03-12-2023 – ఆదివారం రెండవ ఆరాధన

స్తుతిగీతము – 1

సర్వేశ్వరా నీకే స్తుతి
సర్వము నీకే ప్రభు
ఆధారము ఆశ్రయము
నీవే నా యేసు “2”

నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి

చిన్న చిన్న గొర్రె పిల్లలము
కాపరి మము కాయుము
అమ్మ నాన్న అన్ని నీవే
ఆదరించి సేదదీర్చుము

పరిగెత్తెదా కొండ కోనల్లోనా
పచ్చని పచ్చికలో
అండ దండా కొండా
కోనా నీవే నా యేసు

స్తుతిగీతము – 2

ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2)
నే పాడెదన్ – కొనియాడెదన్ (3)
నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4)
||ప్రేమా||

లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2)
యేసుని ప్రేమ వెల యెంతో
ఇహమందైనా పరమందైనా (2)
వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ
కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2)
||ప్రేమా||

మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ
మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ (2)
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2)
గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2)
||ప్రేమ||

స్తుతిగీతము – 3

సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||

ఎడారి త్రోవలో నే నడిచినా – ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2)
నీవే నీవే – నా ఆనందము
నీవే నీవే – నా ఆధారము (2) ||సుమధుర||

సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే – నా జయగీతము
నీవే నీవే – నా స్తుతిగీతము (2) ||సుమధుర||

వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2)
నీవే నీవే – నా అతిశయము
నీకే నీకే – నా ఆరాధన (2) ||సుమధుర||

ఆరాధన వర్తమానము

దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినములకంటే శ్రేష్టము అని వ్రాయబడింది అంటే దాని అర్థము ఏమిటి? దేవుని వాక్యములోని మర్మములను ఎరుగుటకు ఆసక్తి ఎంతో అవసరము. దేవుని సన్నిధిలో ఏమి ఉంటుంది? పూర్ణ సంతోషము ఉంటుంది అని వాక్యము చెప్తుంది. వెయ్యి దినములు మనము మన జీవితములో పొందే సంతోషము అంతా కలిపి ఒక్క దినములోనే దేవుని సన్నిధిలో పొందుకునేవారముగా ఉంటాము.

నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవా, నా దేవా నీవు అధిక ఘనతవహించిన వాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు. -కీర్తనలు 104:1

దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి, ఆ తండ్రి సన్నిధిలో మనము ఉన్నాము. ఆ తండ్రి కలిగిన మహాత్మ్యము ప్రభావము బలము ఆయన సన్నిధిలో కనపరచబడతాయి.

యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిర పరచియున్నాడు. ఆయన అన్నిటిమీద రాజ్యపరిపాలనచేయుచున్నాడు. -కీర్తనలు 103:19

సింహాసనము ఉన్నచోట రాజు ఉంటాడు, రాజు ఉన్న చోట పరిపాలన జరుగుతుంది. పై వాక్యము చూస్తే, “ఆయన అన్నిటిమీద రాజ్యపరిపాలనచేయుచున్నాడు” అనగా మన జీవితములో అన్ని విషయముల మీద పరిపాలన చేయుచున్నాడు. నీకు న్యాయము తీర్చడానికి ఆయన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు.

మన అర్హత చూస్తే, ఏమీ అర్హత లేదు. అటువంటి మనకొరకు ఆయన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు. అసలు యేసయ్య రాకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో కదా! ఏ అర్హత లేని మన కొరకు యేసయ్య వచ్చాడు అనే సత్యమును గ్రహించి స్వీకరిస్తే మన జీవితము ఎంతో ధన్యకరము.

దేవుడు సింహాసనము నీకొరకు ఏర్పాటు చేసాడు అంటే, నీకు అన్యాయము జరుగుతుంది, ఆ అన్యాయము నుండి తప్పించి, న్యాయము తీర్చడానికి అని అర్థము. ఎంత ప్రేమ నీపై నాపై ఆయన కలిగి ఉన్నాడో కదా! ఆ ప్రేమను బట్టే మన జీవితములను పరిపాలన చేయాలి అనే కోరిక కలిగి ఉన్నాడు.

