03-03-2024 – ఆదివారం రెండవ ఆరాధన – దేవుని చిత్తము తెలుసుకోవడానికి

స్తోత్ర గీతము 1

యేసు మాతో నీవుండగా
మేము అలసిపోలేమయ్యా
అంతా నీవే చూసుకుంటావు
||యేసు మాతో||

సమాధానకారకుడు నీవేనయ్యా
సర్వశక్తుడవు నీవేనయ్యా
||యేసు మాతో||

అద్భుత దేవుడవు నీవేనయ్యా
ఆలోచన కర్తవు నీవేనయ్యా
||యేసు మాతో||

తల్లియు తండ్రియు నీవేనయ్యా
పెంచేవాడివి నీవేనయ్యా
||యేసు మాతో||

నా యొక్క సౌందర్యం నీవేనయ్యా
నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా
||యేసు మాతో||

చీకటిని తొలగించు వెలుగు నీవేనయ్యా
రక్షించు దేవుడవు నీవేనయ్యా
||యేసు మాతో||

 

స్తోత్ర గీతము 2

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య

నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో

ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య

ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచొస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య

స్తోత్ర గీతము 3

నీటిపైనా నడిచెను
గాలి సముద్రమును గద్దించెను
మృత్యుంజయుడై లేచెను
నాతో నిత్యము జీవించును

ఆయనే కాపాడు దేవుడు
ఆయనే నడిపించే దేవుడు
ఆయనే తోడైయుండు దేవుడు ఆయనే

మనకొరకు మరణించి
సిలువలో ప్రాణమునిచ్చెను
జయశీలుడై లేచెను
పాపికి విడుదలనిచ్చెను

ఆయనే కాపాడు దేవుడు
ఆయనే నడిపించే దేవుడు
ఆయనే తోడైయుండు దేవుడు ఆయనే

మేఘాల మధ్యలో
బూర ధ్వని శబ్దముతో
రారాజుగా దిగివచ్చును
ఈ భూలోకమును ఏలుటకై

ఆయనే అధికారముతో యేసయ్యా
ఆయనే రాజ్యమేలుటకు యేసయ్యా
ఆయనే న్యాయాధిపతి యేసయ్యా

ఆయనే కాపాడు దేవుడు
ఆయనే నడిపించే దేవుడు
ఆయనే తోడైయుండు దేవుడు ఆయనే

ఆరాధన వర్తమానము

దేవుని సన్నిధిలో ఉన్న మనము దీవించబడిన వారము. ఎందుకంటే, ఆయన మనలను ప్రేమించినవాడై ఉన్నాడు. ఆయన మహిమ పరచవలసిన వారమై ఉన్నాము.

వివేకముతో దేవుని వాక్యాన్ని ధ్యానము చేసినపుడు చాలా విషయములు మనకు తెలియచేయబడతాయి. మన జీవితముల ద్వారా ఆయన నామము మహిమపరచబడవలసినది గనుక ఆయన దీవెనలు అన్నీ మన జీవితములలో స్థిరపరచబడతాయి. అయితే మనము చెయ్యవలసినది ఒకటే, ఆయనను ఆనుకొని నడవడమే!

అలా దేవునిని ఆనుకుని, దేవునితో కలిసి కొనసాగుతుండగా దేవుని మహిమము మనము అనుభవించగలుగుతాము. అప్పుడు వెలకట్టలేని సంతోషముతో మనము నింపబడతాము.

యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.౹ -1 దినవృత్తాంతములు 29:11

మన దేవుడు ఎటువంటివాడో అనే సంగతి ఈ వాక్యము తెలియచేస్తున్నది. భూమ్యాకాశములయందుండు సమస్తమును ఆయన వశము. భూమి మీద ఉన్న మనము కూడా ఆయాన వశము అయి ఉన్నాము. ఆయన వశము అయి ఉన్నాము అంటే ఎలా అర్థము చేసుకోవాలి? అంటే ఆయన ఆధీనములో ఉన్నాము. అంటే ఆయన కలిగిన శక్తిని బట్టి మన జీవితములు ఆయన అధికారములో ఉన్నాయి.

మన జీవితము దినముల లెక్కగా చూడవచ్చు. మనము ఆయన వశములో ఉన్నాము అంటే, మన దినములన్నీ ఆయన ఆధీనములోనే ఉన్నాయి. ఆయన ఆధీనములో మనము ఉన్నాము కాబట్టి, ఆయన మంచివాడైతే మన జీవితములో మంచి జరుగుతుంది. చెడ్డవాడైతే, మన జీవితములో చేడు జరుగుతుంది.

మీరు వాటినిచేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.౹ -ఎఫెసీయులకు 2:2

అంటే ప్రేరేపించు శక్తి అంటే నీకు ఇష్టము ఉన్నా లేకున్నా అపవాది ప్రేరేపణను బట్టి కార్యములు చేసేవారము. అయితే ఇప్పుడు మనము అపవాది అధీనమును నుండి తప్పింపబడి, దేవుని ఆధీనములోనికి తేబడ్డాము.

నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.౹ నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.౹ వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;౹ -యోహాను 10:27-29

మనము ఎవరి ఆధీనములో ఉన్నామో మనము గ్రహించాలి. అందరికంటే గొప్పవాడైనవాని అధీనములో మనము ఉన్నాము. ఆయనను కలిగి ఉండటమే మన ధన్యత అయి ఉన్నది. ఆయన వశములో మనము ఉండగా, దేనికీ కూడా మన జీవితములను పట్టుకుపోవడానికి ఏ అవకాశము లేదు.

యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు – 1 దినవృత్తాంతములు 29:11
నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.౹ -యోహాను 10:9

మన జీవితములకు ఆయనే అధిపతి. ఆ అధిపతి మనము జీవించుటకు కావలసిన ప్రతిదానికీ ద్వారమై ఉన్నాడు. అనగా ఆశీర్వాదమునకు, జీవమునకు మార్గము అయి ఉన్నాడు. అందుకనే మన జీవితములు ఎంతో ధన్యకరమైనవి.

యెహోవా నాకాపరి నాకు లేమి కలుగదు అనే అనుభవమును ఇది సూచిస్తుంది. అందుకే మనము దేవుని వశము అయి ఉండుట ఎంతో భాగ్యము. మనము ఎన్నడును ఆకలిగొనము, ఎందుకంటే మన జీవితములకు కావల్సిన సమస్తము ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు.

ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.౹ -1 దినవృత్తాంతములు 29:12

భాగ్యము సమకూర్చుకొనునట్లుగా సామర్థ్యము కలుగచేసి మనము ఐశ్వర్యము సంపాదించుకొనునట్లు నడిపిస్తారు. అంతే కాక, గొప్పతనము కూడా ఆయనే కలుగచేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే, ఒకని హెచ్చించుట ఆయన వశము.

ఈ సత్యము తెలిసిన ప్రతీ ఒక్కరు ఇహలోకములోని ధనము, పేరు ప్రఖ్యాతులు వెంట వెళ్ళరు గానీ ప్రభువును మాత్రమే వెంబడించేవారుగా ఉంటారు. మనము దేవుని వెంట నడిస్తే సమస్తము మన వెంట రావలసినదే. ఎందుకంటే ఆయనే మన ఆశీర్వాదానికి మార్గము అయి ఉన్నాడు.

ఆయన సమస్తమును ఏలువాడు. అయితే ప్రకృతిని ఏలేవాడు అంటే ఒప్పుకుంటాము, మనకు సంబంధించని దేనినైనా ఏలేవాడు అంటే ఒప్పుకుంటాము. అదే మన జీవితములను కూడా ఏలేవాడు అంటే, తొట్రుపాటు పడతాము. ఏలేవాడు అంటే? పరిపాలన చేయడము అంటే? మన జీవితము సుభిక్షముగా ఉండుటకు అవసరమైన ప్రణాళికలు రచించి, అమలుపరిచుట పరిపాలించుట.

మన జీవితములో తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు ఉన్న పరిస్థితిలోనే కాదు, ఇక ముందు రాబోయే పరిస్థితిలో కూడా ఆయన తనను తాను ప్రత్యక్ష పరచుకుంటాడు. ఆయన ముందు ఎటువంటి పరిస్థితికూడా నిలవడానికి లేదు.

మన దేవుడు మృతమైన దానిని సహితము సజీవముగా చేయగలిగినవాడు మన దేవుడు. మన జీవితములో మనము చూసిన ప్రతి ఒక్కరికంటే, ప్రతి దానికంటే గొప్పవాడు మన దేవుడు.

యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.౹ -1 దినవృత్తాంతములు 29:11
ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.౹ -1 దినవృత్తాంతములు 29:12

11వ వచనములో పరాక్రమమును, మహాత్మ్యమును ఘనతయు దేవునివి అని వ్రాయబడింది. అదే 12వ వచనములో, బలమును పరాక్రమమును నీ దానములు అనగా ఆయన కలిగిన బలము పరాక్రముములు మనకు దానముగా ఇస్తున్నాడు అనే సత్యము గ్రహించగలము.

మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము.౹ -1 దినవృత్తాంతములు 29:13

దావీదు దేవుని గ్రహించినవాడై ఈ మాటలు చెప్పుచున్నాడు. ఈరోజు నీ, నా జీవితములలో కూడా ఆయనే అధిపతి అయి ఉన్నాడు గనుక మనము కూడా ఏదీ పోగొట్టుకొనము.

