01-Jan-2024 నూతన సంవత్సరపు ఆరాధన

స్తుతిగీతము – 1

నీ కృపలో నన్ను దాచావు యేసయ్య- యేసయ్య
నేను బ్రతికి ఉన్నానంటే నీ దయ నీ దయ
నీ జీవమే నాలో ఉండగా నాకు భయమే లేదయ్య
నా తండ్రిగా నీవు ఉండగా నాకు కోరత లేదయ్య
నీ తోడు నాకు ఉంటే చాలయ్య చాలయ్య
ఏదైనా సాధ్యమే నీతో యేసయ్య- యేసయ్య-

ఏ త్రోవ లేకున్నా నిరాశలో ఉన్న
నీ జీవ వాక్యముతో నను నడుపుము యేసన్న
దయచూపుమా దీవించుమా
సమృద్ధి జీవంతో తృప్తిపరచుమా

పేరు ప్రాఖ్యతలు ఉన్నా సంపదలు ఉన్నా
నీ కృప లేకపోతే అన్నియు వ్యర్థమే
నీ కనికరం నీ కరుణ
జీవితానికి చాలు యేసయ్య

కనురెప్పపాటైనా నను విడువని యేసయ్య
నీ సేవ చేయుటకె జీవిస్తానయ్య
నా ప్రార్థన ఆలకించుమా
పరిపూర్ణమైనదానిగ అభిషేకించుమా

స్తుతిగీతము – 2

అన్ని కాలంబులలో ఉన్న మా దేవుడవు
తండ్రి కుమార శుధ్ధాత్మ దేవా ॥2॥

దర్శించుమయా వర్షించుమాపై
ఫలభరితులుగా చేయుమయా
తొలకరి వర్షం కడవరి వర్షం
పంటను విస్తారం చేయుమయ ॥2॥

సంవత్సరములు జరుగుచుండగా
నూతనపరచు నీ కార్యములన్
పరిశుధ్ధాత్మతో మము వెలిగించి
శక్తిమంతులుగ చేయుమయా ॥2॥
“దర్శించుమయా”

జీవ వాక్యముతో మము బ్రతికించి
సత్యముతో స్వాతంత్రులు జేయుము
సజీవ సాక్ష్యులై సర్వలోకముకు
రాయబారులుగా జీవించెదం ॥2॥
“దర్శించుమయా”

వెనుకవి మరచి ముందున్న వాటికై
క్రీస్తు యేసు నందు దేవుని
ఉన్నత భహుమానము కొరకై
గురియొధ్ధకే పరుగెత్తదము ॥2॥
“దర్శించుమయా”

ఆరాధన వర్తమానము

మన దేవుడు మంచివాడు. ఈ సంవత్సరమంతా తన మంచిని మన యెడల కనపరచేవాడుగా ఉన్నాడు. మన జీవితాన్ని సంతోషముతో తృప్తిపరచేవాడుగా ఉన్నాడు. పుట్టినప్పటినుండి కుంటివాడిగా ఉన్నవాడిని యేసు నామమే స్వస్థ పరచింది.

నూతన సంవత్సరపు మొదటి రోజున మన దేవునిని ఆరాధించాలి. మనము యేషువా యేషువా అంటూ ఆయన నామమును స్తుతిస్తూ నూతన సంవత్సరమును ఆరంభించాము. ఇప్పుడు కూడా మనము దేవునిని ఆరాధిద్దాము ఎందుకంటె ఆయనను ఆరాధించినపుడు ఆయన శక్తి వెల్లడిపరచబడింది.

ప్రవచనాత్మకముగా 12 నెలలకొరకు 12 గంపలు ప్రభువు సిద్ధపరచాడు. ఈ గంపలలో ప్రతీ నెల, ప్రతి రోజు కూడా అవసరమైనది సిద్ధపరచబడింది. ఈరోజు కు కూడా అవసరమైనది సిద్ధపరచబడింది.

మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు – 2 కొరింథీ 6:18

ఈ నూతన సంవత్సరము దేవుని మహిమ చేత సిద్ధపరచబడిన సంవత్సరము. దేవుని ఆలయములో దేవుని మహిమ నిండి ఉంటుంది. ఈ సంవత్సరము తన బాహు బలము చేత, సూచక క్రియల చేత, చాచిన చేతుల చేత, మహత్కార్యముల చేత నిర్మించబడింది.

