ఆరాధన వర్తమానము
మన దేవుడు నిత్యము స్తుతింపదగినవాడు. ఆయన స్తుతుల మధ్యలో నివాసముండేవాడు. పరలోకములో కూడా దేవదూతలు, ఇరవై నాలుగు పెద్దలు నిత్యము స్తుతించేవారుగా ఉన్నారు. పరలోకములో జరిగే ఆయన చిత్తము, భూలోకములో కూడా జరిగించబడాలి. ఆయన పరలోకములోనే కాకుండా ఈ భూమిపై నీ జీవితములో, నా జీవితములో కూడా జరిగించబడాలి.
ఎప్పుడైతే మనము దేవుని చిత్తము నెరవేరుతుంది అని మనము నమ్ముతామో, అప్పుడు ఆ చిత్తము నెరవేర్చుటకు, ఆయన తన శక్తిని నీ జీవితములో కనపరుస్తాడు.
దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలములమీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప జేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదలించును యెహోవా కాదేషు అరణ్యమును కదలించును యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నియు ఆయనకే ప్రభా వము అనుచున్నవి. -కీర్తనలు 29:1-9
ఇక్కడ యెహోవా స్వరము యొక్క బలము గూర్చి అనేకమైన మాటలు వ్రాయబడ్డాయి. అందులో అరణ్యము అనేది, ఏ సహాయము అందలేని పరిస్థితిని సూర్చిస్తుంది. అటువంటి పరిస్థితిలో దేవుని స్వరము అనగా ఆయన మాటలు లేదా ఆయన వాక్కు, విడుదల అయినపుడు, ఆయన శక్తి నీ పరిస్థితిలో సహాయము కలుగచేసేదిగా ఉంటుంది.
ఆయన సన్నిధిలో ఉన్న మనము, ఆయన సన్నిధికి నడిపించబడిన మనము ఒక సత్యమును గ్రహించాలి. ఆయన సన్నిధిలో ఉన్న సమస్తము ఆయనకే మహిమ చెల్లించుచున్నవి. మనము కూడా ఆయన సన్నిధిలో ఉన్నాము గనుక, మనము కూడా ఆయనకు మహిమ చెల్లించాలి. ఆయన వాక్కు వినిపించబడునట్లుగా నీవు ఆయన సన్నిధిలో ఉన్నావు. ఆయన స్వరము వినబడే ప్రతి చోట ఆయన శక్తి విడుదల అవుతుంది.
యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. -కీర్తనలు 100:3
మనలను పుట్టించింది ఆయనే, మనలను చేర్చుకున్నది ఆయనే, మనలను పోషించేది ఆయనే. ఈ దినము ఆయనను కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులము. మన పుట్టుక గూర్చి ఆలోచిస్తే, భయము ఆశ్చర్యము కలుగుతుంది అని వాక్యము చెప్పుచున్నది. అప్పుడు మన జీవితము కూడా ఆశ్చర్యకరమైన రీతిలోనే ఉంటుంది. నీ పుట్టుకలోనే దేవుని యొక్క శక్తి, జ్ఞానమును కనపరిచాడు. ఒక్కమాటలో చెప్పాలి అంటే, నీ పుట్టుక సూపర్ నేచురల్, ఆయన బిడ్డగా నీవు చేయబడటము సూపర్ నేచురల్ అలాగే నీవు పోషించబడటము కూడా సూపర్ నేచురల్.
యేసు క్రీస్తు ప్రభువు మర్మమై ఉన్నాడు, ఆయన కనిన బిడ్డలమైన మనము కూడా మర్మమై ఉన్నాము. నిన్ను శ్ర్ష్టించిన దేవుడు ఏమై ఉన్నాడో నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను సత్యముతో ఆరాధించగలుగుతావు. మానవుని జ్ఞానము అనుసరించి మన జీవితములో ఏమీ జరగదు, కానీ దేవుని సూపర్ నేచురల్ విధానములోనే నీ జీవితము నడిపించబడుతుంది, అది దేవుని ప్రేమ!
నీవు పరలోక సంబంధివి అనే సత్యము నీవు ఎరిగి ఉంటే, నీవు జీవించే విధానము మారిపోతుంది. అయితే మనలో ఏ లక్షణములు ఉన్నాయి అని మనకు ఈ సూపర్ నేచురల్ రిసోర్సెస్ ఇవ్వబడుతున్నాయి? యేసయ్య మాత్రమే మన అర్హత. యేసయ్యను బట్టే మనకు ఈ ధన్యత.
మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. -రోమా 8:30
ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను, నీతిమంతులుగా తీర్చినవారిని మహిమ పరచెను. అనగా నీవు సూపర్ నేచురల్ కొరకు నిర్ణయించబడ్డావు, పిలువబడ్డావు, సిద్ధపరచబడ్డావు.
