ఆరాధన వర్తమానము
ఆయన ప్రేమ, కృప మరియు ప్రణాళికను బట్టి మనలను ఆయన సన్నిధిలో నిలబెట్టారు గనుక, ఆయనకే స్తుతియు మహిమ ఘనత కలుగునుగాక! ఈ దినము ఎంతో శ్రేష్టకరమైన దినము. రాబోవు వారమంతా నీవు జీవింపచేయబడునట్లు ఈ దినము సిద్ధపరచబడింది.
దేవునిని ఆరాధిచువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి గనుక, ఒక సత్యము నేర్చుకుందాము. నిన్ను పిలిచిన దేవుడు ఏమై ఉన్నాడో ఖచ్చితముగా నీవు జ్ఞాపకము పెట్టుకోవాలి. ఇది ఒక్కరోజులో తెలుసోకోగలిగే సత్యము కాదు గానీ, మన జీవితమంతా ఆయన వాక్యానుభవము యొక్క ప్రత్యక్షత ద్వారా ఆయనను లోతుగా తెలుసుకోగలుగుతాము.
దేవునిని స్తుతించడానికి నేనే ముందుండాలి అనే ఆశ ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలోనికి మనము రావాలి. అగ్నిగుండముల వంటి శ్రమలలో మనము ఉన్నప్పుడు మనలను మరచిపోని దేవుడు, సింహపు బోనువంటి పరిస్థితులలో మనలను విడిచిపెట్టని దేవుడు. అగ్నిగుండములో గనుక మనము పడితే, వెంటనే బూడిదగా అయిపోతాము, సింహము కొంచెము కొంచెముగా పీక్కుని తింటుంది. అకస్మాత్తుగా జీవితమును ముగించే సందర్భమైనా, కొంచెము కొంచెముగా జీవితమును నాశనము చేసే పరిస్థితి అయినా మన దేవుడు చెయ్యి విడిచిపెట్టక మనలను తప్పించి కాపాడుతున్నాడు.
అంతే కాక మన జీవితమును ముగించుకోవాలి అనే ఆలోచన అపవాది పుట్టించగానే, దేవుడు తన ప్రేమను వెల్లడిపరచి, ప్రత్యక్షపరచి ఆ ఆలోచనలనుండి తప్పించాడు, తప్పిస్తున్నాడు. అందుకే ఆయనది మరువని, మరచిపోని ప్రేమ!
యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. -కీర్తనలు 100:3
మనము ఆయన వారము గనుక ఆయన తన ప్రేమ చేత మనలను నడిపిస్తున్నాడు. మనము ఆయన ప్రజలము గనుకనే మనలను తప్పిస్తున్నాడు. ఆయన గొర్రెలము గనుకనే ఆయనే మనలను పోషిస్తున్నాడు. మన దేవుడు నిత్యము ఉండేవాడు. మరొకలా చూస్తే, మనము ఎటువంటి వారము అనే సంగతి తెలియాలి అంటే ఆయన ఎటువంటివాడో మనము తెలుసుకోవాలి.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇదిగో నేను నేనే నా గొఱ్ఱెలను వెదకి వాటిని కనుగొందును.౹ -యెహెజ్కేలు 34:11
మనము ఆయన వారముగా ఉన్నప్పుడు, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. నేను నేనే నా గొఱ్ఱెలను వెదకి వాటిని కనుగొందును అని ప్రభువు చెప్పుచున్నాడు. నశించే స్థలములో నన్ను వదలక నన్ను వెతికి కనుగొన్నాడు. ఒకవేళ మనలను కనుగొనకపోతే మన జీవితములో ఇప్పటికే నాశనము అయిపోయేవారము. ఈ దినము ఇంకా మనము జీవింపచేయబడుతున్నాము అంటే, దేనికొరకు? ఆయన మహిమ కొరకు ఆయనను స్తుతించుటకొరకు, ఆయన కొరకైన సజీవ సాక్ష్యముగా ఉండుటకు.
తమ గొఱ్ఱెలు చెదరిపోయి నప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱెలను వెదకి, చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలోనుండి వాటిని తోడుకొని వచ్చి, ఆయా దేశములలోనుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను.౹ -యెహెజ్కేలు 34:12-13
యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయితే, ఆయన ఏమై ఉన్నాడో అనే సత్యము నీవు గుర్తించేవరకు నీవు ఆయన ఇచ్చే ఆశీర్వాదమును నీవు అనుభవించలేవు. నీవు ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఉంటే నిన్ను వెతికేవాడిగా ఉంటాడు. ఒకవేళ నీవు ఏమైనా పోగొట్టుకొంటే నీవు ఎలా వెతుకుతావు? పోగొట్టుకొన్నది నీది గనుక నీకు ఆ బాధ ఉంటుంది, వెతికి పట్టుకోవాలి అనే ఆశ ఉంటుంది. అలాగే నీ తండ్రి అయిన దేవుడు కూడా నీవు ఆయన వాడివి గనుక, “నా కుమారుడు, నా కుమార్తె” అనే ఆలోచన గలిగి వెతికి రక్షించేవాడుగా ఉన్నాడు.
