ఆరాధన వర్తమానము
ఆయన సన్నిధిలో క్షేమముగా నిలబెట్టిన దేవుడికే సమస్త మహిమ, ఘనత ప్రభావము కలుగును గాక! దేవుని సన్నిధిలో ఉత్సాహముగా ఉండాలి అని వాక్యము చెప్పుచున్నది. ఎవరు ఉత్సాహముగా ఉండగలుగుతారు? దేవుడు ఎవరో, ఆయన గుణమేమిటో ఎరిగినవారు ఉత్సాహముతో ఉండగలుగుతారు.
ఈరోజు శుద్ధీకరణ దినము, నిర్ణయించిన దినము, ఆశీర్వదించబడిన దినము. శుద్ధీకరణ గురించి ఆలోచిస్తే, ఈ లోక మాలిన్యము మనకు అంటుకుంటుంది గనుక, దేవుని సన్నిధిలో ఆయన వాక్యము చేత శుద్ధిచేయబడతాము. దేవుని వాక్కు లో జీవము ఉంది, ఆ జీవము మన జీవితములకొరకు విడుదల అవుతుంది. గనుక ఆ వాక్యమును పట్టుకుని నిలబడినపుడు మనము సిగ్గుపడడు.
అబ్రహాము దేవుని వాగ్దానమును పట్టుకుని నిలబడ్డాడు, అతడు సిగ్గుపరచబడలేదు. ఎటువంటి సమయము అని ఆలోచిస్తే, ఆ వాగ్దానము నెరవేరబడడానికి అవకాశమే లేని సమయములో సహితము, వాక్కుని పట్టుకుని నిలబడ్డాడు గనుకనే సిగ్గుపడలేదు.
దేవుని వాక్కులో జీవముంది, ఆ వాక్కులో అధికారముంది. అధికారము ఏమి చేస్తుంది అని ఆలోచిస్తే, మనకు వనరులు అవసరము ఉన్నపుడు, అవి అందుబాటులో లేనప్పటికీ, అవి అందుబాటులోనికి వచ్చేలా చేయగల శక్తి దేవుని వాక్కు యొక్క అధికారమునకు ఉంది.
మనము దినదినము ఆశీర్వదించబడేవారము, ఇదే మన జీవితము. దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయనను ఆరాధించేవారముగా ఉండాలి. ఆత్మతోను సత్యముతోను వారు ఆరాధించాలి అని వాక్యము చెప్పుచున్నది. ఆయన ఏమై ఉన్నాడో అది మనము ఎరిగినవారమైతే, ఆ సత్యమును బట్టి మనము స్వతంత్రులముగా అవుతాము, యదార్థమైన ఆరాధన మనము అర్పించగలుగుతాము.
ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి–భూతవర్తమాన భవిష్యత్కాలములలోఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.౹ ఆ సింహాసనమునందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా౹ ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైయుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు– ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానినిబట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. -ప్రకటన 4:8-10
సమస్తమును ఆయనే సృష్టించాడు, ఆయన చిత్తమును బట్టే అవి సృష్టించబడెను, ఆయన చిత్తమును బట్టే అవి ఉన్నవి. ఈ మాటలు దేవుని గూర్చిన సత్యముగా చెప్పబడుచున్నవి.
దేవుడు సృష్టించిన సమస్తములో నీవు నేను కూడా ఉన్నాము. అంతే కాక, మనము ఆయన చిత్తమును బట్టే నీవు నేను సృష్టించబడ్డాము, ఆయ్నా చిత్తమును బట్టే మనము ఉన్నాము. మనుష్యుని కోరికను బట్టి మనము పుట్టాము అని మనము అనుకుంటాము. అయితే వారి కోరికను బట్టి మనము పుట్టలేదు కానీ దేవుని చిత్తమును బట్టే మనము పుట్టాము. అంతే కాదు కానీ ఈరోజు మనము ఇంకా జీవించి నిలిచి ఉన్నాము అంటేనే దేవుని చిత్తము వలన.
