01-03-2026 – ఆదివారము మొదటి ఆరాధన

ఆరాధన వర్తమానము

హల్లెలూయ. ప్రైస్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనల్ని అందరిని కూడా ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవ దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లిస్తున్నాను. ఆమెన్. హల్లెలూయ.

ఈరోజు మనందరం కూడా దేవుని సన్నిధికి నడిపించబడ్డాము. దేవుని చేత ఆకర్షించబడ్డాము. ఇది మనకు చాలా ధన్యకరమైనది. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండడానికే ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని బయట వెతుకుతుంటారు. కానీ దేవుణ్ణి స్తుతించినప్పుడు మన హృదయంలో ఒక నిజమైన ఆనందం పుడుతుంది. దేవుని మహిమ పరిచినప్పుడు మన అంతరంగంలో ఆనందం ఉబికి వస్తుంది. అటువంటి అనుభవంలోకి మనందరం రావాలి.

మనం దినదినము దేవునిలో కట్టబడుతున్న సందర్భంలో ఈ విషయాలు మనకు గ్రహించబడతాయి. అలవాటుగా ఆదివారం చర్చికి వచ్చి, పాటలు పాడి, కొంతసేపు ఉండి వెళ్ళిపోతే, దాని వల్ల జీవితం మారదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఎదుగుతున్నావో, యేసుక్రీస్తు ప్రభువు యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నావో, అప్పుడు నువ్వు దినదినము ఆత్మీయంగా వృద్ధి చెందుతావు.

చాలా మంది “మా కోసం ప్రార్థన చేయండి, మేము ఆత్మీయంగా ఎదగాలి” అంటారు. ప్రార్థన ద్వారా ఆత్మీయ జీవితం వృద్ధి చెందదు. ఆత్మీయత అనేది దేవుని అనుసరించడాన్ని బట్టి వృద్ధిలోనికి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని సిద్ధపరుచుకుంటావో, నీ జీవితం ఆటోమేటిక్‌గా ఆత్మలో వృద్ధి పొందుతుంది.

నువ్వు దినదినము దేవునికి దగ్గర అవుతున్నప్పుడు క్రీస్తు యొక్క స్వభావము నీలో ధరింపబడుతుంది. క్రీస్తు తండ్రిని మహిమపరచకుండా ఉండలేడు. తండ్రి నుండి వేరుపడలేడు. ఆ క్రీస్తు స్వభావం నీలోకి వచ్చినప్పుడు నీవు కూడా తండ్రిని మహిమపరచే వాడవుతావు.

మన దేవుని బట్టి సంతోషించినప్పుడు మన హృదయం అంతరంగం నుండి ఆనందం ఉప్పొంగుతుంది. ఈ లోకంలో ఒక క్రికెటర్ బాగా ఆడితే మనకు సంతోషం కలుగుతుంది. కానీ మన జీవితంలో ఏ మార్పూ రాదు. కానీ దేవుని బట్టి సంతోషించినప్పుడు, ఆయన ఎటువంటి వాడో గ్రహించినప్పుడు, ఆయన నీ కొరకు సమస్తమును అనుకూలపరచే వాడని తెలిసినప్పుడు, నీ హృదయం ఉప్పొంగిపోతుంది.

ఆయన నీ పక్షముగా నిలబడే వాడు. నీ కొరకు సమస్తమును నెరవేర్చే వాడు. ఈ సత్యం నీకు తెలియజేయబడినప్పుడు నువ్వు సంతోషించే వాడవుతావు.

యెహోవా మా ప్రభువా. యేశువా మా రక్షక.

ఆయన నిజంగా నీకు రక్షకుడై ఉన్నాడని నువ్వు గ్రహించగలిగితే, ఆయనను స్తుతించినప్పుడు నీ హృదయం ఉప్పొంగిపోతుంది.

1 పేతురు 2:9 లో ఇలా చెప్పబడుతుంది:

“మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుటకై ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై యున్నారు.”

మనము చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలవబడ్డాము. ఒకసారి మన జీవితాన్ని పరిశీలించాలి. ఎటువంటి చీకటి స్థితిలో నుండి ఆయన మనల్ని రక్షించాడో మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. నువ్వు మొదటి స్థితిని మర్చిపోతే నీ జీవితం దిగజారుతుంది.

