యెడల మనము విడువబడే ప్రమాదము ఉంది. మనము ఈ లోకములో ఉన్నంతవరకే మనము చేయగలిగినది.
నేను యీవిని అపేక్షించి యీలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తారఫలము రావలెనని అపేక్షించి చెప్పు చున్నాను.౹ -ఫిలిప్పీయులకు 4:17
అనగా మనము జీవించే జీవితమునకు ఒక లెక్క ఉంది. మనం చేసే ప్రతీ పని లెక్కపెట్టబడుతుంది. ఆ లెక్కను బట్టే ఫలము సిద్ధపరచబడుతుంది. మన ముందు ఉంచబడిన సాక్షి సమూహములోని ఉన్నవారు వారికి ఇవ్వబడిన పిలుపు కొరకు ప్రయాసపడ్డారు. అలాగే నీవు నేను కూడా ప్రయాసపడవలసిన అవసరము ఉంది. పౌలు జీవితములో అయితే అనేకసార్లు మరణమగునంతగా కొట్టబడ్డాడు. ఒక సందర్భములో చనిపోయాడనుకుని ఊరి వెలుపల పడవేసినప్పుడు, మరుసటి దినమున సమాజమందిరములో తిరిగి సమాజమందిరములో బోధించినవాడుగా ఉన్నాడు.
ఇహలోకములో పరుగు పందెములోని వారు సహితము ఎంతో ప్రయాసపడి సిద్ధపడతారు. మరి ఆత్మీయ జీవితములో మనకు ఇవ్వబడిన పందెము కొరకు, ఇంకెంతగా మనము ప్రయాసపడాలి.
మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు -హెబ్రీయులకు 12:2
పందెములో ఓపిక అనేది ఖచ్చితముగా అవసరము. పరిశుద్ధమైన జీవితమును సిద్ధపరచుకొనుటలో, కొనసాగించుటలో ఓపిక అవసరము. యేసయ్య తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఇప్పుడు ఆసీనుడైయున్నాడు.
ఇక్కడ ఒక సత్యము ఏమిటి అంటే, మన ఎదుట ఉంచబడిన గురిని చేరుకొనుటలో ప్రయాస ఉంటుంది. దేవుడు అనుగ్రహించే బహుమానము ముందు ఈ ప్రయాస ఎన్నదగినది కాదు. ఈ సత్యము మనము ఎరిగినట్టయితే పౌలు వలే, యేసు వలే, యోహాను వలే అవమానమును నిర్లక్ష్య పెట్టి గురి యొద్దకే పరిగెట్టేవారముగా ఉంటాము.
గనుక ఈరోజు నుంచి, దేవుని వాక్యము ప్రకారముగా మాత్రమే జీవించుటకు సిద్ధపడదాము. నా జీవితములో ప్రతి విషయములో దేవుని మహిమను నేను అనుభవిచాల్సిందే అనే తీర్మానము కలిగి ప్రయాసమైనా సరే అదే గురితో జీవిద్దాము.
దేవుని చేత పంపబడినవారు, లోకములో వారికి ఇవ్వబడిన పని ముగించి, తిరిగి దేవుని వద్దకే వెళ్ళారు. కనుక మన గురి కూడా తిరిగి నా దేవుని యొద్దకే వెళ్ళాలి అని ఉండాలి.
మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు.౹ పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది.౹ -కొలొస్సయులకు 3:1-2
అనగా ఎలా అయితే క్రీస్తు ఈలోకములో తనకు ఇవ్వబడిన గురికొరకే ప్రయాసపడి జీవించాడో అలాగే మీరు జీవిస్తే, మీరు కూడా క్రీస్తువలే మరలా దేవుని యొద్దకే చేర్చబడతారు.
పరలోక సంబంధమైన విషయములే మనము గురిగా ఉండటము అంటే ఈ లోకములో వివాహము, పిల్లలు, ఉద్యోగము అన్నీ వదిలి ఉండటమా? కానే కాదు.
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండ వలెనని ప్రార్థించుచున్నాను.౹ -3 యోహాను 1:2
మన ఆత్మ వర్థిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో అంటే, పైన చూసిన విషయాలవంటి అన్ని విషయములలో మనము వర్థిల్లుతాము.
ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి.౹ -యోహాను 1:16
బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.౹ -కొలొస్సయులకు 2:3
కాబట్టి, దేవుడు నీకిచ్చిన పని గురిగా నీవు జీవిస్తే, ఆయన పరిపూర్ణతను బట్టి, ఆయన కృప నిన్ను వెంబడించడమునుబట్టి నీ జీవితములో అవసరమైన సమస్తము నీకు సమకూర్చబడుతుంది. అందుకే నిన్ను నీవు వాక్యమును గైకొనువాడిగా, గైకొను దానిగా మనము సిద్ధపడదాము.
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. -మత్తయి 6:33