05-03-2023 ఆదివారం మొదటి ఆరాధన – ఆయనయందు నిలచి యుండుడి

నా మనస్సా ఆయన మరచునా 

నా మనస్సా ఆయన మరచునా –
దేవుడు నిన్ను మరచిపోవునా (2)
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే –
ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2)
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే –
కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)

1.నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో-
సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే (2)
తరగిపోను నేను అణగార్చబడను నేను (2)
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)

సరిచేయు వాడే ఓ…స్థిరపరచినాడే
బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే
సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు
ఈ నూతనవత్సరములో అలంకరించునే.

2. విచారించే వారు లేక ఒంటరియైయున్న నీకు –
ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే (2)
కూలిన కోటను రాజగృహముగా మార్చును (2)
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)

నా మనస్సా ఆయన మరచునా

ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం

ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘన నామం (2)
స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును
క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును (2)
వేవేనోళ్లతో స్తుతి నే పాడెదా. (2)
యేసునందే సత్యం యేసులోనే మార్గం యేసే నా నిత్యజీవము (2)

ప్రభు నామము ఎంతో ఘనమైనది
అన్ని నామములకంటె హెచ్చైనది (2)
ఆ నామమందే రక్షణ సోదరా (2)
యేసయ్య రక్తము చిందించెగా (2)
యేసే నా రక్షణ యేసే విమోచన యేసే నా నిరీక్షణా (2)

ప్రభు నామము ఎంతో బలమైనది
అపవాది క్రియ లయపరుచునది (2)
భయమేల నీకు ఓ సోదరా (2)
సాతాను సిలువలో ఓడిపోయెగా (2)

యేసే రక్తమే జయం యేసు నామమే జయం యేసునందే విజయం (2)

ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు

ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను నాట్యమాడెదన్ – 2
నాట్యమాడెదన్ నేను నాట్యమాడెదన్ నేను
దావీదువలె నేను నాట్యమాడెదన్

ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను పాటపాడెదన్ – 2
పాటపాడెదన్ నేను పాటపాడెదన్ నేను
దావీదువలె నేను పాటపాడెదన్

ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు
దావీదువలె నేను స్తుతించెదను
స్తుతించెదన్ నేను స్తుతించెదన్ నేను
దావీదువలె నేను స్తుతించెదను

ఆరాధన వర్తమానం

నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును – యోహాను 6:44
తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయును. – యోహాను 6:37
ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పొగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది – యోహాను 6:39

ఈరోజు సంఘముగా కూడుకోవడానికి కృపచూపిన దేవుడు ఈరోజున మనము ఆయన సన్నిధికి వచ్చులాగున ఆయన ఆకర్షించినవాడుగా ఉన్నాడు. పైన చూసిన మూడు వాక్యములు చూస్తే, ఒకటి నిత్య రాజ్యములో ఉండుట అనేది దేవుని చిత్తము. రెండవదిగా చూస్తే, యేసును నమ్మి విశ్వసించిన నిన్ను ఏమాత్రము పోగొట్టుకోడు, అది ఏ పరిస్థితిలో అయినా సరే! ఎందుకనగా మీరు ఆశీర్వాదముకొరకై పిలువబడినవారు.

నీకొరకు దేవుడు సిద్ధపరచి విడుదల చేసే మాటలు నీవు పోగొట్టుకొనక స్థిరపరచబడుట అనుభవిస్తావు.

అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. – రోమా 5:8,9

ఈ వాక్యము మనకు మన రక్షణ విషయములో బాగా తెలిసినదే! అయితే మనము ఆరాధించడానికి మనకు ఆధారము, ” ఉగ్రత నుండి రక్షింపబడుదుము”. పరలోకము ఎలా ఉందో, నరకము కూడా ఉంది.

కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము. ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుతున్నావు లూకా 16:25
వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును – మత్తయి 13:50

ఈ నరకము భయంకరమైనది. యాతన, శ్రమ, ఏడుపు, అగ్ని గంధకముల చేత నిత్యము కాల్చబడే పరిస్థితి. ఈ ఉగ్రత నుండి మనలను తప్పించినవాడుగా యేసయ్య ఉన్నాడు. ఆయన రక్తము కార్చి మనలను విడుదల చేసాడు. అందుకె బాప్తీస్మమిచ్చు యోహాను “సర్పసంతానమా, రాబోవు ఉగ్ర తను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? ” అని అంటున్నాడు. అయితే ఎవరైతే యేసయ్యను అంగీకరించారో వారి గమ్యము పరలోకము.

ప్రభువు దయచేసిన రక్షణ గూర్చిన సత్యము ఎరగకుండా, ఆయన చిందిన పరిశుద్ధ రక్తము విలువ తెలియకుండా నీవు ఆయన కొరకు నిలబడలేవు, పరలోకములోనికి చేరలేవు. గనుక సత్యము తెలుసుకో!

