స్తోత్రగీతము -1
నీ మందిరమై నేనుండగా
నా యందుండి నడిపించవా”2″
నీవు తోడుండగా నాకు దిగులుండునా”2″
వెంబడిస్తాను నిను యేసువా”2″
నీవు కోరేటి దేవాలయం
నాదు దేహంబెగా నిశ్చయం”2″
నీదు ప్రత్యక్షత నాకు కలిగించవా”2″
నిత్యము నిన్ను స్తుతింతును”2″
“నీ మందిరమై”
నాడు నిర్మించే దేవాలయం
రాజు సొలొమోను బహుసుందరం”2″
అట్టి దేవాలయం నేను నిర్మించగా”2″
నీ కట్టడలో నను నిల్పుమా”2″
“నీ మందిరమై”
హన్న ప్రార్ధనను విన్నావుగా
నేనున్నానని అన్నావుగా “2”
నేడు సమూయెలుతో బహుగా
మాట్లాడినా”2″
దేవా నాతోటి మాట్లాడవా”2″
“నీ మందిరమై”
ఆత్మసత్యముతో ఆరాధింప
ఆత్మదేవుండు నేర్పించుమా”2″
మహిమ రూపంబును నేను దర్సింపను”2″
నా నేత్రంబు వెలిగించుమా”2″
“నీ మందిరంమై”
ఆ పరలోక ప్రతిబింబమై
ఈ ధరలోన దీపంబునై”2″
ధరణి వెలిగించను కరుణ ప్రసరింపను”2″
కరము తోడుంచి నడిపించుము”2″
“నీ మందిరమై”
స్తోత్రగీతము-2
కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో (2) ||కుతూహలం||
పాపమంత పోయెను – రోగమంత పోయెను
యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ
పరిశుద్ధ ఆత్మలో (2) ||కుతూహలం ||
దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు
దేవాలయం మనమే
ఆత్మయైన దేవుడు – మన సొంతమాయెను
ఆశ్చర్యమాశ్చర్యమే (2) ||కుతూహలం||
శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు
జయంపై జయం ఇచ్చును
ఏకముగా కూడి – హోసన్నా పాడి
ఊరంతా చాటెదము (2) ||కుతూహలం||
స్తోత్రగీతము-3
హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము
ఆ….. హల్లెలూయ …
హల్లెలూయ … హల్లెలూయ …
|| హల్లెలూయ ||
అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము (2)
అల సాంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము
||హల్లెలూయ||
ఆకాశము నుండి మన్నాను పంపిన
ఆ దేవుని స్తుతియించెదము (2)
బండ నుండి మధుర జలమును పంపిన
ఆ యెహోవాను స్తుతియించెదము
||హల్లెలూయ||
ఆరాధన వర్తమానము
మన ప్రభువు మనలను ఆకర్షించకపోతే, ఆయన మనలను సిద్ధపరచకపోతే ఆయన సన్నిధికి మనము రాలేము. ఆయన సన్నిధిలో దేవుని వాక్కు విడుదల అవుతుంది,ఆ వాక్కు మనలను స్థిరపరచేది గనుక అపవాది అనేకరకములుగా అడ్డంకులు కలుగచేస్తాడు. అయితే మనము ధన్యులము, ఆయన సన్నిధిలో మనము ఉన్నాము.
మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.౹ అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు–యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా ఆయన వేయివేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించునుగాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికిని కుమారుల కుమారులమీదికిని రప్పించునని ప్రకటించెను.౹ -నిర్గమకాండము 34:5-7
మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములనుకాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.౹ -యోవేలు 2:13
మన దేవుడైన యెహోవా యొక్క గుణలక్షణములు ఈ వాక్యము ద్వారా మనము అర్థముచేసుకోగలము. మన దేవుడు అత్యంత కృప గలిగినవాడు, కరుణ మరియు జాలి కలిగిన దేవుడు.
