స్తుతిగీతము – 1
హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము
ఆ….. హల్లెలూయ …
హల్లెలూయ … హల్లెలూయ …
|| హల్లెలూయ ||
అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము (2)
అల సాంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము
||హల్లెలూయ||
ఆకాశము నుండి మన్నాను పంపిన
ఆ దేవుని స్తుతియించెదము (2)
బండ నుండి మధుర జలమును పంపిన
ఆ యెహోవాను స్తుతియించెదము
||హల్లెలూయ||
స్తుతిగీతము – 2
నిన్ను కాపాడువాడు కునుకడు
నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు
నీ భారము వహియించు యేసు
నీ కొరకే మరణించే చూడు
పలుకరించే వారు లేక పరితపిస్తున్న
కనికరించే వారు లేక కుమిలిపోతున్న
కలతలెన్నో… కీడులెన్నో ….
బ్రతుకు ఆశను అణచి వేసినా
ఎడబాయడు యేసు నిన్ను
దరిచేర్చును యేసు నిన్ను
మనస్సులోన శాంతి కరువై
పరుల మాటలు క్రుంగదీసి బాధపెడుతున్న
భీతులెన్నో… భ్రాంతులెన్నో….
సంతసంబును తృంచివేసిన
ఎడబాయడు యేసు నిన్ను
దరిచేర్చును యేసు నిన్ను
స్తుతిగీతము – 3
మంచి మంచి మంచి మంచి దేవుడు యేసన్న
నన్ను విడువడు ఎడబాయలేడు నా ప్రాణనాథుడేసన్నా
ఒంటరిగా నేనున్నప్పుడు తోడై ఉండెను యేసన్న
కన్నీరంతా తుడిచివేసి శాంతినిచ్చెను యేసన్నా
శ్రమలో నేను పడినప్పుడు లేవనెత్తాడు యేసన్న
అంధకారమును నా ప్రభువు వెలుగుగా చేసెను యేసన్న
నా దేవుడవై నన్ను నడిపించు యేసన్నా
ఆరాధన వర్తమానము
మన అందరికీ దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికీ ఆయన జీవ వాక్కులను పొందడానికి అవకాశము ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక! ఆమేన్.
ఆదివారము చాలా ప్రశస్తమైన దినము ఎందుకంటే ఈ దినము మన వారమంతటి జీవితమునకు ఆధారమై ఉన్నది. ఎందుకంటే దేవుని సన్నిధిలో మన కొరకు ఆయన వాక్కు విడుదల అవుతుంది. గొర్రెలవంటి మన జీవితమును కొనసాగించుచుండగా, మనకు తెలియకుండా దేవుని మార్గమును విడిచి వేరేమార్గములోనికి తప్పిపోతాము. అటువంటి పరిస్థితిలలో మనలను తిరిగి సరైన మార్గములోనికి తీసుకురావడానికి ఈ ఆదివారము విడుదల అయ్యేమాటలు, వాక్కు సహాయపడతాయి.
సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు యెహోవామందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. -కీర్తనలు 84:1-2
ఈ అనుభవములోనికి రావాలి అంటే, నీ దేవుడు ఏమై ఉన్నాడో అనే సంగతి గ్రహించినప్పుడే సాధ్యపడుతుంది. తన అత్యంత ప్రియమైన ఒక్కగానొక్క కుమారుడైన యేసయ్యను ఈ భూలోకములోనికి నీకొరకు, నాకొరకు పంపిచాడు. ఎందుకు పంపించాడో అనే సత్యము నీవు ఎరగనంతవరకు లోకము వైపు నీ దృష్టి ఉంటుంది. అదే ఈ సత్యము నీవు గ్రహిస్తే లోతైన ఆత్మీయ అనుభవము పొందుకోగలుగుతాము.
అపవాది ఎలాగైనా సరే దేవునినుండి లాక్కుపోవడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. ఒక్క చిన్న అవకాశము లోకమునకు, అపవాదికి ఇస్తే ఇంక మన జీవితము చిక్కుముడులు పడిపోయేవిధముగా మారిపోతుంది.
నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.౹ -గలతీయులకు 2:20
నీవు క్రీస్తును కలిగి ఉండాలి అనే ఆశ నీకు ఉన్నట్టయితే, లోకమునకు అస్సలు అవకాశము ఇవ్వవు. లోకములో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము అనునవే.
