స్తోత్రగీతము – 1
దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా } 2
జీవదాతవు నీవని శృతిమించి పాడనా
జీవధారవు నీవని కానుకనై పూజించనా } 2
అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే
స్వరార్చన చేసిద నీకే నా స్తుతులర్పించెద నీకే|| దీనుడా ||
సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా
గమనములేని పోరాటాలే తరుముచుండగా
నిరుపేదనైన నాయెడల సందేహమేమి లేకుండా
హేతువేలేని ప్రేమ చూపించి సిలువచాటునే దాచావు } 2
సంతోషము నీవే అమృత సంగీతము నీవే
స్తుతిమాలిక నీకే వజ్రసంకల్పము నీవే|| దీనుడా ||
సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై
నిత్యనిబంధన నాతో చేసిన సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో హృదయార్చనే చేసేద
కరుణనీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా } 2
కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే విజయశిఖరము నీవేగా|| దీనుడా ||
ఊహకందని ఉన్నతమైనది దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది నీరాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు
అమరలోకాన నీసన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను} 2
ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో ఊహలపల్లకి నీవేగా
స్తోత్రగీతము – 2
మహిమ ఘనతకు అర్హుడవు
నీవే నా దైవము
సృష్టికర్త ముక్తి దాత (2)
మా స్తుతులకు పాత్రుడా
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే (2)
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
మన్నాను కురిపించినావు
బండనుండి నీళ్ళిచ్చినావు (2)
యెహోవా యీరే చూచుకొనును
సర్వము సమకూర్చును
||ఆరాధనా||
వ్యాధులను తొలగించినావు
మృతులను మరి లేపినావు (2)
యెహోవా రాఫా స్వస్థపరచును
నను స్వస్థపరచును
||ఆరాధనా||
స్తోత్రగీతము – 3
అన్ని నామములకన్న పై నామము
యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది
క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయం
సాతాను శక్తుల్ లయం లయం
హల్లెలూయ హొసన్న హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్
పాపముల నుండి విడిపించును
యేసుని నామము
నిత్య నరకాగ్నిలోనుండి రక్షించును
క్రీస్తేసుని నామము ‘యేసు’
సాతానుపై అధికారమిచ్చును
శక్తి కలిగిన యేసు నామము
శత్రుసమూహముపై జయమిచ్చును
జయశీలుడైన
యేసు నామము ‘యేసు’
స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము ‘యేసు’
ఆరాధన వర్తమానము
అనుకూలమైన సమయమైనా సరే, అననుకూలమైనా సమయమైనా సరే మన దేవుడు మహిమ పరచబడే దేవుడుగా ఉన్నాడు.
అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్య పడిరి.౹ -నిర్గమకాండము 1:12
ఇక్కడ ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను శ్రమ పెడుతున్నారు. వారు ఎంతగా శ్రమ పెడితే, అంతగా వారు ప్రబలినారు. మనము కూడా ఎంతగా శ్రమానుభవముగుండా వెళుతున్నా కూడా, మనము అంతగా ఆశీర్వదించబడేవారిగా ఉంటాము. అందుకే సమయాసమయములయందు మన దేవునిని ఆరాధించాలి. ఆరాధనకు స్థితి మార్చగలిగే శక్తి ఉంది.
యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక. -కీర్తనలు 20:5
“మా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము” ఇది కేవలము మాటలు మాత్రము కాదు గానీ, కార్యములచేత ప్రకటించబడేది. మన దేవుడు ప్రేమ గలిగిన వాడు, అంతే కాక సామర్థ్యము కలుగచేయువాడు. మా స్థితిని మార్చగలిగినవాడు అనే సత్యము ప్రకటిస్తూ ధ్వజము ఎత్తేవారిగా మనము ఉండాలి.
షద్రకు, మేషాకు మరియు అబెద్నెగో అనువారి జీవితములో చూస్తే, మరణకరమైన అగ్నిగండములో వారి స్థితి మార్చాడు. మన దేవుడు మన స్థితి మార్చగలిగిన సామర్థుడు. ఎవరైతే నా దేవుడు సమర్థుడు అని ప్రకటించారో, వారందరూ ఆశీర్వదించబడ్డారు.
–నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.౹ –నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.౹ మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడైయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,౹ అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక౹ దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.౹ -రోమా 4:18-21
ఇక్కడ అబ్రహాముకు వారి శరీర స్థితిని బట్టి కలిగిన సందేహమునకు లోబడక, అవిశ్వాసమును రానివ్వలేదు. కానీ వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు అని రూఢిగా ఎరిగి దేవుని మహిమపరచాడు. “మృతమైనదానిని సజీవముగా చేయగలిగినవాడవు” అని దేవునిని మహిమపరచాడు.
ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి – యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొనియున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా -2 దినవృత్తాంతములు 14:11
ఇక్కడ ఆసా ఒక పోరాటములో ఉన్నాడు. “బలములేని వారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరూ లేరు” అని ప్రకటించాడు. అంతే కాక, నీ నామముబట్టియే మేము ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము అని ప్రకటించాడు. యుద్ధమునకు వెళ్ళుచున్నది ఆసా అయినప్పటికీ, “నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము” అని చెప్పుచున్నాడు. అంటే యుద్ధము మాది కాదు గానీ యుద్ధము నీదే అని ప్రకటించాడు. వారు విస్తారమైన సైన్యముగా ఉన్నప్పటికీ వారికంటే ఆసా దేవుడే బలవంతుడు అని ప్రకటించాడు. మనము కూడా దేవుని నామమును బట్టి నిలబడినప్పుడు ఖచ్చితముగా సిగ్గునొందము. అందుకే క్రీస్తు యొక్క జ్ఞానమును సంపాదించుకొనుటయే మన విధి. ఎందుకంటే సమస్తము మనకు క్రీస్తులోనే సమకూర్చబడి ఉన్నాయి. అలా ధ్వజము ఎత్తుటను బట్టి ఏమి జరుగుతుంది అంటే,
యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నా కిప్పుడు తెలియును రక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములోనుండి అతనికి ఉత్తరమిచ్చును. -కీర్తనలు 20:6
మనము ధ్వజము ఎత్తుట అంటే, దేవుని గూర్చి ఏమి సత్యమును గ్రహించావో, ఆ సత్యమును ప్రకటించి, ఆ సత్యముపై ఆనుకుని ముందుకు వెళ్ళుట. అప్పుడు మనము సిగ్గుపడము, మనకు విజయమే. అందుకే ఆయన శక్తిని ఆధారము చేసుకుని మనము పలుకుదాము. మన మాటలు వేరేవారికి వెర్రివారిగానే కనబడతామేమో, అయినప్పటికీ మన సమయము వచ్చేసరికి, దేవునికొరకైన సాక్ష్యము మన ద్వారా బయలుదేరుతుంది.
కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము. -కీర్తనలు 20:7
నన్ను రక్షించువాడు, నాకు విజయమిచ్చువాడు, అని మనము అతిశయపడదాం. ఆయన నామము బట్టి నీ పరిస్థితిలో నీవు నిలబడినప్పుడు, నీ జీవితము సమాధానకరముగా ఉంటుంది. అందుకే మన దేవుడు సమర్థుడు అని జ్ఞాపకము పెట్టుకోండి. మీ వ్యక్తిగతమైన జీవితములలో నీ దేవుడు చేయగలిగిన నీవెరిగిన సత్యమును బట్టి ధ్వజము ఎత్తండి.
ఆరాధన గీతము
ఏ నామములో సృష్టి అంత సృజింపబడెనో
ఆ నామమునే స్తుతింతును
ఏ నామములో పాపమంతా క్షమించబడునో
ఆ నామమునే పూజింతును
ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెనో
ఆ నామమునే నమ్మెదను
ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో
ఆ నామమునే స్మరింతును
పల్లవి:
నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే ఆధారము
నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే నా జయము
రోగము తలవంచును నీ నామము యెదుట
శాపము తలవంగును నీ నామము యెదుట
సాటిలేని నామము – స్వస్థపరచే నామము
ప్రతి మోకాలు వంగును నీ నామము యెదుట
ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత
శ్రేష్టమైన నామము – శక్తిగలిగిన నామము
భ్రిద్గె:
హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్య
కీర్తింపబడును గాక నీ నామము యేసయ్య
కొనియాడబడును గాక నీ నామము యేసయ్య
అన్ని నామములకు పై నామముగ
మెయిన్ మెసేజ్
“యేసు వైపు చూచుచూ” అనే అంశము గూర్చి మనము ధ్యానిద్దాము.