నీవు వాక్యమును గ్రహిస్తే, ఆ గ్రహించిన దానిని బట్టే నీ జీవితమును తీర్చేవాడిగా నీ దేవుడు ఉన్నాడు. సూపర్ నేచురల్ అనగా నీ శక్తి చేత కాదు గానీ, నీ జ్ఞానము చేత గానీ జరిగేది కాదు. అది దేవుని శక్తి చేత స్థిరపరచబడేది. నీ జీవితము సూపర్నేచురల్ గా ఉండటానికి దేవుడు నిర్ణయించాడు, స్థిరపరిచాడు. ఎంత గొప్ప ధన్యత నీకు దొరికిందో కదా!
దేవుని శక్తి నా జీవితములో ప్రత్యక్షపరచబడాలి అంటే, నేను ఈ లోకముతో సంబంధము లేకుండా, మనము మన జీవితమును సిద్ధపరచుకోవాలి. నీకొరకు సూపర్ నేచురల్ సిద్ధముగా ఉంది, దేవుని శక్తి నిన్ను వెంబడిస్తుంది, ఎలాగైనా నీ జీవితములో సూపర్ నేచురల్ జరుగుతుంది. అందుకే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, అందువల్లనే నీ యెదుట ఇత్తడి తలుపులు అడ్డుగా ఉన్నా సరే అవి పగలగొట్టబడాలి.
–నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థల ములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను. -యెషయా 45:2
ప్రతీ అడ్డు తొలగించబడునట్లు దేవుని శక్తి ఇప్పుడు ప్రత్యక్షపరచబడుతుంది. నీ జీవితములో ఉన్న ప్రతీ అడ్డు తొలగించబడుతుంది.
పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. -యెషయా 45:3
పేరు పెట్టి పిలిచాడు అంటే, మనము సృష్టించబడ్డాము మనకు ఒక పేరు పెట్టబడింది. అయితే నీ సృష్టి సూపర్ నేచురల్ అయిఉంది. మన ఊహకు మించి చేయగలిగినవాడినే మనము దేవుడు అని ఒప్పుకొంటాము. ఇంతవరకు నీకు అవసరమైనది, నీవు ఆశించినది రహస్యముగా, కనబడకుండా ఉన్నది, సూపర్ నేచురల్ గా, తన శక్తి చేత నీ యెదుటకు తీసుకొచ్చేవాడుగా నీ దేవుడు ఉన్నాడు.
ఆరాధన గీతము
మేలు చేయక నీవు ఉండలేవయ్యా
వారము కొరకైన వాక్యము
ప్రేమామయుడు, కరుణామయుడు అయిన దేవుడు నీ జీవితమును కోరుకొనేవాడుగా ఉన్నాడు. అపవాది మన జీవితములను బంధించడానికి అనేకమైన ఉచ్చులు బిగించాడు. అయితే మన జీవితమును కోరుకున్న దేవుడు సత్యమును బయలు పరచుటకు ఈ దినమును ఏర్పరచాడు. సత్యము ఏమిటి అంటే,
నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను. -యెషయా 60:1
నీకు వెలుగు వచ్చి ఉన్నది అనే సత్యము నీవు గ్రహిస్తే నీవు దానిని వదలక నీవు పట్టుకొనగలుగుతావు. ఈ దినము వెలుగు యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనకు తెలియట్లేదు గనుకనే మనము అంతగా పట్టించుకోవట్లేదు.
ఉదాహరణకు మనము ఒకరినొకరం స్పష్టముగా చూడగలుగుతున్నాము అంటే కారణం ఏమిటి? మనము కళ్ళు కలిగి ఉండటము బట్టే అని మనము ఇట్టే చెప్పగలుగుతాము, అయితే చీకటిలో ఉన్నపుడు కూడా చూడగలమా? అంటే మనము చూడగలగాలి అంటే వెలుగు ఎంతో ప్రాముఖ్యము. ఆత్మీయముగా చూసినప్పుడు కూడా, వెలుగు అనేది ఎంతో ప్రాముఖ్యమైనది.
ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.౹ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. -యోహాను 1:4-5
యేసయ్య వెలుగై ఉన్నాడు అని మత్తయిలో కూడా మనము చూడగలము. ఆ వెలుగు ఇప్పుడు మనపైకి వచ్చి ఉన్నది అంటే, ఆ వెలుగు జీవింపచేసేది.
చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది -యెషయా 60:2
నీ పైకి వచ్చే వెలుగు దేనికొరకు అంటే నీ చుట్టూ భూమిపై చీకటి కమ్ముకొంటున్నది. దానిని పారద్రోలడానికి నీపై ఆయన వెలుగు వచ్చి ఉన్నది.