“నేను వారిలో నివాసముంటాను” అంటే దాని అర్థము, సిద్ధపరచిన సంవత్సరమంతా దేవుడు మనతో నివాసము ఉండేవాడుగా ఉన్నాడు. “నివసించి సంచరింతును” అంటే, ఈ సంవత్సరములోని 12 నెలలలో ఆయన సంచరించును.

కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు – 2 కొరింథీ 6:19-20

ఈ సంవత్సరమంతా మనతో ఉండి, మనతో ప్రతి నెల సంచరించి, సిద్ధపరచిన గంపలతో మనలను తృప్తిపర్చేవాడుగా ఉన్నాడు. అంతే కాక, దేవుడిగాను, తండ్రిగాను మన జీవితములో ఉన్నాడు. తండ్రి పోషించేవాడు గనుక మన వర్తమానమును సూచిస్తుంది. దేవుడు భవిష్యత్తును స్థిరపచేవాడు గనక అది భవిష్యత్తును సూచిస్తుంది.

తండ్రిగా వర్తమానము అనగా ఈ నెల కొరకు సిద్ధపరచేవాడుగానూ, దేవుడిగా రానున్న నెలల కొరకు సిద్ధపరచేవాడుగా ఉన్నాడు.

ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా? – మత్తయి 6: 26

తండ్రిగాను, దేవుడిగానూ పోషించే తండ్రిని బట్టి మనము 12 గంపలు ఈ సంవత్సరము ఎత్తవలసినదే. అయితే ఈరోజు మనము ఆయనను గ్రహించినవారమై, ఎరిగినవారమై, నమ్మినవారమై, స్వీకరించినవారమై ఆరాధిద్దాము. అప్పుడు మన దేవుని శక్తి మనలో పరిపూర్ణమై ఉంటుంది.

ఈ సంవత్సరము జీసస్ కేర్స్ యూ కుటుంబములో ఉన్న ప్రతి వారి జీవితములో నాశనము అనేదే ఉండదు. ప్రభువు నామమే మహిమ పరచబడును గాక!

ఆరాధన గీతము

నా యేసయ్యా నా రక్షకా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)

ప్రేమింతును నీ సన్నిధానమును
కీర్తింతును యేసయ్యా (2)

నా విమోచకుడా నా పోషకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
||ప్రేమింతును||

నా స్నేహితుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
||ప్రేమింతును||

నా విమోచకుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)
||ప్రేమింతును||

మన దేవుడు ఈ సంవత్సరమును ఎంత పర్ఫెక్ట్ గా నిర్మించాడో చూస్తే. మనము చర్చ్ గురించి ప్రార్థించినపుడు, దైవ జనునికి “నిన్ను ముద్ర ఉంగరముగా చేతును” అని వాగ్దానము ప్రభువు ఇచ్చాడు.

నూతన సంవత్సరపు వాగ్దానము – “శత్రువు బలమంతటిపై నీకు అధికారము ఇచ్చియున్నాను” అని దైవ జనునికి ఇవ్వడము జరిగింది. అలాగే మన అందరికీ కూడా నెరవేర్చబడే వాగ్దానములు ఇవ్వబడినవి. ఈ వాగ్దానమును ఎలా స్వతంత్రించుకోవాలి అనే సత్యము గూర్చి ఆలోచిస్తే, ఖచ్చితముగా మనము చేయవలసింది ఉంది. కొన్ని సార్లు ఆయన ప్రేమను కనపరుస్తూ సిద్ధపరుస్తారు. అయితే మనము చేయవలసినది చేయకుండ ఉంటే అది ఆలస్యము అవుతుంది.

ఇదివరకే నేను గెలిచితిననియైనను, ఇదివరకే సంపూర్ణసిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేనినిమిత్తము క్రీస్తు యేసుచేతపట్టబడితినో దానిని పట్టుకొనవలెననిపరుగెత్తు చున్నాను. ఫిలిప్పీ 3:12

చాలా సందర్భములలో మనము జరిగినవాటితో తృప్తిపడిపోయే పరిస్థితిలో ఉంటాము. అయితే అలా తృప్తి పడిపోకుండా, ఇప్పుడు ప్రభువు నాకు ఏమి మాట ఇచ్చాడో ఆ మాట నెరవేర్పు కొరకు నేను పరిగెత్తుచున్నాను. అనగా ఆసక్తి కలిగి కనిపెట్టాలి.

ఈ సంవత్సరము 12 అద్భుతములు ప్రభువు దాచి ఉన్నాడు గనుక, ఆ అన్నీ మనము పొఇందుకోవాలి అనే ఆశ మనము కలిగి ఉండాలి.

సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను – ఫిలిప్పీ 3:13-14

నీకు చేయబడిన వాగ్దానము వెనుక ఒక ఆశీర్వాదము దాచబడి ఉన్నది. ఈ వాగ్దానము నెరవేర్పు కొరకు వేగిరపడి పరిగెట్టమని వాక్యము చెప్పుచున్నది. దాని కొరకు నీకు ఇవ్వబడిన వాగ్దానము నీ ఎదురుగా ఎల్లప్పుడు కనపడులాగున సిద్ధపరచుకోవాలి.

మన జీవితము అనేక రకములైన పరిస్థితుల గుండా వెళుతుంది. అప్పుడు అవసరమైన బాహుబలమైనా, సూచక క్రియ అయినా, మహత్కార్యమైనా మరి ఏదైనా చేసి ఆ పరిస్థితినుండి నిన్ను తప్పించేవాడిగా ఉన్నాడు. నీవు దేవుని సాక్షిగా ఉండాలి అంటే ఆయన ఏమి చెప్పాడో మనకు గుర్తుండాలి కదా! ఆసక్తి నీకు ఉంటే నీవు ఖచ్చితముగా నీవు అదే విధముగా సిద్ధపడతావు.

అపవాది దేవుడు ఇచ్చిన వాగ్దానమును మన నుండి తొలగించడానికి ప్రయత్నిస్తాడు గనుక మనము తప్పక వేగిరపడి సిద్ధపరచబడాలి. మనము వేగిరపడేది దేనికి అంటే ఇవ్వబడిన వాగ్దానము యొక్క నెరవేర్పు ప్రత్యక్షపరచబడటానికి.

కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలు పరచును. అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము.

మనకు లభించిన క్రమము ఏమిటి అంటే – ప్రభువు చెప్పిన మాటలు మర్చిపోకుండునట్లు కంటికి ఎదురుగా పెట్టుకుని, వాటి నెరవేర్పు కొరకు వేగిరపడి కనిపెట్టాలి.

ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై,తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. – హెబ్రీ 6:17-18

దేవుడు మాట ఇచ్చాడు అంటేనే మనము అర్హులుగా మార్చబడ్డాము. ఈ సంవత్సరము ముగింపు కొరకు మనము అర్హులము. ఆల్రెడీ సిద్ధపరచిన దానిలోనికి నిన్ను నడిపించాడు అంటేనే నిన్ను ఆయన వాగ్దానమునకు అర్హుడిగా చేసినట్టు అర్థము చేసుకోవచ్చు కదా!

వాగ్దానము చేయబడినది నిశ్చలమైనది గనుక ఈ సంవత్సరము నెరవేర్పు సంవత్సరము. “మనయెదుట ఉంచబడిన నిరీక్షణను” అనగా ఎవరైతే ఇవ్వబడిన వాగ్దానము యొక్క నెరవేర్పు కొరకు ఆశ కలిగి నిరీక్షణ కలిగిన వారిని సూచిస్తుంది. “వాగ్దానమును దృఢపరచెను” అనగా ఇవ్వబడిన వాగ్దానమును ముద్రించాడు. ఇంక అది జరగవలసినదే అని దాని అర్థము.

కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి. 1 కొరింథీ 15:58

అనగా మీరు ప్రభువునందు వాగ్దానము నెరవేర్పు కొరకు మీకు ఉన్న నిరీక్షణ వ్యర్థము కాదు. దాని నెరవేర్పు కొరకు ఆయనఏ నీ ముందర నడుస్తున్నాడు గనుక మనము నిరీక్షణలో స్థిరులుగా ఉండాలి. అలా ఉండి ప్రభువు కార్యము కొరకు ఆసక్తి కలిగి ఉండాలి.

ఇశ్రాయేలు గోత్రములు 12. ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క రాయి. ఇవన్నీ రాబోయే తరములకు జ్ఞాపకార్థ సూచన గా ఉన్నాయి. గనుక ఈ సంవత్సరము యొక్క వాగ్దానము యొక్క నెరవేర్పు అనగా 12 అద్భుతములు రాబోయే తరములు ఆశీర్వదించబడునట్లు ఈ సంవత్సరము ఉంది.

వాగ్దానమును స్వతంత్రించుకున్న గుంపులో మనము కూడా ఉండాలి అనే ఆశ ఆసక్తి కలిగి ఈ సంవత్సరపు వాగ్దానము స్వతంత్రించుకుందాము.