–యెహోవా, నేను నా దేశమం దుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందు గానే తర్షీషునకు పారిపోతిని.౹ -యోనా 4:2
ఏ ప్రవక్త సాక్ష్యము మనము చూసినా సరే, కరుణా కటాక్షములు కలిగినవాడు, అత్యంత కృప కలిగినవాడు, జాలి కలిగినవాడు, దయ కలిగినవాడుగా దేవుని ఎరిగినవారై ప్రకటించారు. మన ప్రవర్తనను బట్టి మనకు రావలసిన కీడు మనకు రాకుండునట్లు, మనము ఆయన తట్టు తిరగగా ఆయన జాలి కలిగినవాడై, జరగవలసిన కీడును తప్పించేవాడుగా మన దేవుడు ఉన్నాడు. అపవాది ఎప్పుడు మింగుదుమా అని అనేకమైన ఉచ్చులు బిగించి సిద్ధముగా ఉంటాడు. దేవునితో మనము ఉన్నంతకాలము, ఆ ఉచ్చులు ఏమి చేయలేవు. అయితే ఎప్పుడైతే, నీవు దేవునికి దూరంగా వెళ్తావో, ఆ అపవాది ఉచ్చులో చిక్కుబడిపోతావు. అయితే మన దేవుడు మంచిదేవుడు, ప్రేమ గలిగిన వాడు గనుక మనయెడల తన కృపచూపించక మానట్లేదు. దీనికి మన పితరులైన ఇశ్రాయేలీయులే ఒక ఉదాహరణ.
నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులులేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹ -యిర్మీయా 2:19
దేవుడు మనలను అంటిపెట్టుకుని, మనము దేవునిని హత్తుకుని ఉన్నంతకాలము మన జీవితములో క్షేమమే ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనము దేవునికి దూరముగా అవుతామో, అప్పుడు మన జీవితములో కీడు కలిగే పరిస్థితి కలుగుతుంది.
మోషే నుంచి అనేక తరతరముల వారు దేవుడు అత్యంత కృపగలిగినవాడు అని ఎరిగి, అనుభవించి ప్రకటించారు. ఈ దినము మన దినము. మనము కూడ ఈ సత్యమును ఎరిగి మన దేవునిని ఆరాధించి స్తుతిద్దాము.
ఆరాధన గీతము
నీ ప్రేమ నీ శక్తి
నింపుము నాలోనా
ఆరాధింతును – హృదయమంతటితో
స్తుతించెదను – నీ పాదసన్నిధిలో
నీవే కదా దేవుడవు
యేసు నీవే కదా దేవుడవు
దేవా యేసు దేవా
దేవా యేసు దేవా
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4)
యేసయ్యా నీవే నా రక్షకుడవు
యేసయ్యా నీవే నా సృష్టికర్తవు
దరి చేర్చి ఆదరించుమా
ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా
వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు
ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు
హాల్లేలూయా ఆమెన్
ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా
పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి
సర్వాధికారివి.. ఓ యేసయ్యా (2)
కరుణించి కాపాడుమా
ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2)
వారము కొరకైన దేవుని వాక్కు
మన దేవుడు మంచి దేవుడు, మనకు మంచి చేసే దేవుడు. ఆయన ప్రతిఫలము ఇచ్చే దేవుడుగా ఉన్నాడు.
ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది. -కీర్తనలు 62:12
మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలమిచ్చుచున్నాడు. ఎలా ఇస్తున్నాడు అనేది మనము తెలుసుకుందాము.
నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫలమిచ్చును. -యోబు 34:11
ఈ వాక్యమును గమనిస్తే, ఏమైతే ఈ భూలోకములో మనము చేస్తున్నామో, ప్రవర్తిస్తున్నామో ఆ క్రియలను బట్టి ఫలము అనుభవించేవారిగా మనము ఉంటాము. మన క్రియలు మంచి క్రియలైతే మంచి ప్రతిఫలము, చెడ్డ క్రియలైతే చెడ్డ ప్రతిఫలము మనము పొందుతాము.
ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డైవెనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. -2 కొరింథీయులకు 5:10
ఈ చెడుక్రియలను మనము తెలియక జరిగించినప్పుడు క్షమాపణ మనకు దొరికింది. అనగా క్రీస్తును ఎరగకమునుపు మనము చేసిన క్రియలను బట్టి క్షమాపణ ఆయనను అంగీకరించిన మనకు దొరికింది. మరి ఒకవేళ ప్రభువును అంగీకరించిన తరువాత మనము చెడు క్రియలు చేసినట్టయితే, ఆ చెడు క్రియలను బట్టి మనము ప్రతిఫలము అనుభవించవలసినదే!
నీతిమంతులు భూమిమీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులును పాపులును మరి నిశ్చయముగా ప్రతి ఫలము పొందుదురు గదా? -సామెతలు 11:31
నీతిమంతుల గుంపులో మనము ఉంటే మన ప్రతిఫలము ఏమై ఉంటుంది? నీతి మంతుని ప్రతిఫలము నిత్య జీవము, దేవుని రాజ్యమునకు హక్కుదారులు, దేవునిలో ఉన్న ప్రతి శ్రేష్ఠమైన దానినీ స్వతంత్రించుకొనే అవకాశము మరియు హక్కు ఉంటుంది. మన క్రియలు మంచి క్రియ చేసినప్పుడు మనము తల ఎత్తుకొనేవారిగా ఉంటాము. అదే మనము చెడు క్రియలు చేసినప్పుడు, తలవంపులు తెచ్చుకొనేవారిగా ఉంటాము.
నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవించేవారు. అనగా నీవు ఏ సందర్భములో నీవు విశ్వాసముతో నిలబడి ఉంటావో, ఆ సందర్భములో ఖచ్చితముగా నీ తల ఎత్తబడుతుంది. నీవు సిగ్గుపరచబడవు. నీకు ప్రతిఫలము దయచేయబడుతుంది.
మంచి క్రియలు అంటే ఏమిటి? భూలోకసంబంధమైన క్రియలు కాక, ఆత్మీయ సంబంధమైన ప్రతీదీ మంచిక్రియగా మనము చూడగలము. ప్రతిసారీ, ఆత్మీయమైన జీవితములో వాక్యము చెప్పిన రీతిగా మీరు క్రియలు కొనసాగించినపుడు దాని ప్రతిఫలము అనుభవించేవారిగా ఉంటారు.
ఒక విధముగా చూచితే, మీరు నిందలను బాధలను అనుభవించుటచేత పదిమందిలో ఆరడిపడితిరి; మరియొక విధముగా చూచితే, వాటి ననుభ వించినవారితో పాలివారలైతిరి.౹ ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేప్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి.౹ కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.౹ -హెబ్రీయులకు 10:33-35
ఒక విధములో చూస్తే, పరిచర్య కొరకు ఆస్తిని కోల్పోయినవారుగా ఉన్నదానిని బట్టీ, శ్రమలు అనుభవించినవారిగా ఉన్నారు. అదే మరోకవిధములో, దేవుని పనికొరకు శ్రమను అనుభవించినవారి శ్రమలో పాలు కలిగినవారిగా ఉన్నారు. దానిని బట్టి నీతి కిరీటము ఉంచబడింది అని పౌలు సహితము చెప్పుచున్నాడు. మనము కూడా దేవుని కొరకు శ్రమ అనుభవించినప్పటికీ, మనకు కూడా ప్రతిఫలము ఉంటుంది అని మనము గ్రహించగలము.
ఒక సంఘములో చూస్తే, కొంతమంది చాపలు వేస్తారు, బాత్రూంలు కడిగేవారు, తుడిచేవారు అనేకమైన పనులు చేస్తారు. అయితే వారి పని గుర్తించబడలేని నిరాశలో ఉన్నవారు ఖచ్చితముగా నిశ్చింతగా ఉండవచ్చు, ఎందుకంటే, నీ దేవుడు ఖచ్చితముగా ప్రతిఫలము ఇచ్చేవాడుగా ఉన్నాడు.
