నీ దయలో నేనున్న ఇంత కాలం
నీ దయలో నేనున్న ఇంత కాలం
నీ కృపలో దాచినావు గత కాలం (2)
నీ దయ లేనిదే నేనేమౌదునో (2)
తెలియదయ్యా… ||నీ దయలో||
తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో
చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2)
నీ దయ ఉంటే వారు – కాగలరు అధిపతులుగా
నీ దయ లేకపోతే ఇలలో – బ్రతుకుట జరుగునా
నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని
నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని ||నీ దయలో||
నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు
అపవాది కోరలకు అంటకుండ దాచావు (2)
నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము
ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు
నీ పాదాల చెంతనే నే పరవశించాలని
నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని ||నీ దయలో||
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా (2)
నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ||
నాకు ఉన్న సామర్ధ్యం
నాకు ఉన్న సౌకర్యం
నాకు ఉన్న సౌభాగ్యం
నాకు ఉన్న సంతానం (2)
ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం (2)
కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ||
నాకు ఉన్న ఈ బలం
నాకు ఉన్న ఈ పొలం
త్రాగుచున్న ఈ జలం
నిలువ నీడ ఈ గృహం (2)
నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం (2)
కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ||
ఆరాధన వర్తమాన
మనలను సజీవుల లెక్కలో ఉంచిన ప్రభువుకే మహిమ కలుగును గాక! సజీవులే కదా దేవునిని స్తుతించగలరు అని లేఖనములు చెప్పుచున్నవి కదా! మనము జీవించుటకు అనేకమైన కారణాలు ఉన్నప్పటికీ, ప్రాముఖ్యమైనది “దేవునిని మహిమ పరచడం”.
ఈరోజు మనకు ఆయుష్షు దేవుడే ఇచ్చాడు, సమయము దేవుడే ఇచ్చాడు. మనము ఆయనను ఆరాధించునప్పుడు ఆత్మతోనూ సత్యములోను ఆరాధించాలి. ఉదయాన ఒక విషయము నేర్చుకున్నాము, “మన దేవుడు మనలను రాబోవు ఉగ్రతనుండి తప్పించాడు”. అగ్ని ఆరని, పురుగు చావని నిత్య నరకమునుండి మనలను తప్పించాడు.
సజీవులు మాత్రమే దేవునిని ఆరాధించగలరు. మన జీవితాలను పరీక్షించుకుంటే, మనము భౌతికముగా సజీవముగా కనబడినప్పటికీ, మన జీవితాలను మరణము ఏలుబడి చేస్తుంది. ఆదామును చూస్తే నిషేధించబడిన ఫలము తిన్నప్పుడు, భౌతికముగా మరణించనప్పటికీ, ఆత్మీయముగా మరణించిన స్థితిలో ఉన్నాడు. అలాగే మనము కూడా కనబడటానికి సజీవంగా కనబడినప్పటికీ, మరణము చేత ఏలుబడి చేయబడుతున్నవారముగా ఉండిపోతున్నాము. అయితే ఈరోజు నీవు ఆరాధించుచుండగా ఏదైతే నీవు సంతోషించలేని పరిస్థితి ఉందో మార్చబడుతుంది. ఈరోజు నీవు చేయబోయే ఆరాధన నీ లేమి లోనుండి, నీ అసమాధానపు స్థితిలోనుండి తప్పిస్తుంది.
మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి; మనము దేవుని పిల్లలమే.ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏల యనగా అది ఆయనను ఎరుగలేదు – 1 యోహాను 3:1
ఆ దేవుని ప్రేమ మనము దేవుని కుమారులుగా పిలువబడునట్లుగా చేస్తుంది. మనకు జ్ఞానము, శక్తి లేనప్పటికీ దేవునిని అంగీకరించిన కారణము బట్టి, మనము దేవుని కుమారులుగా చేయబడి, దేవుని బట్టియే సిద్ధపరచబడతాము. తప్పిపోయిన కుమారుడి జీవితాన్ని చూస్తే, అతడు తిరిగి వచ్చినప్పుడు కంపు కొట్టే పరిస్థితులలో ఉన్నాడు. అయితే తండ్రి ఆ కుమారుని మెడమీద పడి ముద్దు పెట్టుకున్నప్పుడు చుట్టూ ఉన్న దాసులు కూడా ఆ కుమారుని అంగీకరించినవారుగా ఉంటారు. అంతే కాక! మంచి ప్రశస్త వస్త్రములు కట్టించాడు. తప్పిపోయినప్పటికీ “నా కుమారుడు” అనే భావము ప్రకటించాడు.
