స్తోత్ర గీతములు
నీవు చేసిన మేళ్లకు
ఆరాధన వర్తమానము
ప్రభువు నమ్మదగినవాడు, ఆయన నమ్మకత్వాన్ని ఆయన మన యెడల కనపరచేవాడుగా ఉన్నాడు. ఈ సంవత్సరాన్ని ప్రభువు మనకు నూతనముగా ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరములో అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరూ ధన్యులమే! ఈ నూతన సంవత్సరము నీవే సాక్షివి అని ప్రభువు నిర్ణయించాడు. ఆయన నిర్ణయించినదానిని, క్రియల చేత కనపరచి, సాక్షిగా నిన్ను నన్ను నిలబెట్టేవాడుగా ప్రభువు ఉన్నాడు.
దేవుడు తన చిత్తమును తానే నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఆయన చిత్తము ఏమిటి అంటే, ఆయన కొరకు నీవే సాక్షివి. అయితే ఆ మాట నెరవేర్పు కొరకు, ఆయన సంకల్పము చొప్పున, సమస్తము నెరవేర్చబడతాయి. సమస్తము సమకూడి ఏమి జరుగుతుంది అంటే, నీవు సాక్షిగా నిలబడతావు. ఈ మాట నమ్మి, ప్రభువును ఆరాధించినపుడు సమకూర్చబడే మార్గమును నీవు కనుగొంటావు.
అయితే ఎందుకు మనము దేవునిని స్తుతించాలి? మహిమ పరచాలి? మనము అడగకమునుపే, ఆయన మనలను మొదటిగా ప్రేమించాడు, మన జీవితమును కావలసిన సమస్తము ఆయనే, దయచేసేవాడిగా ఉన్నాడు. నీవు అంగీకరించి స్వీకరించిన సత్యమే నీ జీవితములో స్థిరపరచబడుతుంది. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఏ ఆధారము లేనప్పుడు, మహిమను చూడగలిగే అవకాశము నీకు ఉంది.
నీ జీవితములో మేలు కలగడానికీ ఏ ఆధారము కనబడకపోతే, దేవుని మాటను నీవు నమ్మితే, మహిమను చూస్తావు.
ఆయన ఆలాగు చెప్పి–లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా౹ చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు– మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను. -యోహాను 11:43-44
సమాధి చేయబడినపుడు ఎలా అయితే కట్టబడ్డాడో, అలాగే లాజరు లేచాడు. ఒక మృత శరీరము పాతిపెట్టబడిన తరువాత, ఆ శరీరము కుళ్ళి పురుగులు తినివేసిన పరిస్థితిలో ఉంటుంది. అయితే దేవుని మహిమ లాజరు శరీరం మరలా జీవం పొందుకోవడానికి ఏమి అవసరమో, ఆ సమస్తమును సమకూర్చినదిగా ఉంటుంది. అలాగే ఈ దినము నీవు గనుక దేవుని మాటను నమ్మితే, నీవు ఖచ్చితముగా సాక్షిగా నిలబడతావు. దానికొరకు సమస్తము నీ దేవుడే సమకూరుస్తాడు. ఇది కళ్ళారా నీవు చూడగలుగుతావు.
లాజరు విషయములో మనము చూస్తే, అడ్డుగా ఉన్న రాయిని మొదట తొలగించాడు. అనగా నీవు సాక్షిగా ఉండటానికి ఏది అడ్డుగా ఉందో, అది మొదటిగా తొలగించబడుతుంది. ఆ తరువాత లాజరు బయటకు వచ్చాడు, అంటే నీవు సాక్షిగా ఉండటమే తరువాయి. గనుక మన దేవునిని మనము మనసారా ఆరాధిద్దాము.
తప్పిపోయిన కుమారుడి విషయములో ఊరందరి యెదుట తండ్రి ఇతడు నా కుమారుడు అని ప్రకటించాడు. తప్పిపోయిన కుమారుడు వెళ్ళినపుడు కుమారుడిగా వెళ్ళాడు, తిరిగి వచ్చినపుడు మాత్రము, కుమారుడిగా అనిపించుకోవడానికి ఏ మాత్రము యోగ్యము లేని వాడుగా వచ్చాడు. ఈ పరిస్థితి అంతా ఊరంతా చూసారు. అయితే తండ్రి యొక్క ప్రకటన ఉద్దేశ్యము, విందు చేయడానికి ఉద్దేశ్యము ఏమిటి అంటే, ఎవరి ఎదుట అయితే చెడిపోయినవాడిగా కనపరచబడ్డాడో, వారి యెదుట తన కుమారుడిగా కనపరచాడు.
అలాగే నీ జీవితము గూర్చి కూడా ఊరందరికీ తెలుసు, అయితే ఆ ఊరందరి ముందూ ప్రభువు నిన్ను సాక్షిగా నిలబెట్టాలి అని ఆశిస్తున్నాడు. వారు నిన్ను మంచి సాక్ష్యము కలవాడిగానే చూడాలి అనేది నీ తండ్రి కోరిక. చెడిన నీ జీవితమును బాగుచేయాలి అనేది నీ తండ్రి కోరిక, అది కూడా ఊరందరు కూడా నీ బాగుపడిన జీవితమును చూడాలి, వారందరి యెదుట నీవు దేవుని మహిమకు సాక్షిగా ఉండాలి.
తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినపుడు, ఒక దాసుడుగా ఉండటానికి వచ్చాడు. అయితే తండ్రి ఇంక నీవు దాసుడవు గానీ, కుమారుడవే అని చెప్పుచున్నాడు. దాసుడికి స్వతంత్రము లేదు, అధికారము లేదు గానీ కుమారుడికి స్వతంత్రము ఉంది, అధికారము ఉంది. అందుకే నీవు దాసుడవు కావు.
దాసుడుగా ఉన్నపుడు, యజమాని ఏమి చెప్తే, అదే దాసుడు చెయ్యాలి. అయితే కుమారుడి పరిస్థితి చూస్తే, కుమారుడు ఇష్టప్రకారము ఏమి చెప్తే, అది అక్కడ జరిగించబడుతుంది. అంటే కోరిక సిద్ధిస్తుంది, నెరవేరుతుంది.
తప్పిపోయిన కుమారుడు, తండ్రి దగ్గరనుండి దూరమైపోయి దుర్వ్యాపారము చేసినవాడుగా ఉన్నాడు. దానిని బట్టి కుమారుడి పరిస్థితి నుండి దాసుని స్థితికి దిగజారినాడు. అయితే తండ్రి ప్రేమ కలిగినవాడు గనుక, దాసునిగా ఉన్న జీవితమును కుమారుడిగా ప్రకటిస్తున్నాడు. నిన్ను కూడా ఈ దినము ప్రభువు కుమారినిగా ప్రకటిస్తున్నాడు.
తప్పిపోయిన కుమారునిని మంచి బట్టలతో ఎందుకు సిద్ధపరుస్తున్నాడు అని చూస్తే, తన రూపు కూడా తండ్రి యొక్క కుమారుడు అనే సాక్ష్యము కనపరచడానికే. ఈ దినము నీ జీవితములో కూడా, ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు, ఈమే నా ప్రియమైన కుమార్తె అని ప్రభువు ప్రకటించడానికి ఇష్టపడుతున్నాడు.
లాజరు తిరిగి లేచినపుడు, అతడిని చూడటానికి ఊరంతా వచ్చింది. అయితే తప్పిపోయిన కుమారుని విషయములో లాజరు విషయములో తేడా చూస్తే, తప్పిపోయిన కుమారుని విషయములో ఇతడి నా కుమారుడు అని తండ్రే ఊరంతా ప్రకటించాడు. అదే లాజరు విషయములో ఆ విషయము తెలుసుకొని, ఊరంతా తమకు తామే వెళ్ళారు. ఎందుకు అని చూస్తే, ఆ తరువాత యేసయ్య చనిపోయి తిరిగిలేచుట అనే కార్యము కొరకైన సాక్ష్యముగా లాజరు ఉన్నాడు.
ఈ సంవత్సరము గురించి జ్ఞాపకము చూస్తే, హనోకు దేవునితో నడుస్తూ, మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. అలాగే అనేకసంవత్సరముల తరువాత, ఏలియా మాత్రమే మరలా అలా కొనిపోబడ్డాడు. అలాగే మన జీవితములో ఎప్పుడో విన్నాము దీని గురించి, చెయ్యి ఉంచగానే స్వస్థత ఎప్పుడో కలిగింది.
తొలకరి వర్షము, కడవరి వర్షము కురిపించేవాడు దేవుడే. తొలకరి వర్షము అంటే ఆదిమ దినములలో జరిగిన అద్భుతమైన పరిచర్య. అలాగే కడవరి వర్షము అంటే, ఈ దినములలో అటువంటి పరిచర్య తిరిగి జరగటము.
తప్పిపోయిన కుమారుడి పరిస్థితి చూస్తే, అది తనకు తానే పాడు చేసుకొన్న పరిస్థితి. అప్పుడు తండ్రి తిరిగి వాడి స్థితిని ధరింపచేసాడు. అదే లాజరు విషయములో చూస్తే, యేసయ్యకు చాలా దగ్గరిగా ఉండి, ఆయనను ప్రేమించినవాడిగా ఉన్నాడు, అంతేకాక యేసయ్యచేత కూడా ప్రేమించబడినవాడు. తాను రోగిగా ఉన్నపుడు వర్తమానము కూడా యేసయ్యకు వర్తమానము పంపినవాడుగా ఉన్నాడు.
తప్పిపోయిన కుమారుడైతే దుర్వ్యాపారము చేత కోల్పోయాడు, లాజరు అయితే యేసయ్యతో ఉండి సహితము కోల్పోయాడు. అంటే 2024 లో మంచి ప్రార్థనా జీవితము కలిగి ఉండి కూడా కొన్ని విషయములలో నష్టము చూసావేమో, అయితే 2024 గడిచిపోయింది, అయితే ఇప్పుడు ఆ ప్రభువే, అడ్డు తొలగించి, సాక్షివై ఉండులాగున సమస్తము సిద్ధపరచేవాడుగా ఉన్నాడు.
