02-04-2023 ఆదివారం మొదటి ఆరాధన – మట్టల ఆదివారము

స్తోత్ర గీతము 1

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య

నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో

ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య

ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య

స్తోత్ర గీతము 2

హోసన్నా హోసన్నా
హోసన్నా మహోన్నతుడు
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
ప్రభావము రారాజుకే

కీర్తి కీర్తి
కీర్తి రారాజుకే
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
ప్రభావము రారాజుకే

మహిమ మహిమ
మహిమ రారాజుకే
దేవా నీ నామము ఉన్నత నామము
కృతజ్ఞత స్తుతులు నీకే
ప్రభావము రారాజుకే

స్తోత్ర గీతము 3

యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు
ఆయన కృప నిత్యముండును (2)
ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు (2)
యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు
యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు
జై జై యేసు రాజా – జయ యేసు రాజా (4)
||యెహోవా||

సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే
మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే (2)
||యెహోవా నాకు||

దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనే
విలువైన రక్షణలో నను కడ వరకు నడిపించు వారాయనే (2)
||యెహోవా నాకు||

ఆరాధన వర్తమానము

మన దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మనకు తోడుగా ఉన్నట్టయితే దేనికీ కూడా మన మీద అధికారము లేదు. అయితే ఈ సత్యము నీవు ఎరిగినప్పుడు నీవు దేనికీ భయపడవు. మన దేవుడు చేయి విడువని దేవుడు.

దహనబలులుగా గొఱ్ఱెమేకల పిల్లలను నాయొద్దకు తేలేదు నీ బలులచేత నన్ను ఘనపరచలేదు నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు. నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు నీ బలి పశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తిపరచలేదు సరే గదా. నీ పాపములచేత నీవు నన్ను విసికించితివి నీ దోషములచేత నన్ను ఆయాసపెట్టితివి. -యెషయా 43:23-24

మన వ్యక్తిగతమైన జీవితాలు ఆయనకు మహిమకరముగా లేనప్పటికీ, ఆయను తృప్తిపరచే విధానములో లేనప్పటికీ, ఆయన ప్రేమ ఎలా ఉందో మనము తెలుసుకోవాలి. మన జీవితాలు పాపములతో ఆయనను ఆయాసపెట్టినప్పటికీ, ఆయన మంచితనము మన పట్ల ఎలా ఉందో చూస్తే,

నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము లను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను. -యెషయా 43:25.

మనము ఒక పందికి స్నానము చేసి అలంకరించినా సరే ఎలా అయితే అది తిరిగి మురికి గుంటలవైపే వెళుతుందో, అలాగే మనముకూడా పాపపు గుంటలవైపే వెళ్ళే జీవితము కలవారమైనప్పటికీ, మన అతిక్రమములను తుడిచివేసే ప్రేమ కలిగినవాడు మన దేవుడు.

దేవుడు గనుక మన పాపములను జ్ఞాపకము చేసుకుంటే మన జీవితము ఆయన ఉగ్రతలో నశించిపోయేవారమే. ఆయన ప్రేమను రుచిచూసిన తరువాత కూడా ఆయనను విడిచిపెట్టి పాత పాపముల వైపే వెళ్ళిపొయినప్పటికీ ఆయన మనము ప్రేమించుట మానలేదు.

–నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి. -లూకా 19:42

ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే సత్యము ఈరోజైనను నీవు తెలుసుకొంటే, అది నీకెంతో మేలు. “నేను నేనే నా చిత్తప్రకారము” అని ఆయన అంటున్నాదు అంటే, ఆయన చిత్తములో నీవున్నావు.

ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.౹ -రోమా 8:29

క్రీస్తు మాత్రమే దేవునిని తృప్తిపరచాడు. మనము దేవుని సంతోషపెట్టాలి అంటే మనము కూడా క్రీస్తు వలే మారిపోవాలి. క్రీస్తు యొక్క సారూప్యత మనము ధరించుకున్నప్పుడు మాత్రమే దేవునిని మనము తృప్తిపరచేవారిగా అవుతాము. మనము ఎన్నిక చేయబడ్డాము. అందుకే నీవెంటే ఆయన వస్తున్నాడు. అనాదికాలములోనే నీవు నిర్ణయించబడ్డావు. ఎప్పుడైతే క్రీస్తు సారూప్యతను ధరించుకున్నప్పుడు దేవుని పని నిమిత్తము నీ జీవితములో ఆయన చిత్తము నెరవేరుతుంది.

రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. -యెషయా 59:1-2

రక్షణ యెహోవాది ఆయన ఆశీర్వాదము నీది. క్రీస్తు సారూప్యత ధరించుకొనుట మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. నీ చుట్టూ ఉన్న సమస్త పరిస్థితులనూ మార్చగలగిన శక్తి నీ దేవునికి ఉన్నప్పుడు, నిన్ను మార్చగలిగిన శక్తి నీ దేవునికి లేదా? దీన దరిద్రులు నీళ్ళకొరకు వెతుకుతున్నారు అయితే వారికొరకు నదులనే పారచేసేవాడుగా మన దేవుడు ఉన్నాడు.

రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు. -కీర్తనలు 95:7

నా జీవితము నీకు మహిమకరముగా లేనప్పటికీ, నీ చిత్తము నా జీవితములో జరిగించడానికి ఇష్టపడుతున్నావు. కనుక నా జీవితమును మార్చగల సమర్థుడవని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను అని నీవు చెప్పగలిగితే, ఈరోజు మనస్పూర్థిగా ఆయనను ఆరాధించు.

