04-02-2024 – ఆదివారం మొదటి ఆరాధన

స్తుతిగీతము – 1

మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా

నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక
నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది
||యేసయ్యా||

ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే
నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి
||యేసయ్యా||

పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని
అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు
||యేసయ్యా||

స్తుతిగీతము – 2

నీ కృపలో నన్ను దాచావు యేసయ్య- యేసయ్య
నేను బ్రతికి ఉన్నానంటే నీ దయ నీ దయ
నీ జీవమే నాలో ఉండగా నాకు భయమే లేదయ్య
నా తండ్రిగా నీవు ఉండగా నాకు కోరత లేదయ్య
నీ తోడు నాకు ఉంటే చాలయ్య చాలయ్య
ఏదైనా సాధ్యమే నీతో యేసయ్య- యేసయ్య-

ఏ త్రోవ లేకున్నా నిరాశలో ఉన్న
నీ జీవ వాక్యముతో నను నడుపుము యేసన్న
దయచూపుమా దీవించుమా
సమృద్ధి జీవంతో తృప్తిపరచుమా

పేరు ప్రాఖ్యతలు ఉన్నా సంపదలు ఉన్నా
నీ కృప లేకపోతే అన్నియు వ్యర్థమే
నీ కనికరం నీ కరుణ
జీవితానికి చాలు యేసయ్య

కనురెప్పపాటైనా నను విడువని యేసయ్య
నీ సేవ చేయుటకె జీవిస్తానయ్య
నా ప్రార్థన ఆలకించుమా
పరిపూర్ణమైనదానిగ అభిషేకించుమా

ఆరాధన వర్తమానము

దేవుని సన్నిధిలో ఎవరి దీవించబడతారు, దేవుని చేత ప్రేమించబడిన ప్రతీ వారు దీవించబడతారు. అయితే ఉత్సాహముతో దేవుని స్తుతించాలి అనే తపన కలిగినవారు ఆ దీవెనను స్వీకరించుకొనుటకు సిద్ధపరచుకోగలుగుతారు.

ఈరోజు మనము దేవునిచేత దీవించబడటానికి ఒక అవకాశము ఇవ్వబడింది. మన జీవితములను మహిమా జీవితములుగా చేయాలి అనేది దేవుని ఆశ, ఉద్దేశ్యము. ఆయన మహిమ మన జీవితములను కొనసాగించాలి అనేది ఆయన కోరిక

ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.౹ -రోమా 3:23

“దేవుడు అను గ్రహించు మహిమ” అనేది ప్రాముఖ్యమైన మాట. పాపము చేత ఆ మహిమను పొందలేకపోతున్నారు. ఒకవేళ నీతిమంతులుగా తీర్చబడి, దేవునితో సహవాసము చేస్తూ, ఆయనతో సమాధానము కలిగి ఉన్న మనకు ఖచ్చితముగా ఆయన మహిమ అనుగ్రహిస్తాడు అనే కదా అర్థము.

దేవుని సన్నిధిలో ఆయన బలము, ప్రభావము మరియు ఆయన మహిమ నిండి ఉంటాయి. ఈరోజు ఆ మహిమను అనుభవించాలి అనే ఆశ మనము కలిగి ఉండాలి. మనము ఆరాధిస్తున్నప్పుడు మన దేవుని సన్నిధిని అనుభవించాలి అనే ఆశ కలిగి మనము నిలబడాలి.

యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియులేదు. -1 సమూయేలు 2:2

మనము ఆరాధించే దేవుడు, మనము వెంబడించే దేవుడు వంటి దేవుడు ఒక్కడైనను లేదు. ఆయన తప్ప మరేదేవుడు లేడు. ఆయన వంటి ఆశ్రయదుర్గమేదియు లేదు. నీ దేవుడూ ఏమై ఉన్నాడో అనే సత్యము ఎరిగి ఉంటే నీవు మహిమజీవితములో కొనసాగగలుగుతావు.

కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనతగలవాడవు, నీవంటి దేవుడొకడును లేడు; మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులనుబట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తుదేశములోనుండియు, ఆ జనుల వశములోనుండియు, వారి దేవతల వశములోనుండియు నీవు విమోచించిన ఇశ్రాయేలీయులనునట్టి నీ జనులవంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది.౹ -2 సమూయేలు 7:22-23

మన దేవుని వంటి దేవుడు మరొకడు లేదు. ఆ జీవము గల దేవుని చేత నడిపించబడుతూ పోషించబడుతున్న మన వంటి వాడు ఎవడు లేడు. మన జీవితము ఎలాంటి జీవితము అనేది మనము దీనినిబట్టి అర్థము చేసుకోగలము. ఆయనకు ఖ్యాతి కలుగునట్లు దేవుడు మనలను ఏర్పాటుచేసుకున్నాడు. గనుకనే మన జీవితములు వ్యర్థమైనవి కావు గానీ, ఆయన మహిమకొరకు సిద్ధపరచబడిన జీవితములు. మన జీవితములు ఎలా ఉంటే ఆయనకు మహిమవస్తుంది? మన స్థితి మార్చబడినప్పుడు మాత్రమే కదా!

భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన
1. నీవు ఐగుప్తుదేశములోనుండియు
2. ఆ జనుల వశములోనుండియు
3. వారి దేవతల వశములోనుండియు

నీవు విమోచించిన జనులవంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది

ఐగుప్తు లోకపు పాప దాస్యము. జనము ఆ లోకములో అపవాదిచేత ప్రేరేపించబడి మనకు అడ్డువచ్చే జనము. వారి దేవతలు అనగా లొకములోని అంధకారపు అధికారములు.

ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచిపేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు. -జెఫన్యా 3:20

ఐగుప్తు శ్రమలతో కూడిన స్థలము, ఐగుప్తు ప్రజలు కఠినమైన హృదయము కలవారు అలాగే ఐగుప్తు దేవతలు దేవుని ప్రణాళికకు వ్యతిరేకమైనవారు.

ఐగుప్తు లో ఉన్న శ్రమలనుండి ఎలా అయితే విమోచించాడో అలాగే ఈ లోకమునుండి దేవుడు విడిపిస్తాడు. ఐగుప్తులోని ప్రజల వశములోనుండి ఎలా అయితే విడిపించాడో, ఈ లోకములో దేవునికి వ్యతిరేకమైన ప్రతీ జనమునుండి విడిపిస్తాడు. ఎలా అయితే ఐగుప్తు దేవతల వశములోనుండి విడిపించాడో, ఈ లోకాధికారి దూతల సమూహము యొక్క ప్రభావమునుండి విడిపిస్తాడు. గనుక ఆయన మహిమ నిమిత్తమై మన జీవితములు విమోచించబడవలసినవే.

మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవైయుండి, వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై యుండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి.౹ -2 సమూయేలు 7:24

నిర్ధారణ చేయడము అంటే, ఈ లోకము, లోకములోని జనము, లోకము యొక్క దేవతల ప్రభావమునుండి ఖచ్చితముగా విడిపించబడతాము అని నిర్ధారణ చేయబడ్డాము. ఇది ఈరోజు తెలియచేయబడిన రివలేషన్. మన దేవుని ఉద్దేశ్యము గ్రహిస్తేనేగానీ, ఆయనను సత్యముతో ఆరాధించలేము.

మనకు దేవుని గూర్చి తెలిస్తేనే గానీ ఆయన అడుగుజాడలలో నడువలేము.

ఈ లోకములోని శ్రమలనుండి, కఠినమైన మనుష్యులనుండి, అపవాది నుండి సూపర్నేచురల్ గా విడిపించేదేవుడు నీ దేవుడు అనే సత్యము నీకు అర్థమైతే మనసారా నీ దేవునిని స్తుతించు.