ఈరోజు అనేకమైన నిరాశలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవిస్తున్నాము, అనేకమైన సందర్భాలలో గాయపడిన పరిస్థితిలు కూడా ఉన్నాయి. కొంతమంది ఈ పరిస్థితిలో నెను చచ్చిపోతే బాగుండు అని అనుకుంటున్నారు. అయితే సత్యము ఒకటి ఉంది అది మనము గ్రహించాలి, అది ఏమిటి అంటే – దేవుని చిత్తము ఒకటి ఉంది, ఆ చిత్తమును బట్టే మనము ఉన్నాము.
మన జీవితము గురించి దేవుని చిత్తము ఏమిటి అంటే – మన జీవితము దేవునికి మహిమపరచాలి. మన జీవితములో ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, మన జీవితములో మహిమకరమైన దేవుని చిత్తము ఉంది అని మనము గుర్తుపెట్టుకోవాలి. మన జీవితమును బట్టి దేవునికి రావాలి.
మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలనుగూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశో ధించిరి.౹ -1 పేతురు 1:10
క్రీస్తు విషయమైన శ్రమ మన జీవితములో ఇప్పుడు ఉన్నప్పటికీ, వాటి తరువాత దేవుని మహిమ కూడా ఉంది గనుక, మనము కృంగిపోవలసిన అవసరములేదు.
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.౹ -రోమా 8:28
ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి ఆయన ఏ సంకల్పమైతే కలిగి ఉన్నారో దానిని బట్టే సమస్తమును సమకూడి జరుగుతుంది. మన మందిరము దేవుని సంకల్పము గనుక ఆ మందిరము పూర్తి అగుటకు సమస్తము సమకూడి జరుగుతుంది. అలాగే మన జీవితము కూడా ఆయన సంకల్పమే.
ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్తప్రకారమైన దయాసంకల్పముచొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.౹ -ఎఫెసీయులకు 1:4
ఈ వాక్యములో, దేవుని దయా సంకల్పము చేత జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని వ్రాయబడింది.
మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. -రోమా 8:30
జగత్తు పునాది వేయకమునుపే దేవునికి కలిగిన సంకల్పము చొప్పున నిన్ను నన్ను నిర్ణయించి పిలిచి నీతిమంతులుగా తీర్చెను. మనము ఇరవై సంవత్సరాలవరకు దేవునిని ఎరగని వారిగా ఉంటే, ఆ ఇరవై సంవత్సరాలు కూడా దేవుని సంకల్పము క్రియ జరిగిస్తూ, దేవుని వద్దకు నన్ను నడిపించింది. ఆ సంకల్పము నేను దేవుని చేత పిలువబడి నీతిమంతులుగా తీర్చింది, చివరికి నా జీవితము మహిమ పరచబడుతుంది, నా ద్వారా దేవుని నామము మహిమ పరచబడుతుంది.
నీవు కష్టములో ఉన్నాసరే, నీ జీవితములో దేవుని చిత్తము ఒకటి ఉంది. ఈ సత్యము మనము ఎరిగినపుడు దేవునిని సంతోషముగా ఆరాధించగలుగుతావు. అలా మనము యదార్థముగా ఆరాధించినపుడు, విడుదల మార్గము సిద్ధపరచబడుతుంది.
ఒక ద్వారము మూయబడి తాళము వేయ్బడి ఉంటే, ఆ ద్వారము తెరువబడాలి అంటే, తాళపు చెవి కావాలి. ఆ ద్వారము పరలోకము అయితే, వాక్యమే తాళపు చెవి. భూమి మీద దేనిని బంధించుదువో, అది పరలోకములో బంధించబడుతుంది. దేవుని విప్పుదువో అది పరలోకములో విప్పబడుతుంది. ఎలా బంధించగలము? విప్పగలము అంటే వాక్యము ద్వారానే! ఇంతటి మహిమకరమైన జీవితమును మనకు ఇచ్చినందుకు ఆయనను హృదయమారా ఆరాధిస్తావా?