ఆరాధన గీతము

నీవే నా రక్షణ – నీవే నిరీక్షణ
నీవే నా దీవెన – నీవే క్షమాపణ (2)
యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా
యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా (2)|
|నీవే నా||

గతమును మన్నించి గుణవంతునిగా చేసి
నన్ను మలచి నన్నే మరిపించి (2)
మనిషిగా మార్చినావు
నీ మనసు నాకిచ్చినావు (2)
||యేసయ్యా||

కన్నీరు తుడచి కష్టాలు తీర్చి
అండగ నిలిచి అడ్డులన్ని తొలగించి (2)
మనిషిగా మార్చినావు
మాదిరిగ చేసినావు (2)
||యేసయ్యా||

నీవే నా రక్షణ – నీవే నిరీక్షణ
నీవే నా దీవెన – నీవే సమస్తము (2)
యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా
యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా (2)|
|నీవే నా||

 

 

వారము కొరకైన వాక్యము

ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి –నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి. -లూకా 19:41-42

ప్రభువు ఏ సందర్భములో ఈ మాటలు చెప్పాడో మనము చూసినట్టయితే –

ఆయన ఒలీవలకొండదగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు, తన శిష్యుల నిద్దరిని పిలిచి –మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు; దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైననుమీరెందుకు దీని విప్పుచున్నారని మిమ్ము నడిగినయెడల–ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడినవారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులు–మీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారి నడిగిరి. అందుకు వారు–ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్లమీద తమ బట్టలువేసి, యేసును దానిమీద ఎక్కించి, ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగునపరచిరి. ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు –ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా శబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు–బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి–వీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి -లూకా 19:29-41

ఈ భాగమంతా ప్రభువు కొరకు గాడిద పిల్ల సిద్ధపరచబడిన సంగతి, దాని మీద ఆయన ఎక్కి యెరుషలేమునకు సమీపించడము అనే సంగతులు చూస్తాము. అయితే ఎందుకు ప్రభువు ఏడ్చాడు? ఒక మాట ఆయన చెప్తున్నాడు – “ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు”.

అనగా ఎందుకు యేసుప్రభువు యెరుషలేములోనికి అడుగు పెట్టాడు? అనే సంగతి వారికి తెలియట్లేదు. ఆ సమయములో కొంతమంది ప్రభువు చేసిన అద్భుతముల గురించి దేవునిని మహిమ పరచారు. మరికొంతమంది శిష్యులను గద్దించమని యేసుకు చెప్తున్నారు. అయితే మట్టల ఆదివారము యొక్క ఉద్దేశ్యము పాపము నుండి విడుదల కొరకైన సిద్ధపాటు. నీ మీద ఉన్న పాపపు పత్రపు వెల చెల్లించుటకొరకైన సిద్ధపాటు. నీ విడుదల కొరకైన సిద్ధపాటు.

(ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతోకూడ నిన్ను నేల కలిపి నీలో రాతిమీద రాయి నిలిచియుండనియ్యని దినములు వచ్చునని చెప్పెను. -లూకా 19:43-44

ప్రభువు ఈ దినమందు కూడా తన పరిశుద్ధవాక్యము ద్వారా దర్శించేవాడుగా ఉన్నాడు. అయితే ఆయన దర్శించుకాలము మనము ఎరగలేని స్థితిలో ఉంటే అది ఎంతో దుఃఖకరము. మనము ఆత్మలో కట్టబడాలి అనేది దేవుని కోరిక. ప్రభువును విశ్వసించినపుడు మనలోనుండి జీవధారలు బయటకొస్తాయి. అయితే ప్రభువు దర్శించుకాలము మనము ఎరగనప్పుడు మనలో బయలుదేరవలసిన జీవ ధారలకు అడ్డుకట్ట వేయబడుతుంది.

నశించినదానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభువు వచ్చాడు అనే సంగతి నీవు ఎరిగినప్పుడు నీవు సంతోషముతో ప్రభువును స్తుతిస్తావు. అలాకాని యెడల దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన మాటలు నీ నోటినుండి బయలుదేరతాయి.

ప్రభువు నిన్ను దర్శించిన సంగతి నీవు తెలుసుకున్నట్టయితే, నీ జీవితములో శత్రువు నీ మార్గములో అడ్డుగా నిలువలేడు. ప్రభువును మరియను కనుగొన్నాడు, దావీదును కనుగొన్నాడు ఈరోజు నిన్ను కూడా కనుగొన్నాడు. అయితే మరియ, దావీదుల హృదయము దేవుని మాటలను అంగీకరించే హృదయము. మనము కూడా అంగీకరించే హృదయము మనకు కూడా ఉంటే మనముకూడా వారివలే దేవుని మహిమపరచే వారిగా మనము కూడా ఉంటాము.

ఆరోజులలో దేవదూతల దర్శనము కలిగింది. అయితే ఈరోజు దేవుని చిత్తమంతా మనకు ఆయన పరిశుద్ధ గ్రంథము ద్వారా ఇవ్వబడింది. అలాగే తాను ఎర్పరుచుకున్న సేవకులే దేవుని దూతలవలే ఆయన నియమించాడు. వారి ద్వారా, మరియు నీ వద్దకు వచ్చే వాక్యము ద్వారా నిన్ను దర్శించినప్పుడు నీవు అంగీకరించే మనసు నీవు కలిగి ఉండాలి. అప్పుడు నీవు నిర్లక్ష్యము చేయవు.