05-02-2023 ఆదివారం మొదటి ఆరాధన – ప్రార్థించు

చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు

చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నేను నమ్మిన నా యేసుడు
చాలా మంచోడు– చాలా చాలా మంచోడు
నాకు దొరికిన నా యేసుడు (2)
మాటలలో చెప్పలేనంత
చేతలలో చూపలేనంత (2)
చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు
చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు (2) ||చాలా||

నా పాప శిక్షను తాను మోసెను
నా కొరకు కలువారిలో త్యాగమాయెను (2)
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో||

యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు
జగమంతా వెదకినా కానరారులే (2)
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో||

ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు
వింతైన ప్రేమ అంతు చిక్కదు (2)
కలువరిలో చూపిన ప్రేమ
శాపమునే బాపిన ప్రేమ (2) ||మాటలలో||

నిన్నారాధించెదను – నా పూర్ణ హృదయముతో

నిన్నారాధించెదను – నా పూర్ణ హృదయముతో
అన్నివేళలయందు – పరిశుద్ధాత్మలో ఆనందించెదను
నీతో నడవాలి – కీర్తిని చాటాలి
నీ సన్నిధిలో నిత్యం నిలవాలి, యేసయ్య

ఏది నీకు సాటి – రానే రాదు యేసయ్యా
మనుషులైన లోకమైన నీకు పోటీ కాదయా !
ఒకటే మాటగా – ఒకటే బాటగా
నిరతం ఒకే రీతిగా వుండే దేవుడవు యేసయ్య … నీవయా

శాంతినిచ్చు దేవా – ముక్తినొసగే తండ్రి
వ్యాధులైన బాధలైన రూపుమాపే నాథుడా
కన్నతండ్రిగా – ప్రేమ మూర్తిగా
చివరి శ్వాసవరకు కాచే దేవుడవు యేసయ్యా

సర్వేశ్వరా నీకే స్తుతి

సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభూ
ఆధారము ఆశ్రయము నీవే నా యేసు
నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి

చిన్న చిన్న గొర్రె పిల్లలము కాపరివై మము కాయుము
అమ్మ నాన్న అన్నీ నీవే ఆదరించి సేదదీర్చుము
నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి

పరుగెత్తినా కొండ కోనలలోన పచ్చని పచ్చికలో
అండదండ కొండా కోనా నీవే యేసు
నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి

 

ఆరాధన వర్తమానం

ఈ దినము మనకొరకు సిద్ధపరచి ఏర్పాటుచేసిన దినము. ఈ దినము యొక్క ప్రత్యేకతను నువ్వు గుర్తించినట్టయితే ఖచ్చితముగా నీవు సంతోషిస్తావు. ఈ దినము నీ తండ్రి నీతో మాట్లాడేవాడు అని గమనించండి. అందుకే ఉదాసీనముగా అస్సలు ఉండకండి.

మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి – రోమా 1:21

మన దేవుడు ఏమై ఉంటున్నాడో మనము అనేకమైన ఆదివారములు మనము ధ్యానించి తెలుసుకున్నాము. పైన చూసిన రోమా పత్రికలో చుశిన వాక్యము ప్రకారము మనము ఉండకూడదు అని దేవుని ఉద్దేశ్యము. దేవుడు నాకు ఏమి చేసాడు? ఎందుకు ఆయనను ఆరాధించాలి? అని ప్రశ్న ఉంటుందేమో! నయోమి దేవునిని ఎరిగిన స్త్రీ అయినప్పటికీ ఆమెకు జరిగిన అన్యాయమును బట్టి, దేవుని పట్టణమును విడిచి వెళ్ళింది.

వాదము అంటే ఎలా చూడవచ్చు అంటే, దేవునికి నీకు సమాధానము లేని స్థితి. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము, వాక్కు ఇంకా నెరవేరలేని స్థితిలో నీకు దేవుని మీద కలిగే ప్రశ్నార్ధకమైన స్థితి. ఆ స్థితి నిన్ను ఆరాధించనివ్వదు. అయితే నువ్వు గమనించవలసిన సత్యము, నీ వాదములను తీర్చువాడు నీ దేవుడు మాత్రమే.

యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు. యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి – కీర్తన 145:8-9.