చీకటి అంటే జీవం లేని స్థితి. నాశనం. కానీ ఆయన నాశనకరమైన స్థితి నుండి మనలను తీసుకుని వెలుగులో పెట్టాడు. వెలుగులో జీవం ఉంది. ఆశ ఉంది. ఉద్దేశం ఉంది.

ఆయన గుణాలను ప్రచురించుటకై మనలను ఎన్నిక చేసుకున్నాడు. ఆయన కరుణామయుడు. ప్రేమామయుడు. శక్తిమంతుడు. లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు. మృతమైన దాన్ని సజీవం చేయగలిగిన వాడు. ఆ శక్తి మన ద్వారా కనపరచబడాలి.

మన జీవితంలో మృతమైనది ఏదైనా ఉంటే, ఆయన శక్తి దానిని సజీవం చేస్తుంది. ఇదే దేవుని ఉద్దేశం.

మత్తయి 16:16-18 లో ఇలా చెప్పబడుతుంది:

“సీమోను పేతురు ఉత్తరమిచ్చి — నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అనెను. అప్పుడు యేసు అతనితో — సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు; పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరచెను గాని, నరులు కాదు. మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును; పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవు.”

ఏలియా, యిర్మియా, యోహాను ప్రవక్తలు. వారు దేవుని విషయాలను ప్రకటించారు. కానీ క్రీస్తులో ఆ గుణాలు సమగ్రంగా కనపరచబడ్డాయి.

యోహాను 1:12 లో ఇలా చెప్పబడుతుంది:

“తనను ఎందరు అంగీకరించిరో వారికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు అధికారము ఇచ్చెను.”

నువ్వు ఆయనను అంగీకరించినప్పుడు నీవు దేవుని కుమారుడవుతావు. ఆయన గుణాలు నీలో కనపరచబడాలి. ఏలియా చేసిన అద్భుతం, యోహాను ప్రకటించిన సువార్త, ప్రవక్తల ధైర్యం – ఇవన్నీ నీలో కనపరచబడాలి.

బైబిల్ దేవుని వాక్యము. వాక్యము లేకపోతే జీవం లేదు. ఆత్మ జీవింపజేయబడేది వాక్యముచేతనే. ఎంత బిజీ అయినా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరచకూడదు.

మనము రాజులైన యాజక సమూహము. పరిశుద్ధ జనము. దేవుని సొత్తైన ప్రజలు. లేవి గోత్రానికి దేవుడే స్వాస్త్యమైనట్లు, మనకు దేవుడే స్వాస్త్యము. ఇది అత్యున్నత ధన్యత.

ఇశ్రాయేలు గోత్రాలకు భూమి పంచబడింది. కానీ లేవికి దేవుడే స్వాస్త్యము అని చెప్పబడింది. దేవుడే స్వాస్త్యమైతే, అది సుపర్‌నాచురల్ ధన్యత. మనము కూడా యాజకులము. ఆయన సన్నిధిలో నిలబడగలుగుతున్నాము.

యోహాను 4:23-24 లో ఇలా చెప్పబడుతుంది:

“ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించువారు కావలెను; ఎందుకనగా తండ్రి అటువంటి వారినే కోరుచున్నాడు. దేవుడు ఆత్మయే; ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను.”

సత్యం ఏంటంటే — ఆయన నాకు రక్షకుడు.

మనము ఆయన సొత్తైన ప్రజలు. మనము ఆయన కుమారులు. అపవాది ఈ కుమారత్వాన్ని తీసివేయాలని ప్రయత్నిస్తాడు. కానీ మనము డిక్లరేషన్‌తో నిలబడాలి.

యెహోవా మా ప్రభువా. యేశువా మా రక్షక.

రక్షణ, స్తోత్రం, బలము, ప్రభావము, శక్తి, ఐశ్వర్యము ప్రభువు యేసువే.

ఈరోజు మనము సత్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. అపవాది సిగ్గుపడిపోవాలి. మనము లేచి నిలబడి దేవుని స్తుతించడానికి సిద్ధపడదాం. హల్లెలూయ.

వారము కొరకైన వాక్యము

మరొకసారి యేసయ్య నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను.