2024 లో దేవునితో మంచి సహవాసము కలిగి, ఏ విషయములో దేవునిని అడుగుతూ వచ్చావో, ఆ విషయములో ప్రభువే కలుగచేసుకొని, 2025 లో నీ జీవితములో కార్యము చేసేవాడిగా ఉన్నాడు.
మనము చేతులారా పాడుచేసుకొని తిరిగి దేవుని వద్దకు వచ్చినపుడు, దేవుడు అందరి యెదుట ప్రకటించి, నిన్ను నిలబెట్టేవాడుగా ఉన్నాడు. అయితే నీవు దేవుని తో సరైన సంబంధము కలిగి ఉన్నట్టయితే, ఏ ప్రకటన అవసరము లేదు గానీ, నీ జీవితమే సాక్ష్యముగా ఉంటుంది అదే ఒక ప్రకటనగా ఉంటుంది.
అయితే ఇప్పుడు మనము చేయవలసినది ఏమిటి అని ఆలోచిస్తే,
మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము,౹ అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.౹ -తీతుకు 2:12-13
శుభప్రదమైన నిరీక్షణ ఏమిటి అంటే, ప్రభువు నిన్ను ఈ సంవత్సరము సాక్షిగా నిలబెట్టాలి అనేదే. అయితే దాని కొరకు – భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. భక్తిహీనత అంటే, దేవుని కార్యములయందు ఆసక్తి తగ్గిపోవుట. ఈ సంవత్సరము అలా మనము ఉండకూడదు.
తప్పిపోయిన కుమారుడి విషయములో చూస్తే, ఇంకా తాను బ్రతికి ఉన్నాడు కాబట్టి సమకూర్చబడటానికి అవకాశము ఉంది. అయితే లాజరు పోగొట్టుకున్నది ఇంక శాశ్వతముగా పోగొట్టుకొన్నట్టే. అయితే ఈ సంవత్సరము తప్పిపోయిన కుమారుడి జీవితములో ప్రత్యక్షపరచిన “లేని దానిని ఉన్నట్టుగా చేస్తాడు” అనే సత్యము, లాజరు జీవితములో ప్రత్యక్షపరచిన “మృతమైనదానిని సజీవముగా చేస్తాడు” అనే సత్యము నీ జీవితములో 2025 లో జరుగుతుంది. దానికి సంబంధించిన సమస్తము ప్రభువే సిద్ధపరుస్తాడు. మన కొరకు కూడా దేవుడు దాచిపెట్టాడు. తొడిగించబడవలసినవి, పెట్టబడవలసినవి మరియు ధరింపచేయబడవలసినవి ఏవైతే ఉన్నాయో, అవి ఈ సంవత్సరము జరుగుతాయి.
అయితే తండ్రి తన దాసులను చూచి –ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి; -లూకా 15:22
యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను.౹ యేసు–రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త–ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.౹ అందుకు యేసు–నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;౹ -యోహాను 11:38-40
యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను.౹ యేసు–రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త–ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.౹ అందుకు యేసు–నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;౹ -యోహాను 11:38-40
తప్పిపోయిన కుమారుని విషయములో ఇతనికి కట్టుడి, పెట్టుడి మరియు తొడిగించుడి అని తండ్రి దాసులతో చెప్పుచున్నాడు. అయితే ఆ దాసులు ఎక్కడనుండి తెస్తారు? తండ్రి సిద్ధపరచిన దానినే ఆ దాసులు తెస్తున్నారు. అలాగే నీ కొరకు సీయోను లోనుండి నిన్ను ఆశీర్వదించునట్లు తన దాసులకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.
వస్త్రములు కట్టబడటానికి గల ఉద్దేశ్యము ఏమిటి అంటే, తన కుమారుడిగా పిలవబడటానికే. అలాగే ప్రభువుకు సాక్షిగా ఉండటానికే నీ జీవితములో ప్రభువు కార్యము చేసేవాడిగా ఉన్నాడు. అంటే ఏ లోటు నీ జీవితములో ఉందో, ఆ లోటు తీర్చబడటానికి కుమారునిగా పిలిచేవాడిగా ఉన్నాడు. ఎక్కడ అయితే నీ జీవితము కట్టబడాలో అక్కడ నీ జీవితము కట్టబడటానికి ఆజ్ఞ ఇవ్వబడింది.
ఉంగరము విషయము చూస్తే, ఇంతకు ముందు ఆ కుమారునికి ఉంగరము ఉండేది గానీ, ఇప్పుడు లేదు. అయితే ఇప్పుడు త్వరగా ఉంగరము తెమ్మని తండ్రి చెప్పుచున్నాడు. అంటే ఏమి నీవు కలిగి ఇప్పుడు ఖాళీ అయిపోయావో, అది మరలా నింపబడుతుంది.
చెప్పులు విషయము చూస్తే, సమాధానమునకు, నెమ్మది కి గుర్తు అయి ఉన్నాయి. నీ జీవితమును బట్టి నెమ్మది లేని పరిస్థితి ఉందేమో, అయితే నీ జీవితములో ఇప్పుడు నెమ్మది కలిగి ఉండాలి.