04-Dec-2022 – ఆదివారము ఆరాధన – నీ దేవునిని పూర్ణ హృదయముతో అనుసరించు

ఎడబాయని నీ కృప

పల్లవి:
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ (2)
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని||

చరణం1.
శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2)
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగ (2)
కృపా కనికరముగల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని||

చరణం2.
విశ్వాస పోరాటంలో – ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2)
దుష్టుల క్షేమమునే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2)
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని||

చరణం3.
నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2)
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగ (2)
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని||

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య

1. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం – 2
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును – 2
నీవే రాకపోతే నేనేమైపోదునో – 2

2. ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా – 2
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు – 2
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య – 2

3. ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా – 2
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము – 2
నిన్ను మించిన దేవుడే లేడయ్య – 2

చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు

చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నేను నమ్మిన నా యేసుడు
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు
నాకు దొరికిన నా యేసుడు (2)
మాటలలో చెప్పలేనంత
చేతలలో చూపలేనంత (2)
చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు
చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు (2) ||చాలా||

నా పాప శిక్షను తాను మోసెను
నా కొరకు కలువారిలో త్యాగమాయెను (2)
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో||

యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు
జగమంతా వెదకినా కానరారులే (2)
తన ప్రేమ వర్ణనాతీతం
తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో||

ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు
వింతైన ప్రేమ అంతు చిక్కదు (2)
కలువరిలో చూపిన ప్రేమ
శాపమునే బాపిన ప్రేమ (2) ||మాటలలో||

ఆరాధన వర్తమానం

యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రము లను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను. యెషయ 63:7

మనము కూడా దేవుడు మనకి ఇచ్చినదానిని బట్టి మనకు చేసిన వాటిని బట్టి ఆయన కృపను జ్ఞాపకము చేసుకున్నట్టయితే మనము ఆయనను నిజముగా ఆరాధించగలుగుతాము.

దేవుడు మనకు ఏమి ఇచ్చాడు అని ఆలోచిస్తే, మన మొదటి స్థితిని జ్ఞాపకము చేసుకొనుట ద్వారా అర్థముచేసుకోగలము. మనము పాపులముగా దేవునికి దూరముగా ఉన్నప్పుడు ఆయన తన రక్తము ద్వారా మనలను రక్షించాడు.

అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను – ఎఫెసీ 2:4.

మన గత జీవితమునుండి దేవుడు మనలను విడుదల చేసి నూతనమైన జీవితమును అనుగ్రహించాడు. కొంత సమయమైనా దేవునితో గడిపినప్పుడు ఆయన నీకొరకు నీ సహవాసము కొరకు ఆయన వేచి చూస్తున్నాడు అనే సత్యము అర్థమవుతుంది. అప్పుడు ఇంక సమయముతో సంబంధము లేకుండా ఆయన సన్నిధిలో గడపాలనే ఆశతో ఉండగలుగుతాము. మన గత జీవితములో అనేకమైన చెడు సహవాసములను కలిగి ఉండుటను బట్టి మనము చేసిన పనులు జ్ఞాపకము చేసుకున్నట్టయితే మనకే అసహ్యము పుడుతుంది. కేవలము దేవుని సన్నిధిని, ప్రసన్నతను అనుభవించినవాడికి మాత్రమే ఇది తెలుస్తుంది.

నిజముగా దేవుని ప్రసన్నతను అనుభవించినవాడికి ఎమైనా పొందుకున్నా పొందుకోకపోయినా వాడి హృదయమునిండా సంతోషము నిండిపోతుంది. మన దేవుడు మన జీవితములలో కరుణసంపన్నుడిగా ఉన్నాడు.

దేవుని ఆరాధించడానికి వచ్చిన నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సిద్ధపడుతున్నావు. నీ జీవితములో ఆయన కరుణాసంపన్నుడై ఉన్నాడు అనే సత్యమును గ్రహించాలి. ఇప్పుడు ఆయన అనుగ్రహించిన నూతనమైన జీవితములో కూడా కరుణా సంపన్నుడై ఉన్నాడు. అపరాధములచేత చచ్చిన స్థితిలో ఆయన కరుణాసంపన్నుడై రక్షించాడు. పాపము చేత మరణము వస్తుంది. అయితే ఆ మరణము మనము రక్షించబడిన తరువాత కూడా మనలను మింగడానికి అనేక పరిస్థితులలో పట్టుకొనుటకు ప్రయత్నము చేస్తుంది అయినా కూడా ఆయన కరుణాసంపన్నుడై మనలను తప్పిస్తున్నాడు. ఈ సత్యమును నీవు గ్రహించినట్టయితే ఆయనను నిజముగా ఆరాధిస్తావు.