ఈరోజు నీ పై ఈ మూడిటిలో ఎవరి ప్రభావము నీపై ఉన్నా సరే నీవు దేవుని మాట నమ్మి, నీ దేవుని ఎరిగి చేసే ఈ ఆరాధనను బట్టి, ఆ ప్రభావము నుండి నీవు తప్పించబడతావు.

నీవు దేవుని మాట నమ్మి, నీ దేవుని ఎరిగి చేసే ఈ ఆరాధన ముద్రించబడినది. దేవుని మహిమ కొరకు ఖ్యాతి కొరకు నీవు ఎన్నుకోబడ్డావు, ప్రత్యేకించబడ్డావు, నిర్ధారించబడ్డావు.

ఆరాధన గీతము

నిన్ను పోలిన వారెవరు -మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితినిన్ మా దేవా
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య -2

ఎల్షడాయ్-ఆరాధన
ఎలో హిమ్-ఆరాధన
అడోనాయ్-ఆరాధన
యేషువా -ఆరాధన

కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా
కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య -2 (ఎల్షడాయ్ -ఆరాధన)

యుక్తకాలము అనే ఒక కాలము నిర్ణయించబడింది. ఈరోజు నీవు విడిపించబడులాగున వాక్యము వచ్చించి అంటేనే, నీ విడుదలకొరకైన యుక్తకాలము అని నీవు గ్రహిస్తున్నావా?

మన మధ్య ఉన్న ఆయన తనను తాను కనపరచుకొనేవాడుగా ఉన్నాడు, ప్రత్యక్షపరచుకొనేవాడుగా ఉన్నాడు.

మేలుచేయు దేవుడవు అని ప్రకటించాము తండ్రీ, ఈలోకములోని శ్రమనుండి, కఠినమైన జనములనుండి, లోకపు అధికారి ప్రభావము నుండి విడిపించుటయే నీ మేలు నీ ఖాయ్తి కొరకు నీ మహిమ కొరకు నిర్ధారించినందుకు స్తోత్రము.

వారము కొరకైన వాక్యము

చాలామందికి కృప ఎలా పనిచేస్తుంది అనేది తెలియక వారు కలిగినదానిపైనే ఆధారపడేవారుగా ఉంటారు. అయితే దేవుని బిడ్డలుగా మనము ఆయన కృపనే ఆధారము చేసుకొనేవారిగా ఉండాలి.

శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి ఆలాగైతే ఎవడు రక్షణపొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. -మత్తయి 19:25-26

ఇక్కడ శిష్యుల కళ్ళముందు ఒక సందర్భము జరిగింది. అప్పుడు వారికి వచ్చిన ప్రశ్న అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అనే ప్రశ్నయే. ఆ సందర్భము ఏమిటి అని చూస్తే –

యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను. -మత్తయి 19:23-24

అంటే ధనవంతుడు పరలోకములో ప్రవేశించుట చాలా కష్టమైనది అనే సందర్భము. దీనిని బట్టి మనము అర్థము చేసుకోవలసినది చాలా కష్టమైనది ఎవడూ పొందుకోలేడు అనే ఆలోచన మనకు కలుగుతుంది

ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.౹ -యోహాను 1:17

ఇదిగో ఒకడు ఆయనయొద్దకు వచ్చి బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. అందుకాయన మంచి కార్యమునుగూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు –ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు–నరహత్య చేయవద్దు, వ్యభిచరింప వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రు లను సన్మానింపుము, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను. -మత్తయి 19:16-19

అందుకు ఆ యౌవనుడు – ఇవన్నియు అనుసరించుచునే యున్నాను; ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు–నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యౌవనుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లి పోయెను. -మత్తయి 19:20-22

యవ్వనుడితో ప్రభువు చెప్పిన ఆజ్ఞలు ధర్మశాస్త్రము ద్వారా ఇవ్వబడినవి. అయితే ఆ యవ్వనుడు ఆ ఆజ్ఞలు అన్నీ పాటిస్తున్నాను అని చెప్పినప్పుడు, నీవు పరిపూర్ణుడవు అగుటకు కోరినయెడల, నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, నన్ను వెంబడించుము అని చెప్పగానే, ఆ యవ్వనుడు వ్యసనపడి వెళ్ళిపోయెను.