అసలు ఎక్కడ మనకు అన్యాయము జరుతుంది అని ఆలోచిస్తే, దేని కాలమున అది చక్కగా ఉండునట్లు దయచేసాడు. ఒకవేళ మన జీవితము మన కళ్ళకు బాగానే ఉన్నప్పటికీ, ఆయన చిత్తాను సారముగా మన జీవితములు ఉండట్లేదు. అటువంటి జీవితమును తిరిగి ఆయన చిత్తానుసారముగా నడిపించుటకు ఆయన న్యాయము తీర్చేవాడుగా ఉన్నాడు. నీ జీవితాన్ని గూర్చి ఆయన ఆలోచిస్తునాడు కాబట్టే, నీ జీవితాన్ని చక్కబరచే పనిలో ఉన్నాడు.

మన దేవుడు అదృశ్య లక్షణములు కలవాడు. ఆయన కార్యము మన కళ్ళకు కనబడదు కానీ, వెనుక జరిగించవలసిన సమస్తము జరిగించేవాడుగా ఉన్నాడు. దేవుని ప్రేమ మనపై ఉన్నంత కాలము మనలను ఏ నష్టము, అన్యాయము ముట్టనుకూడా ముట్టదు.

అందుకు యెహోవా–నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు -యోబు 1:8

యోబు గూర్చి దేవుని మాటలు చూస్తే, “నా సేవకుడు” అని ఎంతో గర్వముగా చెప్పుచున్నాడు. అనగా దేవునికి యోబుకు ఉన్న సంబంధము అర్థము చేసుకోవచ్చు. అప్పుడు అపవాది మాటలు చూస్తే,

అని అడుగగా అపవాది–యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతనిచేతిపనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. -యోబు 1:9-10

ఈ వాక్యములో దేవుడు కంచె వేసినట్టు ఏమి కంటికి కనబడటములేదు. అయితే అపవాది అనేక ప్రయత్నములు చేసి తెలుసుకున్నాడు యోబు చుట్టూ దేవుని కంచె ఉన్నది అని. అపవాది ప్రయత్నములు గనుక ఒకసారి ఆలోచించి ఉంటే, యోబు, తన కుటుంబము, ఆస్తి మరియు తాను కలిగి ఉన్నదాని మీద అపవాది ప్రయత్నము చేసి ఉంటాడు.

యోబును సేవకుడు అంటున్నాడు. నిన్ను నన్ను నా సొత్తు అంటున్నాడు. యోబు చుట్టూ కంచెవేసిన దేవుడు నీ చుట్టు నా చుట్టు మరింత ఖచ్చితముగా వేస్తాడు కదా! అయితే మనము కూడా యోబు వలే దేవుకి తగినట్టుగా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనమును విసర్జించినవారిగా ఉండాలి. దేవుని సంబంధములేనిది మనము ఖచ్చితముగా విడిచిపెట్టేవారముగా ఉండాలి. అప్పుడు మన జీవితములో మిస్స్ అయ్యే సమస్యే ఉండదు. దేవుడు సిద్ధపరచిన సమస్తము మనము పొందుకొనేవారముగా ఉంటాము. యోబు, అబ్రహాము, పౌలులు మాత్రమే కాదు గానీ, ఆయన ఎవరో ఎరిగి ఉండి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నయెడల, మన జీవితములో కూడా దేవుడు సిద్ధపరచినది అస్సలు మిస్స్ అవ్వనే అవ్వదు.

మన కొరకు సింహాసనము స్థిరపరచి ఉన్నాడు. దానిని బట్టి న్యాయము తీర్చేవాడు గా ఉన్నాడు. అలాగే జరగవలసిన దానికి సంబంధించి ఆజ్ఞలు జారీ చేసేవాడిగా ఉన్నాడు. గనుక మీ జీవితములో ఏమి జరగాలో అది ఖచ్చితముగా జరుగుతుంది.

దేవుని సన్నిధిలో ఇప్పుడు మనము ఆరాధిస్తాము. అయితే మనము ఆరాధించినపుడు ఏమి జరుగుతుంది? మన ఆరాధన మహత్మ్యము కలిగినవానికి చేస్తున్నాము. అప్పుడు ఆయన బలము, ప్రభావము మన హృదయములలో, ఆత్మలో ప్రత్యక్షపరచబడుతుంది. ఆ బలమును బట్టి, ప్రభావమును బట్టి మనము ఏమైనా చెయ్యగలుగుతాము. గనుక ఈ సత్యమును ఎరిగి, నమ్మి దేవునిని స్తుతిద్దాము ఆరాధిద్దాము.