పేతురు ఇదిగో–మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను–నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తలి దండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. -మార్కు 10:28-30
ఈ వాక్యమును బట్టి, పరసంబంధమైన ఆశీర్వదమూ,ఇహసంబంధమైన ఆశీర్వాదమూ ఖచ్చితముగా దేవుని నిమిత్తము, దేవుని సువార్త నిమిత్తము త్యాగపూర్వకమైన పని చేసిన ప్రతివారికీ నూరంతల ప్రతిఫలము తీర్మానము చేయబడింది. దేవుని కొరకు నీవు చేసే ప్రతీ పనికి ఈ పరలోకములోనే కాక, భూలోకములో కూడ ప్రతిఫలము దయచేసేవాడు నీ దేవుడు. అందుకే దేవుని పని కొరకు నీవు సిద్ధపడే వారిగా మనము ఉందాము.
మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.౹ -హెబ్రీయులకు 6:10
ఆత్మీయమైన జీవితములో మనము ఏమి చేసినా అది ప్రభువుకు చేసినట్టే! ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టినప్పుడు అది దేవునికి పెట్టినట్టే అని దేవుడు చెప్పుచున్నాడు. అలాగే మనము “పరిశుద్ధులు” అనగా “సంఘము” నకు చేసిన ప్రతీ ఉపచారము దేవునికి చేస్తున్నట్టే అని మనము అర్థము చేసుకోవాలి. తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు. నీవు చేసినదానిని మరచిపోడు గానీ నీకు న్యాయము చేస్తాడు. ఏమి సమర్పించి మీరు పరిచారము చేసారో ఆ విషయములో మీకు సమృద్ధి కలుగచేస్తాడు. నీవు చేసిన పరిచర్యను బట్టి మందిరము కొనసాగించబడుతుంది, దానిని బట్టి నీవు కొనసాగించునట్లు దేవుని హస్తము నీకు తోడుగా ఉండి నడిపించేవాడుగా ఉంటాడు. అందుకే వాక్య సంబంధమైన క్రియల చేత మనము మన జీవితములను సిద్ధపరచుకుందాము.
అతడు–నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసికొనిపోయెను.౹ ఏశావు–యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పి–నాకొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా అని అడిగెను.౹ -ఆదికాండము 27:35-36
ఇవి యాకోబు గూర్చిన మాటలు. యాకోబు ఏశావును, ఇస్సాకును మోసము చేసినవాడుగా ఉన్నాడు. మోసపూరితమైన క్రియలతో తన జీవితాన్ని కట్టుకున్నాడు.
మీ తండ్రి నన్ను మోసపుచ్చి పది మార్లు నా జీతము మార్చెను; అయినను–దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.౹ -ఆదికాండము 31:7
యాకోబు రెండుసార్లు మోసం చేసాడు, అయితే యాకోబు పదిసార్లు మోసగించబడ్డాడు. మనము శ్రద్ధగా ఆలోచిస్తే, చేసిన క్రియలకు ప్రతిఫలము చేసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. మంచి క్రియ అయినా సరే ఎక్కువగా ప్రతిఫలమును పొందేవారిగా ఉంటాము. మన జీవితము కూడా అదే రీతిగా ఉంటుంది. మనము చేసిన ప్రతి క్రియకు ప్రతిఫలము మనము అనుభవించవలసినదే. అయితే దేవుని ప్రేమ, కృపను బట్టి ఆ కలువరి సిలువలో వెల చెల్లించాడు. అప్పుడు చెప్తున్నాడు నీ తండ్రి ఇంటికి వెళ్ళమని చెప్పుచున్నాడు.
అప్పుడు యెహోవా–నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా -ఆదికాండము 31:3