04-02-2024 – ఆదివారం రెండవ ఆరాధన

స్తోత్ర గీతము 1

నీకంటె నమ్మదగిన దేవుడెవయ్యా
నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా
మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా
కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా
||నీకంటె||

కొట్టబడిన వేళ
నా గాయం కట్టినావే
బాధించినా స్వస్థపరిచేది నీవే
||నీకంటె||

అణచబడిన వేళ
నా తలను ఎత్తినావే
శిక్షించినా గొప్ప చేసేది నీవే
||నీకంటె||

విడువబడిన వేళ
నను చేరదీసినావే
కోపించిన కరుణ చూపేది నీవే
||నీకంటె||

స్తోత్ర గీతము 2

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా
యేసయ్యా నీవే నా రక్షకుడవు
యేసయ్యా నీవే నా సృష్టికర్తవు
దరి చేర్చి ఆదరించుమా
ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా

వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు
ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు
హాల్లేలూయా ఆమెన్
ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా

పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి
సర్వాధికారివి.. ఓ యేసయ్యా
కరుణించి కాపాడుమా
ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా
||హల్లెలూయా||

స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్
కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా
కృప చూపి నడిపించుమా
ఓ యేసయ్యా.. కృప చూపి నడిపించుమా
||హల్లెలూయా||

స్తోత్ర గీతము 3

మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా

నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక
నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది
||యేసయ్యా||

ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే
నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి
||యేసయ్యా||

పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని
అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు
||యేసయ్యా||

ఆరాధన వర్తమానము

దెవుని సన్నిధికి నడిపించబడిన మన అందరము ధన్యులము. ఈరోజు ఆ దేవుడు మనలను ఆయన సన్నిధిలో ఉండునట్లు ఆకర్షించాడు.

ఒబెదేదోము దేవుని పని యందు ఆసక్తి కలిగినవాడు. దేవుని మందసము వద్దనే ఉండాలి అనే ఆశ కలిగినవాడుగా ఉన్నాడు. ఆలయములో ఆయన పని అయిపోయినప్పటికీ ఆయన దేవుని సన్నిధిలోనే ఉండటానికి ఆసక్తి కలిగినవాడుగా ఉన్నాడు.

ఒక సమయములో మందసము ఆయన ఇంటిలో ఉన్న కారణాన ఆయన ఇల్లు, ఇంటివారందరూ అతను కలిగి ఉన్న సమస్తము ఆశీర్వదించబడ్డారు. అలాగే ఉదయాన, సాయంకాలమున కూడా దేవునిని స్తుతించడానికి కూడి వచ్చిన అందరికీ అదే ఆశీర్వాదము కలుగును గాక! మనకు కూడా ఒక ఆశీర్వాద సమయము నిర్ణయించబడింది.

మనము నిర్ధారణ చేయబడ్డాము అని దేవుడు ఉదయమున మనకు తెలియచేసాడు. ఆయన జనులుగా ఉండునట్లుగా నిర్ధారణ చేయబడ్డాము. ఆయన జనులుగా ఏర్పరచబడిన జీవితములో ఐగుప్తు దేశము నుండి, వారి జనుల నుండి, వారి దేవతలనుండి విడిపిస్తాడు అని తెలియ చేసాడు.

యోసేపును చూస్తే, తన కలలో ఒక విషయము దేవుడు తెలియచేసాడు, అది తాను ఉన్నతమైన స్థానములో ఉంచబడతాడు అనేది ఆ రివలేషన్. పౌలుకు కూడా యెరూషలేములో ఇచ్చిన సాక్ష్యము రోమాలో కూడా ఇవ్వాలి అని దేవుని చేత రివెలేషన్ వచ్చింది. మనము కూడా వాక్యములోని రివెలేషన్ ను గనుక పట్టుకోగలిగితే మనము కూడా ఆ రివలేషన్ ద్వారా మన జీవితములను నడిపించుకోగలుగుతాము.

ఆత్మీయముగా ఎదగాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఆశించవలసినది దేవుని వాక్యములోని సత్యము, రివలేషన్ తెలుసుకోవాలి అనేదే!

రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వనిచేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానముచేయు దము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. -కీర్తనలు 95:1-2

మన దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించగలిగితే మనము ఖచ్చితముగా ఉత్సాహ గానము చేయగలుగుతాము. మన దేవుడు తనకు ఖ్యాతి కలుగునట్లు మన జీవితములను ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటప్పుడు ఏ శ్రమ, ఏ పరిస్థితి మన జీవితములను లోబరుచుకోగలదు.

యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు సమస్త దేవతలకంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవిశాలమును సృజించినవాడు. ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలసౌందర్యములు ఆయన పరిశుద్ధస్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి మహిమబలములు యెహోవాకు చెల్లించుడి. -కీర్తనలు 96:4-7

మనలో కొంతమంది ఆయన సన్నిధికి వచ్చి కూడా స్తుతించుటకు నోరు తెరువలేనివారుగా ఉంటారు, శరీరము ఇక్కడే ఉన్నా మనసు ఎక్కడో ఉంటుంది. అయితే మన దేవుడు అధిక మహిమను పొందదగినవాడుగా ఉన్నాడు. ఒకవేళ దేవుడు ఏమై ఉన్నాడో తెలిస్తే అలా అలక్ష్యముగా మనము ఉండము.

దేవుని సన్నిధిలో బలము, ప్రభావము మహిమ ఉన్నాయి అంటే ఎందుకు? ఊరకనే చూపించుకోవడానికా? కాదు గానీ, ఆయన మన తండ్రి గనుక ఆయన కలిగినవి అన్నీ కూడా మనవే. అందుకే పౌలు చెప్పగలుగుతున్నాడు – “నేను ఎప్పుడు బలహీనుడనో, అప్పుడే బలవంతుడను” అని చెప్పుచున్నాడు.

యెహోవా మహాత్మ్యముగలవాడు అంటే మనము కనీసము ఊహించడము కూడా సాధ్యము కానివాటిని చేయువాడు .

మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. -ఎఫెసీయులకు 3:20

దేవుని మహాత్మ్యము మన జీవితములో చూపించడానికే, ఆయన కనికరము మనపై చూపించడానికే, ఆయన ప్రేమ మనపై కురిపించడానికే. ఈ సత్యము నీవు ఎరిగితే, నీ నోరు తెరిచి స్తుతించకుండా ఉండగలుగుతావా?

మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును. -మత్తయి 7:10

అంటే నీవు ఏమి అడిగావో దానికంటే ఎక్కువగా ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. అంటే నీవు ఊహించినదానికంటే అధికముగా చేయగలవాడు.

మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా? -మత్తయి 7:9

మనము చెడ్డవారమై ఉండి కూడా మన పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలి అని ఎరిగినవారుగా ఉన్నాము. చెడ్డవారు అనే మాట చూస్తే, పిల్లలకు మంచి చేయాలి అనే ఆశ ఉంది గానీ, ఆ మంచి చెయ్యగల సామర్థ్యము నీకు లేదు. అయినప్పటికీ మంచే చెయ్యాలి అని ఆశ కలిగి ఉన్నాము.

అయితే మన పరలోకపు తండ్రి ఎలా ఉన్నాడు? ఆయన సర్వ శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది లేనేలేదు. అందుకనే మన జీవితములో ఖచ్చితముగా మంచిదే జరుగుతుంది, జరిగిస్తాడు. ఈ సత్యము నీవు ఎరిగితే నీ దేవుని గూర్చి ఉత్సాహ గానము చేయగలుగుతావు. ఆ మంచి ఎలా జరిగించబడుతుంది అంటే, మన దేవుని మహాత్మ్యమును బట్టి జరిగించబడుతుంది.

దేవుడే నాకు తండ్రిగా ఉన్నాడు. ఆయన మహాత్మ్యమును బట్టి నా జీవితములో మంచే జరుగుతుంది అనేది ఈరోజు దేవుడు తెలియచేసిన సత్యము. ఈ సత్యమును ఒప్పుకోవడమే నీవు ఈరోజు చేసే ఆరాధన!