ఆరాధన గీతము

భయము లేదు దిగులే లేదు
నా జీవితమంతా ప్రభు చేతిలో
నిరాశ నన్నెనడు ముట్టలేదు
నిరీక్షణతో అనుదినం సాగెదను

యావే నీవే నా దైవం
తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయం
తరతరముల వరకు
నీవు కునుకవు నీవు నిదురపోవు
ఇశ్రాయేలున్ కాపాడువాడవు

మరణ భయం అంతా పోయెను
శత్రు భీతి అంతా తొలగించెను
మరణమును ఓడించి శత్రువును జయించిన
సర్వాధికారివి నా దేవా
||యావే.. ||

ఓటమిని అంతా తీసివేసి
రోగాన్ని అంతా మాన్-పివేసి
జయశీలుడవు పరమవైద్యుడవు
సర్వశక్తుడవు నా రక్షకా
|| యావే.. ||

 

వారము కొరకైన వాక్యము

ఈరోజు “నిన్ను నడిపించే దేవుడు” గురించి ధ్యానిద్దాము. నిన్ను నడిపించాలి అనేది ఆయన కొరిక కూడా. మన తల్లిదండ్రులను జ్ఞాపకము చేసుకుంటే, మన చిన్నప్పుడు మన చెయ్యి పట్టుకుని నడిపించేవాడుగా మన తండ్రి ఉన్నాడు. మనము నడవగలిగినప్పటికీ, చెయ్యి పట్టుకుని నడిపించాలి అనే ఆశ తండ్రి కలిగి ఉంటాడు. అలాగే మన దేవుడు మనలను నడిపించుచుండగా, మనకు తోడుగా ఉండగా మనము భయపడవలసిన సందర్భమే ఉండదు.

నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. -యెషయా 48:17

నీ దేవుడు గా ఆయన ఉన్నాడు అని నీవు నమ్మితే, ఈ వాక్యము నీ కొరకే. మన పితరులు అయిన ఇశ్రాయేలు ప్రజలు దేవుడు గాక వేరే రాజు నడిపించాలి అని కోరుకున్నారు. అయితే ఈరోజు మనము అలా ఉండకూడదు.

ఒకవేళ నీ నడక అనగా నీ జీవిత ప్రయాణము సరిగా లేదేమో, ప్రభువు కోరుకున్నట్టుగా లేదేమో, అయితే నీ ప్రభువు నీతో చెప్పుచున్నాడు, ఆయనే నడిపిస్తాను అని చెప్పుచున్నాడు. ఎంత భాగ్యమో కదా! ఈ విషయము దావీదుకు అర్థము అయ్యింది గనుకనే –

యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు. -కీర్తనలు 23:1-3

అనగా నడిపించేవాడు ఎండిన స్థితిలోనికి నడిపించడు గానీ సమృద్ధి గల చోటకే నడిపిస్తాడు. ఈ సత్యము దావీదు వలే నీవు నేను గ్రహిస్తే, నిశ్చింతగా ఉంటాము.

తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. అనగా, నీతి మార్గములో మరణమే లేదు. అనగా ఇకనుండి మన మార్గము జీవమార్గము అని అర్థము. అంటే ఇంతవరకు ఎక్కడో ఒకచోట మరణకరమైన మార్గములు ఉన్నాయి అని అర్థము. తన చిత్తము తానే నెరవేర్చుకునే దేవుడు, ఇప్పుడు మన జీవితములను తనకు మహిమకరములుగా చేసుకొనుటకు ఇష్టపడుతున్నాడు. గనుక ఆయన చిత్తము మనజీవితములో నెరవేరబడునట్లు ఏర్పాటు చేసిన మార్గములో మనలను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. గనుక నీతి మార్గము అనగా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన మార్గము అన్నమాట.

అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.౹ -1 కొరింథీయులకు 15:57

జయము అనుగ్రహించేది దేవుడు. ఇంతవరకు మన జీవితములో అపజయములు వచ్చాయి. అయితే ఇప్పటినుండి మనలను నడిపించాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన నడిపించే మార్గములో మనకు విజయమే. ప్రభువు నడిపింపు కొరకు ఒక వాక్యము చూద్దాము.