ఆరాధన గీతము
దేవా పరలోక దుతాలి
వారము కొరకైన వాక్యము
ఈరోజు స్నేహితుల దినముగా లోకములో జరుపుకుంటున్నారు. ఈరోజు నిజమైన స్నేహితుడి గురించి మనము తెలుసుకుందాము. స్నేహము అనేది ఇద్దరు వ్యక్తులమధ్య ఏర్పడే బంధము. వారి హృదయములను ఐక్యపరచేది ఈ స్నేహ బంధము.
ఈలోకములో స్నేహానికి ఎంతో విలువ ఉంది. అయితే ఈ స్నేహము లోకములో సందర్భమును బట్టి మారుతుంది. అయితే నిజమైన స్నేహము గూర్చి వాక్యప్రకారము చూద్దాము.
దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను.౹ -1 సమూయేలు 18:1
దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధనచేసికొనెను.౹ -1 సమూయేలు 18:3
ఇక్కడ దావీదు హృదయముతో యోనాతాను హృదయము కలిసిపోయింది అని ఇక్కడ వ్రాయబడెను. వారి స్నేహము బట్టి వారి హృదయములు ఏకమైపోయెను అని అర్థము చేసుకోగలము. దానిని బట్టే వారి మధ్య ప్రేమ వారి మధ్య ఉన్నది.
లోకములో ధనము కలవారికి అనేకులు స్నేహితులు అవుతారు. ఆ ధనము పోయిన స్థితిలో ఆ స్నేహితులలో అనేకులు విడిచిపెట్టేవారుగా ఉంటారు. అయితే నిజమైన స్నేహితుడే అట్టి స్థితిలో విడిచిపెట్టక నిలిచి ఉంటాడు.
నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనేకాని మీరును ఫలిం పరు.౹ -యోహాను 15:4
ఇద్దరు స్నేహితులు ఉన్నారు అనుకుందాము. అందులో ఒకడు ధనవంతుడు, మరొకడు బీదవాడు అనుకుందాము. వారి మధ్య నిజమైన స్నేహము ఉంటే, ఆ బీదవాడి ప్రతి అవసరములో ఆ ధనవంతుడైన స్నేహితుడు సహాయము చేసేవాడిగా ఉంటాడు.
అలాగే ధనవంతుడైన యేసయ్య ద్రాక్షావల్లిగా ఉన్నాడు. ఆయన స్నేహితులుగా తీగెలుగా మనము ఆయనను అంటిపెట్టుకుని ఉన్నపుడు మనము ఖచ్చితముగా ఫలించేవారిగా ఉంటాము.
మొదట హృదయము కలుస్తుంది, ఆ తరువాత వారి మధ్య ఉన్న సహవాసమును బట్టి అనేకమైన రహస్యములు అనేవి ఉండవు. మన యేసయ్య కూడా నిజమైన స్నేహితుడు కాబట్టే, ఆయన వద్ద మన రహస్య పాపములను సహితము ఒప్పుకుంటాము. అలాగే మన యేసయ్య కూడా తన మర్మములు అన్నీ మనకు తెలియ చేసేవాడుగా ఉన్నాడు.
నేను మీ కాజ్ఞాపించువాటినిచేసినయెడల, మీరు నా స్నేహితులైయుందురు.౹ దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.౹ -యోహాను 15:14-15
యేసయ్య నిజమైన స్నేహితుడు అని ఈ వాక్యము ద్వారా తెలుస్తుంది. తండ్రి వలన వినిన సంగతులన్నీ యేసయ్య మనకు తెలియచేసాను అని చెప్పుచున్నాడు. తండ్రి కాలములు, సమయములు తండ్రికి మాత్రమే తెలుసు. అయితే నిజస్నేహితుడైన యేసయ్య తండ్రి ఆయనకు తెలియచేసిన సంగతులన్నీ మనకు తెలియ చేసేవాడుగా ఉన్నాడు.
అయితే యేసయ్య మనకు ఆజ్ఞాపించిన దానిని మనము చేసినపుడు, మనము స్నేహితులమై ఉంటాము అని చెప్పుచున్నాడు. ఆ నిజమైన స్నేహములో కొనసాగించబడాలి అంటే, యేసయ్య చెప్పిన ప్రకారము మనము చేసేవారిగా ఉండాలి.