ఈ లోకములో ఉన్నవాటికి విలువ కొంచెమే గానీ, నీ విలువ దేవుని దృష్టిలో ఎంతో గొప్పది. “చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి” అనగా ఏ పరిస్థితిలో నీవు చెడిపోయావో ఆ పరిస్థితులనుండి నిన్ను తప్పించి, “వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి”, అనగా ఏ స్థితిలో నీవు ఉండాలో ఆ స్థితిలోనికి నిన్ను తీసుకువచ్చి నిలబెడతాడు.
మన దేవుడు ఏమై ఉన్నాడో అనే సంగతి ఎరిగి ఉంటే, మన మనస్సులో ప్రశ్నలు ఉండవు గానీ, జవాబులే ఉంటాయి. ఏ పరిస్థితి అయినా సరే నా దేవుడు పని చేస్తున్నాడు, నేను ఉండవలసిన స్థితిలోనే నేను ఉంటాను. సమయము కొంచెము ఆలస్యము అయినా సరే, నేను ఉండవలసిన స్థానములోనే నేను ఉంటాను.
“వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను” – అనగా నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును – కీర్తన 1:3. అనగా మన జీవితము ఆశీర్వాదమే!
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. -కీర్తనలు 23:1 – సత్యము మనము ఎరిగినపుడు, ఈ వాక్యమే మన ధైర్యము.
ఆరాధన గీతము
విడువనిది ఎడబాయనిది యేసు నీ ప్రేమ
వారము కొరకైన వాక్యము
అపవాది ఎప్పుడు మ్రింగుదునా అని అవకాశము కొరకు ఎదురుచూస్తుంది. అంతే కాక, నీ జీవితము గూర్చి, దేవునికి అపవాదికి ఎల్లప్పుడు వైరము ఉంటుంది.
దేవుని సన్నిధిలో నేను దేవుని కుమారుడిని, దేవుని కుమార్తెను అని ప్రకటిస్తున్నపుడు, అపవాది సిగ్గుపరచబడతాడు, వాడు ఓడిపోతాడు. మనము స్తుతించినపుడు ఏమి జరుగుతుంది అంటే, నీవు దేవునికి చెందినవాడివి అనే ఆ సత్యము బలముగా ప్రకటించబడుతుంది. అపవాది ఖచ్చితముగా సిగ్గుపరచబడతాడు.
సౌలును ఇశ్రాయేలీయులును కూడివచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయుల కెదురుగ యుద్ధపంక్తులు తీర్చిరి.౹ -1 సమూయేలు 17:2
గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులోనుండి బయలుదేరు చుండెను. అతడు ఆరుమూళ్లజేనెడు ఎత్తుమనిషి.౹ -1 సమూయేలు 17:4
అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగినయెడల మేము మీకు దాసుల మగుదుము; నేనతని జయించి చంపినయెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు.౹ ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించినయెడలవాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచువచ్చెను.౹ సౌలును ఇశ్రాయేలీయులందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. -1 సమూయేలు 17:9-11
కొన్ని శ్రమలు, పోరాటాలు అపవాది మనలను నాశనము చేయడానికి అయితే, కొన్ని శ్రమలు దేవుని మహిమ కొరకు దేవుడు అనుమతిస్తాడు. అన్నిటికంటే గొప్ప ఉదాహరణ, క్రీస్తు శ్రమపడకపోతే, అసలు మనకు ఈ జీవితమే లేదు. శిష్యులు శ్రమపడకపోతే, ఈరోజు సువార్త అనేదే లేదు. క్రీస్తుకొరకు పడే శ్రమలో విజయముంది, ప్రభువు యొక్క మహిమ ఉంది.
మనము చదివిన వాక్యభాగములో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలపైకి యుద్ధానికి వచ్చి 40 రోజులు వారిని హేళన మాటలతో భయపెడుతూ ఉండగా, దావీదు అక్కడకు రావడము జరిగింది. దావీదు వచ్చేవరకు అక్కడ పరిస్థితి భయకంపితముగా ఉంది. అయితే దావీదు వచ్చినతరువాత పరిస్థితి మారింది. ఎందుకు అని ఆలోచిస్తే,
అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను – ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.౹ -1 సమూయేలు 16:1
సౌలును విసర్జించి ఆ స్థానములో దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు గనుక, సౌలు స్థానములో దావీదు రాజుగా వచ్చునట్లుగా, ఆ శ్రమను ప్రభువు అనుమతించాడు. ఏర్పాటుచేయబడిన వాడు వచ్చేవరకు వారు భయముతో ఉన్నారు గానీ, ఓడిపోలేదు. మన జీవితములో కూడా, ఆశీర్వాదము కొరకు దేవుడు ఏర్పాటు చేయబడిన పరిస్థితి కలుగుటకు, శ్రమ అనుమతించబడుతుంది. దేవుడు ఏర్పాటు ప్రకారామే మన పోరాటములలో విజయము గానీ, మన స్వంత బలము, జ్ఞానము ప్రకారము మనము ఏమి జయించలేము. అపవాదిని జయించే శక్తి మనకు లేదు గానీ మన శక్తి మన దేవుడే.