అదే విధముగా ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ పరలోకపు తండ్రి నీవునూ దేవుని కుమారులుగా పిలువబడునట్లు ఎట్టిప్రేమను అనుగ్రహించాడో చూసావా! నీవు దేవుని కుమారునిగా పిలువబడాలి అనేది నీ తండ్రి ఆశ. ఈ గుర్తింపు ఏమాత్రము పోగొట్టుకోకూడదు.
అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు – 1 పేతురు 2:9
చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలవబడ్డాము అంటే ఎలా? ఒక విధముగా చూస్తే మనము పాపిగా జీవించాము యేసయ్యను అంగీకరించిన తరువాత వెలుగులోనికి వచ్చాము. ఇంకా లోతుగా చూస్తే, చీకటిలో మరణము ఉంది వెలుగులో జీవము ఉంది. మరణమునుండి జీవములోనికి పిలువబడ్డాము. ఇప్పుడు తండ్రి గుణాతిశయములను ప్రచురము చేసేవారిగా ఉండుటకు పిలువబడ్డాము. అంటే, ఆయన జీవపు వెలుగుకు సాక్షులుగా ఉన్నాము. నీవు ఏమై ఉన్నావో ఎరిగి ఉండుట ఎంతో ఆవశ్యము. అందుకే సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అంటే, దేవుని ప్రేమను ప్రచురపరచే దేవుని కుమారునిగా సాక్ష్యము కనుపరచి స్తుతించాలి.
మనమీద ఉన్న దేవుని ప్రేమను బట్టి మన జీవితాలు పరిపూర్ణముగా చేయబడతాయి. తప్పిపోయిన కుమారుడు కూడా నా తండ్రి ఇంటిలో ఉన్న అనేకమైన పనివారిలో ఒకరిగా ఉంటాను అని అనుకున్నాడు. అయితే తండ్రి ప్రేమ కుమారునిగానే అంగీకరించులాగున చేసింది. పనివాడుగా ఉండి ఉంటే, స్వాతంత్ర్యము లేనివాడిగా ఉంటాడు అయితే కుమారునిగా అంగీకరించిన కారణాన యజమానుని స్వాతంత్ర్యము పొందుకున్నాడు. అటువంటి నీ పరలోకపు తండ్రి ప్రేమను ఎరిగి, గుర్తించి మనసారా ఆయనను ఆరాధిద్దాము స్తుతిద్దాము.
మన జీవితాలు మహిమా జీవితాలు. ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని జ్ఞాపకము చేసుకుంటే, వారు అరణ్యములో ఉన్నప్పుడు వారి చెప్పులు అరిగిపోలేదు, బట్టలు చిరిగిపోలేదు. అది కేవలము దేవుని మహిమ వలన ఆ కార్యము జరిగింది. ఈ లోకములో ఉన్న మన జీవితాలు కూడా మహిమా జీవితాలే. దేవుని ఆత్మ చేత ఈ జీవితాన్ని స్వతంత్రించుకోవాలి. మనకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యము దేవుని కుమారులుగా పిలువబడి మహిమ కరమైన జీవితము కలిగి ఉండుట.
