02-03-2025 – ఆదివారం మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

ఈ దినము దేవునిని స్తుతించడానికి దేవుని సన్నిధికి మనము వచ్చాము, ఆయనను మహిమపరచడానికి ఆయన సన్నిధికి వచ్చాము. స్తుతించడము ద్వారా ఏమి జరుగుతుంది? అపవాది పారిపోతాడు. మన జీవితములను అపవాది పట్టుకొని వేలాడుతున్నపుడు, నీవు స్తుతించునపుడు ఆ అపవాది పారిపోతాడు.

మనమందరము దేవుని స్తుతించడానికి ఏర్పరచబడ్డాము. ఆ రీతిగా ఆయనను స్తుతించడానికి ఆయనే మనలను నడిపించాడు. ఆయనను స్తుతించడానికి అవసరమైన సత్యము ఆయన ఈ దినము మనకు బోధించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆయనను స్తుతించకుండా అనేకమైన ఆటంకాలు పెట్టడానికి అపవాది ప్రయత్నిస్తాడు, గనుక మనము జాగ్రత్త కలిగి ఉండాలి.

దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి. -కీర్తనలు 29:1-2

మనలను సృష్టించినది, మనకు కావలసిన సమస్తము సిద్ధపరచినది ఆయనే!

ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు కారా? -మత్తయి 6:26

ఆకాశ పక్షులను పోషించే దేవుడు తన పిల్లలమైన మనలను ఖచ్చితముగా పోషిస్తాడు. మనకు కావలసినది ఆయనే మనకు దయచేస్తాడు.

మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె–మన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.౹ -అపొస్తలుల కార్యములు 17:28

మన దేవునిని బట్టే మనము జీవిస్తున్నాము, జీవితానికి అవసరమైన సామర్థ్యము పొందేవారముగా ఉన్నాము.

అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జి తముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు. ఇదియును దేవునివలన కలుగునని నేను తెలిసి కొంటిని.౹ -ప్రసంగి 2:24

చిన్న పిల్లలను చూస్తే, మొదట పాలు తాగుతాడు, తరువాత కొంచెము బలమైన ఆహారము తీసుకొంటాడు. ఎదిగే కొద్దీ, ఆహారము పెరుగుతుంది. ఆకాశ పక్షిని చూస్తే, అది అనేకమైన ప్రదేశములు తిరుగుతుంది. అది పండించదు, కోసుకోదు, దాచుకోలేదు. అయినప్పటికీ దేవుడే దానికొరకు అవసరమైనది సిద్ధపరచాడు. అలాగే నీకు ఏ సమయములో ఏది అవసరమో, అది నీకొరకు దయచేస్తాడు.

చిన్నపిల్లలు పాలు తాగే వయసులో అవసరమైన పాలు కూడా దేవుడే సిద్ధపరుస్తున్నాడు. అసలు పాలు తాగాలి అనే ఆలోచన పుట్టించిందే దేవుడు. నీ జీవితములో నీ మేలు కొరకైన ఆలోచనలు పుట్టించేదే దేవుడు.

పాలు విడిచిన తరువాత, కొంచెం ఘనపదార్థము తినడము ప్రారంభిస్తాడు. అలా ఎదిగే కొద్దీ, ఏ ఆహారము అవసరమో, అదే ఆహారము దేవుడు సమకూరుస్తాడు. అలాగే ఈ దినము నీకున్న అవసరమును బట్టి నీ దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు. నీ జీవితము వర్థిల్లే కొలదీ నీకు పెరిగే అవసరములు తీరుటకు కావలసిన సామర్థ్యము ఖచ్చితముగా నీ దేవుడు నీకు దయచేస్తాడు. అలా నీకు అవసరమైన రిసోర్సెస్ కూడా దయచేస్తాడు.

అప్పుడు వారు–ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. -లూకా 24:32

నీవు ఎదుగుచుండగా నీ ఎదుగుదలకు అవసరమైన సమస్తము నీకు దయచేసేవాడు నీ దేవుడు. నీ హృదయము గనుక వాక్యము బోధించుచున్నపుడు నీ హృదయము స్పందిచుటలేదు అంటే, ఏదో సమస్య ఉంది. మన దేవుడు మనకు సిద్ధపరచేవాడుగా ఉన్నాడు. మనము ఏమై ఉన్నామో అది ఆయన వలననే అయి ఉన్నాము. ఆయన వలననే మనము జీవము కలిగి ఉన్నాము. నీవున్న స్థితిలోనే నిన్ను వదిలిపెట్టడు నీ దేవుడు.