మన ప్రభువైన యేసు క్రీస్తు కలువరి సిలువలోనే సమస్తము జరిగించినాడు. ఆ సిలువ త్యాగము ఉన్నంతకాలము మనమీద దేవుని కృప, కరుణ అలాగే ఉంటుంది. అయితే ఉద్దేశపూర్వకముగా మనము పాపము వైపు తిరిగి గత జీవితములో చేసిన వాటివైపు తిరిగినప్పుడు మరలా అపవాదికి అవకాశము ఇచ్చేవాడివిగా అవుతావు. అయితే తన వాత్సల్యమును బట్టి కృపాబాహుళ్యమును బట్టియు చూపిన మహకనికరమును జ్ఞాపకము చేసుకుంటే మనము ఆయన సన్నిధిలో నిలిచి ఉండగలుగుతాము.

అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు- విలాపవాక్యములు 3:23

ఆయన నమ్మకత్వమును బట్టే మన జీవితము కొనసాగించబడుతుంది. ఆకాశ పక్షులని చూసినట్టయితే అవి విత్తవు కోయవు అయినను వాటిని పోషించుచున్నాడు మన దేవుడు. మన జీవితములో శారీరకమైన పోషణతో పాటు, ఆత్మీయ పోషణ కూడా తన వాక్యమును సమయానుసారముగా పంపుతూ మనలను పోషిస్తూ ఉంటాడు.

అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతి శయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు యిర్మీయా 9:24

అతిశయించువాడు దేవుడు ఏమి చేస్తున్నాడు, ఎలా కృప చూపిస్తున్నాడు అని ఎరిగి అతిశయించాలి. నీజీవితములో నీతి న్యాయములు జరిగించుచున్నాడు అనే సత్యము ఎరిగినట్టయితే ఆయనే నీ జీవితానికి ఆధారము అనే సత్యమును ప్రకటించగలుగుతావు. ఆయన నమ్మకత్వము చూపించకపోతే కన్నీటితోనే నీ జీవితము నిండిఉండేది, అయితే ఆయన చూపిన కరుణ కృపను బట్టే మనము సంతోషముగా ఉండగలుగుతున్నావు.

యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును బట్టియు నా జీవితములో ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను. అని ఆయనను బట్టి అతిశయించేవారిగా ఆయనను కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఆయనను ఆరాధిద్దాము.

ఆయన నమ్మకత్వమును గూర్చి ఆలోచిస్తే ఆయనకు కలిగిన వాత్సల్యమును బట్టియే మన యెడల చూపిస్తున్నాడు. మనము చేసిన క్రియలనుబట్టి చూపిన అపనమ్మకత్వమును బట్టి మన యెడల ఆయన కృప తీసివేయక కాపాడుటను బట్టే మనము ఈరోజు మనగలుగుతున్నాము.

ఆరాధన గీతము

నాకు నీ కృప చాలును ప్రియుడా (2)
నాకు నీ కృప చాలును
శ్రమలతో నిండిన ఈ జీవితములో (2)

నాథా నీ రాక ఆలస్యమైతే (2)
పడకుండ నిలబెట్టుము నన్ను
జారకుండ కాపాడుము (2) ||నాకు||

పాము వలెను వివేకముగను
పావురమువలె నిష్కపటముగను (2) ||నాథా||

జంట లేని పావురము వలెను
మూల్గుచుంటిని నిను చేరుటకై (2) ||నాథా||

పాపిని నను కరుణించు దేవా
చేరి నిను నే స్తుతియించుచుంటిని (2) ||నాథా||

Main Message | మెయిన్ మెసేజ్

దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతను అనుభవించడము ఎంతో గొప్ప భాగ్యము. అందుకే ఉదయాన్నే దేవుని సన్నిధిలో మనము గడిపి మొదలుపెట్టినట్టయితే ఆ రోజంతా ఎంతో సంతోషముగా ఉండగలుగుతాము.

ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము – కీర్తనలు 90:14.

నీ దేవునిని పూర్ణ హృదయముతో అనుసరించుట అనేది ప్రతీ క్రైస్తవుని జీవితములో అత్యంత ప్రాముఖ్యము కలిగిన సత్యము.

యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవ డును చూడడు. అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతాన మునకును ఇచ్చెదనని ప్రమాణముచేసెను. ద్వితీయోపదేశకాండము 1:36.

కాలేబు జీవితాన్ని మనము క్షుణ్ణముగా పరిశీలించి మనము సత్యమును అర్థము చేసుకుందాము. నీ పూర్ణాత్మతో నీ పూర్ణ హృదయముతో మరియు పూర్ణ మనస్సుతో వెంబడించాలి అనే వాక్యము గుర్తుంటుంది కానీ ఎలా ఆవిధముగా ఉండాలి అనే విషయము తెలియని వారిగా ఉంటున్నాము. బైబిలు గ్రంథములోని భక్తుల జీవితములు మనకు మాదిరిగా ఇవ్వబడ్డాయి కనుక మనము కాలేబు జీవితమును పరిశీలించి నేర్చుకుందాము.

సంఖ్యాకాండము 13 వ అధ్యాయములో చూస్తే, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనానుదేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము అని మోషేతో చెప్పాడు. అప్పుడు మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. ఇక్కడ “దేవుడు ఇచ్చుచున్న కానాను దేశము” అనే మాట ఎంతో ప్రాముఖ్యము. ఈ పంపబడిన మనుష్యుల గుంపులో కాలేబు కూడా ఉన్నాడు.

మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపి నప్పుడు వారితో ఇట్లనెనుమీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారము లలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు న్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము – సంఖ్యాకాండము 13: 17-20

ఈరోజు ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారు నూతన సృష్టి (2 కొరింథీ 5:17). మనకు కూడా నూతమైన జీవితము ఆరంభించబడింది. అది ఎలా కొనసాగించబడుతుంది అనే విషయము మనము అర్థము చేసుకుందాము.

క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను, తన మహిమైశ్వర్యముచొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను – ఎఫెసీ 3: 16-19

ఎవరికైతే వాక్యము అందించబడుతుందో వారు దీవించబడినవారు. వాక్యములోని సత్యము అందించబడిన వారు దీవించబడినవారు.

నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము. దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. సామెతలు 4:20-22.

మనము చదివినభాగములో కాలేబుకు దొరికిన అవకాశము నీకు కూడా ఇవ్వబడింది. కాలేబుకు యెహోవా ఇచ్చుచున్న కానాను ఎలా ఉంది అని చూడటానికి పంపబడ్డాడు. నీవు కూడా క్రీస్తును బట్టి నీకు ఇవ్వబడిన జీవితము కూడా ఎలా ఉంది అని నీవు పరిశీలించుకోగలుగులాగున నీకు కూడా అవకాశము ఇవ్వబడింది. నీవు దేవుని మీద ఎంత విశ్వాసము కలిగి ఉన్నావు? విశ్వాసము బట్టి నీతిమంతుడు జీవించును అని వాక్యము చెప్తుంది. అప్పుడు మన జీవితములో జీవముచేత ప్రతి దినము ముగించబడాలి మరి అలా నీ జీవితము ఉంటుందా? నీ జీవితములో క్రీస్తును బట్టి ఇవ్వబడిన విశ్వాసము, మహిమైశ్వర్యము, దేవుని సంపూర్ణత మరియు దేవుని ప్రేమలను నీవు గ్రహించగలుగుతున్నావా?

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను యోహాను 3:16.

