02-02-2025 – ఆదివారం మొదటి ఆరాధన – అడిగినవన్ని పొందుకోవడానికి

ఆరాధన వర్తమానము

మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయము, ఆయనే దుర్గము అనే పాట ద్వారా మనము ఆయనను స్తుతించాము. అయితే మన జీవితము ఒకలా ఉండి, మనము మాత్రము దేవుని మాటలు పలుకుతుంటే అది దేవునికి మహిమకరము కాదు.

ఒకవేళ నిజముగానే మనము ఆయనే ఆశ్రయముగా నిలబడి ఉంటే అది ఎంతో ధన్యకరమైన స్థితి. ఆశ్రయము అనే మాట, మనము ఒక కష్ట పరిస్థితిలో, శత్రువు మనపై దాడి చేయడానికి సిద్ధపడి వాడి ప్రభావము చూపిస్తున్న స్థితిలో వాడే మాట.

నీవు ఏ మాటలు పలుకుతున్నావో, అదే నీ జీవితమై ఉండులాగున జాగ్రత్త పడు.

అపొస్తలుడైన పౌలు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపవలననే అయి ఉన్నాను అని అపొస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు.

అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కు వగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.౹ -1 కొరింథీయులకు 15:10

ఇక్కడ పౌలు తాను ప్రయాస పడ్డాడు అని చెప్పుచున్నాడు. అనగా తన శక్తిని వ్యయపరిచాడు. అయితే పౌలు తనకు అనుగ్రహించబడిన కృప నిష్ఫలము కాలేదు అని చెప్పుచున్నాడు. పౌలు కష్టపడినప్పటికీ, తన కష్టము చేత తానున్న స్థితిలో లేడు గానీ, దేవుని కృపవలననే ఆ స్థితిలో ఉన్నాడు అని చెప్పుచున్నాడు.

మనము కూడా ఈ సత్యము ఎరిగి ఉండాలి. మన కష్టమును బట్టి మనము మన స్థితిని మెరుగుపరచుకోలేము గానీ దేవుని కృపవలననే మన స్థితి స్థిరపరచబడుతుంది. నీవేమై ఉన్నావో అది దేవుని కృపవలననే అనే సత్యము నీవు నమ్మి ప్రకటించాలి.

“నాకు అనుగ్రహించబడిన కృప నిష్ఫలము కాలేదు” అనే మాట చూస్తే, కృప వలన మాత్రమే మనకు క్షేమము కలుగచేయబడుతుంది. మన అందరికీ దేవుని కృప అనుగ్రహించబడింది, ఆ కృప నిష్ఫలము కాదు, నీ స్థితి మార్చబడుతుంది.

యేసు క్రీస్తునందు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప నాలో నిష్ఫలము కాలేదు అనే సత్యము నీవు చెప్పగలగాలి. క్రీస్తునందు ఉన్న ప్రతి వారు నూతనపరచబడ్డారు. గనుక నీవు “క్రీస్తునందు ఉంటే”, దేవుని కృప నిష్ఫలము కాదు.

క్రీస్తునందు ఉండటము అంటే, క్రీస్తు దేనికొరకు ఈ భూలోకమునకు వచ్చాడు? అని ఆలోచిస్తే, పాపము పోగొట్టు నిమిత్తమే ఈ భూలోకములోనికి వచ్చాడు. మన జీవితము నష్టకరమైన, కష్టకరమైన స్థితిలో ఉండటాంకి కారణమే పాపము. నీవు క్రీస్తునందు ఉన్నట్టయితే, నీకు అందించబడే దేవుని కృప, నీ జీవితములో సమస్తము నూతనపరుస్తుంది.

ఒకవేళ నీవు క్రీస్తునందు లేకపోతే, నీకొరకు అందించబడే దేవుని కృప, నిన్ను జీవింపచేసే కృప నిష్ఫలమైపోయి, నీవు పొందవలసిన జీవము పోగొట్టుకొంటావు. గనుక అట్టి దేవుని కృపను మనము పొందకుండా అడ్డువచ్చే పాపమునకు మనము దూరముగా ఉండాలి. అయితే అది ఎలా సాధ్యము? కేవలము వాక్యము ప్రకారము మాత్రమే మనము మన జీవితమును సిద్ధపరచుకోగలుగుతాము.

క్రీస్తునందు ఉన్నప్పుడు పాతవి గతించిపోతాయి, సమస్తము నూతనపరచబడతాయి, అయితే రక్షించబడిన మనము ఈ మాట ఎలా అన్వయించుకోవచ్చు?

కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;౹ -2 కొరింథీయులకు 5:17

దినములు గడుచుచుండగా మన స్థితి మార్చబడుతుంది. నిన్నటి దినమున ముప్పదంతలలో ఉంటే రేపటి దినము అరువదంతలలో ఉంటాము అటుపై నూరంతలలోనికి మనము మార్చబడతాము. అయితే ఇదంతా దేవుడు మనకు అనుగ్రహించిన కృపనుబట్టి మాత్రమే ఇది సాధ్యము అవుతుంది.

ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే! ఆ కృపను బట్టే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అనే అనుభవము మనము కలిగి ఉండగలుగుతాము. వాక్యము మాత్రమే మనలను దేవునికి దగ్గరగా చేస్తుంది. గనుక ఈ దినము మనము జ్ఞాపకము చేసుకోవలసినది ఒక్కటే – “నేను క్రీస్తునందు ఉన్నానా లేదా?”.

మనము ఆశించినది దొరకనపుడు సాధారణముగా మానవ స్వభావము బట్టి, దేవునికి ఆయన సన్నిధికి, వాక్యమునకు వ్యతిరేకముగా మనము దూరమయ్యే స్థితిలోనికి వెళ్ళే ప్రమాదము ఉంది. అయితే అటువంటి ఉచ్చులకు లోబడి దేవుని కృప నిష్ఫలము అయ్యే పరిస్థితిలో ఉండకూడదు. మనము క్రీస్తును పోలి నడుచున్నట్టయితే మనము ఆ కృపను మనము పోగొట్టుకోము, ఆ కృప మనలను నిలబెడుతుంది.

నీ జ్ఞానము బట్టి చూసుకుంటే నీకు అన్నీ మంచిగానే కనబడతాయి. అయితే వాక్యమును బట్టి మాత్రమే నీవు ఏది సరైనదో నీవు గ్రహించగలుగుతావు. వాక్యము మనతో మాట్లాడుతుండగా మన హృదయాన్ని కఠినపరచుకోకూడదు గానీ, ఖచ్చితముగా లోబడాలి. అప్పుడు దేవుని కృప నీవున్న స్థితి గతింపచేసి, నీ స్థితిని మేలు కొరకై నూతనపరుస్తుంది.

దేవుని కృప నాకుంది కాబట్టి ఆ కృప ఖచ్చితముగా నా పాత జీవితమును గతింపచేసి, నూతనపరుస్తుంది – ఆమేన్! దేవుని కృపకు ప్రతిగా ఇవ్వగలిగిన వెల ఏమీ మనవద్ద లేదు, ఈ లోకములో కూడా లేదు.

ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టే, నీవు నశింపక ఉండునట్లు, నిన్ను వెదికి రక్షించాడు. దాని అర్థమేమిటి అంటే, దేవుని కృప నీకు అనుగ్రహించబడింది.

రేపు అనగా 2025లో ఆహాబు ప్రయత్నములన్నీ నీ జీవితములో ఫలింపవు ఆమేన్!

ఆరాధన గీతము

నిను విడిచినను నీవు విడువవు

 

వారము కొరకైన వాక్యము

క్రీస్తుని పోలి నడుచుకోవడానికి నీవు సిద్ధమా? క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాను అని పౌలు చెప్పుచున్నాడు. మరి దానికి మీరు సిద్ధమా?

ఏలయనగా, యేసుయొక్క జీవము కూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము.౹ -2 కొరింథీయులకు 4:11

యేసుయొక్క జీవము మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడుతుంది అనే సత్యము ఎరిగినవాడై క్రీస్తు కొరకు శ్రమపడటానికి కూడా వెనుకాడనివిధముగా సిద్ధపడ్డాడు.

మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైనశ్రమలనుగూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశో ధించిరి.౹ -1 పేతురు 1:10

“క్రీస్తు విషయమైనశ్రమలనుగూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు”, అనగా క్రీస్తు నిమిత్తము శ్రమలు వచ్చినపుడు, వాటి వెంబడి మహిమ కూడా కలుగుతుంది.

ఎప్పుడైతే నీవు విశ్వాసముతో నిలబడి నీవు కొనసాగించబడుతున్నపుడు, అపవాది నిన్ను పడగొట్టడానికి చేసే ప్రయత్నములే నీ జీవితములో శ్రమ. ఆ శ్రమ నిన్ను ఏమీ చేయలేదు గానీ దాని తరువాత మహిమ వెంబడిస్తుంది. గనుక శ్రమను చూసి నీవు భయపడనవసరము లేదు. నీవు అనుభవించిన శ్రమకంటే నీవు రెట్టింపు మహిమ నీవు అనుభవిస్తావు. నీ గిన్నె నిండి పొర్లిపోతుంది.

మన ఆత్మీయ జీవితములో బలముగా ఉండటానికి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. దేవునిని మనము అడిగినది మనము పొందకుండా ఉన్నపుడు, దేవునిని నుండి వెనుకకు వెళ్ళిపోయేవారిగా ఉంటాము. అడిగినవన్నీ మనము పొందుకోవాలి అంటే ఏమి చేయాలి. అసలు అడగటము అంటే ఏమిటి?

అడగటము అంటే, ప్రార్థనలో అడగటము. ఎవరిని అడగాలి అంటే మన పరలోకపు తండ్రిని. అప్పుడు ఆయన మనకొరకు సిద్ధపరచి దయచేస్తాడు.

అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. -మార్కు 11:24

ఎప్పుడైతే నీవు అడిగినది మనము పొందాము అని నమ్ముతున్నావో, అప్పుడు ఆ ప్రార్థన ఫలితము నీ కళ్ళముందు కనపరచబడుతుంది.

ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు–(నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను. -మార్కు 9:22-23

“ఏమైనను నీవలననైతే” ఇక్కడ ఒక ప్రశ్న యేసయ్యను అడుగుతున్నట్టుగా మనము చూడవచ్చు. మన ప్రార్థన కూడా అనేకమైన ప్రశ్నలతో కూడి ఉంటుంది. ఇక్కడ తండ్రి పరిస్థితి చూస్తే

జనసమూహములో ఒకడు– బోధకుడా, మూగదయ్యము పెట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని; అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను. -మార్కు 9:17-18

ఇక్కడ తండ్రి తన కుమారుని జీవితములో జరిగిన పరిస్థితి చూసినవాడై, దానిని బాగుచేయడానికి యేసయ్య శిష్యులవద్దకు తీసుకువెళ్ళాడు. అయితే శిష్యులు అనేకమైన స్వస్థతలు చేసారు గానీ, ఈ పిల్లవాడి విషయములో మాత్రము ఏమీ చేయలేకపోయారు.

ఇక్కడ మనము తీసుకోవలసిన విషయము ఏమిటి అంటే, మనము అనేకమైన సార్లు మనము కావలసిన దానికొరకు చేసే ప్రార్థనలో మనము అనుభవించిన ఓటమి ఆధారముగా చేసే ప్రార్థన కనబడుతుంది. అయితే మనము చేసే ప్రార్థన దేవుని మాట మీద నమ్మకము పై ఆధారపడి ఉండాలి గానీ, మనము చేసిన వ్యర్థప్రయత్నముల మీద కాదు.

రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు–ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని -మత్తయి 14:25-29

ఇక్కడ పేతురు మొదట భూతమని భయపడ్డాడు గానీ, తరువాత ఎప్పుడైతే యేసయ్య “నేనే భయపడకుడి” అని చెప్పాడో, వెంటనే, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. దీనికి కారణము పేతురు యొక్క మొదటి అనుభవము. యేసయ్య మాట చొప్పున వల వేసాడు, విస్తారముగా పొందుకున్నాడు. అనుక చెప్పినది యేసయ్యే అయితే ఖచ్చితముగా ఇది కూడా జరుతుంది అనే నమ్మకము.

మన ప్రార్థన కూడా పేతురు వలే దేవునిలో మనము కలిగిన అనుభవము మీద ఆధారపడి ఉండాలి. యేసయ్య చనిపోయిన తరువాత, పేతురు తిరిగి చేపలు పట్టుకొంటాను అని ఆ జీవితము వైపు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, అయితే, యేసయ్య ఉన్నప్పుడు తనవద్ద నిత్య జీవపు మాటలు ఉన్నాయి, ఎప్పుడైతే యేసయ్య చనిపోయాడో, ఇంక ఆ మాటలు తనతో లేవు అని పేత్రుతు అనుకున్నాడు,

అయితే ఎప్పుడైతే యేసయ్య కనికరపడి తనను తాను ప్రత్యక్షపరచుకొన్నాడో ఆ అనుభవము పేతురు ఇంక ఎన్నడూ తొలగి పోకుండా నిలబడేలా చేసింది.

నీవు నమ్మి ప్రార్థన చేసినపుడు నీ అంతరాత్మలో ఆనందము సంతోషము కలుగుతుంది. అంటే నీవు చేసే ప్రార్థన ఖచ్చితముగా నెరవేరుతుంది.

తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది; ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనము కూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము.౹ -1 యోహాను 4:17

ఆయన ఎట్టివాడై యున్నాడో మనము కూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము, అయితే ఇది నీవు ఆయనను నమ్మినపుడే సాధ్యము! ఆమేన్! అందుకే యేసయ్య ఎలా అయితే నీళ్ళపై నడిచాడో, అదే విధముగా పేతురు నడిచినవాడై ఉన్నాడు.

–నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.౹ –నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.౹ మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడైయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,౹ అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక౹ దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.౹ -రోమా 4:18-21

నీవు నమ్మి ప్రార్థించినపుడు అవరోధములు చుట్టూ కనపడినప్పటికీ, నీ దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో ఎరిగినవాడవై నిలబడాలి గానీ నీ స్థితిని చూడకూడదు.

పేతురు విషయములో ఒకసారి గమనిస్తే –

గాలిని చూచి భయపడి మునిగిపోసాగి – ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను. వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. -మత్తయి 14:30-31

పేతురు తన పరిస్థితిని చూడకుండా యేసునే చూస్తూ నడిచినంతసేపు నీళ్ళపై నడిచాడు. అయితే మధ్యలో వచ్చిన గాలిని చూసి, ఏకాగ్రత తప్పిందో, అప్పుడు మునిగిపోసాగాడు. అందుకే మనము కూడా ఒకసారి ప్రభువు కొరకు నమ్మి నిలబడుతున్నామో, దానినుండి ఏ పరిస్థితిని బట్టి తొలగిపోకూడదు.