ఈ యవ్వనస్తుందు ఆజ్ఞలు పాటించినప్పటికీ, పరిపూర్ణత లేనివాడిగా ఉన్నాడు. ధర్మశాస్త్రం ఆయనకు పరిపూర్ణత ఇవ్వలేదు. పరిపూర్ణత కొరకు యేసయ్య చెప్పిన మాట అనుసరించలేని దుస్థితిలో యవ్వనస్తుడు అక్కడనుండి వెళ్ళిపోయాడు.

ఇదంతా చూస్తున్న శిష్యులు అడుగుతున్న ప్రశ్న – “ఆజ్ఞలను పాటించడము ద్వారా పరిపూర్ణత లేకపోతే” ఇంక ఎవరు రక్షణ పొందుకుంటారు? ఆజ్ఞలను పాటించినప్పుడు మనలో జీవము కలుగుతుంది గానీ, ఆజ్ఞలను బట్టియే పరిపూర్ణత కలుగదు.

ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టివాడైనందున జనులు గుంపుకూడి యుండుటవలన చూడ లేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి–జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా -లూకా 19:1-5

ఇక్కడ జక్కయ్య కూడా ముందు చూసిన యవ్వనస్తుడివలే ధనవంతుడై ఉన్నాడు. అయితే యేసయ్య జక్కయ్యను పిలిచి తన ఇంటికి వెళ్ళడము మనకు తెలిసినదే. అయితే యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళడము అంటే ఏమిటి? మోషే ద్వారా ధర్మశాస్త్రము లోని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. యేసయ్య ద్వారా కృపయు సత్యమును అనుగ్రహించబడ్డాయి.

ధనవంతుడు ఆజ్ఞలు పాటించినపుడు పరిపూర్ణత సాధించలేకపోయాడు. మరొక ధనవంతుడు కృపను బట్టి పరిపూర్ణత పొందుకోగలిగాడు. అనగా చాలా కష్టము, అసాధ్యము అనే సంగతులు కృప చేత మనము పొందుకోగలము.

శిష్యుల కళ్ళముందు రక్షణ పొందుకోలేని ఆజ్ఞలు పాటించే ఒక ధనవంతుడు ఉన్నాడు. మనముందు పాపియైన ఒక ధనవంతుడు యేసయ్యను అంగీకరించి, యేసయ్యను బట్టి కృపను పొందుకొన్నవాడై ఉన్నాడు. శిష్యుల ముందు ఉన్న ధనవంతుడికి తన ఆస్తిని అమ్మమని చెప్పినపుడు వ్యసనపడివెళ్ళిపోయాడు. అయితే మనముందు ఉన్న జక్కయ్యతో యేసయ్య ఆస్తిని అమ్మమని చెప్పలేదు గానీ, తనంతట తానే తన ఆస్తిని పంచిపెట్టినవాడుగా ఉన్నాడు. కృప పనిచేసినప్పుడు ఇలా జరుగురుంది

అయితే ధర్మశాస్త్రము వ్యర్థమా?

అందుకాయన మంచి కార్యమునుగూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను – మత్తయి 19:17

జీవము అనగా యేసయ్యే. ఆయనే మార్గము, సత్యము జీవము అయి ఉన్నాడు. అనగా ధర్మశాస్త్రములోని ఆజ్ఞల ద్వారా యేసయ్య వద్దకే నడిపించబడతాము. యేసయ్యను అంగీకరించినపుడు కృపను పొందుకొనినవారుగా ఆ కృపచేతనే నడిపించబడతాము.