అపవాది కుయుక్తి కలిగినవాడు అపవాది. అటువంటి అపవాది ఆధీనములోనుండి మనలను విడుదల చేసి, ఈ శ్రేష్టకరమైన జీవితమును అనుగ్రహించాడు మన దేవుడు. అంతే కాక ఆయన బలమును పరాక్రమమును మనకు ఉచితముగా, దానముగా ఇచ్చియున్నాడు.

ఆరాధన గీతము

విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకు
నీ జీవితాన్నే ధారబోసితివే

నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా
ఎన్ని యుగాలైనా మారదు
ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే

పాపములో పడిన నన్ను
శాపములో మునిగిన నన్ను
నీ ప్రేమతో లేపితివే
రోగమే నన్ను చుట్టుకొనియుండగా
రోదనతో ఒంటరినైయుండగా
నా కన్నీటిని తుడిచితివే

పగలంతా మేఘ స్తంభమై
రాత్రంతా అగ్ని స్తంభమై
దినమంతయు రెక్కలతో కప్పితివే
స్నేహితులే నన్ను వదిలేసినా
బంధువులే భారమని తలచినా
నా కొరకే బలి అయితివే

సాధ్యమే సాధ్యమే సాధ్యమే
నా యేసుకు సమస్తము
సాధ్యమే సాధ్యమే సాధ్యమే
నా ప్రియునికి సమస్తము

ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే

 

వారము కొరకైన వాక్యము

ఈరోజు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి అనే అంశము గూర్చి నేర్చుకుందాము. సాధారణముగా మన నోటినుండి దేవుని చిత్తము గూర్చిన అనేకమైన మాటలు మాట్లాడతాము.

అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాము.౹ -కొలొస్సయులకు 1:9

పై వాక్యములో సంఘముగా ఏమి కలిగి ఉండాలో అని అనేకమైన విషయములు వ్రాయబడ్డాయి. అయితే అందులో ఒకటి – ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించాలి.

మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు,౹ మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి.౹ -ఎఫెసీయులకు 6:6-7

దేవుని చిత్తమును గ్రహించడమే కాక, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించాలి. అయితే ఎలా ఆయన చిత్తము తెలుసుకోవాలి?

మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. -రోమా 12:2

మొట్టమొదట దేవుని చిత్తము జరిగించబడాలి అంటే మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందవలసి ఉన్నది.

ఒక స్త్రీ గర్భము ధరించింది, అయితే రక్తస్రావము అయినప్పుడు ఆ గర్భము నిలువదు. ఈ లోకములో ఆలాగుననే జరుగుతుంది. అయితే ఆ లోకము యొక్క మర్యాదను అనుసరించక, అనగా లోకములో సాధారణముగా ఏమి జరుగుతుందో దానిమీద మనసు పెట్టక, ఉత్తమము అనుకూలమైన దేవుని చిత్తము ఏమిటో అనేది మనము తెలుసుకోవాలి అంటే మొదట మన మనసులో ఆ ఆలోచన మారవలసి ఉన్నది.

దేవుని చిత్తమును చూస్తే, గర్భఫలము ఆయన దానము. కుమారులు గల తల్లిగా సంతోషము ధరింపచేయువాడు దేవుడే. అయితే అననుకూల సమయములలో మన హృదయము ఈ లోకములో జరిగే విధముగా ఆలోచించకూడదు.

దైవజనునికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఈలోకములో ఆ వ్యాధి వచ్చిన వారు ఎలా ఉంటారో అనే పరిశోధన చేస్తున్నప్పుడు, నీకు ఉన్న విశ్వాసమును బట్టి ఆ క్యాన్సర్ నిన్ను ప్రభావము చేస్తుంది. లోకములో ఉన్న ప్రకారము నీకు జరగడానికి నీకు లేదు అనే సత్యము ప్రభువు జ్ఞాపకము చేసి బలపరచి నిలబెట్టారు.

మనము కూడా దేవుని చిత్తము జరిగించాలి అంటే మొదట మన హృదయము సిద్ధపరచబడాలి. లోకములో ఉన్న ప్రకారము మన ఆలోచనలు ఉంటే, దేవుని చిత్తము జరిగించలేము.

దేవుని చిత్తము రెండు రకములుగా తెలియచేయబడుతుంది. ఒక విధముగా దేవుడే తన చిత్తమును తెలియచేసేవాడుగా ఉంటాడు. ఆదిమ దినములలో ప్రవక్తల ద్వారా, దేవదూతల ద్వారా అలాగే కలల ద్వారా కూడా తన చిత్తమును తెలియచేసారు.

ఈ మూడు విషయములలో మన ప్రమేయము ఏమీ ఉండదు. ప్రత్యేకముగా దేవుడు తన చిత్తమును బయలుపరచినవాడుగా ఉన్నాడు అంటే? ఎన్నిక చేయబడినవారికి. అయితే మన అందరము కూడా ఎన్నిక చేయబడినవారమే!