అందుకే దేవుని గూర్చిన విషయములలో పాజిటివ్ గానే మనము ఉండాలి. దేవుని విషయములు కొన్నిసార్లు మనకు అర్థము కావు. లాజరు రోగిగా ఉన్నప్పుడు యేసయ్యకు కబురు పెట్టినప్పటికీ, రాలేని పరిస్థితులలో లాజరు చనిపోయాడు. అయితే విడిచిపెట్టబడినవాడు కాదు. చనిపోయినప్పటికీ తిరిగి జీవించినవాడుగా అయ్యి, దేవునికి గొప్ప మహిమ కలుగుటలో ఒక సాధనముగా అయ్యాడు.

ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద ఉన్నవి. నేను కూడా ఆయన కార్యము అయి ఉన్నాను. నేను ఆయన చేతి పని, ఆయన కనికరము నా మీద ఉంది అని నీవు జ్ఞాపకము చేసుకుంటే నీ ఆత్మలో ఎంతో సమాధానము కలుగుతుంది.

ఏ విషయము చూసి మీరు భయపడుతున్నారో దానికి విరుగుడు దేవుని వాక్యమే. మీరు ఎటువంటి పరిస్థితులలో ఉన్నా, దేవుని వాక్యము జ్ఞాపకము చేసుకోండి. అది నీ ఆత్మను బలపరస్తుంది. అప్పుడు నీ శరీరము కూడా బలము పుంజుకుంటుంది.

ఆయన కనికరము మన మీద ఉంది అంటే ఏంటి మనకు ప్రయోజనము?

యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడనుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. జనసమూ హములు ఆ సంగతి విని, పట్టణములనుండి కాలినడకను ఆయనవెంట వెళ్లిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహ మును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. – మత్తయి 14:13:14.

జనసమూహము యేసు అరణ్య ప్రదేశమునకు వెళ్ళిన సంగతి విని పట్టణముల నుండి కాలి నడకను ఆయన వెంట వెళ్ళారు. అప్పుడు ఆయన వచ్చి గొప్ప సమూహముగా ఉన్న వారిని చూసి, వారిలో రోగులయినవారిని స్వస్థపరిచారు. ఆయనకు ఎందుకు కనికరము కలిగింది? అంటే వారు రోగముతో ఉన్నప్పటికీ ఎంతో ఆశతో, అరణ్యప్రదేశములోనికి యేసయ్య దగ్గరకు వచ్చారు. వారి ఆసక్తి మరియు ఆశ యేసయ్యకు కనికరము పుట్టించింది.

నీవున్న స్థితిలో డీలా పడకుండా నీ యేసయ్య దగ్గరకి నీవున్న స్థితిలోనే వస్తే, ఆయన కనికరము నీమీద నిలుస్తుంది గనుక, నీవు సంతోషించలేని నీ నెగటివ్ స్థితి సంతోషకరముగా మార్చబడుతుంది. ఎంత గొప్ప భాగ్యము?

ఈ చివరి దినములలో ఎవరికి వారే పక్కవారి గూర్చి ఆలోచించే సమయమే ఉండదు. ఒకవేళ ఆలోచించినా ఏ మాత్రము సహాయము చేయలేని స్థితిలో ఉంటారు. తల్లిదండ్రులు సహితము, పిల్లలు ఉన్న స్థితిలో కృంగిపోవటము తప్ప వారికి సహాయము చేయలేని స్థితిలో ఉంటారు. అయితే వారు నా దేవుడు పరమతండ్రి, ఆయన కనికరము కలవాడు అని ఎరిగినట్టయితే వారి పిల్లల స్థితిని దేవదేవుని దగ్గరకు ఆసక్తితో ఆశతో తీసుకువస్తారు. అప్పుడు దేవుని కనికరము వారి పిల్లల స్థితి మారుస్తుంది.

తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి – కీర్తన 104:27

కనికరము కలిగిన నీ దేవుని దయ కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఏమి జరుతుంది?

నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును – యోహాను 15:7

కనికరము కలిగిన నీ దేవుని దయ కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఏమి జరుతుంది? నీ హృదయవాంఛ తీర్చబడుతుంది. ఆమేన్! మనకు వేరే అవకాశము లేదు గనుక మనము ఆయన దయకొరకు కనిపెట్టుకుంటాము. అయితే ఆయన కనికరము దొరకుట ఎంత గొప్ప భాగ్యము? ఎందుకు మనకు ఆయన కనికరము దొరికింది అంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కనుకనే కదా!