మరల యేసు–నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.౹ -యోహాను 8:12
ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డైవెనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.౹ -యోహాను 3:19
మన పైకి వచ్చిన వెలుగు గ్రహించలేకపోవడానికి కారణము ఏమిటి అంటే, మన క్రియలు చెడ్డవైనందునే! ఏవి క్రియలు మంచి క్రియలు? ఏవి క్రియలు చెడ్డ క్రియలు? ఎలా తెలుస్తుంది? వాక్యము ప్రకారమే, మన క్రియలు వాక్యానుసారముగా ఉంటే అవి మంచి క్రియలు, అవి వాక్య ప్రకారముగా లేకపోతే, అవి చెడ్డ క్రియలు అయి ఉన్నాయి.
అందుకే ప్రభువుకు ఆయాసకరమైనది ఏమైనా ఉందేమో అనే ప్రార్థన మనము యదార్థముగా చేసి, ప్రభువు చూపించినదానిని వదిలిపెట్టేవాడిగా మనము సిద్ధపడాలి.
మరల యేసు–నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.౹ -యోహాను 8:12
యేసయ్యను వెంబడించుట అంటే, వాక్యమును వెంబడించుట. వాక్యము ప్రకారము మనము జీవించినపుడు, ఆయన వెలుగు మనపై నిలిచి ఉంటుంది. ఆ వెలుగు మనలో జీవమును నింపుతుంది. మన జీవితములో చిన్న చిన్న విషయములలో కూడా ఆయనపై ఆధారపడే అలవాటు మనము చేసుకోవాలి. ఎందుకంటే ప్రతీవాని కోరిక తీర్చాలి అనేది దేవునికి ఇష్టము. నీ దేవుడు నీ సంతోషమునే కోరుకుంటాడు అనే సత్యము నీవు ఎరిగితే, నీ జీవితము విధానమే మారిపోతుంది.
అయితే ఈ విషయము నీవు గ్రహించకుండా అపవాది నిన్ను లోకపు ఆశలచేత మభ్యపడుతుంది. అయితే నీ జీవితము లోకములో ప్రకాశించడానికి దేవుడు నీపై వెలుగు ఉదయింపచేస్తున్నాడు. అప్పుడు నీవు దేవుని ప్రియమైన కుమారుడివి అని, కుమార్తెవు అని లోకము యెదుట ప్రత్యక్షపరుస్తాడు.
నేత్రాశ, జీవపు డంబము, గర్వము మొదలైన శరీరాశలు అన్నీ మనము వదిలిపెట్టాలి, వాటి ప్రభావమును జయించాలి. మననుండి ప్రభువు కోరుకొనేది తగ్గింపు హృదయము, వినయము కలిగిన హృదయము. ఎప్పుడైతే అపవాది నిన్ను ప్రలోభపెడుతుందో, అప్పుడు నీవు నీపై ఉన్న వెలుగును ప్రత్యక్షపరచేవాడిగా నీవు వాక్యమునకు లోబడాలి. ప్రభువు సిద్ధపరచే సమస్తము ఎంతో గొప్పగా ఉంటాయి.
అలా మనము లోకములో అపవాది ప్రభావమునకు లోనైనపుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేరేపిస్తాడు. అప్పుడు మనము ఆయన స్వరమును త్రోసేవారిగా ఉండకూడదు గానీ లోబడాలి అప్పుడు రాజులు సహితము నీ వెలుగును చూసి నీ యొద్దకు వస్తారు.
జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రవ్యాపారము నీవైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును. -యెషయా 60:3-5
కుమారులు అనగా స్వాస్థ్యము, అనగా నీకొరకు ప్రభువు సిద్ధపరచినది నిన్ను వెతుక్కొంటూ వచ్చేదిగా ఉంటుంది. ఉప్పొంగే ఆనందముతో నీ జీవితము నిండిపోతుంది. అప్పుడు నీ జీవితము సంతోషముతో నిండిపోతుంది. సముద్ర వ్యాపారము నీవైపు తిప్పబడుతుంది, అంటే దేవుని వెలుగు నీవు కలిగి ఉంటే సంతోషము, సంపద, ఐశ్వర్యము నీవైపు దారి మార్చుకొని వస్తాయి.
పాపము చిక్కుముడి వంటిది, ఒక్క పాపములో అడుగువేస్తే అనేకమైన పాపములు చుట్టుముడతాయి. అయితే దేవుని ఆశీర్వాదములు అలాకాక, ఒకదానితో ఒకటి ముడిపడిఉంటాయి.