రెండవదిగా మనకు మనము కూడా దేవుని చిత్తమును తెలుసుకోవచ్చు. ఈ విధానములో మన ప్రమేయము ఉంటుంది.

ఇప్పుడేలాగైనను ఆటంకములేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు, మిమ్మునుగూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను -రోమా 1:9

ఇక్కడ పేతురు, పౌలు ప్రార్థన వలన దేవుని చిత్తము కనుగొనుటకు ప్రయత్నము చేస్తున్నారు. మనము కూడా ప్రార్థనల ద్వారా దేవుని చిత్తమును కనుగొనగలుతాము.

మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు; మీరు సంపూర్ణులును, ప్రతి విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని యితడెల్లప్పుడును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు.౹ -కొలొస్సయులకు 4:12

ఎపఫ్రా తన సంఘము దేవుని చిత్తమును సంపూర్ణముగా తెలుసుకోవాలి అని ప్రార్థన చేస్తున్నాడు.

మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంట లకు పేతురు ప్రార్థనచేయుటకు మిద్దెమీది కెక్కెను.౹ అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను; ఇంటివారు సిద్ధముచేయుచుండగా అతడు పరవశుడై౹ ఆకాశము తెరవబడుటయు, నాలుగు చెంగులుపెట్టి దింప బడిన పెద్ద దుప్పటివంటి యొకవిధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను.౹ -అపొస్తలుల కార్యములు 10:9-11

పేతురు ప్రార్థన చేయుచుండగా కలిగిన దర్శనమును ద్వారా దేవుని చిత్తము బయలుపరుస్తున్నాడు. మనము కూడా ప్రార్థన ద్వారా దేవుని చిత్తము తెలియచేయబడుతుంది అనే సత్యము తెలిసినవారమైతే, మనము కనిపెట్టేవారముగా ఉంటాము.

అందులో భూమియందుండు సకల విధములైన చతుష్పాద జంతువులును, ప్రాకుపురుగులును, ఆకాశపక్షులును ఉండెను.౹ అప్పుడు –పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమత నికి వినబడెను.౹ అయితే పేతురు–వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా౹ –దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను.౹ ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను. -అపొస్తలుల కార్యములు 10:12-16

పేతురుకు మొదట ఆ దర్శనము యొక్క భావము అర్థము కాలేదు. అయినప్పటికీ, పేతురు గ్రహించేంతవరకు ఆయన చిత్తమును తెలియచేస్తూనే ఉంటారు. మనము ప్రార్థన చేయడానికి సిద్ధపడితే, తన చిత్తము తెలియచేయడానికి ఆయన సిద్ధమే.

దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు తన చిత్తమును బయలుపరచడానికి సిద్ధపడినప్పుడు, మన ఆత్మీయ వాతావరణము మార్పు చెందుతుంది, మన ఆత్మ సిద్ధపరచబడుతుంది.

పేతురు తనకు కలిగిన దర్శనమేమై యుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి౹ -అపొస్తలుల కార్యములు 10:17

పేతురుకు ఇవ్వబడిన దర్శనము ఏమిటో అర్థము కాలేదు అయినప్పటికీ, ఆ దేవుని చిత్తము పేతురు కళ్ళముందే ప్రత్యక్షపరచబడింది.

–దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను.౹ ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.౹ -అపొస్తలుల కార్యములు 10:34-35

ఇప్పుడు పేతురు మాటలలో – దేవుని చిత్తమును నిజముగా గ్రహించాడు అని ఒప్పుకుంటున్నాడు.

యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు. అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి–నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను.అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. -అపొస్తలుల కార్యములు 16:7-10

ఇక్కడ పౌలుకు కూడా దర్శనము కలిగింది. అలా తెలుసుకున్న చిత్తము ప్రకారము చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. దీనినిబట్టి ప్రార్థన ద్వారా దేవుని చిత్తమును తెలుసుకోవచ్చు అని మనము గ్రహించగలము.

ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమునువారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు – యెషయా 61:1-3
ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా – –ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజమందిరములోనున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయన–నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. -లూకా 4:17-20

దేవుని చిత్తము ఆయన లేఖనముల ద్వారా వెల్లడిపరచబడుతుంది. యెషయా ద్వారా తెలియచేయబడిన చిత్తము, యేసయ్యకు ఆ లేఖనముల ద్వారా తెలియచేయబడింది. గనుక మనము కూడా మనము దేవుని చిత్తమును తెలుసుకోవచ్చు.

మనము దేవుని చిత్తము కొరకు ప్రార్థన చేసి, వాక్యము ధ్యానము చేసినప్పుడు ఆయన చిత్తమును మనము ఖచ్చితముగా కనుగొనగలుగుతాము.