యేసయ్య ఈ లోకములో జీవించినప్పుడు సమస్తములో మనకు మాదిరిగా జీవించాడు. అందుకే ఆయన వైపు చూస్తూ మనము ఈలోకములో జీవించాలి.
మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.౹ -హెబ్రీయులకు 12:2
“విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు” అనే దానిని గూర్చి మనము ఈరోజు నేర్చుకుంటాము. మన ఎదుట ఉంచబడిన పందెము అంటే మన జీవితము. అయితే ఎందుకు మనము యేసువైపు చూడాలి అంటే? నీతిమంతుడు విశ్వాసము మూలమున జీవిస్తాడు. అయితే ఈ విశ్వాసమునకు కర్త ఎవరు అని చూస్తే అది యేసుప్రభువే. మన జీవితాలను ముందుకు కొనసాగించాలి అంటే, విజయకరమైన జీవితముగా మనము కొనసగించాలి అంటే యేసయ్యవైపే చూడాలి.
విశ్వాసమునకు కర్త అంటే, నీవు విశ్వసించునట్లుగా మూలమును సృష్టించువాడు ఆయనే. అంతే కాకా అలా సృష్టించినదానిని కొనసాగించువాడు కూడా ఆయనే.
వాడు వెళ్లి, యేసు తనకు చేసిన వన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి. -మార్కు 5:20
అక్కడ యేసు ఒక విడుదల కార్యము చేసినాడు. ఎవరూ విడిపించలేని వాడిని యేసయ్య విడుదల చేసాడు. ఈ కార్యము ఆ పట్టణము అంతా ప్రకటించబడింది.
యేసు మరల దోనె యెక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహుజనసమూహము ఆయనయొద్దకు కూడివచ్చెను. ఆయన సముద్రతీరమున నుండగా సమాజమందిరపు అధికారులలో యాయీరను నొకడు వచ్చి, ఆయనను చూచి ఆయన పాదములమీదపడి –నా చిన్నకుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీచేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితోకూడ వెళ్లెను; బహుజనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. -మార్కు 5:21-24
ఈ సమాజమందిరపు అధికారి యేసయ్య దగ్గరకు వెళ్ళడానికి కారణము ఏమిటి? యేసయ్య చావనై ఉన్న తన కుమార్తెను రక్షించగలిగిన సమర్థుడు అని నమ్మడానికి కారణము ఏమిటి? అని చూస్తే, గెరాసేనీయుల దేశములో యేసయ్య చేసిన విడుదల కార్యము యాయీరు హృదయములో విశ్వాసమును పుట్టించింది. అనగా మనలో విశ్వాసము కలుగునట్లుగా దేవుడు తన కార్యములు జరిగించువాడుగా ఉన్నాడు. ఆ కార్యములద్వారా మనలో విశ్వాసము కలుగుతుంది.
ఆయన దోనెయెక్కినప్పుడు, దయ్యములు పెట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవియ్యక–నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్లి, యేసు తనకు చేసిన వన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి. -మార్కు 5:18-20
ఇక్కడ యేసయ్య చేసిన కార్యమును ప్రకటించమని ఆ స్వస్థపరచబడిన వ్యక్తితో చెప్పాడు. దానికి కారణము ఏమిటి అంటే, మరొకరు ఆ వార్తను విని రక్షించబడుట కొరకే. అందుకే మన వద్దకు దేవుని కార్యములను గూర్చిన వార్త రాగానే మనము కూడా ఇది దేనికొరకు మనవద్దకు వచ్చిందో అనే విషయము గూర్చి ఆలోచించి సిద్ధపడి స్వీకరించాలి.