పరలోకము నిత్యము సంతోషము, ఆనందము, నెమ్మది, సమాధానములచేత ఆవరించబడిన ప్రదేశము. ఈ సుందరమైన పరలోకములోనికి వెళ్ళగలుగులాగున ఉగ్రతనుండి తప్పించిన నీ దేవునిని ఆరాధించు!

అలాగే ఈ లోకములో ఉన్నప్పుడు, మనలను నాశనముచేయుటకు అపవాది సిద్ధపరచిన ఉగ్రత నుండి, ప్రభువు తప్పించి సమాధానము దయచేయువాడు. దేవుని స్వరూపములో, దేవుని ఆత్మ చేత నింపబడిన ఆదాముని అపవాది మోసము చేసాడు. అటువంటి శక్తిగలిగిన అపవాది నిన్ను పడగొట్టుటకు చేసే ప్రయత్నములన్నీటిలో నీ దేవుడు నిత్యము నిన్ను తప్పించుచున్నాడు.

పరిశుద్ధుల స్వాస్థ్యము పరలోకమే! అటువంటి పరలోకములో నిన్ను ఉంచుటకై, ఉగ్రతనుండి తప్పించిన నీ ప్రభువుని మాతో కలిసి ఆరాధిస్తావా!

ఆరాధన గీతము

గొర్రెపిల్ల రక్తములో
కడుగబడినవారే పరిశుద్ధులు (2)
పరిశుద్ధుడా యేసయ్యా..
నను శుద్ధి చేయుమయా (2)
నను శుద్ధి చేయుమయా ||గొర్రెపిల్ల||

ఆకాశము ఈ భూమియు గతియించినా
గతియించవు నీ మాటలు (2)
శాశ్వతమైనది నీ రాజ్యము (2)
ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా ||గొర్రెపిల్ల||

వేవేల దూతలు అనునిత్యము కొనియాడుచున్న
ఆ పరలోకము నీ సింహాసనం (2)
పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము (2)
ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా ||గొర్రెపిల్ల||

నీవు ఒప్పుకొని, నమ్మి చేసిన ఈ ఆరాధనను బట్టి , తెలిసో తెలియకో నీకు అంటుకున్న లోకమాలిన్యము దేవుని గొర్రెపిల్ల రక్తముచేత కడుగబడి పరిశుద్ధముగా మార్చబడతావు.

Main message| మెయిన్ మెసేజ్

ఈరోజు మనము ధ్యానము “ఆయనయందు నిలిచియుండుడి”. ఏ వాక్యము నీ దగ్గరకు వచ్చినా, ఆ వాక్యములో నీ జీవితము ఉంది. దేవుడు విడుదలచేసే వాక్కులో నీ జీవితమును నీవు కనుగొనగలిగితే నీవు సత్యమును ఎరుగగలుగుతావు.

ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు – యోహాను 15:5.

“మీరు” అనే మాట ప్రాముఖ్యమైనది. మన జీవితాలు ఫలించాలి అంటే ఈ ఆత్మీయ సత్యము మనము పట్టుకోవాలి. వాక్యాన్ని నీవు చేతపట్టుకున్నపుడు నీవు జ్యోతివలే ప్రకాశిస్తావు. నీవు ఫలించటానికి ఒక మర్మము లేఖనము తెలియచేస్తుంది.

1. దేవుని యందు నిలిచియుండుట
2. దేవుడు మనయందు నిలిచి యుండుట

ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మనమొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. దీనివలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలిసికొనుచున్నాము; ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు. – 1 యోహాను 4:12-13.

నీవు ప్రేమ కలిగి ఉన్నప్పుడు, అనగా ఇతరులను ప్రేమించే మనస్సు నీవు కలిగి ఉన్నప్పుడు నీవు ఫలించేవాడవుగా ఉంటావు. అయితే మన జీవితాలను పరీక్షించుకోవాలి. కయీను మరియు హేబెలు అన్నదమ్ములే కానీ కయీను హేబెలును చంపినవాడుగా ఉన్నాడు. కారణము ఏమిటి అని ఆలోచిస్తే, ఇద్దరూ దేవునికి అర్పణ తీసుకొచ్చారు. హేబెలు అర్పణ అంగీకరించబడింది అయితే కయీను అర్పణ అంగీకరించబడలేదు, అయితే ఆ బాధచేత పుట్టిన అసూయ తన తమ్ముడిమీద ప్రేమను చంపేసింది. అందుచేత హేబెలును చంపేసాడు. మనలో ఉన్న శరీర క్రియలైన అసూయ, ద్వేషము మనలో ఉన్న దేవుని ప్రేమను చంపివేస్తున్నాయి. ఎప్పుడైతే ఆ ప్రేమ చచ్చిపోయిందో, ఆయనలో నీవు నిలిచి ఉండలేవు, నీలో ఆయన నిలిచి ఉండలేదు. దేవుని ప్రేమను చంపివేసేది ఏమిటంటే, మనలో పనిచేసే శరీరక్రియలు. ఎప్పుడైతే మనము శరీర క్రియలు జరిగిస్తామో, పాపమును కూడగట్టుకుంటాము. నిజానికి మనలో దేవుని ప్రేమ ఉంటుంది, అయితే ఎప్పుడైతే శరీర క్రియ ప్రేరేపిస్తుందో ఆ ప్రేమను చంపివేసేవారముగా అయిపోతాము. దేవుని ప్రేమ లేనివాడు ఆయనవాడవు కాదు.

ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; – 1 కొరింథీ 13:4

కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. అయితే ప్రేమ నీలో ఉంటే సహనము ఉంటుంది. నీవు దయను కలిగినవాడుగా ఉంటావు. ప్రేమ కలిగినవారు డంబముగా ప్రవర్తించదు. ఇంకా చూస్తే, “అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్ని టికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. – 1 కొరింథీ 13:5-7“. మనము ప్రత్యేకించబడినవారము. యేసయ్యే మన ప్రత్యేకత. ఈ లక్షణములు మనము క్రియా రూపములో కనపరచినప్పుడు మనము దేవునిలో నిలిచి ఉన్నామని సాక్ష్యము ఇవ్వగలుగుతాము.

మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి. – మత్తయి 5:16.

నిత్య నరకము లోనికి వెళ్ళకుండునట్లు, “ప్రేమ” కలిగి ఉండుట అనే “దేవుని ఆజ్ఞ” ను పాటించుట కొరకు నీ జీవితమును మార్చుకొనవలసినదే అని గుర్తించు. దేవుని ఆజ్ఞ మన జీవితమునకు దీపము అయి ఉన్నది.

ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచి యుండును; ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మమూలముగా తెలిసికొను చున్నాము. – 1 యోహాను 3:22

నిత్య నరకము లోనికి వెళ్ళకుండునట్లు, “ప్రేమ” కలిగి ఉండుట అనే “దేవుని ఆజ్ఞ” ను పాటించుట కొరకు నీ జీవితమును మార్చుకొనవలసినదే అని గుర్తించు. దేవుని ఆజ్ఞ మన జీవితమునకు దీపము అయి ఉన్నది.

యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పుకొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు – 1 యోహాను 4:15.

యేసుకు తండ్రి చేత సర్వాధికారము ఇవ్వబడినది అనే సత్యమును అంగీకరించాలి. అలాగే అనేకసార్లు మనము వినేది, “కేవలము ప్రార్థన వలన ఏమి జరుగుతుంది?” అనే మాటలు. అయితే నీవు ఆయన మాట నమ్మాలి, ఆయన అధికారముకలిగిన వాడు అని మనము నమ్మాలి.

కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము. – హెబ్రీయులకు 13:15.

మనము ఆరాధించే సమయములో తెలియచేయబడిన సత్యమును ఒప్పుకొంటున్నాము. ఆ సత్యము యేసే అయి ఉన్నాడు. అలాగే-

కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడుకాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు వాడు – 1 యోహాను 2: 23
మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. మత్తయి – 10:32

నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. “నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, నేను వానియందును నిలిచియుందుము.” – యోహాను 6:55-56.
దానిని విరిచియిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను – 1 కొరింథీ 11:24

మనకొరకు నలుగగొట్టబడి, మన పాపముల కొరకు శిక్షించబడినది చెల్లించినది ఆయన శరీరము. మన పాపములకొరకు ప్రాయశ్చిత్తము చేసి వెల చెల్లించినది ఆయన రక్తము. ఈ సత్యము గ్రహించి మనము సిద్ధపడాలి. మనము ఫలించాలి అనేది ఆయన ఆశ!

మరొక సత్యము, కొన్ని సందర్భాలలో భౌతికముగా ప్రభు శరీరము, రక్తము లలో పాలు కలిగి ఉండలేము. అయితే శరీరమునకు సాదృశ్యమైన “వాక్యము” నకు లోబడి ఉంటే, నీవు పాలు కలిగి ఉన్నట్టే

ఈరోజు నేర్చుకున్న నాలుగు విషయాలు.
1. దేవుని ప్రేమను కలిగి ఉండాలి.
2. దేవుని మాటలు లోబడి ఆజ్ఞలు పాటించాలి.
3. ఆయన నామమును ఒప్పుకోవాలి.
4. ఆయన శరీరము, రక్తములో పాలు కలిగి ఉండాలి.