03-11-2024 – ఆదివారం మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

విశ్వాసి యొక్క ధైర్యము వారు కలిగిన దానిని బట్టి కాక వారు ఆరాధిస్తున్న దేవుని బట్టి అయి ఉండాలి. అటువంటి ఆత్మీయమైన జీవితాన్ని ఆచరించినపుడు మనము క్షేమముగా సంతోషముగా ఉండగలుగుతాము. మన స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఈ స్థితి గతులను నమ్ముకున్నట్లైతే కొన్నిసార్లు సంతోషిస్తాము, కొన్నిసార్లు దుఃఖముతో ఉంటాము. అయితే ఎన్నడూ మారని దేవునిని బట్టి మనము నిలబడగలిగితే, నిత్యము సంతోషమే.

దేవుని సన్నిధిలోనే మనకు సంతోషము ఉంటుంది. ఆయన సన్నిధిలో ఆయన మనతో మాట్లాడేవాడిగా ఉంటాడు. ఆయన ఏమి నీ పట్ల చేస్తున్నాడొ నీవు ఎరిగితే అప్పుడు ఆయనను మనస్పూర్తిగా స్తుతించగలుగుతావు. దేవునిని కలిగిన మన జీవితాలు గొప్పగా ఉంటున్నాయి. ఎందుకు అని ఆలోచిస్తే, మన జీవితాల పట్ల ఆయన మేలైన ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశ్యము ఆయనే నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఒకవేళ దారి తప్పినా, తిరిగి సమకూర్చి నడిపిస్తాడు.

మన జీవితాలు మన శక్తిని బట్టి, మన జ్ఞానము బట్టి కాదుగానీ, ఆయన శక్తిని బట్టి నడిపించబడే జీవితాలు. ఈ సత్యము అర్థము అయితే మన జీవితము గొప్పది అని తెలుసుకోగలుగుతాము. దేవుని శక్తి లేని దానిని ఉన్నట్టుగా చేయగలదు, మృతమైన దానిని సజీవముగా చేయగలదు. మన జీవితమును దేవుని యెదుట యదార్థముగా కనపరచుకొనిన యెడల, ఆయన శక్తిని నీ జీవితములో అనుభవించగలుగుతావు.

మృతమైనదానిని సహితము జీవింపచేయగలిగినది. మృతమైన దానిని గూర్చి ఆలోచిస్తే, పోగొట్టుకున్న పరిస్థితి, కోల్పోయిన పరిస్థితిగా మనము చూడవచ్చు. ఒకవేళ దేవుని శక్తిని బట్టి నీవు నిలబడితే, ఏమి పోగొట్టుకున్నా, ఏమి కోల్పోయినా తిరిగి రెండింతలుగా నీ దేవుడు నీకు దయచేయగలవాడు. అందుకే నా జీవితము దేవుని శక్తిచేత మాత్రమే నడిచేది అని మనము ఎల్లప్పుడు జ్ఞాపకము చేసుకోవాలి. నీ దేవుడు నీ జీవితమునకు కాపరి అయి ఉన్నాడు అనేది సత్యము.

మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలుకలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా? అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసికొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినదని వారితో చెప్పును గదా – లూకా 15:4-5

ప్రభువు నీకు కాపరి అయి ఉన్నాడు. ఆ కాపరి యొక్క మనసు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే. నీవు కలిగి ఉన్నదానిని బట్టి సంతోషము కలిగి ఉండటము లేదు గానీ, నీవు కోల్పోయిన దానినిబట్టి ఎలాగైనా నీకు దానిని తిరిగి ఇవ్వడానికి ఆయన ఆశకలిగినవాడుగా ఉన్నాడు.

నీకున్న ఆశీర్వాదాలలో నీవు కలిగి ఉన్నదానిని బట్టి కాదు గానీ, నీవు కొల్పోయిన ఒక్క ఆశీర్వాదమును కూడా తిరిగి నీకు ఎలా ఇవ్వాలి అనేది ఆయన ఆలోచన అయి ఉన్నది. అటువంటి దేవుడు నీ దేవుడు. ఈ సత్యము ఎరిగినట్టయితే దేవుడే నా కాపరి అయినందున నాకు ధైర్యముగా ఉన్నది. ఆయనే నా సంపద అయినందున నాకు సమృద్ధిగా ఉన్నది అని మనస్పూర్తిగా చెప్పగలుగుతాము.

అందుకే నీ దేవుడైన నీ కాపరి మనసు ఎలా ఉందో గ్రహించిన స్థితిలో మనము ఉండాలి. నీ దేవుని గూర్చిన సత్యము నీవు ఎరిగి ఉండాలి. నీవు పోగొట్టుకున్న దానిని తిరిగి తీసుకురావడానికి నీ దేవుడు వెతికి వెళుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు? ఆయన మాటలు సత్యము, ఆ మాటలు మన జీవితమును స్థిరపరుస్తాయి.

