స్తోత్రగీతము – 1
స్తోత్రము స్తుతి స్తోత్రము
వేలాది వందనాలు
కలుగును గాక నీకే మహిమ
ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము
యేసయ్య యేసయ్య యేసయ్య (4)
శూన్యము నుండి సమస్తము కలుగజేసెను
నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను
యేసే నా సర్వము
యేసే నా సమస్తము ||యేసయ్య||
పరలోకము నుండి దిగివచ్చెను యేసు రారాజుడు
సిలువ మరణమునొంది మార్గము చూపెను
యేసే నా రక్షణ
యేసే నా నిరీక్షణ ||యేసయ్య||
స్తోత్రగీతము – 2
యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు
ఆయన కృప నిత్యముండును (2)
ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు (2)
యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు
యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు
జై జై యేసు రాజా – జయ యేసు రాజా (4)
||యెహోవా||
సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే
మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే (2)
||యెహోవా నాకు||
దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనే
విలువైన రక్షణలో నను కడ వరకు నడిపించు వారాయనే (2)
||యెహోవా నాకు||
స్తోత్రగీతము – 3
నీటిపైనా నడిచెను
గాలి సముద్రమును గద్దించెను
మృత్యుంజయుడై లేచెను
నాతో నిత్యము జీవించును-2
ఆయనే కాపాడు దేవుడు
ఆయనే నడిపించే దేవుడు
ఆయనే తోడైయుండు దేవుడు ఆయనే-2
1.మనకొరకు మరణించి
సిలువలో ప్రాణమునిచ్చెను
జయశీలుడై లేచెను
పాపికి విడుదలనిచ్చెను-2
ఆయనే కాపాడు దేవుడు
ఆయనే నడిపించే దేవుడు
ఆయనే తోడైయుండు దేవుడు ఆయనే-2
2.మేఘాల మధ్యలో
బూర ధ్వని శబ్దముతో
రారాజుగా దిగివచ్చును
ఈ భూలోకమును ఏలుటకై-2
ఆయనే అధికారముతో యేసయ్యా
ఆయనే రాజ్యమేలుటకు యేసయ్యా
ఆయనే న్యాయాధిపతి యేసయ్యా-4
ఆయనే కాపాడు దేవుడు
ఆయనే నడిపించే దేవుడు
ఆయనే తోడైయుండు దేవుడు ఆయనే-2
ఆరాధన వర్తమానము
దేవుని స్తుతించే సమయములో దేవుని యొక్క పరిపాలన జరిగించబడేదిగా ఉంటుంది. అందువలన దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిని మనము ఎలా గమనించగలము? ఒక రాజు తన సింహాసనము పై ఆసీనుడైనపుడు అక్కడ ఉన్న వారు ఆ రాజును పొగడి, కీర్తించేవారుగా ఉంటారు. అప్పుడు ఆ రాజు సంతోషించిన యెడల వారికి మేలు జరిగించేవాడుగా ఉంటాడు. ఆ రాజు యెటువంటివాడో ఎరిగినవారై ఆయన కలిగిన లక్షణములను బట్టి ఆ రాజును కీర్తించిన యెడల, ఆ రాజు సంతోషించేవాడుగా ఉంటాడు. అలాగే మనము కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చిన సందర్భములో ఆయన ఏమై ఉన్నాడో ఎరిగినవారమై ఆయనను ఆరాధించిన యెడల మన దేవుడి ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడు.
యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు కాడు; ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము; సైన్యములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు. -యిర్మీయా 10:16
యాకోబునకు స్వాస్థ్యము అగువాడు. “స్వాస్థ్యము” అంటే చెందినది అని అర్థము. “యాకోబునకు స్వాస్థ్యము అగువాడు” అంటే యాకోబునకు చెందినవాడు. అనగా దేవుడు యాకోబునకు చెందినవాడు గా ఉన్నాడు. “ఇశ్రాయేలు దేవునికి స్వాస్థ్యము” అనగా ఇశ్రాయేలు దేవునికి చెందినది.
ఇశ్రాయేలు అనగా దేవుని అంగీకరించినవాడు – యాకోబు అనగా దేవుడు పిలిచినవారు. దేవుడు పిలిచినవారికి దేవుడు చెందినవాడు, దేవుని అంగీకరించినవారు దేవునికి చెందినవారుగా ఉన్నారు. అనగా దేవునిలో వారు, వారిలో దేవుడు ఏకమై ఉన్నారు అని అర్థము. ఇది మనము కలిగిన ఆధిక్యత.
“యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు కాడు” అంటున్నాడు అంటే, ఆయన ఎటువంటివాడు? నీవు అంగీకరించిన నీ దేవుడు, నిన్ను తనకు స్వాస్థ్యముగా చేసుకున్నవాడైన నీ దేవుడు ఎటువంటివాడు?
ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.౹ -యిర్మీయా 10:12
అటువంటి దేవునికి నీవు స్వాస్థ్యము అయి ఉన్నావు అనే సత్యము ఎరిగినప్పుడు నీవు ఎంతో నిశ్చింతగా ఉండగలుగుతావు. మన పుట్టుకను చూస్తే, మన శరీర నిర్మాణమును గమనిస్తే దేవుని అనంత జ్ఞానము అర్థముచేసుకోగలుగుతాము. ఆ దేవుడు ఎటువంటివాడు అని చూస్తే –
- సృష్టించేవాడు – తన బలము చేత
- స్థాపించేవాడు – తన జ్ఞానము చేత
- విశాలపరచేవాడు – తన ప్రజ్ఞ చేత
నీవు ఎవరికి స్వాస్థ్యము అయి ఉన్నావో ఆయన లక్షణములు ఇవి. అటువంటి దేవుడు నీకే గుర్తింపుగా ఉన్నాడు. ఈ సత్యములో నీవు బ్రతకవలసిన అవసరము ఉంది. నీ కొరకు ఆయన తలంపులు కలిగినవాడు. దానికొరకు సృష్టించేవాడుగా, స్థాపించి స్థిరపరచేవాడుగా, కొనసాగించేవాడిగా విశాల పరిచేవాడుగా ఉన్నాడు. మన జీవితములు మన బట్టికాదుగానీ, ఆయనను బట్టి స్థిరపరచబడును.
ఆయన ఆజ్ఞ నియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును, భూమ్యంత భాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములలోనుండి గాలిని రావించును.౹ -యిర్మీయా 10:13
ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడ నున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుట లేదు.౹ -యిర్మీయా 2:6
దేవుడు ఎటువంటి పరిస్థితులగుండా నడిపించేవాడో దీనిని బట్టి అర్థము చేసుకోగలము. ఎవరూ నివాసము చేయని దేశములో అనగా, ఎవరికీ రాని కఠిన పరిస్థితులైనా సరే నీ దేవుడు నిన్ను మేలు కొరకు నడిపించగలిగిన వాడు. ఎడారి అనగా లేమి కలిగిన స్థితిగా చూడవచ్చు. గోతులు గల దేశము అంటే, పడుతూ లేస్తూ ఉన్న పరిస్థితిగా చూడవచ్చు. అనావృష్టి అంటే కరువుగా ఉన్న స్థితి, పరిస్థితి ముగించబడటానికి ఏ అవకాశము లేని స్థితి గా చూడవచ్చు. గాఢాంధకారము అనగా భరించలేని శ్రమగా చూడవచ్చు. అటువంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు విడిచిపెట్టక, నడిపించినవాడుగా అనగా దాటించినవాడుగా ఉన్నాడు. ఎక్కడికి నడిపించాడు?
దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి, నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి.౹ -యిర్మీయా 2:7
“ఫలవంతమైన దేశములోనికి” అనగా సమృద్ధి కలిగిన స్థితి, నీ పరిస్థితి ముగించబడి, సంతోషముతో, నిండుదనముతో ఉన్న పరిస్థితిలోనికి నడిపించేవాడు అని అర్థము. అటువంటి దేవునికి స్వాస్థ్యముగా నీవు ఉన్నావు. ఆయనను బట్టియే మన జీవితము స్థిరపరచబడుతుంది. ఎప్పుడైనా సరే శ్రేష్ఠమైనవే మనకొరకు స్థిరపరచేవాడుగా మన దేవుడు ఉన్నాడు. మన దేవుడు బలము కలిగినవాడు, జ్ఞానము కలిగినవాడు, ప్రజ్ఞ కలిగినవాడు. ఆయన కాపాడే దేవుడు, ఆయన తోడైఉండే దేవుడు, ఆయన నడిపించే దేవుడు. నీ ఆధిక్యత నీవు అర్థము చేసుకున్నట్టయితే ఆయనను సత్యముతో ఆరాధించు. కుమారులు మాత్రమే తండ్రి సంపాదించినదానికి హక్కుదారులు. ఆయనకు కుమారునిగా నీ హక్కు ఏమిటి? తండ్రి కలిగిన శ్రేష్ఠమైనదానిని అనుభవించే హక్కు. లేమి కలిగిన స్థితి నుండి విడిపించబడటము నీ హక్కు. అందుకే నీవు దేనికీ భయపడనవసరము లేదు. నీ దేవుడు ఉన్నవాడై ఉన్నాడు సజీవుడైనవాడు. అందుకే మనము మన గుర్తింపు (ఐడెంటిటీ) ఏమై ఉందో నీవు ఎరిగి ఉండాలి.