ఆరాధన గీతము
ప్రేమ యేసుని ప్రేమ – అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము – ఇది భువి అందించలేనిది
ఎన్నడెన్నడు మారనిది – నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది – నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ||
నన్ను చూచిన ప్రేమ – నన్నుచేర్చుకున్న ప్రేమ
చీకటిలో ఉన్న నన్ను- వెలుగులోకి నడిపిన ప్రేమ ||ఎన్నడెన్నడు||
Main message| మెయిన్ మెసేజ్
ఈరోజు మన ధ్యానము “కృప విస్తరించును”. దేవుని కృప గురించి మనకు ఎక్కువగా తెలియని స్థితిలో ఉంటున్నాము.
చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్ల నెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను – యిర్మియా 31:3
దేవుడు చెప్పుచున్న మాటలు, “నిన్ను ప్రేమించుచున్నాను గనుక” నిన్ను “విడువక” “కృప” చూపించుచున్నాను అని. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను విడువక నీ యెడల కృపచూపుచున్నాడు. ఈ కృపనే ఆధారము చేసుకుని మనము బ్రతకాలి. ఈ కృప తండ్రి యొద్దనుండి మనకు ఇవ్వబడింది. దేవుని ప్రేమ మన జీవితము చివరివరకు చూపించబడుతుంది గనుక ఆయన కృప కూడా మన జీవితము చివరివరకు ఉంటుంది. ఒకవేళ నీవు దేవునితో ఉంటే ప్రేమ నీ జీవితములో పరిపూర్ణం అవుతుంది. ఒకవేళ నీవు దేవునితో సమాధానము లేని స్థితిలో ఉంటే, ప్రేమ నిన్ను తిరిగి దేవుని దగ్గరకే చేరుస్తుంది. అందుకే ఆయనది శాశ్వతమైన ప్రేమ. అందుకే మనము ఆయన కృప మీద ఆధారపడాలి. దేవుని కృప యొక్క లక్షణము “విస్తరించుట” నిన్ను నీ జీవితకాలము “వెంబడించుట”.
దేవుని కృపలోనే అన్నీ ఉన్నాయి అని అనేకసార్లు మనకు వాక్యము బోధించబడింది. అన్నీ అంటే క్షమాపణ, దయ, సమాధానము మొదలైన దేవుని గుణలక్షణములన్నీ ఆ కృపలో మనకు విడుదల అవుతాయి. ఎవరికి ఏది అవసరమో అది ప్రతి ఒక్కరి జీవితములో విడుదల అవుతుంది.
యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచునుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు – 2 దినవృత్తాంతములు 6:14
మన శరీర జీవితములో మనకు ఉన్న ఉద్యోగము బట్టి ఎమైనా సమకూర్చుకోగలము అని సంతోషముగా ఉంటాము. అయితే ప్రపంచ పరిస్థితులను బట్టి ఆ ఉద్యోగము ఉండవచ్చు పోవచ్చు. అయితే దేవునిని ఆధారము చేసుకునేవారు ఏ పరిస్థితిలోనైనా దేవుని కృపను బట్టి నిలబడతారు.
యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును. కీర్తన 107:1
కృప ద్వారా జరిగేది సూపర్ నేచురల్ విషయాలు. అది నీ జీవితములో ప్రతి పరిస్థితిలోను సూపర్ నేచురల్ జరిగిస్తుంది. అయితే కృప యొక్క లక్షణము – “విస్తరించుట”.
అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు – ఆదికాండము 24:27
“కృప చూపుట మానలేదు” అంటే దాని అర్థము ఇంతకు ముందు కూడా కృప చూపించాడు అనే కదా! అబ్రహాము జీవితములో ఇంతకుముందు ఎక్కడ కృప చూపించాడు? ఇస్సాకు పుట్టుకలో కృప చూపించాడు. శారా గర్భము మృతతుల్యము అయిపోయింది, స్త్రీ ధర్మము నిలిచిపోయింది అయితే దేవుని కృపనుబట్టి సూపర్ నేచురల్ జరిగి ఇస్సాకు పుట్టుక జరిగింది. అయితే ఇప్పుడు ఇస్సాకు వివాహము విషయములో కూడా ఆ కృప చూపించబడింది.
మన జీవితములో కూడా దేవుని కృప విడుదల చేయబడుతుంది.
అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృపచేత మీరు రక్షింపబడియున్నారు.ఎఫెసీ 2:4-5
నీవు క్రీస్తును అంగీకరించావు అంటే, నీ పుట్టుక ఎటువంటిది? ఒకప్పుడు మన జీవితాలు పాపముతో చచ్చిన జీవితాలు. అయితే యేసుక్రీస్తు ద్వారా నూతనమైన జీవితము ఇవ్వబడింది. అయితే నూతనమైన జీవితము పొందుకోవడానికి మనము ఏమి చేసాము? ఏమీ చేయ్యలేదు. ఆయనే ముందుగా నిర్ణయించి, వెతికి, సువార్తను ప్రకటించి తన ప్రేమను వెల్లడి పరిచాడు. ఇంతకు ముందు నీవు పాపివి అంటే ఒప్పుకునేవాడివా? అయితే ఈరోజు నీలో ఆ మార్పు ఎలా వచ్చింది? కృపను బట్టి.
ఇస్సాకు జీవితములో పుట్టుకలో మొదలయిన కృప వివాహము విషయములో కూడా విస్తరించింది. సుబుద్ధి గలిగిన భార్య యెహోవా దానము. ఇస్సాకు ఉన్న పరిస్థితి చూస్తే, తల్లి చనిపోయి దుఃఖములో ఉన్నాడు. అయితే దేవుని కృపను బట్టి భార్యను పొంది, తన కష్టములో దుఃఖనివారణ పొందాడు.
అలాగే మన ఆత్మీయ పుట్టుక కృపను బట్టి కలిగింది. మన ఆత్మీయ జీవితము కొనసాగించబడుతుండగా, మనమున్న కష్ట పరిస్థితులలో కూడా దేవుని కృప విడుదల అవుతుంది. అందుకే దేవుని కృప నిరంతరము ఉంటుంది అని వ్రాయబడింది.
దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. 2 పేతురు 1:3
యేసయ్యను గూర్చిన అనుభవములో నీవుంటే, ఆ అనుభవ జ్ఞానము బట్టి నీ జీవితములో కృప మరియు సమాధానము విస్తరిస్తుంది. దావీదు గురించి ఒకసారి ఆలోచిస్తే,
నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను – 2 సమూయేలు 7:15
నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచుచున్నాను – కీర్తన 52:8
దావీదుకు దేవుని కృప అనుగ్రహించబడింది. దావీదు కూడా ఆ కృపయందే నమ్మిక ఉంచాడు. అందుకే దేవునిని కాపరిగా గుర్తించాడు. “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడుశాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు – కీర్తన 23:1-2”. కాపరిని గూర్చి ఆలోచిస్తే, ఆ కాపరి ఎలా నడిచివెళ్తే ఆ గొర్రెలుకూడా ఆ కాపరివెంటే వెళతాయి. ఆ కాపరి పచ్చికవద్దకు తీసుకెళతాడు. మన జీవితములో దేవుని చేత కృప అనుగ్రహించబడుతుంది. ఆ కృప ఎక్కడికి తీస్కెళుతుంది? జీవము కలిగిన స్థితిలోనికే! అందుకె దావీదు ఇలా చెప్పగలుగుతున్నాడు – “నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చునుచిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను – కీర్తన 23:6”. దేవుని కృపను నమ్మినవాడే ఇలా చెప్పగలడు. పరిస్థితులు కష్టముగా ఉన్నప్పటికీ, “గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును. నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువునూనెతో నా తల అంటియున్నావునా గిన్నె నిండి పొర్లుచున్నది – కీర్తన 23:4-5” అని చెప్పగలుగుతాము. ఇలా దావీదు దేవుని చేత అనుగ్రహించబడిన కృపచేత నడిపించబడ్డాడు.