దేవుడు మనలను ప్రేమించాడు కాబట్టి మనము నాశనము కాలేదు. కానానును వేగుచూడటానికి వెళ్ళిన పన్నెండుమంది కూడా ఆ ప్రదేశమును గూర్చి ఇచ్చిన సాక్ష్యమును జ్ఞాపకము చేసుకుంటే – “వారు అతనికి తెలియపరచినదేమనగానీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితివిు; అది పాలు తేనెలు ప్రవ హించు దేశమే; దాని పండ్లు ఇవి – సంఖ్యాకాండము 13:27”. అలాగే మన జీవితములో క్రీస్తులో దేవుడు అనుగ్రహించిన నూతనమైన జీవితము దేవుడు చెప్పిన విధముగానే ఉంటుంది. అయితే ఆ పదిమంది కానానును అనుభవించలేనట్టు, మనకు ఇవ్వబడిన నూతనమైన జీవితమును అనుభవించలేకపోతున్నాము.

నిజానికి యేసును అంగీకరించినమనము నశించకూడదు. అయితే కొన్ని విషయాలు మన జీవితములో నశించిన స్థితిలో ఉంటున్నాయి దానికి కారణము ఏమిటి? దేవునిని పూర్ణా హృదయముతో అనుసరించలేకపోవడమే. “దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును…” వేగు చూడటానికి వెళ్ళిన వారితో కూడా ఇలాగే తెలిసికొని రమ్మని ప్రభువు చెప్పాడు. అయితే వారు ఏమి చూస్తున్నారు?

అయితే ఆ దేశ ములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితివిు – సంఖ్యాకాండము 13:28.

ఆ పరిస్థితిలో ఈ పదిమంది వారిని చూసి భయపడి వారిని జయించలేము అని డీలాపడిపోయారు. అయితే కాలేబు ఏమి చెప్పాడు? “కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను – సంఖ్యాకాండము 13:29”. ఎందుకు అంటే? “దేవుడు ఇచ్చుచున్న కానాను దేశము” ఇది దేవుడు ఇచ్చు దేశము అని దేవునిని పూర్ణ హృదయముతో అనుసరించినవాడుగా ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు కూడా “నన్ను బలపరచువానియందు నేను సమస్తము చేయగలను” అని చెప్పుచున్నాడు. అయితే నీ జీవితములో ఎన్నిసార్లు నిరుత్సాహముతో కృంగిపోయి ఉన్నావు?

క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? – రోమా 8:35.

నీ జీవితములో నీ ముందు ఉన్న పరిస్థితులలో నీ ఆలోచన ఏమిటి? నీవు చెయ్యగలను అనుకుంటున్నావా? దాటగలను అనుకుంటున్నావా? లేక నిరుత్సాహపడుతున్నావా? నీ జీవితములో శ్రమ గానీ, బాధగానీ, హింస గానీ, కరువు గానీ, లేమి గానీ, ఉపద్రవములు గానీ చివరకి ఖడ్గమైన సరే క్రీస్తు ప్రేమనుండి ఎడబాపగలదా?

“దేవుడు ఇచ్చుచున్న కనాను” అంటే “దేవుడు ఇచ్చుచున్న నూతనమైన జీవితము” అని దేవుడు ప్రకటించిన సత్యము. ఒకవేళ అనాకీయులవంటి స్థితులు ఉన్నప్పటికీ అవి వెళ్ళగొట్టబడవలసినవే. నీ జీవితమును నీవు స్వతంత్రించుకోవలసినదే. అయితే ఆ పదిమంది వలే నీవున్నట్టయితే నీకిచ్చిన జీవితమును స్వతంత్రించుకోలేవు.

యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరిఎవడును చూడడు. అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతాన మునకును ఇచ్చెదనని ప్రమాణముచేసెను – ద్వితీయోపదేశకాండము 1:36

అయితే కాలేబువలే నీవు ఉన్నట్టయితే నీవే కాక నీ తరువాత తరమును కూడా దేవుని ఆశీర్వాదములతో నింపినవాడివి అవుతావు. నీ జీవితములో కూడా ఎటువంటి నెగటివ్ ఆలోచన రానివ్వకుండా దేవుడు ఇచ్చుచున్న జీవితమును స్వతంత్రించుకో. నీ జీవితములో ఎటువంటి పరిస్థితులు ఉన్నాసరే కాలేబు వలే దేవుడు ఇచ్చిన మాటను బట్టి పూర్ణహృదయముతో అనుసరించి దేవుడు నీకిచ్చుచున్న నూతన జీవితము స్వతంత్రించుకుని నీవు సంతోషించి నీ దేవునిని సంతోషపరచు.