అందుకు యేసు–ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది. -లూకా 19:9

మత్తయిలోని ధనవంతుడు రక్షణ పొందుకోలేకపోయాడు. దానిని బట్టి ధనవంతుడు రక్షణ పొందుకోవడము కంటే వొంటె సూదిబెజ్జములో దూరుట సులభము అని చెప్పబడింది దానిని బట్టి శిష్యులకు సందేహము వచ్చింది.

అయితే ఇక్కడ జక్కయ్య అనే ధనవంతుడు యేసయ్యను అంగీకరించినవాడై అనుగ్రహించబడిన కృపను బట్టి రక్షణ పొందుకున్నాడు. కృపలో ఉన్న ప్రతీ వాని స్థితి మారవలసినదే!

వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని వెంబడిస్తూ ఆ ప్రకారము నడిచేవాని జీవితమును కృప వెంబడిస్తుంది. నీ వాక్యమే నా త్రోవకు వెలుగు అనగా నా జీవితమునకు వెలుగు అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. అంతే కాక నా జీవితమంతా కృపా క్షేమములే వెంబడిస్తాయి అని చెప్పగలుగుతున్నాడు. కృప పనిచేసినప్పుడు మన సామర్థ్యము ఏమి పనిచెయ్యదు.

కృప సూపర్నేచురల్ కార్యములు చేస్తుంది. జక్కయ్య కృపను పొందుకోక మునుపు ధనమును కూడబెట్టుకోవడమే లక్ష్యముగా ఉన్నాడు అయితే కృపను పొందుకోవడము ద్వారా తాను చెల్లించేవాడిగా మారాడు. దేవునికి ఇష్టమైనవాడిగా ఉండాలి అంటే మన జీవితములో ఆయనకు ఇష్టము కానిది ఏమి ఉన్నా సరే అది దేవుడు తీసివేస్తున్నపుడు సంతోషముతో లోబడాలి.

అయితే అలా చెల్లించడము ప్రారంభిస్తే మరి ఇంక మనకు ఏమి మిగులుతుంది అనే ఆలోచనవస్తే ఎలా? శిష్యులకు కూడా ఇదే ప్రశ్న వచ్చింది.

పేతురు–ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను (ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును. -మత్తయి 19:27-29

దేవుని కృప పరలోకములో నీ స్థానమును సిద్ధపరుస్తుంది. ఒకప్పుడు జక్కయ్యను అందరూ తిట్టుకొనేవారుగా ఉన్నారు. అయితే ఇప్పుడు అందరికీ తీర్పు తీర్చువాడిగా దేవుని కృప మార్చింది.

మనము దేవుని కొరకు విడిచిపెట్టినది ఖచ్చితముగా మరలా సమకూర్చబడుతుంది. ఈ సత్యమును ఎరిగిన ప్రతివాడు అదేవిధముగా కార్యములు జరిగించేవాడుగా ఉంటాడు. మన దేవుడు మన దగ్గరనుండి ఆశించేవాడు కాదు గానీ, మనలను దీవించేవాడు. కృప అసాధ్యమైనదానిని సాధ్యపరుస్తుంది. కృప పరలోకములో మన స్థానమును సిద్ధపరుస్తుంది. అలాగే కృప మనము దేవునికొరకు విడిచిపెట్టినదానిని తిరిగి నూరంతలుగా సమకూర్చేదిగా ఉంది.

మత్తయిలోని ధర్మశాస్త్రమును పాటించే ధనవంతుడైన యవ్వనస్తుడి ద్వారా, లూకా లోని ధనవంతుడైన జక్కయ్య ధర్మశాస్త్రము లేకుండానే కృపను పొందుకున్న సంగతి ద్వారా ధర్మశాస్త్రమునకు కృపకు గల వ్యత్యాసమును ప్రభువు ఈరోజు మనకు తెలియ చేసాడు.

ఈ సంవత్సరపు 12 గంపల ద్వారా పొందే ఆశీర్వాదమును సూపర్నేచురల్ గా మీరు పొందుకోవడానికి కృప మనలను వెంబడిస్తుంది.