ఈలోకములోని స్నేహము పరిస్థితులను బట్టి మారిపోతుంది. దేవునితో ఉన్న స్నేహము ఎన్నటికీ మారదు. యేసయ్య చెప్పినట్టు చేసినట్టయితే ఖచ్చితముగా మనకు బోధించేవాడుగా ఉంటాడు.
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. -సామెతలు 17:17
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. సహోదరుడుగా ఉండును అంటే, ఆసరాగా ఉంటాడు అని అర్థము. అంతే కాదు గానీ మన స్థితి మార్చగల శక్తి యేసయ్యకి ఉంది.
అబ్రహామును స్నేహితుడుగా దేవుడు పిలిచాడు. అబ్రహాము కష్టములో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితముగా దర్శించాడు. అబ్రహాము, లోతు గొర్రెల కాపరులకు గొడవ వచ్చినపుడు, లోతు మంచి భూమి అంతా తీసుకున్నపుడు దేవుడు అబ్రహామును విడిచిపెట్టలేదు గానీ, అతనిని ఆశీర్వదించినవాడుగా ఉన్నాడు.
లాజరు చనిపోయిన సందర్భములో, యేసయ్య నా స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతనిని లేపుటకు మనము వెళదాము అని శిష్యులతో చెప్పుచున్నాడు. జీవము కోల్పోయిన లాజరుకు జీవము తిరిగి ఇవ్వడానికి యేసయ్య వెళ్ళాడు. మన జీవితములో కూడా యేసయ్య నిజమైన స్నేహితుడుగా ఉన్నాడు గనుక, మనము కోల్పోయినది తిరిగి ఇచ్చేవాడుగా యేసయ్య ఉన్నాడు.
మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును. -సామెతలు 27:6
మేలును కోరే నిజమైన స్నేహితుడు తప్పు చేస్తే హెచ్చరిస్తాడు, అవసరమైతే శిక్షిస్తాడు కూడా. తప్పును సమర్థించేవాడు స్నేహితుడు కాదు గానీ, తప్పును సరిచేయువాడే స్నేహితుడు. మన నిజమైన స్నేహితుడైన యేసయ్య మన మేలు కోరి, వాక్యము ద్వారా హెచ్చరిస్తాడు, హృదయము గాయపరుస్తాడు. అయితే అది నీ మేలుకొరకు మాత్రమే.
నిన్ను ఆశీర్వదించువాడు, హెచ్చరించువాడు, నడిపించువాడు నీ నిజస్నేహితుడైన యేసయ్య అయి ఉన్నాడు. అబ్రహాముతో నేను చూపించిన దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు. దాని అర్థము, దేవుడు అబ్రహామును నడిపించాడు అనే కదా. మన జీవితములో దేవుని నడిపింపు లేకపోతే మన జీవితములు వ్యర్థము అయిపోతాయి.
తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.౹ -యోహాను 15:13
ఈ లోకములో ఇటువంటి స్నేహితుని మనము కనుగొనలేము గానీ, నీ కొరకు ప్రాణము పెట్టిన నిజమైన స్నేహితుడు నీ యేసయ్య. యేసయ్య చెప్పే మాటలు నీకు అర్థము అవ్వాలి అంటే నీవు ఆయనతో సహవాసము చేసినపుడు మాత్రమే జరుగుతుంది. ఉదాహరణకు నీకు ఒక మూగవాడైన స్నేహితుడు ఉంటే, అతడు చెప్పే మాటలు మొదట నీకు అర్థము కావు గానీ, సహవాసము చేసే కొలదీ చాలా సులువుగా మనము అర్థము చేసుకోగలుగుతాము.
అటువంటి నిజ స్నేహితుడైన యేసయ్యను విడిచిపెట్టక ఆయన సహవాసములో దినదినము మనము ఎదిగి, ఆ స్నేహములో మనము వర్థిల్లుదాము.