04-06-2023 – ఆదివారం మొదటి ఆరాధన – నీవు తెలుసుకోవలసినది

స్తోత్రగీతము – 1

సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభూ
ఆధారము ఆశ్రయము నీవే నా యేసు
నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి

చిన్న చిన్న గొర్రె పిల్లలము కాపరివై మము కాయుము
అమ్మ నాన్న అన్నీ నీవే ఆదరించి సేదదీర్చుము
నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి

పరుగెత్తినా కొండ కోనలలోన పచ్చని పచ్చికలో
అండదండ కొండా కోనా నీవే యేసు
నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి

స్తోత్రగీతము – 2

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి
నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా

హాలేలూయ హాలేలూయ
భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..
…సన్నుతించెదనూ…

హాలేలూయ హాలేలూయ
లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి
నిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనావు
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..
…సన్నుతించెదనూ…

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి
నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా

స్తోత్రగీతము – 3

నా యేసయ్యా నా రక్షకా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)

ప్రేమింతును నీ సన్నిధానమును
కీర్తింతును యేసయ్యా (2)

నా విమోచకుడా నా పోషకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
||ప్రేమింతును||

నా స్నేహితుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
||ప్రేమింతును||

నా విమోచకుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
||ప్రేమింతును||

ఆరాధన వర్తమానము

దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవునిని ఆరాధించవలసిన వారము, ఘనపరచవలసిన వారము.

యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. -కీర్తనలు 100:3

“యెహోవాయే దేవుడని తెలిసికొనుడి” అని వాక్యము తెలియ చేస్తుంది. మన వ్యక్తిగతమైన జీవితములో, ఈ వారమంతా మన ఉద్యోగములలో, పనులలో కొనసాగించబడటానికి కారణం ఎవరు అని మనము ఖచ్చితముగా తెలుసుకోవాలి. ఆయన కృపయే మనలను ఇంతవరకు నడిపించింది. మనము ఆయనకు చెందిన వారము గనుక మనకు ఒక ప్రత్యేకత ఉంది. అంది ఏంటి అంటే, మన జీవితములో సూపర్ నేచురల్ విషయాలే జరుగుతాయి.

యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు గాక విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును -కీర్తనలు 107:1-2
యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును. -కీర్తనలు 136:1-2

ఈ వాక్యాలను బట్టి ఆయన కృప నిరంతరము ఉంటుంది అనే సత్యము గ్రహించగలము. ఆ కృపను బట్టియే మన జీవితములో ఆయన కార్యములు జరుగుచున్నవి.

మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముండును. -కీర్తనలు 136:23-24

మనము ఆయనకు చెందినవారిగా, ఆయన బిడ్డలుగా ఉంటున్నాము. ఆయన మన దీన దశలో జ్ఞాపకము చేసుకుంటున్నాడు. అలా జ్ఞాపకము చేసుకునేవాడు ఎటువంటివాడు? అంటే నిరంతరము కృప గలిగినవాడు. ఆయన “కృప” మనము కలిగిన ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ గా మనకు చూడగలము.

సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండును. -కీర్తనలు 136:25

ఆయన బిడ్డలుగా మన ప్రత్యేకత ఏమిటి అంటే ఆయన “కృపను పొందుకొనుట”. సింహపు పిల్లలైనా ఆకలిగొంటాయి గానీ ఆయన పిల్లలకు ఏ కొదువ ఉండదు. లోకములో ఉన్నవారికీ మనకూ ఒక తేడా ఏమిటి అంటే, వారి జీవితములో కొరత ఉంటుందేమోగానీ, మన జీవితములో ఆయన కృపనుబట్టి ఏ కొరత మనకు ఉండదు. మనము ఆయన వారము. మన ముందుకు వచ్చే ప్రతి పరిస్థితి వెనుకకు వెళ్ళిపోవలసినదే. ఎందుకంటే మన ముందర ఉన్నవాడు యెహోవాయే. ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో పగలు మేఘ స్తంభముగానూ, రాత్రివేళ అగ్ని స్తంభముగానూ వారికి తోడై నడిపించాడు. క్రూర మృగాలనుండే కాదుగానీ, మంచు చల్లదనము నుండి కూడా వారిని కాపాడినాడు. మన జీవితములలో కూడా చిన్న చిన్న వాటినుండి పెద్ద పెద్ద వాటి వరకు కూడా ఆయనే తప్పించి, కాపాడి నడిపించేవాడు.

యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. -కీర్తనలు 100:3

మనలను పోషించువాడు ఆయనే! పోషణ అంటే ఆహారము మాత్రమే కాదు గానీ, మనము సంతోషముగా కొనసాగించబడటానికి ఏమున్నా సరే అవన్నీ పోషణగానే చూడవచ్చు. మనము కలిగిన అవసరములన్నీ తీర్చువాడు ఆయనే.

నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవతల యెదుట నిన్ను కీర్తించెదను. -కీర్తనలు 138:1
రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వనిచేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానముచేయు దము -కీర్తనలు 95:1

“యెహోవానుగూర్చి” అంటే, యెహోవాయే మన దేవుడై ఉన్నాడు, మన కాపరియై ఉన్నాడు. మన పోషకుడై ఉన్నాడు. ఈ సత్యమును గ్రహించి మనస్పూర్తిగా ఆయనను ఆరాధించాలి. దీనికొరకు ఆయన కృపను మీరు అనుభవించాలి. అనుభవించాలి అంటే, వాక్యము ప్రకారము నడవాలి.నేను ప్రత్యేకమైన వాడను, సూపర్ నేచురల్ ను పొందుకొనేవాడను అని సత్యము ఎరిగినట్టయితే ఆయనను సంతోషముతో స్తుతించు.

కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. -కీర్తనలు 95:2

ఆరాధన గీతము

నా యేసయ్యా నా రక్షకా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)

ప్రేమింతును నీ సన్నిధానమును
కీర్తింతును యేసయ్యా (2)

నా విమోచకుడా నా పోషకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
||ప్రేమింతును||

నా స్నేహితుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
||ప్రేమింతును||

నా విమోచకుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
||ప్రేమింతును||

మెయిన్ మెసేజ్

మనము ఆత్మీయముగా ఎదగాలి అంటే ఏమి చేయాలి? మన ఆత్మను సృష్టించిన వాని గూర్చి మనము తెలుసుకోవాలి.

మీ కొరకును, లవొదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడనివారందరికొరకును౹ నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరు చున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.౹ బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.౹ -కొలొస్సయులకు 2:1-3

“దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై” మనము ఉండాలి అని పౌలు ఈ పత్రిక ద్వారా తెలియచేస్తున్నాడు. నీవు క్రీస్తును గూర్చి ఏమి తెలుసుకున్నావు అని అడిగితే, నా కొరకు చనిపోయాడు అని, నన్ను రక్షించాడు అని, పరలోకానికి మార్గము అని చెప్తాము. అయితే మనము చదివిన వాక్యము చూస్తే, “స్పష్టముగా” తెలుసుకోవాలి అని వ్రాయబడి ఉన్నది.

ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండ వలెనని ప్రార్థించుచున్నాను.౹ -3 యోహాను 1:2

క్రీస్తును గూర్చిన మర్మము తెలుసుకొనుటలో మనము వర్థిల్లుచున్న ప్రకారము మనము అన్నివిషయములలో మనము వర్థిల్లుతాము. ఎందుకంటే మనకొరకు సమస్తము క్రీస్తులోనే దాచబడి ఉన్నవి.

ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది;౹ -కొలొస్సయులకు 2:9
ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.౹ ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేప్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.౹ -హెబ్రీయులకు 1:2-3

దేవుడు ఏమి గుణములు కలిగి ఉన్నాడో ఆ అన్ని గుణములు కలిగినవాడుగా శరీర ధారిగా యేసయ్య ఉన్నాడు. దేవుని మహిమ, దేవుని తత్త్వము కలిగినవాడుగా యేసయ్య ఉన్నాడు. అంతే కాక, యేసయ్య మాటలలో దేవుని మహాత్మ్యము ఉన్నది. అందుకే యేసయ్య మాటలు ఎంతో విలువైనవి.

కాబట్టి యేసు–మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా౹ సీమోను పేతురు– ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;౹ -యోహాను 6:67-68

యేసయ్య మాటలలోని మహాత్మ్యము గ్రహించిన పేతురు ఆ మాటలు నిత్యజీవపు మాటలు అని తెలుసుకున్నాడు.

అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు–సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు. మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. -మత్తయి 16:16-18

పరలోకమందున్న తండ్రి యేసుని గూర్చిన మర్మమును పేతురుకు బయలుపరిచిన దానిని బట్టి, పేతురు యేసుని గూర్చి తెలుసుకున్నవాడై ఉన్నాడు. క్రీస్తు నిత్యజీవపు మాటలు గలిగినవాడై ఉన్నాడు, మరియు ఆయనే జీవమై ఉన్నాడు.

కావున యేసు ఇట్లనెను–మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు.౹ నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్యజీవముగలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.౹ -యోహాను 6:53-54

దేవాది దేవుడు జీవముగలవాడు అయి ఉన్నాడు. ఆ దేవాది దేవుని మూర్తిమంతమైన యేసుక్రీస్తు జీవము ఇచ్చువాడిగా ఉన్నాడు. అందుకే క్రీస్తును కలిగిన మనము జీవము గలిగినవారుగా ఉంటున్నాము.

బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.౹ -కొలొస్సయులకు 2:3

యేసయ్యను అంగీకరిస్తే జ్ఞానము, సంపద వచ్చేస్తుందా? అంటే, అదికాదు గానీ, అంతకంటే ప్రాముఖ్యమైన “ఆయన ఏమై ఉన్నాడో అది నీలో నింపబడుతుంది”. అందుకే యేసయ్య ఏమై ఉన్నాడో మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఉద్యోగములోనైనా, చదువులోనైనా, జీవితములోనైనా ఎక్కడైనా సరే నీకు అవసరమైన జ్ఞానమునకు ఆయనే ఆధారము అయి ఉన్నాడు.

కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.౹ -ఫిలిప్పీయులకు 4:19

క్రీస్తును కలిగి ఉన్న ప్రతి ఒక్కరి అవసరము ఖచ్చితముగా తీర్చబడుతుంది. అందుకే యేసు ఇలా చెప్తున్నాడు –

యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.౹ -యోహాను 14:6

యేసయ్యే మార్గము అంటే మోక్షానికి మార్గము అని మాత్రమే మనము ఎరిగి ప్రకటిస్తాము. అయితే మన జీవితములో అవసరమైన ప్రతీ పరిస్థితిలో మనకు మార్గముగా యేసయ్యే ఉన్నాడు. ఆయనే ఆధారమై ఉన్నాడు. అందుకే క్రీస్తులో ఎదుగుతున్నప్పుడు దేవుని మర్మము నీవు గ్రహించినవాడిగా ఉంటావు.

కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;౹ -2 కొరింథీయులకు 5:17

దినములు గతించేవిగా ఉన్నాయి. ఈరోజు మనము క్రీస్తుతో ఉన్నాము, గనుక నూతనముగా సిద్ధపరచబడేవారిగా ఉంటాము. క్రీస్తును కలిగి ఉండటము అంటే ఏమిటి? క్రీస్తు వాక్యమై ఉన్నాడు. అంటే, వాక్యము ఏమి చెప్తుందో ఆ ప్రకారము నీ జీవితము ఉన్నట్టయితే, నీ జీవితములో గతించిపోయే దాని స్థానములో నూతనపరచబడుతుంది. ఏమిటి అని ఆలోచిస్తే, ఉదాహరణకు ఒక విద్యార్థి పరీక్ష రాస్తున్నాడు. వాడు క్రీస్తు నందు విజయము అని నమ్మినవాడై ఉన్నాడు. ఆ పరీక్ష రాయడానికి అవసరమైన జ్ఞానము లేని పరిస్థితి గతించిపోయి, పరీక్షలో విజయము కొరకైన జ్ఞానము చేత నూతనపరచబడుతుంది. అందుకే వాక్యము ప్రకారము మనము ఉండుట అనేది ఎంతో ప్రాముఖ్యము. క్రీస్తునందు ఉన్నయెడల నీ కన్నీటికి కారణమైన ప్రతీదీ గతించిపోయి, నిన్ను సంతోషపరిచే విధానములో సామర్థ్యము నూతనపరచబడుతుంది.

అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని.౹ నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేప్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.౹ క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును,౹ ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.౹ -ఫిలిప్పీయులకు 3:7-10

క్రీస్తు ఎలా పునరుత్థానుడైనాడు అని ఆలోచిస్తే, “మృతులలోనుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. -రోమా 8:11”. శారీరకమైన మరణము మాత్రమే కాదు గాని, మరణకరమైన ప్రతి పరిస్థితిలోనుండి లేపగలిన శక్తి కలిగినవాడు పరిశుద్ధాత్మ. ఆ అనుభవము కొరకౌ పౌలు ఆశకలిగి ఉన్నాడు. నీవు నేను కూడా అదే ఆశ కలిగి ఉండాలి.

ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే గాక రాబోవు యుగమునందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనియున్నాడు.౹ -ఎఫెసీయులకు 1:20

దేవుడు తన ఆత్మ చేత కార్యము జరిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేవాడుగా ఉన్నాడు. అందుకే మనము ఆత్మ చెప్పు సంగతులు వినాలి.

కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను.౹ -ఎఫెసీయులకు 1:8

మొదటిగా కార్యము జరగక మునుపు, ఆయన చిత్తమును గూర్చి తెలియచేయబడుతుంది. ఆ చిత్తమును గూర్చి వెల్లడి చేయబడిన మాటలు పట్టుకుని నడిచినప్పుడు, కృప ద్వారా ఆ చిత్తము నెరవేర్చబడుతుంది.

తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.౹ -2 పేతురు 1:2

అనుభము కలిగిన కొలదీ కృప విస్తరిస్తుంది. అందుకే వాక్యము ప్రకారము జీవించి అనుభవించాలి.