యాకోబు సంతతీ, తప్పక నేను మిమ్మునందరిని పోగు చేయుదును, ఇశ్రాయేలీయులలో శేషించినవారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొఱ్ఱెలు కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేతస్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు.౹ -మీకా 2:12

పౌలు సీలలను భయంకరముగా కొట్టి బంధించారు. అటువంటి పరిస్థితిలో వారు దేవునిని స్తుతించి, మహిమపరచారు. దానికి కారణము ఏమిటి? దేవుని గూర్చిన సత్యము వారు ఎరిగినవాడుగా ఉన్నాడు. ఓడ బద్దలై ద్వీపములో చిక్కుకున్నపుడు, విష సర్పము కాటువేసినపుడు కూడా సత్యమును నమ్మినవాడుగా పౌలు నిలబడ్డాడు. దానికి కారణము, యెరుషలేములో సాక్ష్యమిచ్చిన నీవు రోమాలో కూడా నీవు సాక్ష్యమివ్వాలి అని దేవుడు చెప్పాడు. గనుక అక్కడికి వెళ్ళేవరకు ఏ ఆటంకము అడ్డురాలేదు.

ఈ దినము దేవునిని స్తుతించడానికి దేవుడు మనకు అవకాశము ఇచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చిన మనము ఖచ్చితముగా ఆయననుండి పొందుకోనే వెళతాము. అయితే మనము దేవుని సన్నిధిలో ఉన్నాము అనే సత్యము గ్రహించాలి.

నీ శ్రమకంటే నీ దేవుడు గొప్పవాడు. అటువంటి గొప్ప దేవుడిని కలిగి కూడా మనము అపవాది పెట్టిన ఉచ్చులో, శ్రమలో చిక్కుబడి నిరాశగా ఉండటము ఎంతో బాధాకరము. ఈ లోకమును జయించినవాడు నీలో ఉన్నాడు అనే సత్యము నీవు ఎరిగి ఉండాలి. నీవు శ్రమలో ఉన్నాసరే మౌనముగా ఉండక, ఆయనను స్తుతించు!

ఈ దినము పరిశుద్ధపరచే దినము, నియమించబడిన దినము. మన జీవితములో అపవాదిచే బంధించబడిన పరిస్థితిని విడిపించడానికి నియమించబడిన దినము. మనము ఆయన మహిమకొరకు సృష్టించబడ్డాము, నియమించబడ్డాము.

మన పితరులు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క స్తుతిని ఆయుధముగా కలిగి వెళ్ళేవారు. “యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును” అని వారు స్తుతిస్తూ వెళ్ళుచుండగా, దేవుడే వారికొరకు కార్యములు జరిగించినవాడుగా ఉన్నాడు.

ఈ దినము స్తుతించడానికి ఇవ్వబడింది, మరలా 7 దినములు నీవు వేచి ఉండాలి అనే ఆలోచన ఆశ నీవు కలిగి ఉంటే, నీ ఆశ వేరుగా ఉంటుంది.

యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది. -కీర్తనలు 29:4

ఆయన స్వరము, బలము, ప్రభావము ఏమి చేయగలవో నీవు ఎరిగి ఉంటే, నీవు స్తుతించుట మానవు, నీ స్తుతి ఆచారయుక్తముగా ఉండదు గానీ, యదార్థముగా ఉంటుంది.

యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. -కీర్తనలు 29:5

దేవదారు వృక్షములు ఎంతో బలమైనవి. అటువంటి వాటిని సహితము తన స్వరము చేత విరుగగొట్టగలవాడు నీ దేవుడు. అటువంటి నీ దేవుని స్వరము, నీకు అడ్డుగా ఉన్న దానిని విరుగగొట్టగలిగిన బలము కలిగినది. అవసరమైతే నీ కొరకు, నిన్ను తృప్తిపరుచుటకు నూతనముగా అవకాశము సృష్టించగలవాడు నీ దేవుడు.

అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవాదూత పరలోకమునుండి–అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు–చిత్తము ప్రభువా అనెను.౹ అప్పుడు ఆయన–ఆ చిన్నవానిమీద చెయ్యివేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్న దనెను.౹ అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములుతగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుకతట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను.౹ -ఆదికాండము 22:10-13

నీవు దేవుని ఎంతగా నమ్మితే అంతగా గొప్పకార్యములు నీవు అనుభవిస్తావు. అప్పటివరకు అక్కడ పొట్టేలు లేదు గానీ, దేవుడు చెప్పగానే, అక్కడ పొట్టేలు కనపడింది. ఈ సత్యము నీవు గ్రహిస్తే, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అని చెప్పగలుగుతావు. వాక్యమును నీ జీవితములో పోనివ్వవు. ఆత్మీయ నిర్లక్ష్యము చేత మనము వాక్యమును పోగొట్టుకొనేవారముగా ఉంటున్నాము. అలా ఉండకూడదు.

కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము. -కీర్తనలు 20:7

అపవాది మనలను ఒంటరిగా చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. ఎలా అంటే, నేను ఒంటరిని అనే ఆలోచన పుట్టించి నిన్ను ప్రలోభపెడతాడు. అయితే నీ దేవుని గూర్చిన సత్యమును ఎరిగిన నీవు మాత్రము, ఆయనను బట్టి ఖచ్చితముగా నేను లేచి నిలబడతాను అనే నమ్మకముతో నేను ఒంటరిని కాదు అని ప్రకటించాలి.

ఆరాధన గీతము

ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా

వారము కొరకైన వాక్యము

ఈ దినము హృదయాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి అని మనము నేర్చుకుందాం. ఆత్మీయ జీవితము అనుభవముతో కూడినదై ఉండాలి. సంవత్సరములు గడుస్తున్నాయి గానీ, మనలో మార్పు మాత్రము కనపడని స్థితిలో ఉండిపోతున్నాము, మనము కలిగిన ఆత్మీయ అనుభవము యొక్క బలము సరిపోవట్లేదు. ప్రభువు కొరకైన సైన్యముగా మనము ఉండాలి, ఆయన కొరకు యుద్ధము చేయగల వారిగా మనము ఉండాలి.

సైన్యము దేశ సరిహద్దులలో ఉంటారు, వారు బ్రతికి ఉండగా శత్రువు ప్రవేశించలేడు. అది సైన్యము యొక్క ప్రత్యేకత. అటువంటి ఆత్మీయ సైన్యముగా మనము సిద్ధపడాలి. ఇది దేవుని సమయము, ఆ సమయములో నీవు సిద్ధపడి ఉంటే నీవు అవకాశము పొందుకుంటావు.

అయితే రుచి చూసి మాత్రమే నీవు దేవుడు నాకు కావాలి అని చెప్పగలుగుతావు. అది ఆత్మీయ అనుభవము కలిగి ఉంటేనే అది సాధ్యపడుతుంది.

నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. నేను ఏమియు మాటలాడక మౌనినైతిని క్షేమమునుగూర్చియైనను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయెను. -కీర్తనలు 39:1-2

భక్తి హీనులతో మనము ఉన్నపుడు, వారితో కలిసి నాలుకతో పాపము చేయకుండునట్లు జాగ్రత్తపడాలి. అప్పుడు మన ఆత్మీయ జీవితము ఒక బలమైన కోటగా ఉంటుంది. గనుక, నీవు ఆత్మీయముగా బలము కలిగి ఉండునట్లు సిద్ధపడాలి.

అప్పుడు వారు–ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. -లూకా 24:32

దేవుని వాక్యము వింటున్నపుడు నీ హృదయము మండకపోతే, నీ హృదయములో ఎదో అడ్డుగా ఉన్నది . వాక్యము వినుట మాత్రమే అయితే అది కేవలము పునాది మాత్రమే, అయితే ఆ ప్రకారముగా నడిచినపుడే గృహముగా కట్టబడతావు.

చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది -యెషయా 60:2

లోకములో చీకటి కమ్ముకొనుచుండగా నీవే వెలుగుగా వారి మధ్య నీవు సిద్ధపడాలి అని దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. దేవుని వాక్యము నీవు వినుచుండగా నీవు చేసినదానిని బట్టి నీకు అసహ్యము పుడుతుంది అంటే, నీ హృదయము మండుచున్నది అని అర్థము.

కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను.౹ -ఎఫెసీయులకు 1:8

మన యెడల కలిగిన ఆయన ఏర్పాటు కాలము సంపూర్ణమైనపుడు తెలియచేయబడుతుంది. వాక్యము నీకు వెల్లడి పరుస్తున్నపుడు, ఆ వాక్యము ప్రకారము నీ హృదయము సిద్ధపరచాలి, పాపము విషయమై నీ హృదయములో అసహ్యము కలగాలి.

ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు. -2 కొరింథీయులకు 1:22

మన హృదయములో పరిశుద్ధాత్ముడు నివాసము ఉండాలి. తండ్రి, కుమార పరిశుద్ధాత్ములు ఏకమై ఉంటారు. అయితే వారు జరిగించే కార్యములు మాత్రము వేరుగా ఉంటాయి.

లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును.౹ -యోహాను 14:17

నీ హృదయములలో నివసించవలసిన ఆత్మ, నీలోనుండి బయటకు వచ్చి, మనతో ఉంటున్నాడు అంటే, నీ హృదయము నివాసయోగ్యముగా లేదు. మరలా దానిని సరిచేయడానికి నీతో ఉంటూ వాక్యము ద్వారా పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింపచేస్తాడు.

ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.౹ -రోమా 5:5

పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, దేవుని యొక్క ప్రేమ నీ హృదయములో కుమ్మరించబడుతుంది.

అదేమని చెప్పుచున్నది? – వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే.౹ -రోమా 10:8

ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.౹ -హెబ్రీయులకు 4:12

వాక్యము నీ హృదయములో ఉంటే, నీ హృదయమును సరిచేస్తుంది, సిద్ధపరుస్తుంది, కార్యము జరిగిస్తుంది. వాక్యము అనగా క్రీస్తే! పరిశుద్దాత్ముడు క్రీస్తు చెప్పిన మాటల ప్రకారము పనిచేస్తాడు. అనగా నీవు హృదయములో వాక్యము కలిగి ఉంటే, ఆ ఉన్న వాక్యమును బట్టి పరిశుద్ధాత్ముడు నీ జీవితములో పనిచేస్తాడు.

ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే.౹ -1 తిమోతికి 1:5

పైకి బాగానే ఉంటారు గానీ హృదయములో మాత్రము వేరుగా ఉంటారు. గనుక చాలా జాగ్రత్తగా మనము హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. పైకి ఒకలా, లోపల వేరుగా ఉండకూడదు. హృదయము మండినవాడు సాధారణమైనవాడు కాదు.

దాసులారా, యథార్థమైన హృదయముగలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకువలె, శరీర విషయమై మీ యజమానులైనవారికి విధేయులై యుండుడి.౹ -ఎఫెసీయులకు 6:5

పవిత్రమైన హృదయము, యదార్థమైన హృదయము మనము కలిగి ఉండాలి. దేవుడే నీకు యజమానుడు గనుక, ఆయన యెడల నీవు భయము కలిగి ఉండాలి. అప్పుడు నీవు ఆయన యెడల విధేయత కనపరుస్తావు.

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. –నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు.౹ -యిర్మీయా 17:5

మన హృదయము గనుక ఆయనను కలిగి ఉండకపోతే, మనము శాపగ్రస్తులుగా అయిపోతాము. ఆయననుండి మన హృదయము తొలిగిపోతే శాపగ్రస్తులుగా అయిపోతాము.

ఈ ప్రజలు కన్నులార చూచి చెవు లార విని మనసార గ్రహించి నావైపు తిరిగి నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మంద ముగా విని కన్నులు మూసికొనియున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీపితరులతో చెప్పిన మాట సరియే.౹ -అపొస్తలుల కార్యములు 28:27

ప్రభువు మనతో మాటలాడుచుండగా, అంగీకరించే మనసు మనము కలిగి ఉండాలి. తగ్గింపు స్వభావము కలిగి ఉన్న హృదయముగా ఉండాలి.