కాబట్టిమునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు౹ ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.౹ అయిననుమునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.౹ -ఎఫెసీయులకు 2:11-13
శరీరవిషయములో అన్యజనులైయుండి అనగా ఏమిటి? అన్యజనులు అనగా దేవుని ఎరగనివారు. అనగా శరీర విషయములో దేవుని ఎరగనివారివలే ఉన్న స్థితిని గూర్చి మాట్లాడిన సందర్భము. అటువంటి సందర్భములో మీరు ఉంటే, ఇశ్రాయేలుతో సహపౌరులు కావు. అనగా దేవుడిచ్చిన వాగ్దాన పూర్ణ జీవితమునకు అర్హుడవు కాని పరజనుడవుగా ఉంటావు. నిరీక్షణ లేక, లోకమందు దేవుడు లేని వాడవుగా, క్రీస్తుకు దూరస్థులైనవారిగా ఉంటావు.
అపవాది చిన్న అవకాశము కొరకు మాత్రమే చూస్తాడు. అది చిన్నగా ఉన్నప్పుడు మనకు ఏమీ తెలియదు. గానీ నీళ్ళట్యాంకు కు పడిన చిన్న రంధ్రము వలే మనము కలిగిన మొత్తము ఖాళీ అయిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోతాము.
పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. -రోమా 5:20
అనగా మనము పాపము చేయునట్లుగా అపవాది తన ప్రయత్నాలు చేసేవాడుగా ఉన్నాడు. మన జీవితము కొనసాగించబడుతున్నపుడు, అలాగే అపవాది ప్రయత్నాలు కూడా కొనసాగించబడుతున్నాయి. అయితే వాక్యము ప్రకారము, కృప కూడా కొనసాగించబడుతుంది. అయితే మనము యేసయ్యకు దూరముగా వెళ్ళిపోతే అనగా అపవాది ప్రయత్నాలకు లోబడిపోతే మనము క్రీస్తుకు దూరముగా అయిపోతాము. అప్పుడు కృప పొందలేని వారముగా మనము అయిపోతాము.
నీ మందిరముయొక్క సమృద్ధివలనవారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించు చున్నావు. -కీర్తనలు 36:8
దేవుని సన్నిధిలో పూర్ణ సంతోషముకలదు అని వాక్యము చెపుతుంది. అందుకే, “నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించు చున్నావు” అని వ్రాయబడింది. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషము, మన జీవితములలో స్థిరపరచబడుతుంది. దేవుని సన్నిధిలో బలము ప్రభావములు ఉంటాయి. అంతేకాక దేవుని సన్నిధిలో ఆయన వాక్కు విడుదల అవుతుంది.
యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవామందిరములో నివసింప గోరుచున్నాను. -కీర్తనలు 27:4
ఎందుకు ఈ ఆశ కీర్తనాకారుడు కలిగి ఉన్నాడు అని మరొక వాక్యము చూస్తే,
దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకు దును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను. నీళ్లులేక యెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది. నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానముచేయుచున్నది -కీర్తనలు 63:1-5
నిన్న రాత్రి వాక్యాన్ని ధ్యానించినపుడు దేవుడు సెలవిచ్చిన వాక్కు యొక్క నెరవేర్పు కొరకు ఉదయమున దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. అంటే ఎలా నెరవేరుతుంది? ఎలా స్థిరపరచబడుతుంది అని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. దేవుని సన్నిధిలో బలము, ప్రభావములలతో పాటు ఆజ్ఞలుకూడా జారీ చేయబడతాయి. రాజుల రాజైన వాని సన్నిధిలో పరిపాలన జరుగుతుంది. ఏ విషయము నిమిత్తము ఆయన సన్నిధికి వెళ్ళామో వాటి విషయములో ఆయన ఆజ్ఞలు జారీ అవుతాయి.
దేవుడు మనలన్ను కోరుకుంటున్నాడు. ఒకరోజు ఆయన సన్నిధిలో లేకపోతే, ఆయ్యో ఈరోజు నేను నా దేవునిని కలవలేదు, స్తుతించలేదు అనే బాధ మనలను స్థిమితముగా ఉంచకూడదు, అటువంటి ఆశ మనము కలిగి ఉండాలి. ఒక్క దినము మన దేవుని సన్నిధిలో గడుపుట వెయ్యి దినములకంటే శ్రేష్టమైనది. అటువంటి తన సన్నిధిలోనికి మనము రాగలుగునట్లు అవకాశము ఇచ్చిన దేవునిని ఎంతగా మనము కొనియాడాలి, ఆరాధించాలి? ఈరోజు వరకు అపవాదికి దొరకకుండా, మనకు అవకాశాలు ఇస్తూ తన కృపచేతనే కదా నడిపించబడుతున్నాము, ఈ దినమును చూడగలిగాము? ఆయన నమ్మకత్వమును బట్టి ఎంతగా మన దేవునిని ఆరాధించాలి? ఆచార యుక్తముగా కాక, ఆత్మతో సత్యముతో యదార్థమైన హృదయముతో మనము దేవునిని ఆరాధిద్దాము.