మన ఆలోచనలు కొంచెము దూరమే ఉంటాయి. ఇప్పటివరకు మాత్రమే ఉంటాయి. అయితే దేవుని ఆలోచనలు ఇప్పుడు మరియు ఇంక ముందు భవిష్యత్తులోను నీవు ఆ మచి అనుభవించాలి అనేది.

ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నడిపించబడుతున్నప్పుడు, వారి కాలి చెప్పులు అరిగిపోలేదు, వారు బట్టలు చిరిగిపోలేదు. అయితే దేవుడు చెప్పింది కానానుకు తీసుకువెళతాను అని మాత్రమే చెప్పాడు. ఆ కానాను తీసుకువెళ్ళే వరకు వారి బట్టలు, చెప్పుల విషయములో కూడా ఆయనే బాధ్యత తీసుకున్నవాడుగా ఉన్నాడు. మన జీవితములో కూడా ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడే వరకు మధ్యలో ప్రతీ విషయములో ఆయనే బాధ్యత తీసుకుంటాడు. ఎందుకంటే మనము ఆయన సొత్తు.

అందుకే ఏ పరిస్థితి అయినా సరే నీకు రక్షణ దుర్గమైన దేవునినే ఆశ్రయించాలి. సమస్యలు రావు అని వాక్యము చెప్పలేదు. లోకములో శ్రమ కలుగుతుంది అయితే ఆ శ్రమ నిన్ను నశింపచేయడానికి, నీ జీవితములోనికి ప్రవేశించడానికి అవకాశము లేదు. ఈ సత్యము ఎరిగి మనము ఆరాధిద్దాము.

ఆరాధన గీతము

తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు
నా ప్రియుడా నా ప్రాణమా నిన్ ఆరాధించెదన్
నా జీవమా నా స్నేహమా నిన్ అరాధించెదన్

నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా
తండ్రి దేవా నా ఆనందమా – నీ వడిలో నాకు సుఖము

నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా
తండ్రి దేవా నా ఆనందమా – నీ వడిలో నాకు సుఖము

వారము కొరకైన వాక్యము

మన దేవుడు నిజముగా ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన మన యెడల మంచి కోరిక కలిగి ఉన్నాడు. అయితే ఏమిటి ఆయన కోరిక? నీవు నేను పరిపూర్ణులుగా కనపరచబడాలి అనేదే ఆయన కోరిక. దేవునివాక్యము జీవమై ఉంది గనుక ఆ వాక్యమును స్వీకరించేవారిగా ఉండాలి. అప్పుడు ఆ జీవము మనలో స్థిరపరచబడుతుంది.

ప్రతిసారీ మంచిగానే మన జీవితములో జరగాలి అనేది లేదు. కొన్ని సార్లు మన విశ్వాసము పరీక్షించబడునట్లు కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు జరుగుతాయి. అయితే ఆ సందర్భములో మనము దుఃఖముతో నిండి ఉన్నప్పుడు, మనకు తండ్రిగా ఉన్న ఆ దేవ దేవుడు చూస్తూ ఉంటాడు కదా! నిన్ను చూచుచున్న దేవుడు అలాగే ఊరుకుంటాడా? ఏమైనా చేస్తాడా? ఒక్కోసారి అయితే అసలు ప్రభువా నీవున్నావా? అనే ప్రశ్న కూడ మనలో వస్తుంది.

యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయువారందరు బింకములాడుచున్నారు. –యెహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని యెహోవా, వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రిలేనివారిని హతముచేయుచున్నారు. -కీర్తనలు 94:3-7

ఇక్కడ కూడ, కీర్తనకారుడు దేవుడు చూడటములేదు అనుకొని భక్తిహీనులు దేవుని ప్రజలను బాధిస్తున్నారు అని చెప్పుచూ ఒక సత్యము తెలియచేస్తున్నాడు.

జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగచేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపకమానునా? -కీర్తనలు 94:8-10

అందుకే దేవుడు చూడటములేదు అనుకొనే వారికి ఈరోజు నీ సమాధానం, నా దేవుడు చూచువాడు. నీవు ఏ కఠినమైన మాటలు అనుభవిస్తున్నావో, నీ జీవితము గూర్చి అనేకులు ఏమి మాట్లాడుకుంటున్నాసరే, వాటిని నీ దేవుడు కూడ వింటున్నాడు.

ఒకవేళ దేవుని అంగీకరించి నలిగిపోతున్న స్థితిలో ఉంటే, అది మాటల చేత అయినా సరే, క్రియల చేత అయినా సరే నీ దేవుడు చూచేవాడుగా ఉన్నాడు. చూసిన దేవుడు క్రియలు జరిగించేవాడుగా ఉన్నాడు. న్యాయము జరుగులాగున యుక్త కాలమున తన క్రియలు జరిగించువాడుగా ఉన్నాడు. అసలు వాక్కు బయలుదేరింది అంటేనే కార్యము ముగించబడటానికి బయలుదేరుతుంది. ఆ వాక్కు బయలుదేరిన సమయమే యుక్త సమయము.

విధవరాలు అంటే ఆధారము, సహాయము లేని వారు. పరదేశులు అంటే స్వంతవారు కాని వారిగా ఎంచబడిన పరిస్థితి. చంపివేయబడుట అంటే ఇంక ఎదగకుండ, తప్పించబడు మార్గము లేకుండా బంధించబడి ఉంటుట.

అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను.౹ యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి–స్వస్థపడ గోరుచున్నావా అని వానినడుగగా౹ -యోహాను 5:5-6

ఇక్కడ యేసయ్య మొదట చూచినవాడుగా ఉన్నాడు, తరువాత స్థితిని ఎరిగినవాడుగా ఉన్నాడు చివరికి స్పందించినవాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తికి స్వస్థపరచబడే మార్గము ఎదురుగా ఉంది కానీ, ఆ మార్గములోనికి నడిపించే ఆధారము లేనివాడుగా ఉన్నాడు. ఆ కారణము చేత 38 సంవత్సరములు అక్కడే ఉండిపోయాడు. మన జీవితములలో కూడా ఆధారము లేని కారణాన మనము పోగొట్టుకున్న దానిని తిరిగి ఇచ్చేవాడుగా మన దేవుడు ఉన్నాడు.

–మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడై యున్నాడు;౹ -ఆదికాండము 31:5

యాకోబు జీవితములో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. యాకోబుకు లాబాను ఆధారముగా ఉండేవాడు. అయితే ఇప్పుడు ఆ ఆధారము దొరకట్లేదు. పరిస్థితి మారిపోయింది. ఉద్యోగములలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతవరకు కటాక్షము ఉండి ఇప్పుడు లేని పరిస్థితి ఉంటే, నీ దేవుడు నీకే తోడై ఉన్నాడు. మనము కూడా ఇదే ఆలోచన దృక్పథము కలిగి ఉండాలి.

మీ తండ్రి నన్ను మోసపుచ్చి పది మార్లు నా జీతము మార్చెను; అయినను–దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.౹ -ఆదికాండము 31:7

“అయినను” అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. జీవితములో జరిగే పరిస్థితి ఎంత నష్టకరమైనా, కష్టకరమైనా హాని జరగనివ్వడు నీ దేవుడు.

నీ తండ్రి అయిన దేవుడు నిన్ను చూసే వాడు, చూసిన వాడైన నీ దేవుడు ఏ నష్టము జరగనివ్వడు. అంటే మరి ఏమి చేస్తాడు?

ఆ నెగటివ్ పరిస్థితినుండి తప్పించడానికి దేవుడు తన మార్గములను తెరుస్తాడు, నడిపిస్తాడు. యాకోబు జీవితములో కూడా అనేకసార్లు జరిగిన ప్రయత్నములలో తప్పించబడే మార్గము తెరిగి తప్పించాడు.