దేవుని ఆరాధించినప్పుడు చాలా విషయాలు జరుగుతాయి. ఆరాధన ఒక మార్గము. దేవుని యొక్క శక్తి దిగి రావడానికి ఇది ఒక వేయి. ఆరాధన జరిగినప్పుడు కొన్ని విషయాలు కనపరచబడతాయి. వాటిని దర్శనాలు అంటారు. కొంతమందికి దేవుడు ఆ వరమును ఇచ్చిన వాడిగా ఉంటాడు.

కాబట్టి మీరు దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు ఏదో ఒకటి చేయుచున్నాడని గ్రహించాలి. కేవలం ఆరాధించి వెళ్ళిపోవడం కాదు. దేవుడు నీ జీవితంలో ఏమి చేయబోతున్నాడో నీవు గ్రహించగలిగిన స్థితికి ఎదగాలి. ఆరాధనలో దేవుని శక్తి నిన్ను తాకవచ్చు. దేవుడు ఏదైనా కనపరచవచ్చు. ఈ విషయాలలో మీరు ఆత్మీయంగా ఎదగాలి. దేవునికి మహిమ కలుగును గాక.

నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న సందర్భంలో ఒక మాట నన్ను ఎంతో సంతోషపరిచింది. అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను.

యెహోషువ 23:8 లో ఇలా చెప్పబడుతుంది:

“మీరు నేటివరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను.”

ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఇదే — ఇప్పటివరకు మీరు ఎలాగైతే దేవునిని హత్తుకొని ఉన్నారో, ఇకముందు కూడా అలాగే ఉండాలి.

ఇది మరింత స్పష్టంగా ద్వితీయోపదేశకాండము 4:4 లో ఇలా చెప్పబడుతుంది:

“మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరును నేటి వరకు సజీవులై ఉన్నారు.”

హత్తుకొనిన వారందరూ సజీవులై ఉన్నారు. దేవునిని హత్తుకొనిన వారు జీవముతో ఉన్నవారు.

ఇక్కడ రెండు గుంపులు ఉన్నాయి. ఒక గుంపు దేవునిని హత్తుకొనినవారు — వారు సజీవులు. ఇంకొక గుంపు ఏదో చేశారు — వారు నాశనం అయ్యారు. వాళ్ళు ఏమి చేశారో మనం తెలుసుకుంటే మనం జాగ్రత్త పడగలము.

సంఖ్యాకాండము 25:1-3 లో ఇలా చెప్పబడుతుంది:

ఇశ్రాయేలీయులు షిత్తీయములో దిగియుండగా మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసిరి. వారు తమ దేవతల బలులకు ప్రజలను పిలిచిరి. ప్రజలు వారి దేవతలకు నమస్కరించిరి. అప్పుడు యెహోవా కోపము రగులుకొనెను.

దేవుని హత్తుకొని జీవించాలి అంటే ఒక సత్యం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి — నీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.

ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి దేవుడే నడిపిస్తున్నాడు. కానీ మార్గమధ్యంలోనే దేవుని విడిచిపెట్టి లోకంలో ఉన్నదానితో మోహించారు. అది సరదాగా మొదలైంది. కానీ అది వ్యభిచారముగా మారింది.

ఈరోజు మనము అటువంటి శారీరక వ్యభిచారంలో ఉండకపోయినా, లోకం మనలను ఆకర్షించగలదు. లోకంలో ఉన్నది రమ్యంగా కనబడుతుంది.

లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి — లోకంలో ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఇవి మనలో ఉండకూడదు.

లోకంలో ఉన్నదాన్ని మన జీవితంలోకి తీసుకొస్తే తెగులు వస్తుంది. అదే సంఖ్యాకాండము 25లో — 24,000 మంది చనిపోయారు. వారికి కూడా కనాను దేశపు వాగ్దానం ఉండేది. కానీ వాగ్దానం నెరవేర్చబడలేదు.

లోకంలో ఉన్నదాన్ని జీవితంలోకి తెచ్చుకోవడం వాగ్దానాన్ని ఆపివేస్తుంది.

నయోమి కథ చూడండి. రూతు 1:3-5 లో ఇలా చెప్పబడుతుంది — మోయాబులో నివసించిన తరువాత ఆమె భర్త చనిపోయెను, తరువాత ఆమె ఇద్దరు కుమారులు చనిపోయిరి.