ఆరాధన గీతము
యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా
నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా
వందనాలు వందనాలయ్యా – శతకోటి స్తోత్రాలయ్యా
యేసయ్యా… యేసయ్యా…
నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా
జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా
నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా
వారము కొరకైన వాక్యము
మన ఐడెంటిటీ, అనగా గుర్తింపు ఏమిటి? మన వ్యక్తిగతమైన జీవితములలో ఈ విషయము మర్చిపోయేవారముగా ఉన్నాము కాబట్టే ధైర్యము కోల్పోయేవారిగా ఉంటున్నాము. అయితే మన గుర్తింపు ఏమిటి అంటే, “దేవుని కుమారులు”.
దేవుని కుమారులనుకున్న ప్రత్యేకత ఏమిటి? ఉదాహరణకు లోకములోని తండ్రి తన పిల్లలను అందరితో కలిపి చూస్తాడా? లేక ప్రత్యేకముగా చూస్తాడా? ఖచ్చితముగా ప్రత్యేకముగానే చూస్తాడు.
మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మన కెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.౹ -1 యోహాను 3:1
ఈలోకములో ధనవంతుడైన తండ్రికి పుట్టిన కుమారును చూస్తే, అడిగినదానిని పొందుకుని తన చుట్టూ ఉన్నవారిచేత గొప్పవాడిగా, ధనవంతుడుగా పిలవబడతాడు. దీనికి కారణము తన తండ్రికి తనపై ఉన్న ప్రేమయే. అలాగే మనము మనలను ఎంతగానో ప్రేమించే పరలోకపు తండ్రికి పిల్లలమై ఉన్నాము.
దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులైయుందురు -రోమా 8:14
నిజముగా మనము దేవుని కుమారులమైతే, దేవుని ఆత్మను మనము కలిగినవారుగా ఉండాలి.
శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సునుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరానుసారమైన మనస్సు మరణము;౹ ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.౹ -రోమా 8:5-6
ఈ వాక్యము మనము దేవుని కుమారులమై ఉన్నామా లేదా ని పరీక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. నీ మనస్సు ఎటువైపు లాగుతుంది అనేదానిని బట్టి మనము శరీరానుసారులమా? ఆత్మానుసారులమా అనే సంగతి తెలిసిపోతుంది.
మన మనస్సు మన ఆశీర్వాదమును గూర్చి తెలియచేస్తుంది. ఒకవేళ మన మనస్సు ఆత్మ విషయములమీద ఉండేది అయితే, జీవము సమాధానము కలిగిన జీవితము మనము కలిగిఉంటాము. అలా కాక, శరీరానుసారమైన మనస్సు గనుక మనము కలిగి ఉంటే, మరణకరమైన జీవితము మనము కలిగి ఉండగలుగుతాము.
ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.౹ కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.౹ దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారేగాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.౹ -రోమా 8:7-9
ఈ వాక్యమును బట్టి స్పష్టముగా తెలిసేది ఏమిటి అంటే, మనము దేవుని ఆత్మను కలిగి ఉంటేనేగాని ఆయన వారము కానేరము. అదే ఆయన ఆత్మను కలిగినవారుగా ఉంటే, ఆయన కుమారులుగాను, జయించువారిగాను ఉంటాము.
మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు. -గలతీయులకు 3:29
అనగా క్రీస్తు ఆత్మను కలిగినవారైతే, వాగ్దానమునకు వారసులైయున్నారు. దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో అవన్నిటికీ వారసులుగా ఉంటారు. మన ఐడెంటిటీని మర్చిపోయేవారముగా ఉంటే, శరీరమును అనుసరించేవారిగా అయిపోతాము.
నేను చెప్పునదేమనగా ఆత్మా నుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.౹ -గలతీయులకు 5:16
శరీరేచ్చలు అనగా శరీరక్రియలయందు ఆసక్తి కలిగిన జీవితము. శరీర క్రియలు స్పష్టముగా తెలియచేయబడుతున్నాయి.
శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,౹ విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,౹ భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.౹ -గలతీయులకు 5:19-21
అలాకాకుండా ఆత్మను అనుసరించేవారిగా మనము ఉండాలి. అప్పుడు మనము ఆత్మఫలములు ఫలించేవారిగా ఉంటాము.
అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.౹ -గలతీయులకు 5:22
ఆత్మను కలిగి ఉండుట అంటే ఏమిటి?
దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. –నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. –కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. –మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. -2 కొరింథీయులకు 6:16
మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము అని దేవుడు చెప్పుచున్నాడు. అంతే కాక, “నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.” అని చెప్పుచున్నాడు.
అసలు దేవుడు అంటే ఏమిటి అనే సత్యమును మనము ఎరిగి ఉండాలి. సంఘమును చెడగొట్టడానికి అనేకమైన బోధలు బయలుదేరారు గనుక, మన విశ్వాసమును చెడగొట్టే మాటలను అస్సలు దగ్గరకు రానివ్వవద్దు.
మనము దేవుని ఆలయము గనుక, మనలో దేవుడు నివాసము ఉంటాడు. అనగా తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ కలిసి మనలో నివసిస్తారు. కాబట్టి, దేవుని ఆత్మను కలిగినవారు అనగా పరిశుద్దాత్మను కలిగినవారు అని అర్థము.
మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,౹ -1 కొరింథీయులకు 6:19
గనుక ఆత్మానుసారముగా నడచుట అంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారము జీవించుట.
మృతులలోనుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. -రోమా 8:11
దేవుని ఆత్మను కలిగినవారు దేవుని కుమారులుగా ఉంటారు. దేవుని కుమారునిగా ఉన్న మనము జీవింపచేయబడేవారిగా ఉంటాము.
కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము.౹ మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మ చేత శారీర క్రియ లను చంపినయెడల జీవించెదరు.౹ -రోమా 8:12-13
ఋణము ఉంటే, మనము ఎలా ఉన్నప్పటికీ ఆ ఋణమును తీర్చవలసిన స్థితిలో ఉంటాము. అనగా పాపమునకు, అపవాదికి ఋణము కలిగి ఉంటే, వాడు చెప్పినట్టే శరీరానుసారముగా ప్రవర్తించవలసిన స్థితిలో ఉంటాము. అలా కాక, మనము దేవుని కుమారులము అనే సంగతి ఎరిగి అపవాది ప్రేరేపించే ఆలోచనలను అనుమతించక, సత్యమును అనుసరించి నిలబడితే మనము జీవించువారిగా ఉంటాము.
పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తాను ఏమి చేయడుగానీ, క్రీస్తు చెప్పిన బోధ ప్రకారమే ఆయన చేస్తాడు. ఆ బోధనే మనము జ్ఞాపకము చేస్తాడు. మన అనారోగ్య పరిస్థితులలో కలువరి సిలువలో ప్రభువు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలిగినది అనే మాటను బోధించి మనలను నడిపిస్తాడు. అప్పుడు మనము ఆయన ప్రేరేపించే వాక్కును ఖడ్గముగా ఉపయోగించి అపవాది ప్రేరేపణలను జయించాలి.
దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.౹ -రోమా 8:19
మనము దేవును కుమారులము గనుక, మన గురించి సృష్టి ఆశతో తేరి చూచుచూ కనిపెడుతూ ఉన్నది అని అర్థము. అనగా దేవుని పిల్లలు తమకు ఇవ్వబడిన అధికారమును ప్రత్యక్షపరచే పరిస్థితి కొరకు సృష్టి లోబడుటకు ఎదురుచూస్తుంది.
మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.౹ మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము. -రోమా 8:16-17
క్రీస్తుతోడి వారసులము అంటే, క్రీస్తు కలిగిన అధికారము మనకు కూడా అందుబాటులో ఉంటుంది అని అర్థము. క్రీస్తు సృష్టిపై అధికారము కలిగినవాడు గా జీవించాడు. మన ఐడెంటిటి ఎరిగి జీవిస్తే మనము కూడా అదే అధికారమును చూపగలుగుతాము. ఈ అధికారము దేవుని మహిమ కొరకే. అందుకే దేవుని కుమారులకు ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడుడి అని వాక్యము చెప్పుచున్నది. గనుక శరీరానుసారముగా కాక, ఆత్మానుసారముగా మనము జీవిద్దాము. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నివాసముంటాడు.