లాబాను కటాక్షము ఉన్నప్పుడే నష్టపరచాలి అనే ఆలోచనలను తప్పించాడు. అటువంటిది ఆ కటాక్షము లేని పరిస్థితిలో మరి ఇంకెంతగా ఆ హానినుండి, నష్టము నుండి ఖచ్చితముగా తప్పిస్తాడు?

నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.౹ -ఆదికాండము 31:42

మన దేవుడు చూచేవాడు. ఆ చూచినవాడు స్పందించేవాడుగా ఉన్నాడు. కోనేరు వద్ద వేచి ఉన్నా వాడిని కూడా చూచినవాడైన దేవుడు, స్పందించిన వాడుగ ఉన్నాడు.

తండ్రిలేనివారిని హతముచేయుచున్నారు. అంటే ఉద్యోగములో చూస్తే, మన బాస్ మనకు సహాయకరముగా ఉంటే, మన తరపున మాట్లాడేవాడుగా తను ఉంటాడు. అటువంటి పరిస్థితి లేనప్పుడు, సహాయము చేసేవారు లేని స్థితిని ప్రభువు చూసి స్పందించేవాడుగా ఉన్నాడు.

యాకోబును అడ్డుకోవడానికి లాబాను వచ్చినవాడుగా ఉన్నాడు. నీ ప్రమోషన్ ను అడ్డుకోవడానికి ఎవరు వచ్చినా సరే, నీ ఆశీర్వాదమును అడ్డుకోవడానికి ఏది అడ్డుకున్నా సరే అది నీ దగ్గరకు రాకుండానే అది గద్దించబడుతుంది.

యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి యుండును. -కీర్తనలు 94:17

అనగా నీకు సహాయము చేసేవాడు దేవుడు తప్ప మరొకడు లేడు అని అర్థము. ఇప్పుడు దేవుని వైపు మాత్రమే నీ హృదయమును సిద్ధపరచుకోవాలి అని దేవుడు నీకు జ్ఞాపకము చేస్తున్నాడు. నీ ఆశీర్వాదమును దొంగిలించేది ఎవరైనా ఏ పరిస్థితి అయినా సరే, దానిని అడ్డుకోగలిగేది నీ దేవుడు మాత్రమే.

–నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది. -కీర్తనలు 94:18-19

ఇంతకు ముందు ఫలానాది జరుగుతుంది అని అనుకున్నప్పుడు, అది జరగకపోవడము కాలు జారిన పరిస్థితి. దానిని బట్టి విచారము హెచ్చినప్పుడు, గొప్ప ఆదరణ ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది. ఆదరణ ఎల్లప్పుడు మాటలను బట్టే కలుగుతుంది. అయితే మన దేవుని మాటలు క్రియలతో కూడినవిగా ఉన్నాయి. ఈరోజున దేవుని మాటలు నీ పరిస్థితిలో ఆదరణ కలిగిస్తుంటె, ఇది నీ సమయము. చూచుచున్న దేవుడు స్పందించేవాడు. స్పందించే దేవుడు నిన్ను తృప్తి పరచేవాడు.

అందుకే నీ ఎదురుగా ఉన్న పరిస్థితి ఎలా ఉన్నాసరే, ఒకవేళ నీ ప్రమోషన్ అడ్డుకోవడానికి ఇతరులు వారి వారి రికమండేషన్స్ తో వచ్చినా సరే, నీ దేవుడు రాత్రికి రాత్రే ఆ పరిస్థితి మార్చేవాడుగా ఉన్నాడు.

మీకు హాని చేయుటకు నా చేతనవును; అయితే పోయిన రాత్రి మీ తండ్రియొక్క దేవుడు–నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుక కుము జాగ్రత్త సుమీ అని నాతో చెప్పెను.౹ -ఆదికాండము 31:29

అనగా ఎవరు ఎన్ని ప్రయత్నములు చేసినా సరే వాడి ప్రయత్నములు సఫలము కావు. ఈ వాక్యమును మనసులో పెట్టుకుని, జరగబోయే మంచి, మహాత్మ్యము ఎలా జరుగుతుంది అని గమనించు. దేవునికి సాక్షిగా సిద్ధపడు.