మనము అనేకమైన పరిస్థితులలో దేవుని యందు విశ్వాసము ఉంచుతాము. అయితే కొన్ని సార్లు ఆ విశ్వాసముండి తొలగిపోయే పరిస్థితులు కలుగుతాయి. యాయీరు జీవితములో కూడా ఈ పరిస్థితి కలిగింది –
ఆయన ఇంకను మాటలాడుచుండగా, సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చి–నీ కుమార్తె చనిపోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు వనిరి. యేసు వారు చెప్పినమాట లక్ష్యపెట్టక–భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజమందిరపు అధికారితో చెప్పి -మార్కు 5:35-36
యాయీరు జీవితములో విశ్వాసమును పుట్టించిందే యేసయ్య. దానిని కొనసాగించే బాధ్యత కూడా యేసయ్యే తీసుకున్నారు. ఇంకా సమాజమందిరపు అధికారి మాటలాడక మునుపే యేసయ్య సమాధానము చెపుతున్నాడు. అందుకే యేసు వైపు నీవు చూసినప్పుడు, నీలో విశ్వాసమును పుట్టించిన యేసయ్య ఆ కార్యము ముగించేవరకు నీలో విశ్వాసమును కొనసాగించేవాడుగా ఉన్నాడు.
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు రోమా 5:5
అందుకే మన చూపంతా కూడా యేసయ్యవైపే ఉండాలి. ఈ భూలోకములో మనకు మాదిరిగా జీవించాడు.
ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు – హెబ్రీయులకు 12:2
తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టుట అంటే, ఏ విషయము కొరకైతే నీలో విశ్వాసమును కలిగించాడో, ఆ విషయము యొక్క నెరవేర్పు కొరకు, ప్రతీ నెగటివ్ పరిస్థితిని నిర్లక్ష్యము చేసి, అదే విశ్వాసముపై నిలబడి ముందుకు సాగాలి. కొన్ని సార్లు నెగటివ్ పరిస్థితి యొక్క ప్రభావము మనలను గాయపరుస్తుందేమో అయినప్పటికీ, సహించి నిలబడాలి.
సహించుట అనేది భూలోకములో జరిగింది. సింహాసనము పరలోకములో ఉంది. మనము భూలోకములో సహిస్తే, మనకొరకు ఆశీర్వాదము పరలోకమునుండి దిగి వస్తుంది. విశ్వాసము పరలోకముండి అధికారమును విడుదల చేసేదిగా ఉంది. యేసు వైపు చూసినప్పుడు నీ విశ్వాసము నిలకడగా ఉంటుంది.
మరొక సందర్భములో సమరయ స్త్రీలో విశ్వాసము కలుగునట్లుగా తాను కార్యము జరిగించినాడు. ఎవరూ నశించిపోకూడదు అని నిన్ను నన్ను కూడ వెతుకున్నవాడుగా యేసయ్య ఉన్నాడు. సమరయ స్త్రీ యేసయ్య ఎవరో ఎరగని స్థితిలో, ఆమె గ్రహించునట్లుగా అనేకమైన ప్రయత్నాలు చేసినతరువాత, ఆమె ప్రవక్త అని గ్రహించిది. అలా విశ్వాసము కలిగించిన తరువాత దానిని ఎలా కొనసాగిస్తున్నాడో చూద్దాము.
ఆ స్త్రీ ఆయనతో–క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా౹ యేసు–నీతో మాటలాడుచున్ననేనే ఆయననని ఆమెతో చెప్పెను. -యోహాను 4:25-26
యాయీరు జీవితములో ఒక సందర్భము, సమరయ స్త్రీ జీవితములో మరొక సందర్భము. ఈ రెండు సందర్భములూ మన జీవితాల గూర్చియే. అనేక సందర్భాలలో మనము ఏమి చేయాలో ఎరగని స్థితిలో ఉన్నప్పుడు మనము గ్రహించునట్లుగా ఆయన తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఎందుకు అంటే మనము దేవుని ఉద్దేశములో ఉన్నవారము. మనము నమ్మడానికి అవకాశము ఉన్నా, అవకాశము లేకపోయినా, మనలను ఆయా పరిస్థితులగుండా మనలను నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నవాడు. అంతే కాదుగానీ ముగించువాడు కూడా ఆయనే! ఏ విషయములో నీలో విశ్వాసము కలిగించబడిందో, ఆ విషయము నీకొరకు ఖచ్చితముగా నెరవేర్చబడుతుంది.