మనము పొగొట్టుకొన్న్న దానిని తిరిగి తీసుకురావడానికి నీ దేవుడు వెతుకుతూ వెళుతున్నాడు. నీ జీవితము పరిపూర్ణముగా ఉండాలి అనేది నీ దేవుని ఆశ, కోరిక. తొమ్మిది ఆజ్ఞలు పాటించి, ఒక్క ఆజ్ఞ పాటించకపోతే ఎలా అయితే దేవుడు దానిని గూర్చి లెక్క చూసేవాడుగా ఉన్నాడో, నీవు తొమ్మిది ఆశీర్వాదాలు కలిగి, ఒక్కటి కోల్పోతే, ఆ ఒక్క దాని విషయములో కూడా లెక్క చూసేవాడుగా, సమకూర్చేవాడుగా నీ దేవుడు ఉన్నాడు.

నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి మన దేవుడు సిద్ధముగా ఉంటాడు అనేదానికి సాక్ష్యము, సమరయ స్త్రీ జీవితము. తన జీవితము ఈలోకములో చెడిపోయిన జీవితముగా ఉన్న సమయములో, తన జీవితమును మార్చినవాడుగా యేసయ్య ఉన్నాడు. మన జీవితములలో లేనిదిగా కొదువగా ఉన్న సమయములలో, ఆయనే కాపరి కాబట్టి, ఆ కొదువ, లేమి ఖచ్చితముగా తీర్చబడతాయి. ఒకవేళ పోగొట్టుకొని ఉంటే, ఖచ్చితముగా తిరిగి తీసుకువచ్చేవాడుగా నీ దేవుడు ఉంటాడు.

అందుకే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును అని దావీదు చెప్పగలుగుతున్నాడు. ఎందుకు అంటే, యెహోవా నా కాపరి అనే సత్యము తాను ఎరిగి ఉన్నాడు. దండము అనగా ఆయన అధికారము. దుడ్డుకర్ర అంటే వాక్యముగా మనము చూడవచ్చు. శూన్యములో సమస్తమును సమకూర్చగల దేవుడు, నీవు చిన్నగా బాధపడినా తట్టుకోలేని దేవుడు, నీ దేవుడు.

నీ కాపరి నిన్ను పచ్చిక గల చోట్లకు, జీవము గల చోట్లకే నిన్ను నడిపిస్తాడు. ఈ సత్యము నీవు ఎరిగి ఉండాలి. మనము వెళ్ళేదారిలో శ్రమలు కలిగినా సరే, నీ దేవుని పట్ల నీ విశ్వాసము ఎలా ఉందో పరీక్షించడానికి మాత్రమే ఆ శ్రమలు అనుమతిస్తాడు. ఎప్పుడైతే నీ విశ్వాసము యదార్థమైనదిగా కనపరుస్తావో, నిన్ను జీవము వైపుకే తన శక్తిని బట్టి తప్పక నడిపిస్తాడు.

నా జీవితము నా శక్తిని బట్టి కాదుగానీ, నా కాపరి అయిన నా దేవునిని బట్టి శక్తివంతమైనది అనే ఆలోచన కలిగి నిన్ను సిద్ధపరచుకో! అప్పుడు ఆయన మహిమ కొరకు నీ జీవితము సిద్ధపరచుకోగలుగుతావు. లోకము ఎల్లప్పుడూ నిన్ను లాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నీవు లోకమువైపు తిరిగితావో, అప్పుడు దేవుని సంగతులను కోల్పోయే స్థితిలోనికి వెళ్ళిపోతావు. లోకముతో దేవుని బిడ్డలకు పొత్తు లేదు. లోకము నిన్ను లాగినపుడు, ఎన్నిసార్లు నువ్వు నీ రక్షణ కాపాడుకున్నావు? అనే లెక్క ప్రభువు రాస్తూనే ఉంటాడు.

యోబు గురించి దేవుడు అంత గొప్ప సాక్ష్యము ఇవ్వడానికి కారణము ఏమిటి? భూమి మీద యోబు వంటి వాడు ఎవ్వడూ లేడు అని చెప్పాడు. తన పిల్లలు పాపము చేసారేమో అని ముందుగానే బలి అర్పించేవాడిగా ఉన్నాడు. తాను పాపములోనికి పడకుండా తన కన్నులను కాపాడుకుంటున్నాడు, అటువంటి యోబు యదార్థతను దేవుడు గొప్పదిగా చూసినవాడుగా ఉన్నాడు.

నీవు పోగొట్టుకొన్న దానిని వెతకడానికి, ఆయన నీ కాపరిగా ఉన్నాడు కాబట్టి వెళుతున్నాడు. ఆయన నీ కాపరి అనే సంబంధమే ముఖ్యము.

