05-05-2024 – ఆదివారం రెండవ ఆరాధన

స్తోత్ర గీతము 1

యేసే నా ఆశ్రయము
యేసే నా ఆధారము
నా కోట నీవే… నా దుర్గము నీవే
నా కాపరి నీవే

శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా
కష్టాల ఊభిలో కూరుకున్ననూ
నన్ను లేవనెత్తును నన్ను బలపరచును
నాకు శక్తినిచ్చి నడిపించును

జీవ నావలో తుఫాను చెలరేగినా
ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా
నాకు తోడైయుండును నన్ను దరి చేర్చును
చుక్కాని అయి దారిచుపును

దినమంతయు చీకటి అలుముకున్ననూ
బ్రతుకే భారమైన సంద్రమైననూ
నాకు వెలుగిచ్చిను నన్ను వెలుగించును
నా నావలో నాతో నుండును

 

స్తోత్ర గీతము 2

గొంతు ఎత్తి చాటెదాను
నడుము కట్టి పయనింతును
నా యేసు గొప్పవాడు
నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడు
నీ కొరకే నేనన్నాడు
నా యేసు గొప్పవాడు

ఎంత గొప్ప కార్యము చేసినాడు
ఎర్ర సంద్రమునే చీల్చినాడు
ఎంత గొప్ప మహిమను తెచ్చినాడు
యెరికో గోడలు కూల్చినాడు
ఎంతాటి కార్యమైనా చేయగలడు
శక్తివంతుడు అసాధ్యుడు
నా తండ్రి గొప్పవాడు

ఎంత గొప్ప కార్యము చేసినాడు
నిషేధించిన రాయి స్థానం మార్చాడు
పనికిరాని పాత్రను వాడగలడు
గొప్పదైన దానిగా చేయగలడు
ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నాడు
ఎంత గొప్ప దేవుడు నా యేసుడు
నా యేసు గొప్పవాడు

కన్న తల్లి కన్న తండ్రి చూపలేనిది
నా యేసు తండ్రి చూపుతాడు
ఈ లోక స్నేహం ఇవ్వలేనిది
నా యేసు ప్రాణం ఇచ్చినాడు
ఎన్నాడు విడువని గొప్ప దేవుడు
లోకమంతా విడిచినా నిన్ను విడువడు
నా యేసు గొప్పవాడు

స్తోత్ర గీతము 3

ఉత్సాహ గానము చేసెదము
ఘనపరచెదము మన యేసయ్య నామమును
హల్లెలూయ యెహోవ రాఫా
హల్లెలూయ యెహోవ షమ్మా
హల్లెలూయ యెహోవ ఈరే
హల్లెలూయ యెహోవ షాలోమ్

అమూల్యములైన వాగ్ధానములు
అత్యధికముగా ఉన్నవి
వాటిని మనము నమ్మినయెడల
దేవుని మహిమను ఆనుభవించెదము

వాగ్ధాన దేశము పితరులకిచ్చిన
నమ్మదగిన దేవుడాయన
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేం ఆనుభవించెదము

ఆరాధన వర్తమానము

నీ ఆసక్తిని బట్టి దేవుడు నీ జీవితములో కార్యము జరిగించేవాడుగా ఉన్నాడు.

నీవు దేవుని యెడల చూపించే ఆసక్తి ని బట్టి నీకొరకు ఒక లెక్క వ్రాయబడుచున్నది.

దేవుని యెడల నీకున్న ఆసక్తి, దేవుని నుండి ఆశీర్వాదము పొందుకోవడానికి అర్హత అయి ఉన్నది.

నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు -కీర్తనలు 103:1-4

కీర్తనాకారుడు తన ప్రాణముతో చెప్పుకుంటున్న మాట, యెహోవాను సన్నుతించుము. ఎందుకు సన్నుతించాలి అంటే –

నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. అనగా నీ జీవితములో ఉన్న సంకటములన్నింటినీ ఆయన మాత్రమే కుదిర్చేవాడుగా ఉన్నాడు.

మన జీవితములు ఆయన సొత్తై ఉన్నవి. ఆయనే మనకు యజమానుడుగా ఉంటున్నాడు. గనుకనే మన జీవితము యెడల ఆయన బాధ్యత తీసుకునేవాడుగా ఉంటున్నాడు.

రాజుల చేతనైనను, నరుల చేతనైనను మనకు రక్షణ కలుగదు కానీ, కేవలము దేవునిని ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగును.

సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు -కీర్తనలు 103:4-5

దేవుడు మనలను విమోచించేవాడుగా ఉంటున్నాడు. ఎక్కడనుండి విమోచిస్తున్నాడు అంటే, సమాధిలోనుండి విమోచిస్తున్నాడు. యేసయ్యను మనము జ్ఞాపకము చేసుకుంటే, మృతులలోనుండి క్రీస్తును లేపినవాడు మన దేవుడు.

ఒకవేళ మన పరిస్థితులు మృతమైనప్పటికీ, ఆ మృతమైన పరిస్థితులనుండి మనలను విమోచించగలిగినవాడు మన దేవుడు. సమాధివంటి పరిస్థితులనుండి నిన్ను ప్రభువు విమోచించుచున్నాడు.

దేవుని మాటలయందు నమ్మిక ఉంచినపుడు ఏమి జరుగుతుంది? ఇది అర్థము చేసుకోవాలంటే యేసయ్య నీళ్ళమీద నడిచిన సందర్భము జ్ఞాపకము చేసుకుందాము.

పేతురు నేను కూడా నీళ్ళపై నడచులాగున అజ్ఞాపించుము అని చెప్పినప్పుడు. పేతురు కొంచెము దూరము నడిచిన తరువాత ములిగిపోసాగాడు. అంటే నమ్మిక ఉంచినంతవరకు పేతురు నడవగలిగాడు. ఎప్పుడైతే ఆ నమ్మకము పరిస్థితినిబట్టి చెదిరినపుడు ములిగిపోసాగాడు.

అనగా మనము నమ్మిక ఉంచినపుడు ఏ పరిస్థితి అయితే సమాధిగా ఉంటుందో లేదా, నీవు ములిగిపోయే పరిస్థితి ఏదైతే ఉంటుందో, ఆ పరిస్థితి నీకు నష్టము కలిగించకుండా నీ నమ్మిక అడ్డుపడుతుంది.

సమాధి అంటే మనిషి ఉన్నప్పటికీ జీవము లేని పరిస్థితి అని అర్థము. అది ఆరోగ్యమైనా, ఆర్థికమైనా మరేదైనా సరే ఆ పరిస్థితుల ద్వారా వచ్చే నష్టమునకు మన నమ్మిక అడ్డుపడుతుంది.

అలా నమ్మిక ఉంచినపుడు ఎక్కడైతే పడిపోయామో, ఎలా అయితే పడిపోయామో, అక్కడే అలాగే నిలబడతాము. అనగా రిస్టొర్ చేయబడతాము.

పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము నూతనపరచబడేది. అదేవిధముగా నీ జీవితములో అనేకమైన మేలులు జరిగించి నిన్ను తృప్తిపరచేవాడిగా ఉన్నాడు.

ఈ సత్యము గ్రహించి నీవు నీ దేవునిని ఆరాధించినపుడు నీ జీవితములో ఎక్కడ విమోచించబడాలో అక్కడ విమోచించబడతావు. ఎక్కడ రిస్టోర్ చేయబడాలో అక్కడ రిస్టోర్ చేయబడతావు.

నీ దేవునికి పరిమితులు లేవు. నీ కళ్ళముందు అసాధ్యమైనదైనా సరే, నీ దేవునికి మాత్రము సమస్తము సాధ్యమే! 

ఆరాధన గీతము

నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా

ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు

మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును

 

వారము కొరకైన వాక్యము

యెహోవా దయాదాక్షిణ్యములుగలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు. యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి. -కీర్తనలు 145:8-9

సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానముచేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. -కీర్తనలు 100:2-3

దేవుడే నిన్ను నన్ను పుట్టించినవాడు, మరియు మనము ఆయన వారమై ఉన్నాము గనుక, మనము ఆయన కార్యమై ఉన్నాము. కాబట్టి ఆయన కనికరము మనపై ఖచ్చితముగా ఉంటుంది.

అంతే కాక, మనము ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము గనుక, మనలను నడిపించేవాడు ఆయనే. వీటన్నిటిని బట్టి మనము ఆయన సొత్తు అని అర్థము చేసుకోవచ్చు.

దేవుడు దయాళుడు అని చెప్పబడుతుంది అంటే, ఆయన దయ మన జీవితములకు ఆధారమై ఉంటుంది.

తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి -కీర్తనలు 104:27

సమస్త కార్యములపై ఆయన దయ, కరుణ ఉంటుంది. గనుక మనకు కూడా ఆయన దయను బట్టి సమస్తము అనుగ్రహించబడతాయి.

నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి పరచబడును. -కీర్తనలు 104:28

అనగా, దేవుడు ఇస్తేనే తప్ప మనము పొందుకోలేము, కూర్చుకోలేము, తృప్తిపరచబడలేము.

దేవుడు దయాళుడు అనే వ్యక్తిత్వము మన జీవితములకు ఎంతో అవసరమై ఉన్నది. ఈ సత్యములను మనము మర్చిపోకుండా మన జీవితములను సిద్ధపరచుకోవాలి.

రోడ్డుపై అడుక్కునేవారిని చూసినపుడు వారు నిస్సహాయస్థితిలో ఉంటారు. అనేకులు వారిని చూసి వెళ్ళిపోతారు గానీ, దయ కలిగినవారు మాత్రము వారికి కలిగిన దానిలోనుండి కొంత వారికి ఇస్తారు.

మన దేవుడు కూడా మనము నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు మన దేవుడిని తన దయ చూపమని అడిగేవారిగా ఉండాలి.

యెహోవా నీవున్న పరిస్థితిలో ఆదుకొనగల సమర్థుడు అలాగే ఆయన దయ కలిగినవాడు. గనుక నిన్ను దాటిపోడు. నీవున్న నిస్సహాయస్థితిలో సహాయము నీకు అందిస్తాడు.

వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్లుచుండగా, ఆయన శిష్యులును బహుజనసమూహమును ఆయనతోకూడ వెళ్లుచుండిరి. ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చి నప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతోకూడ ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి–ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన –చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. -లూకా 7:11-15

ఈ భాగములో చూస్తే, యేసయ్య కనికరము గలవాడు. నాయీను గ్రామమునకు వెళ్ళుచున్న మార్గము మధ్యలో ఒక తల్లి కనపడుతుంది. ఆ తల్లి విధవరాలు. ఒక్కగానొక్క కుమారుడు కూడా చనిపోయాడు. అంటే ఆమె పరిస్థితి నిస్సహాయ స్థితిని చూసినవాడుగా అక్కడ యేసయ్య ఉన్నాడు.

ఆ విధవరాలు యేసయ్యను అడగలేదు కానీ, యేసయ్యలో ఉన్న కనికరమును బట్టి అక్కడ ఆకార్యము చేసినవాడుగా ఉన్నాడు.

ఒక గొర్రెల కాపరిని గూర్చి ఆలోచించినపుడు, ఒక ప్రదేశములో గొర్రెలు మేత మేయుచుండగా, అక్కడ ఆహారము అయిపోయే అయిపోయే సమయమునకు వేరే ప్రదేశమునకు నడిపించడానికి సిద్ధపడతాడు.

ఎందుకంటే, అదే ప్రదేశములో ఉంటే ఆకలికి తాళలేని పరిస్థితిలో ఉంటాయి. ఆ పరిస్థితిని ఆ గొర్రెల కాపరి చూడలేడు గనుక, మేత దొరికే ప్రదేశమునకు తోడుకొని వెళతాడు.

గనుక ఇప్పుడు జీవము లేని పరిస్థితి ఉంటే కంగారు పడవద్దు గానీ, జీవము గల ప్రదేశమునకు ఆయన నడిపించేవాడు అని నమ్మి సంతోషించండి.

ఆ దినములలో మరియొక సారి బహుజనులు కూడి రాగా, వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తనయొద్దకు పిలిచి –జనులు నేటికి మూడుదినముల నుండి నాయొద్దనున్నారు; వారికి తిననేమియు లేనందున, నేను వారిమీద కనికరపడుచున్నాను; -మార్కు 8:1-2

గొర్రెల విషయములో ఇంకా జీవము లేని పరిస్థితి రాకమునుపే జీవము కలిగే మరొక మార్గమును సిద్ధపరచేవాడుగా ఉనాడు.

ఇక్కడ కూడివచ్చిన జనుల విషయములో, జీవము పోలేదు గానీ, పోయే పరిస్థితిలో ఉన్నారు. అందుకే యేసయ్య “ఒకవేళ” అనే మాట ఉపయోగించారు. అలాగే “మూడు దినములు” అని దినములు కూడా లెక్కపెట్టినవాడుగా ప్రభువు ఉన్నాడు.

అంటే నీవు ఎన్ని దినములు జీవము లేకుండా ఉన్నావో ప్రభువు గమనించేవాడుగా ఉన్నాడు. ఇలాగే కొనసాగించబడితే, నీవు నిరీక్షణ కోల్పోతావేమో అని ప్రభువు తన దయాగుణమును బట్టి, తన కనికరము మనపై చూపించేవాడుగా ఉన్నాడు.

