01-09-2024 – ఆదివారం మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

యెహోవామందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. -కీర్తనలు 84:2

మనము సంతోషముగా ఉన్నప్పుడు మనము కేకలు వేయటానికి అవకాశము ఉంటుంది. అదే బాధలో ఉన్నపుడు అటువంటి ఆశ తక్కువగా ఉంటుంది. అయితే దేవుని సన్నిధికి వచ్చినపుడు, మన హృదయము మరియు శరీరము ఆనందముతో కేకలు వేసే స్థితిలో ఉండాలి. ఆదివారము కొరకైన ఆశ, దేవుని స్తుతించుటకొరకైన ఆశ మనము కలిగిఉండాలి. అప్పుడు దేవుడు నీ యందు సంతోషించేవాడిగా ఉంటున్నాడు.

మన అందరికీ దేవుని చేత మంచి సాక్ష్యం పొందాలి అనే కోరిక అందరికీ ఉంటుంది. అయితే ఏ విధముగా ఉంటే దేవుడు ఇష్టపడతాడో తెలియజేసే దేవుని వాక్య మర్మములను మనము పట్టుకొని వాటిపై నిలబడాలి.

కీర్తనాకారుని ఆశ మందిరము యొక్క భౌతికమైన రూపము కొరకు కాదు గానీ, ఆ మందిరములో దేవుని ప్రసన్నత కొరకైన ఆశ. ఆత్మీయమైన జీవితము అంటే నీకు నీ దేవునికీ మాత్రమే సంబంధించినది. దైవ జనులు నిన్ను దేవుని వద్దకు నడిపించడానికే, దేవుని సన్నిధిలో నిలబెట్టడానికే.

దేవునిని స్తుతించడానికి ఎవరికి బడితే వారికి అవకాశము లేదు. పరిశుద్ధులు మాత్రమే స్తుతించగలుగుతారు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. మనము రక్షించబడటమే, మనకు దొరికిన భాగ్యము. ఈ లోకములో ఏమున్నా లేకున్నా యేసు చాలును.

గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి. -కీర్తనలు 24:7

ఈ మాటలో మన జీవితములు చూడలి అంటే, మనము ఆయన నివసించే గృహముగా అర్థము చేసుకోవాలి. గృహమునకు వ్యక్తులు లోపలికి రావడానికి గుమ్మములు ఉంటాయి. గుమ్మములు పడిపోయినప్పుడు, ఆ గృహములోనికి ప్రవేశించడానికి ఉండదు. మన వ్యక్తిగతమైన పరిస్థితిలో పడిపోయిన స్థితిలో, ప్రభువు ప్రవేశించడానికి అవకాశము లేని స్థితిలో ఉంటున్నాయి అని ప్రభువు ఈ వాక్యము ద్వారా చెప్పుచున్నాడు.

ఇప్పుడు ఆ గుమ్మములను పైకెత్తి, అనగా అవి ఉండవలసిన రీతిలో ఉండులాగున సిద్ధపరచుకోవడము. అలా సిద్ధరపచుకున్నపుడు, మహిమగల రాజు ప్రవేశిస్తాడు. ఎంత గొప్ప భాగ్యమో కదా!

నిజానికి మన హృదయములో ప్రభువు నివాసము ఉండాలి. అయితే మన పరిస్థితుల ప్రభావము చేత, ప్రభువుకు మనకు దూరము పెరిగిపోయే పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితిలో మనము సమాధానము కోల్పోతాము. దేవునికి మనకు మధ్య ఏదీ రానివ్వవద్దు. ఆయన లేకుండా ఏమున్నా వ్యర్థమే, ఆయన ఉండి ఏమి లేకున్నా మన జీవితము సంతోషమే. ఈ దినము నీకు నీ దేవునికి మధ్య దూరము పెరిగిన స్థితి నీవు గమనిస్తే, నిన్ను నీవు ఈరోజు సిద్ధపరచుకో!

పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి – అనేమాట చూస్తే, అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమందు కూర్చున్నాడు, అనగా ఒక కష్ట కాలములో ఎదురుచూస్తున్న సమయముగా మనము ఇంతకు ముందు చూసాము. ద్వారము అనేది ఎవరైనా రావడానికి, పోవడానికి ఉపయోగపడేది. అంటే అనేక దినములుగా ఎదురు చూసిన ఆశీర్వాదము దొరకక కృంగిపోయిన పరిస్థితి. మిమ్మును లేవనెత్తుకొనుడి, అనగా ఇప్పుడు ఆశకలిగి సిద్ధపడు అని అర్థము.

మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా. -కీర్తనలు 24:8

అలా సిద్ధపడినపుడు నీలో ప్రవేశించే మహిమగల రాజు బలము కలిగినవాడు, యుద్ధశూరుడు అయిన యెహోవా. నీవు అనేక దినములుగా ఎదురుచూస్తున్నప్పటికీ నీవు పొందక దేని నిమిత్తమైతే కృంగిపోయావో, దానిని పొందుకొనే నిమిత్తము నిన్ను నీవు సిద్ధపరచుకొనుము.

ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును. -సామెతలు 12:25

మనము కలిగిన అనేకమైన విచారములను బట్టి మనము కృంగిపోయిన స్థితిలో మనము దేవునిని ఆరాధించలేము. అయితే ఈరోజు ఒక దయగల మాట మనకు చెప్పబడింది. ఆ మాటను బట్టి మనము సంతోషముగా ఆరాధించగలుగుతాము. గనుక మన హృదయమును మనము సిద్ధపరచుకుందాము.

యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. -కీర్తనలు 3:3

మన తలపైకెత్తువాడు మన దేవుడే గనుక ఈరోజు మనలను మనము సిద్ధపరచుకోగలుగుతాము. మన దేవుడు మహిమ గల రాజు, యుద్ధ శూరుడు గనుక, ఏ విచారమైతే మనలను కృంగదీసిందో, దానినుండి విడుదల ఖచ్చితముగా ఉంటుంది. ఆమేన్!

గనుక నీ శక్తిని, నీ జ్ఞానమును చూడవద్దు గానీ, నీకున్న మహిమ గల రాజు బలశౌర్యములు కలిగినవాడు గనుక ఆయన వైపు చూడు. ఆయనను బట్టి నీ విచారము, అవమానము తప్పించబడతాయి. ఈ లోకములో ఎవరున్నా లేకున్నా ఆయన నీకున్నాడు. మన పక్కన ఎవరైన నిలబడి ధైర్యాన్నిస్తే, ఎంతో ఆదరణగా ఉంటుంది. అయితే మన తోడు మనతో ఉండువాడు ఆయనే గనుక, మనము ఎంతో సంతోషముగా నిశ్చింతగా ఉండగలుగుతాము.

 

ఆరాధన గీతము

ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా

 

వారము కొరకైన వాక్యము

దేవుడు కోరుకొనేది మన హృదయమే అని వాక్యము పదే పదే గుర్తుచేస్తుంది. ఈ భూలోకములో మనము దేవునికి ఇవ్వగలిగినది ఏమైనా ఉంది అంటే, అది మన హృదయమే!

హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. -మత్తయి 5:8

హృదయమును పరిశుద్ధముగా ఉంచుకొన్న వాళ్ళు ఖచ్చితముగా దేవుని చూసేవారుగా ఉంటారు. మన హృదయము దేవుడు కోరుకొనేవాడుగా ఉన్నాడు గనుక, మనము దానిని ఆయనకొరకే సిద్ధపరచుకోవాలి. మన హృదయము దేవుని సొంతమైతే, మనలో నుండి జీవధారలు బయలుదేరతాయి. ఒకవేళ మన హృదయము అపవాదికి సొంతమైతే, అది బహు ఘోరమైనది, మోసకరమైనది.

నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము -సామెతలు 4:23

ఈ వాక్యము ప్రకారము హృదయమును కాపాడుకోవలసిన అవసరము మనదే. అసలు హృదయమును కాపాడుకోవలసిన పరిస్థితి ఉంటుందా? ఉదాహరణకు చూస్తే, మన హృదయము తలంపులచేత నింపబడేది. ఎలాంటి తలంపులు అని ఆలోచిస్తే, దేవునిని వెంబడించేవాడవైతే, దేవుని గూర్చిన తలంపులు ఉంటాయి. అపవాదిని వెంబడించేవారమైతే, అపవాదికి సంబంధించిన తలంపులే వస్తాయి.

అయితే మన హృదయములో ఏమి నింపబడాలి? ఏమి నింపబడి ఉన్నాయి? ఒక గ్లాసును పూర్తిగా నీళ్ళచేత నింపివేసాము అనుకోండి. ఇంకా దానిలో ఇంకా నీళ్ళు పోస్తే, ఆ నీళ్ళు బయటికి పొర్లిపోతాయి. అలాగే మన హృదయములో అపవాది తలంపులచేత నింపబడి ఉంటే, దేవుని విషయములు ఎంత విన్నా సరే, అవి వ్యర్థమైపోతాయి. అయితే అపవాది తలంపులన్నీ తొలగించినపుడు, విన్న దేవుని మాటలు హృదయములో భద్రపరచబడతాయి.

నీవు ఆత్మీయముగా వృద్ధిచెందాలి అంటే, ఏవైతే లోకానుసారమైన తలంపులు మన హృదయములో ఉంటే, వాటిని మొదట తీసివెయ్యాలి. ఉదాహరణకు సినిమాల వలన అనేకమైన లోకానుసారమైన ఆలోచనల చేత నిండిపోతుంది. అప్పుడు దేవుని ఆలోచనలు మనలో నిలిచిఉండలేవు.

ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను – నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు. -సామెతలు 4:4

ఈరోజు దేవుని మాటలు నీకు బోధించబడుతున్నాయి. అయితే ఈ మాటలు నీవు పట్టుకొని నిలబడాలి అంటే, నీకు పట్టుదల కావాలి. అప్పుడే మనము బ్రతుకుతావు, అనగా నీవు జీవము కలిగి ఉంటావు.

నా హృదయము దేవుని ఆలయము నేను పాడు చేయను అనే తీర్మానము తీసుకొని, పట్టుదల కలిగి నిలిస్తే, నీవు ఖచ్చితముగా నిలబడగలుగుతావు.

నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్యకుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము. -సామెతలు 4:20-21

మన హృదయమును ఎలా భద్రము చేసుకోవాలి అంటే, వాక్యము ద్వారానే. వాక్యము తప్ప ఇంక ఏదీ మన హృదయములో ఉండటానికి వీలు లేదు. దేవునికి తప్ప మన హృదయములో మరి దేనికీ ఇంక చోటు ఇవ్వకూడదు.

దొరికినవారికి అవి జీవమునువారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. -సామెతలు 4:22

ఎవరికైతే ఆ వాక్యము దొరికిందో, వారికి జీవమే. అందుకే మన హృదయాన్ని వాక్యముతో భద్రము చేసుకోవాలి.

నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. -కీర్తనలు 119:11

ఒకవేళ మనము వాక్యము గనుక హృదయములో భద్రపరచుకోలేని స్థితిలో ఉంటే, ఏ భయము లేక పాపమును లోకానుసారముగా చేసేవారముగా ఉంటము. అయితే మన హృదయమును వాక్యముతో నింపుకుంటే, పాపము చేయకుండా మనము మనలను కాపాడుకొనే స్థితిలో ఉంటాము. వాక్యమునకు సమయము ఇచ్చేవారు వాగ్దానమును స్వతంత్రిచుకుంటారు.

లోకము మన హృదయములోనికి జొరబడడానికి ఎంతో ప్రయత్నము చేస్తుంది గనుక మనము హృదయములో వాక్యము లేకుండా జాగ్రత్తపడలేము. మన హృదయములో వాక్యముతో పాటుగా విశ్వాసము కూడా కలిగి ఉండాలి.

యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. -కీర్తనలు 28:7

మన హృదయమును వాక్యముతో సిద్ధపరచుకోవాలి అంతే కాక, విశ్వాసముతో కూడా సిద్ధపరచుకోవాలి.

అదేమనగా–యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.౹ -రోమా 10:9

మనము హృదయములో విశ్వాసములేని కారణముచేత దేవుడు చేసే అద్భుతకరమైన కార్యములు మనము కోల్పోతున్నాము. విశ్వాసము అనేది పెదాలద్వారా వచ్చేది కాదు గానీ హృదయములోనుండి వచ్చేది.

మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి భయము వేసే పరిస్థితి మానవ రీత్యా ఉంటుంది. అయితే ప్రభువు వాక్యమును నిరంతరము ధ్యానము చేయువాడు, ఆ ధ్యానించిన వాక్యమందు విశ్వాసము కలిగినవాడు, ఖచ్చితముగా ఆ భయము కలిగించే పరిస్థితినుండి తప్పించబడతాము.

నేనున్న పరిస్థితిని జయించగలవాడు నా ప్రభువే అని నోటితో ఒప్పుకొని, మృతమైన ప్రతీ పరిస్థితినీ జీవింపచేయగలవాడు నా ప్రభువే అని నా హృదయమందు విశ్వసించి, నీవున్న పరిస్థితిలో సమకూర్చబడి, నెరవేర్చబడి, సాక్ష్యముగా ఉండగలుగుతావు.

ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు. -కీర్తనలు 73:1

వాక్యము చేత నీ హృదయమును సిద్ధపరచుకుంటే, నీవు శుద్ధహృదయము కలిగినవాడిగా ఉంటావు. అప్పుడు ఖచ్చితముగా నీ యెడల దేవుడు దయాళుడై ఉంటాడు. అప్పుడు నీ జీవితములో నిత్యము సమృద్ధి సంతోషము ఆనందమే.

యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు? వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే. -కీర్తనలు 24:3-4

శుద్ధహృదయము కలిగినవాడు యెహోవా పర్వతమును ఎక్కగలుగుతావు. అనగా ఆయన యెదుట ఆయన సన్నిధిలో నిలబడే అవకాశము నీవు కలిగి ఉంటావు.

నిన్ను ఎరిగినవారియెడల నీ కృపను యథార్థహృదయులయెడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. -కీర్తనలు 36:10

యదార్థమైన హృదయము కలిగినపుడు దేవుని యొక్క నీతి నీ యెడల కనపరచబడుతుంది. గనుక ఈరోజు ప్రభువు చెప్పిన మాటల ద్వారా నీ జీవితమును సిద్ధపరచుకొందాము,