 

ఆరాధన గీతము

నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది

వారము కొరకైన వాక్యము

మన ఆత్మీయమైన జీవితములు ఎంతో శ్రేష్టము అని పదే పదే మనము జ్ఞాపకము చేసుకోవాలి. మన జీవితములు సూపర్నేచురల్ జీవితములు. యేసయ్య జననము, జీవితము, మరణము అన్నీ మర్మములుగా ఉన్నాయి. ఆయన ఎట్టివాడో అని ఆయన చేసిన కార్యములను బట్టి జనులు అనుకునేవారుగా ఉంటున్నారు. గాలి లోబడుతుంది, సముద్రము లోబడుతుంది, ప్రకృతి లోబడుతుంది ఈయన ఎట్టివాడో అని వారు అనుకుంటున్నారు.

ఇప్పుడు మనము ఆయన నుండి మనము వచ్చినవారుగా ఉంటున్నాము, ఆయనే మనలను కనినవాడుగా ఉంటున్నాడు. ఆయన మర్మమై ఉన్నాడు గనుక, ఆయనలోనుండి వచ్చిన మన జీవితము కూడా మర్మమై ఉండే జీవితము. మనుష్య హృదయములకు గోచరమయ్యే జీవితములు కాదు.

యేసయ్య ముందు ఏమి వచ్చిన, స్వతంత్రించుకుని, అధికారము కనపరచిన జీవితము కలిగి ఉన్నాడు. మన జీవితము గూర్చి చూస్తే, మన జీవితము శరీర సంబంధమైనది కాదు గానీ, ఆత్మసంబంధమైనది. మనము రక్షించబడే వరకు చేసిన పాపమంతా, మనము ఆయనను రక్షకుడిగా అంగీకరించి, బాప్తీస్మము తీసుకోగానే మన మీదనుండి తీసివేయబడి, ఒక నూతనమైన వ్యక్తిగా సిద్ధపరచబడే జీవితము గనుక, మన ఆత్మీయ జీవితము యొక్క జననము మర్మమై ఉన్నది.

మర్మము అంటే ఏమిటి అంటే, యేసయ్య జీవితము కొనసాగించబడిన ప్రతిసారీ, చుట్టు ఉన్నవారికి అర్థముకాని విధానములో కొనసాగించబడింది. అలాగే మన జీవితములో కూడా ప్రతీదీ, మనుష్యులకు అర్థముకాని, దేవుని శక్తి చేత కొనసాగించబడే జీవితము మనది గనుక అది మర్మమై ఉన్నది.

బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటివరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు – మత్తయి 11:12

పరలోక రాజ్యములో ఏమి ఉంటుంది? సమాధానము, సంతోషము, అధికారము అన్నీ దేవుని రాజ్యములో ఉంటాయి. లోకములో బలాత్కారము అంటే పాపముతో కూడూకున్నది. అయితే ఆత్మీయముగా ఆలోచిస్తే, బలత్కారము అనేది తీవ్రమైన ఆసక్తిగా మనము చూడవచ్చు. దేవుని అధికారము చూడాలి అంటే, మనము బలవంతము చేయాలి, అంటే తీవ్రమైన ఆసక్తి కనపరచాలి.

మన ఆత్మీయమైన జీవితములో బలవంతము చేయడము అనగానే ప్రార్థనలోనే మనము చూసేవారిగా ఉంటాము. అయితే ఈ విషయములో కొన్ని సంగతులు చూద్దాము. అబ్రహాము దేవుని విషయములో బలవంతము చేసినట్టుగా మనము చూడవచ్చు.

మరియు మమ్రేదగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి ప్రభువా, నీ కటాక్షము నామీద నున్నయెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగు కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచు కొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసునియొద్దకు వచ్చితిరనెను. వారు–నీవు చెప్పినట్లు చేయుమనగా – ఆదికాండము 18:1-5

ఇక్కడ అబ్రహాము వారిని వెళ్ళనీయక ఆతిథ్యము కొరకు బలవంతము చేసేవాడిగా ఉంటున్నాడు. మనము దేవునిని స్వీకరించే విషయములో మనము దేవునిని బలవంతము చేసే విధముగా సిద్ధపరచుకోవాలి. అబ్రహాము జీవితములో తాను బలవంతము చేయుటను బట్టి, తన జీవితములో ఆశీర్వాదము కొరకైన సమయము సిద్ధపరచబడింది.

అందుకాయన–మీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు విను చుండెను – ఆదికాండము 18:10

అబ్రహాము అటువంటి బలవంతము చేయక మునుపు, కుమారుడు కొరకైన వగ్దానము మాత్రమే వచ్చింది గానీ, సమయము తెలియచేయబడలేదు. అయితే, అయితే ఇప్పుడు, సమయమునుకూడా తాను పొందుకున్నవాడుగా ఉన్నాడు.