ఇశ్రాయేలు ప్రజల పరిస్థితిలో దావీదు అక్కడకు నడిపించబడ్డాడు గానీ తనంతట తాను అక్కడికి వెళ్ళలేదు. దావీదు అక్కడకు వచ్చినది ఒకపని నిమిత్తము అయితే అతడు చేస్తున్నది వేరేపని. మన జీవితములో కూడా మనమున్న పోరాటములో సొల్యూషన్ ఉంది. ఏ పరిస్థితికి అయినా నీ జీవితమును నాశనము చేసే అధికారములేదు. అయితే ఒకే కండిషన్ ఏమిటి అంటే, నీవు ఇశ్రాయేలీయుడవై ఉండాలి అనగా దేవునికి చెందినవాడివిగా ఉండాలి.
ఇశ్రాయేలీయులలో ఒకడు –వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే; నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరు చున్నాడు, వానిని చంపినవానికి రాజు బహుగ ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లిచేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగాచేయు ననగా దావీదు–జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారి నడుగగా -1 సమూయేలు 17:25-26
జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? అనే మాట దావీదు ఉపయోగించాడు. ఇక్కడ రెండు గుంపులు ఉన్నాయి. ఒకటి జీవము గల దేవుని సైన్యము, మరొకటి సున్నతిలేని సైన్యము.
దావీదు చెప్పుచున్న మాటలు, ఏమిటి అంటే- మనము దేవునికి చెందినవారము, ఆయన సొత్తైనవారము. అటువంటి వారి జీవితములో వచ్చిన పరిస్థితి ఏ పాటిది? అనే ఆలోచన మనము కలిగి ఉండాలి. దావీదు అభిషేకించబడినవాడు గనుక, వచ్చిన పరిస్థితిలో భయమును పారద్రోలే మనసు మనము కలిగి ఉండాలి. దేనిని బట్టి మనము అలా నిలబడగలము? దేవుని గూర్చిన సత్యమును బట్టియే!
సౌలు–ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను.౹ అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను–మీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱెపిల్లను ఎత్తికొని పోవుచుండగ నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱెను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని.౹ మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు,౹ సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటియొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు–పొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను. -1 సమూయేలు 17:33-37
దావీదు మొదట నిలబడినపుడు కృంగదీసే మాటలు వచ్చాయి. నీవు బాలుడవు, పైగా యుద్ధముచేయడము తెలియని వాడవు అని సౌలు చెప్పగా, దావీదు మాత్రము తాను నమ్మిన దేవుని గూర్చిన సత్యము పై మాత్రమే నిలబడుతున్నాదు. సింహమునుండి, ఎలుగుబంటి నుండి తప్పించిన దేవుడైన యెహోవా ఈ దినమున కూడా నన్ను తప్పిస్తాడు. శత్రువుగా ఎవరు నిలబడినా సరే, ఆ సింహము, ఎలుగుబంటివలె అగుదురు అని చెప్పగలుగుతున్నాడు.
ఫిలిప్తీయుడు–కఱ్ఱ తీసికొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను.౹ -1 సమూయేలు 17:43
ఇక్కడ దావీదు చిన్న కర్రపట్టుకుని గొల్యాతును ఎదుర్కోవడానికి వెళుతున్నాడు. దానిని చూసిన గొల్యాతు తమ దేవతల పేరట దావీదును శపిస్తున్నాడు. అయితే దావీదు ఎలా ఉన్నాడు?
దావీదు–నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.౹ -1 సమూయేలు 17:45
గొల్యాతు అపవాది పేరట నిలబడుతున్నాడు, దావీదు దేవుని పేరట నిలబడుతున్నాడు. దేవుని పేరట నిలబడే మనకే విజయము అదే ఖచ్చితం. గనుక మన మనసును సిద్ధపరచుకుందాము, మన దేవుని పేరట నిలబడదాము, విజయము పొందుకుందాము. దావీదు అయిదు రాళ్ళు తీసుకొన్నాడు గాని, మొదటి రాయితోనే గెలిచినవాడుగా ఉన్నాడు. అదే విశ్వాస పరిమాణము మనము కూడా కనపరుద్దాము.