అక్కడ కూడుకున్న వారందరి దగ్గర కలిపి 7 రొట్టెలు ఉన్నాయి. అయితే వారిపై కనికరపడిన యేసయ్య ఆ ఏడు రొట్టెలను ఆశీర్వదించి అవే 7 వేల మందికి సరిపోయేవిధానములో ఆశీర్వదించాడు.

నీ పరిస్థితి కూడా ఎన్ని దినములు జీవములేని పరిస్థితిలో ఉందో, ఆ పరిస్థితిలో నీకు తన కనికరము చూపించి, నీకున్న దానినే ఆశీర్వదించి వృద్ధిచేసేవాడుగా ఉన్నాడు. అంటే ఆయన కనికరము నీవు దీవించబడునట్లుగా నీ జీవితమును సిద్ధపరుస్తుంది.

వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను. -లూకా 15:20

తప్పిపోయిన చిన్న కుమారుడు ఆత్మీయముగా ఒకప్పుడు మంచిగా ఉండి, ఇప్పుడు ఆత్మీయత కోల్పోయినవారిని సూచిస్తున్నాడు. తండ్రితో ఉన్నంతసేపు ఆనందమే.

ఈ చిన్న కుమారుని చూస్తే, తనకు రావలసినది సమస్తము పట్టుకుని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రితో ఉన్నంతసేపు తన చుట్టూ రక్షణ కంచె ఉంది. ఎప్పుడైతే తాను వెళ్ళిపోయాడో, అపుడు ఆ రక్షణ కంచేనుండి దూరముగా వెళ్ళినవాడై నష్టపరచబడే స్థితిలోనికి వెళ్ళిపోయాడు.

ఇక్కడ తండ్రి వ్యాపారము చేసేవాడు, ఆ వ్యాపారములో తన కుమారులుకూడా పాలు కలిగిఉన్నారు. తండ్రితో ఉన్నంతసేపు ప్రొటెక్షన్ ఉంది. అయితే ఎప్పుడైతే తండ్రినుండి విడిపోయాడో, అప్పుడు తనకు ప్రొటెక్షన్ పోయింది.

పరలోకపు రాజ్యము కట్టబడటమే తండ్రి యొక్క వ్యాపారమై ఉన్నది. అలాగే ఆ వ్యాపారములో కుమారులుగా మనము కూడా బాధ్యత కలిగిన వారిగా ఉన్నాము. తండ్రితో ఉన్నంతసేపు ఆ వ్యాపారములో పాలు, మనకు రక్షణ. ఒకవేళ తండ్రితో ఉండక, వేరే లోకపు దుర్వ్యాపారములతో గనుక మళ్ళితే, రక్షణ వలయమునుండి దూరమయ్యి అపవాది చేత నష్టపరచబడటానికి చిక్కుపడిపోతాము. అంతే కాక తండ్రితో ఉన్నప్పుడు ఏదైతే కలిగి ఉన్నామో, అది సమస్తము పోగొట్టుకొనే స్థితిలోనికి వెళ్ళిపోతాము.

వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను. -లూకా 15:20

అయితే విడిచివెళ్ళిన చిన్నకుమారుడు తిరిగివచ్చినపుడు ఆ తండ్రి ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు. తండ్రి నీ స్థితిని చూసి, నీవు కోల్పోయిన జీవమును తిరిగి దయచేసేవాడిగా ఉన్నాడు.

కుమారుడికి తండ్రి కలిగినదానిలో స్వాతంత్ర్యము ఉంటుంది. దాసుడైతే యజమానుడు దయచేసేవరకు వేచిఉండవలసినదే. తండ్రి తన చిన్నకుమారుడు ఇంకా మురికి బట్టలతో ఉన్నపుడే పరుగున వెళ్ళి ముద్దుపెట్టుకున్నాడు. ముద్దు అనేది అంగీకారమునకు సూచన అయి ఉన్నది.

యెహోవా దయాదాక్షిణ్యములుగలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు. యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి. -కీర్తనలు 145:8-9

నీవు నేను ఆయన పని అయి ఉన్నాము. ఆయన కనికరము నీపైనా నాపైన కూడా ఉంది. ఆయన కనికరమును బట్టి నీవు కోల్పోయినదానిని తిరిగి నీకు దయచేసేవాడిగా ఉన్నాడు.