ఈ సమయములో ఆయనను మనస్పూర్తిగా ఆరాధిస్తావా? నీవు ఈ వాక్యము చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడన్న సత్యము నీవు గ్రహిస్తే ఆయనను ఆరాధిస్తావా? నీవు దేవుడవు, నాకు ఉపకారివి, నీవు గుప్పిలి విప్పుతున్నావు కనుకనే నేను తృప్తిపరచబడుతున్నాను, కృప కలిగిన దేవా నీకు వందనాలు అని స్తుతిస్తావా?

ఆరాధన గీతము

స్తుతియించెద నీ నామం దేవా అనుదినం
దయతో కాపాడినావు కృపనే చూపించినావు
నిను నే మరువనేసు నిను నే విడువనేసు

“వారు దేవునిని ఎరిగియు మహిమపరచలేదు, కృతజ్ఞతా స్తుతి చెల్లించలేదు”, దయచేసి మనము అలా ఉండవద్దు. నేను నిన్ను అనుదినము, అనుక్షణము స్తుతిస్తాను తండ్రీ అని ప్రకటిద్దాము. పాపము ద్వారా మనలను ఏలే మరణమునుండి తప్పించింది ఆయన కృపయే, ఆయన ప్రేమయే. ఆ సత్యము ఒప్పుకుంటూ ఆయనను స్తుతిద్దామా? ఆరాధిద్దామా?


పాపియై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు
నిను నే మరువనేసు నిను నే విడువనేసు


సిలువే శరణం నీవే నాకు మార్గం
నిను నే మరువనేసు నిను నే విడువనేసు

 

 

Main message| మెయిన్ మెసేజ్

మనము అబద్ధాన్ని వెంబడించట్లేదు గానీ నిజమైన దేవునిని వెంబడిస్తున్నాము. అందుకే వాక్యము చెప్పేది సత్యము. ఆయన కనికరము నీ మీద నిలుస్తుంది అంటే నీ స్థితి మార్చబడుతుంది. ఇంతకు ముందు నీ స్థితి సరిగాలేదేమో, అనారోగ్యము ఉందేమో, అయితే నీవు సత్యము ఎరిగి ఆయనను స్తుతించినప్పుడు, నీ స్థితి మార్చబడుతుంది.

ఈ రోజు ప్రభువు మనతో మాట్లాడబోతున్నాడు, మీ జీవితములు మార్చబడుతున్నాయి. ఈరోజు మన ధ్యానంశము “ప్రార్థించు”.

మన ముందు యేసు ప్రభువు ఉన్నారు. ఆయన మనకు మాదిరి అయి ఉన్నారు.

క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరియుంచి పోయెను – 1 పేతురు 2:21

“నేను తన అడుగుజాడలలో నడచునట్లు అన్ని విషయాలలో మాదిరి ఉంచినాడు” అని నీవు తీసుకోవాలి. ప్రార్థించుటలో కూడా ఆయన ఒక మాదిరి ఉంచివెళ్ళాడు. ఆయన ఏ రీతిగా ప్రార్థించాడో తెలుసుకుందాము.

ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను – మార్కు 1:35.

ప్రార్థన అంటే దేవుని మాట్లాడుట. అయితే ఎప్పుడు మరియు ఎలా అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. యేసయ్య అయితే పెందలకడనే, ఇంకా చీకటిగా ఉండగానే లేచి ప్రార్థన చేసినవాడుగా ఉన్నాడు. ఈ దినము నేను దేవునితో ఆరంభించాలి అనే ఆశ ఆసక్తి కలిగి యేసయ్య ప్రార్థించాడు. అరణ్య ప్రదేశము అనగా ఎటువంటి ఆటంకములు లేని ప్రదేశము, దేవుడు తప్ప మరెవరు కనబడని
ప్రదేశము.

ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. లూక 6:12

ఇక్కడ కూడ, ఎవరూ ఆటంకపరచని ప్రదేశములో యేసయ్య ప్రార్థించాడు. మనము కూడా నేర్చుకోవలసినది ఏమిటంటే, ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి ఆటంకము లేని ప్రదేశమును సిద్ధపరచుకోవాలి. మనలను ఆటంకపరచేది మన మొబైల్. ప్రార్థించేటప్పుడు మీ మొబైల్స్ ను పక్కకు పెట్టండి, దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడటానికి సిద్ధపడండి.