మరి మన జీవితములలో ఏమి చేస్తే దేవునిని బలవంతముగా చూడవచ్చు. ఉదాహరణకు దేవుడు మనకు ఒక వాగ్దానము ఇచ్చాడు అనుకోండి, ఆ వాగ్దానమును చేజారకుండా, గట్టిగా ఒడిసిపట్టుకొనే మనసు మనము కలిగి ఉండాలి. ఏ కారణము చేత కూడా ఆ వాగ్దానము పోగొట్టుకోకూడదు.

ఉదాహరణకు, మన హృదయము బాగాలేదు, ఆ సమయములో దేవుని వాక్కు మనకు వచ్చినట్టయితే, మనమున్న పరిస్థితిని బట్టి ఆ వాక్యమును నిర్లక్ష్యము చేసేవారిగా ఉంటాము. అయితే అలా కాక, దేవుని వాక్కు రాగానే, బలవంతముగా చేజారకుండా నీవున్న పరిస్థితితో సంబంధము లేక నీవు సిద్ధపడితే, నీవు సూపర్నేచురల్ గా ఆ వాక్యము యొక్క నెరవేర్పు చూడగలుగుతావు.

యాకోబు కూడా దేవునిని ఆశీర్వాదము కొరకు బలవంతము చేసినవాడుగా దేవునితోనే పెనుగులాడినవాడిగా ఉన్నాడు.అయితే అబ్రహాము విషయములో అలాగే యాకోబు విషయములో ఏమిటి తేడా అని ఆలోచిస్తే. అబ్రహాము పరిస్థితిలో బిడ్డ పుట్టడానికి సమయము ఉంది. అయితే యాకోబు విషయములో తన అన్న చేతిలో మరణమయ్యే పరిస్థితి ఎదురుగా ఉంది. దేవుని ఆశీర్వాదము కొరకు పెనుగులాడకపోతే, తన జీవితమే ముగిసిపోయే పరిస్థితి. తాను బలవంతము చేసాడు కాబట్టే తన అన్న హృదయము మార్చబడింది.

ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీ–భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనముచేయుచువచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి–మనయొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పు డెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను – 2 రాజులు 4:8-10

ఎలీషా దైవజనుడు గనుక ఆ స్త్రీ ఆతిథ్యము కొరకు బలవంతము చేసినదిగా ఉంది. దానినిబట్టి తన జీవితములో ఏమి లోటైతే ఉందో, ఏమి కొదువ ఉందో, ఆ కొదువ తీర్చబడుతూ వచ్చింది. అది కూడా ఆమె అడగకమునుపే ఆ కొదువ తీర్చబడుతూ వచ్చింది. అబ్రహాము కూడా ఆతిథ్యము విషయములోనే బలవంతము చేసాడు. అలాగే మనము కూడా దేవునినుండి పొందుకొనే విషయములో బలవంతము చేసేవారిగా ఉండాలి.

ఎలీషా ఆత్మ సంబంధమైన వాడు గనుక సూపర్నేచురల్ విషయములు కలవాడు. ఎప్పుడైతే ఆ స్త్రీ బలవంతము చేసి అతనికి ఆతిథ్యము చేసిందో, ఆమె అడగకుండానే ఆ సూపర్నేచురల్ విషయములను పొందుకొనేవారుగా ఉంటారు.

ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్లవచ్చుననెను. అందుకు వారు–ఆలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చెదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతనితట్టు తిరిగి అతని యింట ప్రవేశించిరి. అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనముచేసిరి – ఆదికాండము 19:1-3

ఇక్కడ లోతుకూడా తాను బలవంతము చేసిన దాని గూర్చి, ఆ దేవదూతలు సొదొమ గొమొర్రాల నాశనమునుండి లోతు తానను, తన కుటుంబమును సూపర్నేచురల్ గా రక్షించుకోగలిగినాడు. అలాగే మనము కూడా ఆత్మీయ సంబంధమైన విషయములలో బలవంతము చేసేవారిగా ఉండాలి.

బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటివరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు – మత్తయి 11:12

పరలోక రాజ్యములో సమాధానము ఉంది, సంతోషము ఉంది, సూపర్నేచురల్ ఉంది, సమృద్ధి ఉంది, స్వస్థత ఉంది. బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు, ఆక్రమించుకొనుట అంటే, స్వంతం చేసుకొంటున్నారు. సమృద్ధి విషయములో చూస్తే, నీ లేమిలో నీవు బలవంతము చేసినపుడు సమృద్ధిని స్వంతం చేసుకొనేవాడిగా నీవు ఉంటావు. ప్రభువు వాక్యమును స్వీకరించుటలో, దైవ జనులను స్వీకరించే విషయములో, ప్రార్థన విషయములో బలవంతము చేసేవారుగా ఉండాలి.