మోయాబు దేవుడు ఏర్పాటు చేసిన స్థలం కాదు. దేవుడు నడిపించే మార్గం విడిచి వెళితే నాశనం వెంట వస్తుంది.

కాబట్టి దేవునిని హత్తుకొని జీవించాలి అంటే —

  1. లోకంలో ఉన్నది మనలోకి రాకూడదు.

  2. విశ్వాసముతో జీవించాలి.

  3. ఆయన ఆజ్ఞలను గైకొనాలి.

  4. మన జీవితం ఆయన మహిమ కొరకు ఉండాలి.

ద్వితీయోపదేశకాండము 4:9-10 లో ఇలా చెప్పబడుతుంది:

“నీవు కనులారా చూచిన వాటిని మరువకుండునట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము; నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పుము.”

నువ్వు దేవునిని ఎలాగైతే హత్తుకొంటున్నావో, అదే నీ పిల్లలకు నేర్పాలి. కోట్లు సంపాదించడం కంటే సుపర్‌నాచురల్ జీవితం నేర్పడం గొప్పది.

దేవుని హత్తుకొని జీవిస్తే నీకే కాదు, నీ తర్వాత తరానికి కూడా క్షేమం కలుగుతుంది.

ద్వితీయోపదేశకాండము 4:40 లో ఇలా చెప్పబడుతుంది:

“నీ దేవుడైన యెహోవా నీకును నీ తర్వాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగునట్లు, నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను గైకొనవలెను.”

ఇంకా ద్వితీయోపదేశకాండము 4:34 లో ఇలా చెప్పబడుతుంది:

“తన కొరకు ఒక జనమును తీసుకొనుటకు శోధనలతోను సూచక క్రియలతోను మహత్కార్యములతోను యుద్ధముతోను బాహుబలముతోను యత్నము చేసిన దేవుడు వేరొకడు ఉన్నాడా?”

దేవుడు ఒక జనమును తన కొరకు తీసుకున్నాడు. నీ జీవితం నీకొరకు కాదు — ఆయన కొరకు.

నీవు ఆయన జనమై ఉంటే సూచక క్రియలు, మహత్కార్యాలు, యుద్ధాలలో విజయం — ఇవన్నీ నీ పక్షముగా జరుగుతాయి.

నీ జీవితం ఆయన మహిమ నిమిత్తమే.

నీ మాటలో ఆయన మహిమ.

నీ నడకలో ఆయన మహిమ.

నీ జీవనశైలిలో ఆయన మహిమ.

యెహోషువ 23:6-8 లో ఇలా చెప్పబడుతుంది:

“మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని, ఎడమకు గాని కుడికి గాని తొలగిపోక, మీరు నేటివరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను.”

ఇప్పటివరకు నిన్ను సజీవంగా ఉంచింది నీ ఆత్మీయ జీవితం. ఇకముందు కూడా అదే కొనసాగాలి. ఒకసారి ఎక్కి, ఒకసారి పడిపోవడం కాదు. స్థిరత్వం అవసరం.

విశ్వాసం మాటలలో కాదు, క్రియలలో కనబడాలి. కాలేబు చెప్పినట్లుగా — “మనము జయించగలము.” అది విశ్వాసం.

లోకానికి దూరంగా ఉండాలి.

విశ్వాసముతో జీవించాలి.

ఆయన వాక్యమే మన జీవితం కావాలి.

“ఇక జీవించువాడను నేను కాదు; క్రీస్తే నా యందు జీవించుచున్నాడు” అని గలతీయులకు 2:20 లో చెప్పబడుతుంది.

వాక్యమే నీ జీవితం కావాలి.

దేవునిని హత్తుకొనిన వారందరూ సజీవులు. నీవు కూడా సజీవుడై ఉండాలంటే ఈ నియమాలు నీలో నెరవేరాలి.

ఈరోజు మనము పరిశీలించుకుందాం. లోకంలో ఉన్నది ఎక్కడైనా మనలోకి వచ్చి ఉంటే, ఈరోజే పశ్చాత్తాపపడదాం. దేవునిని మరలా హత్తుకొని నిలబడదాం.

హల్లెలూయ. దేవునికి స్తోత్రం.