శత్రువు యెదుట భోజనము సిద్ధపరచుదువు అనగా ఏమిటి? శత్రువు ఎప్పుడు నీ నాశనాన్నే కోరుకుంటాడు. అయితే వెంట వచ్చుచున్న కృపను బట్టి నీ శత్రువు ప్రయత్నాలు ఏమీ నెరవేరవు, నీ శత్రువు సిగ్గుపరచబడపోతున్నాడు. ఆమేన్! ఒకవేళ మనము బలము కలిగి ఉంటే, శత్రువును ఓడిస్తాము. అయితే వాడు శత్రువు నిలబడుతున్నాడు అంటే, నీవు బలహీనుడవు. అయితే నీకు దేవుడనుగ్రహించిన కృప నీ బలహీన పరిస్థితిలో నీ శత్రువును సిగ్గుపరుస్తుంది. మనము చూసిన పచ్చిక అవసరమైన పరిస్థితులు, గాఢాంధకరాము వంటి పరిస్థితులు, శత్రువులు చుట్టుముట్టిన పరిస్థితులు అన్నీ ఒకే సారి రావు. ఒక్కక్కటిగా తన పరిస్థితులలో, విడుదల అయిన కృపను గూర్చిన అనుభవ జ్ఞానము బట్టి, తరువాత వచ్చుచున్న పరిస్థితులలో ఆ కృప మీదే ఆధారపడి నిలబడి, ఆ కృపకు సాక్ష్యముగా ఉన్నాడు. ఇలా దేవుని కృప విస్తరిస్తుంది అని మనము తెలుసుకోగలము. దావీదు కృపను ఎరిగి ఉన్నాడు గనుకనే “నా ప్రాణమా ఆయన చేసిన మేలులను మరువకు అని చెప్పుచున్నాడు”.
దావీదు జీవితములోనే కాదు గానీ సొలోమోను జీవితములో కూడా చూస్తే,
సొలొమోను ఈలాగు మనవి చేసెనునీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్య మును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతనియెడల పరిపూర్ణ కటాక్షమగుపరచి, యీ దినముననున్నట్లుగా అతని సింహాసనముమీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతనియందు మహాకృపను చూపియున్నావు 1 రాజులు 3:6
సొలోమోను సింహాసనము మీద కూర్చున్నాడు. దావీదుకు అనుగ్రహించబడిన కృప తన తరువాత తరముకు కూడా అనుగ్రహించబడుతుంది. మనము కూడా మన జీవితాలను చూద్దాము. దావీదుకు దేవుని కృపను గూర్చిన అనుభవము కలిగి ఉన్నాడు. మనము యేసు క్రీస్తును గూర్చిన అనుభవము కలిగి ఉండాలి.
నేను గొఱ్ఱలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱలకొరకు తన ప్రాణము పెట్టును – యోహాను 10:11
కాపరిగా ఉన్న యేసయ్య తన కృపను మన జీవితములో విస్తరింపచేసేవాడుగా ఉన్నాడు. ఈ అనుభవ జ్ఞానము మనము కలిగి ఉండాలి.
మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో, ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. రోమా 5:20-21
యేసు క్రీస్తు కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మూలము గా ఏలు నిమిత్తము ఆయన కృప ఎక్కడ విస్తరిస్తుంది? పాపము ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప విస్తరిస్తుంది. పాపము వలన వచ్చేది మరణము. ఎక్కడైతే నీ జీవితములో నెగటివ్ పరిస్థితులు ఉన్నాయో అక్కడ నిన్ను తప్పించడానికి దేవుని కృప విడుదల అవుతుంది. ప్రత్యేకించి “నీ శత్రువును నీవు ఏలు నిమిత్తము దేవుని కృప నీకు తోడుగా వస్తుంది”.
వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై యుండి, వెనువెంట జరుగుచువచ్చిన సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. – మార్కు 16:20
నీ శత్రువు సిగ్గుపడటమే దేవుడు నీకు అనుగ్రహించుచున్న కృపను బట్టి జరిగేది. నేను బ్రదుకు దినములన్నియు నేను ఏలువాడుగా ఉంటాను. నా వెంట వచ్చుచున్న కృపను బట్టి చిరకాలము దేవునికి సాక్షిగా ఉందును అని నీవు చెప్పగలుగుతావు.