ఆరాధన గీతము
నీటిపైనా నడిచెను
గాలి సముద్రమును గద్దించెను
మృత్యుంజయుడై లేచెను
నాతో నిత్యము జీవించును-2
ఆయనే కాపాడు దేవుడు
ఆయనే నడిపించే దేవుడు
ఆయనే తోడైయుండు దేవుడు ఆయనే-2
మనకొరకు మరణించి
సిలువలో ప్రాణమునిచ్చెను
జయశీలుడై లేచెను
పాపికి విడుదలనిచ్చెను-2
ఆయనే సృష్టి కర్తయు
ఆయనే స్థిరపరచు వాడును
ఆయనే విశాలపరచును ఆయనే-2
యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు
ఆయన కృప నిత్యముండును (2)
ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు (2)
యెహోవాయే నా స్వాస్థ్యము – నాకు భయమే లేనే లేదు
యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు
జై జై యేసు రాజా – జయ యేసు రాజా (4)
||యెహోవా||
మెయిన్ మెసేజ్
మన భవిష్యత్తును గూర్చిన విషయములు ఎవరికీ తెలియదు. అయితే మన అవసరము నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు మనకు భవిష్యత్తు కొరకు కొన్ని విషయములు తెలియచేస్తాడు. అయితే లోకరీతిగా చూస్తే, మన భవిష్యత్తు కొరకు డబ్బు దాచుకోవడము అనేది చేస్తాము. ప్రతీ ఒక్కరికీ మంచి భవిష్యత్తు కావాలి అనే అందరమూ కష్టపడతాము. లేఖనములు గమనిస్తే, “దేవుని కృప నిత్యము ఉంటుంది”. ఈ కృప ఏమి చేసింది అని ఆలోచిస్తే, ఈ లోకములో అటు ఇటు తిరుగుతూ, అపవాది ప్రేరేపణ చేత నడిపించబడుతున్న సమయములో, దేవుని కృప రక్షించి శ్రేష్ఠమైన ఫలములుగా మనలను స్థిరపరచబడుతున్నాయి.
ఒక విషయము స్పష్టముగా అనుభవించి తెలుసుకోగల సత్యము ఏమిటి అంటే, ఆత్మీయముగా బలము కలిగినవారు, వారి భౌతికమైన, శరీర సంబంధమైన జీవితాన్ని ఫలభరితముగా సిద్ధపరచుకోగలుగుతారు. ఒక సత్యము మనము తెలుసుకున్నది ఏమిటి అంటే, ఆరాధనలో దేవుని ఆజ్ఞ బయలు దేరుతుంది. ఆ దేవుని ఆజ్ఞ మన జీవితములను స్థిరపరచబడుతుంది. ఈరోజు తెలుసుకున్న సత్యము ఏమిటి అంటే, “సృష్టించినవాడు, స్థాపించేవాడు, విశాలపరచేవాడు”. మన జీవితములో సృష్టించబడ్డాము, అయితే ఇంకా స్థాపించబడలేదేమో, అయితే ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి, ఆరాధించిన సమయములో, మనము స్థిరపరచబడటానికి ఆజ్ఞ బయలుదేరుతుంది. ఒకవేళ స్థాపించబడి ఉంటే, విశాలపరచబడే స్థితి కొరకు ఆజ్ఞ బయలు దేరుతుంది. మన సంఘము విషయములో కూడా, మన కొరకు మందిరము స్థాపించబడి, విశాలపరచబడుతుంది. ఈ సత్యము ఎరిగి, ఆ ప్రకారము అభ్యాసము చేసేవారిగా ఉందాము. ఈ ప్రకారముగా మన జీవితాన్ని కట్టుకుంటే, మన ఎదుట నిలబడి అడ్డుకోగలిగినది ఏమీ లేదు. మనము మంచి జీవితము జీవించాలి అంటే, నీ ఆత్మీయ జీవితము బలముగా ఉండాలి. ఏమి చేస్తే మన ఆత్మీయ జీవితము ఎలా బలము కలిగి ఉంటుంది? దీని గురించి మనము ధ్యానిద్దాము.
చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును. -యెషయా 55:3
నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి. -ద్వితీయోపదేశకాండము 30:20
“ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు”. అనగా ఆయన మనకొరకు నిర్ణయించిన భవిష్యత్తు ను స్వతంత్రించుకొని అనుభవించుటకు అనగా మంచి జీవితమును జీవించుటకొరకు ఆయనే ఆధారమై ఉన్నవాడు.
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణము చేసినది దేవుడు. అబ్రహాము యొక్క పితరులు అన్యదేవతలను పూజించినవారుగా ఉన్నారు. ఆ సమయములో దేవుడు అబ్రహామును పిలిచి, ప్రత్యేకపరచి, పాలు తేనెలు ప్రవహించే దేశములో అతను ఉండాలి అని ఉద్దేశ్యము కలిగినవాడుగా దేవుడు ఉన్నాడు. మన జీవితము చూస్తే, అన్యులుగా ఉన్న మనలను యేసు క్రీస్తు ద్వారా పిలిచి, రక్షిని, సమృద్ధికలిగిన జీవితములు గా, సమాధానకరమైన జీవితములుగాను ఉండాలని దేవుడు కలిగిన ఉద్దేశ్యము నెరవేరాలి అంటే, మనకు దేవుడే ఆధారము అయి ఉన్నాడు.
నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.౹ -యోహాను 10:27
మన ఆత్మీయ జీవితము బలముగా ఉండాలి అంటే ఆయనే మూలమై ఉన్నాడు. “నా గొఱ్ఱెలు నన్ను వెంబడించును”. గొర్రెల కాపరి ముందుగా ఎలా నడుస్తున్నాడో, అదే రీతిగా అవి కూడా అలాగే నడుస్తాయి. అనగా మనము మంచి జీవితము జీవించాలి అంటే, నీకు ముందుగా ఏమి మార్గము వేయబడి ఉందో, ఆ మార్గములోనే నిలిచి ఉండాలి.
నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుటవలన నీకు నీవే యీ బాధ కలుగజేసికొంటివి గదా.౹ -యిర్మీయా 2:17
నీతిమంతుల మార్గములో మరణమే లేదు. ఈ నీతిమంతుల మార్గములో నిలిచినంతసేపు, నీవు విజయకరమైన జీవితము జీవించగలుగుతావు. ఉదాహరణకు, గొర్రెలు మరియు కాపరి మనము రోడ్డు పై వెళుతున్నప్పుడు, అవి పక్కగా వెళుతున్నప్పుడు, తన స్వరము ద్వారా వాటిని తిరిగి సరైన దారిలోనికి వచ్చునట్లు శబ్దములు చేస్తాడు కదా! మన ఆత్మీయ జీవితములో కూడా అంతే,
ఏదనగా–నా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులైయుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.౹ -యిర్మీయా 7:23
మన జీవితములో మనము విని క్షేమము కలిగి ఉండునట్లు, ఆయన తన మాటలు మన వద్దకు పంపుతాడు. ఆ మాటలను వినిన యెడల మనకు క్షేమము కలుగుతుంది. అంటే, అంతవరకు నీకు క్షేమములేదు అనే కదా దాని అర్థము. గొర్రెల కాపరిని చూస్తే, శబ్దముల ద్వారా, కర్ర ద్వారా వాటిని క్షేమకరమైన మార్గములో నడిపిస్తాడు. అలాగే, మనము కూడా, దేవుని స్వరము మనతో పలుకుతున్న క్షేమకరమైన హెచ్చరికలను, ఆజ్ఞలను మనము విని ఆ ప్రకారము సరిజేసుకోకపోతే, మన జీవితము అవిటిదిగానీ, మృతమైనదిగా గానీ అవుతుంది. అది దేవుని ఉద్దేశ్యము కాదు. అందుకే దేవుని వాక్యముద్వారా వచ్చే హెచ్చరికను అలక్ష్యము చేయకూడదు. అలా నడుచుకున్నప్పుడు ఏమి జరురుతుంది అంటే?
నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థుల నందరిని యూదా వంశస్థులనందరిని, నడికట్టు నరుని నడుముకు అంటియున్నరీతిగా నన్ను అంటియుండజేసితిని -యిర్మీయా 13:11
ఆయన మాటల ప్రకారము నడిచినప్పుడు మనము క్షేమము కలిగి ఉంటాము. ఎలా అంటే, మన బెల్టు (నడికట్టు) మన నడముకు ఎలా అంటిపెట్టుకుని ఉంటుందో, అలా దేవుడు మనలను అంటిపెట్టుకుని ఉంటాను అని ఆయనే చెప్పుచున్నాడు. అలా ఉన్నప్పుడు, మన ద్వారా దేవునికి కీర్తి స్తోత్ర మహిమలు కలుగుతాయి. అంటే ఆయన శక్తి, మహిమ నీ జీవితములో స్థిరపరచబడతాయి.
ఐగుప్తుదేశములోనుండి, ఆ యినుప కొలిమిలోనుండి నేను మీపితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని–నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీపితరులకిచ్చెదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు, మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించు విధులన్నిటినిబట్టి యీ నిబంధన వాక్యముల ననుసరించినయెడల మీరు నాకు జనులైయుందురు నేను మీకు దేవుడనైయుందును.౹ -యిర్మీయా 11:4
దేవుని మాటను నిర్లక్ష్యము చేసినట్లయితే దేవుని ప్రజలుగా మనము ఉండలేము. మనము సత్యము ఎరగలేని స్థితిలో రహస్యముగా పాపములో కొనసాగుతూ, ఎవరికీ తెలియదు అనుకుంటాము. అయితే మన దేవుని యెదుట దాచబడినది ఏదీ లేదు.
ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి. -1 పేతురు 2:10
మనము చేసేదాన్ని చేసేస్తూ, నేను దేవునికి చెందినవాడిని అను నీవు అనుకుంటే, అది అసత్యము. ఒకప్పుడు నీవు దేవుని ప్రజగా లేని స్థితిలో ఉన్నావు. అప్పుడు నీకు కనికరము నీ జీవితములో దొరకలేదు. నీవు అసత్యములో కొనసాగించబడుతుంటే దేవుని కనికరము దొరకని స్థితిలోనికి నీవు వెళ్ళిపోతావు.
“మీపితరులకిచ్చెదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు, మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించు విధులన్నిటినిబట్టి యీ నిబంధన వాక్యముల ననుసరించినయెడల మీరు నాకు జనులైయుందురు నేను మీకు దేవుడనైయుందును”. అని దేవుడు ఈ దినమున మనతో చెప్పుచున్నాడు. మన దేవుని కోరిక మనము మంచి జీవితము జీవించాలి అనే.
నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులులేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగు నని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ -యిర్మీయా 2:19
మన జీవితములో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఎక్కడైనా మనము తప్పిపొయామేమో ఎక్కడైనా దేవునికి భయభక్తులు చూపించలేని స్థితిలో ఉన్నామేమో, మనము పరీక్షించుకోవాలి. ఒకవేళ, తప్పిపోతే శ్రమ కలిగినట్లు, అదే నీవు సరిగా ఉన్నప్పటికీ శ్రమ వచ్చింది అంటే, అది శ్రమ కాదు గానీ, అది శోధన. నీ విశ్వాసము కొరకైన పరీక్ష మాత్రమే.
మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు. -యెషయా 1:19-20
దేవుడు చెప్పిన మాటలను సమ్మతించి, అనగా అంగీకరించి ఆ ప్రకారము నడిచిన యెడల, మంచి జీవితములను జీవిస్తాము. అలా కాని యెడల నష్టము పొందేవారిగా అయిపోతాము.
ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.౹ -ప్రసంగి 12:13
నీవు మంచి జీవితము కలిగి ఉండాలి అంటే
1. ఆత్మీయ జీవితము బలముగా ఉండాలి అంటే దేవుడే నీకు మూలము.
2. నీకొరకు దేవుడు చూపించిన మార్గములోనే ఉండాలి.
3. నీవు మార్గమును తప్పించుకున్నప్పుడు తన మాటల ద్వారా హెచ్చరించినప్పుడు, దానిని స్వీకరించి సరిచేసుకోవాలి.
4. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి.
జీవమును మరణమును నీ యెదుట ఉంచబడినవి, నీవు ఇప్పుడు జీవమును కోరుకొనుట అనేది దేవుని ఉద్దేశ్యము.