కొంతమంది ఉదయము కొంతమంది రాత్రి ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆటంకములు లేకుండా ఆది చేయాలి అని గమనించండి

కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.- మత్తయి 6:9

మొదటిగా, ప్రార్థన చెయ్యవలసినది తండ్రికి అది కూడా యేసయ్య నామములో చెయ్యాలి. ఆ తరువాత ఆయన మహిమను, ఘనతను ప్రకటించాలి. “నీ నామము పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అనేది దానినే సూచిస్తుంది. అటుతరువాత నీ అవసరములు అడగాలి. అటుతరువాత ఆయన శక్తిని ఒప్పుకోవాలి.

1. తండ్రికి నీ ప్రార్థన సంబోధించాలి
2. దేవుని మహిమ ప్రకటించాలి
3. నీ అవసరము గూర్చి అడగాలి
4. నీవు అడిగినది దయచేయు సమర్థుడవు అని ఒప్పుకోవాలి
5. యేసు నామములో సమర్పించాలి

ప్రార్థన ఎప్పుడు చేయాలి? మనకు అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తాము, ఇంకొంతమంది శోధనలో పడకుండునట్లు ప్రార్థన చేస్తారు. అయితే ఈరోజు మరొక సత్యము తెలుసుకుందాము.

నీ జీవితములో దుష్టుడు పనిచేస్తున్నాడా? ఎలా పని చేస్తున్నాడు? దుష్టుడు అనగానే ఏదో భయంకరముగా భూతములాగా ఆలోచిస్తాము. అయితే అదంతా మన ఊహ. మీరు క్రీస్తు బిడ్డలు. అయినప్పటికీ దుష్టుడు మీ జీవితాలలో ఎల పనిచేస్తాడు?

ఎవడైనను రాజ్య మునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే. మత్తయి 13:19

నువ్వు వాక్యము వింటున్నావు అయితే నీవు ఆ విన్న వాక్యమును గ్రహించలేని దానిబట్టి నీవు విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకుపోతున్నాడు. ఆ కారణము చేత ఆ వాక్యము లోని జీవము నీలో ఫలించట్లేదు. నిజానికి దేవుడు పలుకగా ఆ ప్రకారము ఆయెను. అయితే ఆ వాక్యమును మనము గ్రహించలేని దానిని బట్టి దుష్టుడు ఆ వాక్యమును ఎత్తుకుపోతున్నాడు. అంటే నీకు దీపముగా ఉన్న వాక్యమును నీవు మర్చిపోవుట, ఆ వాక్యము ద్వారా నీ స్థితిలో దేవుడు ఏమి మాట్లాడాడో గ్రహించలేకపోవుట.

దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవునిమూలముగా పుట్టినవాడు తన్ను భద్రముచేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. – 1 యోహాను 5:18.

పాపము అంటేనే ఆజ్ఞాతిక్రమము. మనము పాపము చెయ్యకుండా ఎలా ఉండాలి? దేవుని మాటకు లోబడుట ద్వారా తనను భద్రము చేసుకొనుటను బట్టి నీవు పాపము చేయవు. దానిని బట్టి దుష్టుడు నిన్ను ముట్టడు. అందుకే నీవు ప్రార్థిస్తున్నప్పుడు, నిన్ను తాకిన వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థించు. నీవు స్వీకరించిన వాక్యము నెరవేర్పు కొరకు దానిని ఎత్తి పట్టి ప్రార్థించు. అప్పుడు నీవు ఆ వాక్యము గ్రహిస్తావు గనుక దుష్టుడు దానిని ఎత్తుకుపోలేడు. ఆ వాక్యము యొక్క ఫలింపు ఖచ్చితముగా నీ జీవితములో నెరవేరుతుంది. వాక్యము కలిగినవాడు అపవాదిని తరమ గలుగుతాడు.

ప్రార్థన మరొక విషయమును కూడా చేస్తుంది. అదేమిటో చూద్దాము.

నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. యిర్మియా 33:3

ప్రార్థన అంటే అడగడమే అనుకుంటాము, అయితే నీవు ఇంతవరకు గ్రహించలేని గూఢమైన మర్మములు గొప్పవైన సంగతులు దేవుడు తెలియచేస్తాడు.

క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. అపొస్తలుల కార్యములు 2:31

దావీదు క్రీస్తు పుట్టకముందు అనేకమైన సంవత్సరాలకు పూర్వము ఉన్నవాడు. అయితే క్రీస్తు పాతాళములో విడువబడలేదు అని, ఆయన శరీరము కుళ్ళిపోలేదు అని ఎలా గ్రహించాడు? మరొక మాట చూద్దాము.

ఆయననుగూర్చి దావీదు ఇట్లనెను నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచు చుంటిని ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును. – అపొస్తలుల కార్యములు 2:25-26

ఈ సత్యమును గ్రహించాలి. దావీదు ఎల్లప్పుడు ఎలా ప్రభువును చూస్తున్నాడు? ప్రార్థనలో ఉంటున్నాడు అని దాని అర్థము. ఆ ప్రార్థనలో విడుదల అయిన మర్మము దావీదును సంతోషింపచేసింది. అందుకే ఎమంటున్నాడు?

నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు – అపొస్తలుల కార్యములు 2:27.

క్రీస్తును గూర్చిన మర్మము తెలియపరచబడినాక దావీదు సత్యము గ్రహించి ప్రకటించాడు. క్రీస్తు పునరుత్థానుడయ్యాడు, నేను కూడా పునరుత్థానుడనవుతాను అని ప్రకటించాడు.

దావీదు ఎన్నిసార్లు ప్రార్థనలో ఉండేవాడు?

నీ న్యాయవిధులనుబట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించు చున్నాను – కీర్తన 119:164

మనకు దేవుడు కూడా ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఎన్నిసార్లు నీవు ఆయన సన్నిధికి వెళ్తున్నావు?

భౌతికముగా మనము చూసినట్టయితే, కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచివీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని, యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను. – యోహాను 6:5-6

ఇక్కడ యేసయ్యకు ఏమి చెయ్యాలి అని ఎలా తెలిసింది? ఫలాన రంగు ఇది అని మనకు ఎలా తెలిసింది? మనకు అలా నేర్పించబడింది గనుక మనము ఇప్పుడు గుర్తించగలము. యేసయ్య మనుష్య కుమారుడుగా భూమి మీదకు వచ్చాడు. “కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును – యోహాను 5:19”. అయితె యేసయ్య ఎక్కడికి వెళ్ళి, ఎలా చూసాడు? “నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును” అని వాక్యము చెప్తుంది కదా?

తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్య పడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును – యోహాను 5:20.
అలాగే, “నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది- యోహాను 5:30”.

అయితే ఎలా కనపరచబడింది? పగలు, రాత్రి దేవుని సన్నిధిలో గడపడమును బట్టి, దేవుని చిత్తము ఆయనకు బయలుపరచబడింది. యేసయ్య దేవుని సన్నిధిలో ఏమి అడిగి ఉంటాడు? “నాకు వేరే ఆహారము కలదు, అది నన్ను పంపిన నా తండ్రి చిత్తము నెరవేర్చుట” అని యేసయ్య చెప్తున్నాడు. ఆయన చేసే పరిచర్య కొరకైన మాటలే యేసయ్య దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు.

తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను – యోహాను 5:26.

దేవునికి మాత్రామే సృష్టించే అధికారము ఉంది. ఆ అధికారము యేసయ్యకు కూడా ఇవ్వబడింది. యేసయ్యకు ఈ మర్మమైన సత్యము గ్రహించిన యేసయ్య అనేకులకు భోజనము పెట్టగలిగాడు. నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపినప్పుడు అనేకమైన మర్మములు తెలుసుకుంటావు. అంతే కాక, గ్రహించిన సత్యమును బట్టి అద్భుతములు జరిగేవిగా ఉన్నాయి. ఆ అద్భుతమును బట్టి దేవుడు మహిమపరచబడతాడు.

అందుకే నీ జీవితములో ప్రార్థన ఒక భాగము అవ్వాలి. యేసయ్య మనకు మాదిరిగా ఉంచిన ప్రకారముగా ప్రార్థనా జీవితమును మార్చుకుందాము.