రాజైన హేరోదు దినములయందు యూదయదేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి –యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి -మత్తయి 2:1-2

ఈ జ్ఞానులు నక్షత్రము కనబడగానే, యూదుల రాజు పుట్టాడు అని గ్రహించారు. అయితే వీరు యేసయ్య దగ్గరికి వెళ్ళకుండా హేరోదు దగ్గరకు వెళ్ళారు. వీళ్ళు మార్గము తప్పి హేరోదువద్దకు వెళ్ళినప్పటికీ, వీరి ఆశను బట్టి, దేవుడు వారిని సరైన మార్గములో నడిపించాడు.

వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమునవారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను. -మత్తయి 2:9

అనగా మనము కూడా దేవుడు నడిపించాలి అనే ఆశ కలిగి ఉంటే ఖచ్చితముగా నడిపించేవాడుగా ఉంటాడు. ఆయన నడిపింపులో అపజయము అనేదే లేదు. జ్ఞానులు యేసయ్య వద్దకు నడిపించాడు. యేసయ్య వెలుగు మరియు జీవము అయి ఉన్నాడు గనుక, మనలను ఆ వెలుగు వైపు, జీవము వైపు నడిపిస్తాడు.

మరొక సందర్భములో చూస్తే –

ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులనుగూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై –దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. -మత్తయి 1:19-21

యోసేపు మరియను విడిచిపెట్టాలి అనే ఆలోచన మరియ ధరించిన గర్భమును బట్టి కలిగింది. ఆ గర్భములో ఉన్నది యేసయ్య. ఎప్పుడైతే విడిచిపెట్టలి అనుకున్నాడో, వెంటనే దూత వచ్చి ఆ గర్భము ఎలా కలిగిందో చెప్పింది. అప్పటివరకు ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ, దూత చెప్పగానే తన ఆలోచన విధానము మారిపోఇంది.

యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. -మత్తయి 1:24-25

అనగా సత్యము ఎరగని స్థితిలో యోసేపు మరియను విడిచిపెట్టాలి అనే ఆలోచన కలగగానే, దూత చేత సత్యము తెలియచేయబడి వెంటనే సరైన మార్గములోనికి నడిపించబడ్డాడు. యేసయ్యకు వ్యతిరేకమైన మార్గమునుండి యోసేపు తప్పించబడ్డాడు.

యేసయ్య పుట్టాక కూడా రాజు పుట్టిన బిడ్డను చంపడానికి ప్రయత్నము చేస్తున్నాడు. అప్పుడు చూస్తే –

వారు వెళ్లినతరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై–హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. -మత్తయి 2:13

ఇక్కడ యేసయ్యకు వ్యతిరేకమైన ఆలోచననుండి తప్పించడానికి మరలా యోసేపును నడిపించాడు. మరలా హేరోదు చనిపోయిన తరువాత మరలా నడిపించాడు.

–నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలుదేశమునకు వెళ్లుము; శిశువు ప్రాణము తీయజూచు చుండినవారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలుదేశమునకు వచ్చెను. -మత్తయి 2:20-21

ఈ మొత్తము వాక్యములలో యోసేపును దేవుడు నడిపిస్తున్నాడు అనే సంగతిని మనము అర్థము చేసుకోగలము. ఇక్కడ యేసయ్యను ఆత్మీయ జీవితముగా చూస్తే, మనము ఆత్మీయ ఎదగాలి అనే ఆశ కలిగి ఉన్నప్పుడు, జ్ఞానులను నడిపించిన విధముగానే మనలను నడిపించేవాడుగా నీ దేవుడు ఉన్నాడు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితమును చంపివేసే ప్రతి ప్రయత్నమునుండి తప్పించబడునట్లు నిన్ను నడిపిస్తాడు. చివరికి యేసయ్య దేవుని చిత్తమును జరిగించినవాడుగా ఉన్నాడు. అలాగే మన జీవితములో దేవుని మార్గములో మనము నడిపించబడుచుండగా, దేవుని చిత్తము జరిగించబడుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది.

నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. -యెషయా 48:17

యోసేపుకు ఉపదేశము చేసి నడిపించాడు, జ్ఞానులను త్రోవలో నడిపించాడు. అదే దేవుడు నిన్ను నన్ను నడిపించాలి అని ఆశ కలిగిఉన్నాడు గనుక ఈరోజే ఆయన చేతికి నీ జీవితమును సమర్పించు.