01-01-2025 – నూతన సంవత్సరపు ఆరాధన

స్తుతిగీతములు

నూతన సంవత్సరం దయచేసిన దేవా

ఆరాధన వర్తమానము

నూతనన సంవత్సరములోని మొదటి దినము దేవునిని మహిమ పరచడానికి, ఆయనను స్తుతించడానికి మనకు ఇవ్వబడింది. దేవుని వాక్యము మన జీవితాలకు, పరిచర్యకు ఆధారమైనది. ఆ వాక్యము మనకు ముందుగా పోవుచూ మెట్టగా ఉన్న స్థలములను సరాళముగా చేస్తుంది.

ఆదామును సృష్టించక మునుపే ఆదాముకొరకు సమస్తము సిద్ధపరచారు. 2025 దేవుని నామమును స్తుతించడానికి, మహిమపరచడానికే ఇవ్వబడింది. ఆయన కొరకైన సాక్షిగా నిన్ను దేవుడే నిలబెడతాడు.

ఆదామును సృష్టించకమునుపు ఆదాము కొరకు దేవుడు ఎలా సిద్ధపరచారు? తన వాక్కు చేత. అలాగే మన జీవితములో కూడా మన అవసరములు తీర్చబడటానికి దేవుని మాట, ఆయన వాక్కు గనక, అదే మనకొరకు సృష్టించేదిగా, సిద్ధపరచేదిగా ఉంటుంది. అందుకే దేవుని సన్నిధిలో ఏమి వాక్కు విడుదల అవుతుందో అనే ఆశ, ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే కీర్తనాకారుడు నీ వాక్యము నా పాదములకు దీపము అని చెప్పుచున్నాడు. మనకు వాక్కు విడుదల అయింది కాబట్టి ఇంక మనము భయపడనవసరము లేదు.

ఈ సంవత్సరమును దేవుడే నిన్ను ప్రేమించి ఒక బహుమానముగా ఈ సంవత్సరమును ఇచ్చాడు. బహుమానము మనము పొందినపుడు, కృతజ్ఞత చెల్లించాలి. ఈ మొదటి దినమునుండే దేవునికి మన హృదయమును అర్పిద్దాము. ఆ మొదటి దినమునుండి ఆయనే మనలను నడిపించేవాడిగా, రాజుగా, తండ్రిగా మనము ఒప్పుకుందాము.

ఆరాధన గీతము

యేసుసామి నీకు నేను నా సమస్త మిత్తును

నూతన సంవత్సరపు వాక్యము

మన జీవితము సంతోషముగా, సమాధానముగా, సమృద్ధిగా ఉండటానికి చాలా ప్రయత్నములు చేస్తాము. ఎందుకంటే ఈ జీవితము మనది కాబట్టి, దానిని గూర్చి అనేకమైన ప్రయత్నములు చేస్తావు. అయితే ప్రభువు చెప్పుచున్నాడు, నీవు నా సొత్తు అని చెప్పుచున్నాడు. అంటే మన జీవితముకొరకు ప్రభువు కూడా ప్రయత్నములు చేసి తన చిత్తమే నెరవేర్చబడునట్లు ఆయన కార్యములు చేసేవాడిగా ఉన్నాడు.

ఆయన ముందుగా పోవుచూ మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసేవాడిగా ఉన్నాడు. ఆయన పోక మునుపే పరిస్థితి మెట్టగా ఉంది అయితే మనకంటే ముందుగా ఆయన వెళుతూ మెట్టగా ఉన్న దానిని సరాళము చేసేవాడిగా దేవుడు ఉన్నాడు. నీవు నీ మెట్టగా ఉన్న పరిస్థితికి వెళ్ళకమునుపే వాక్కు ముందుగా విడుదల అయింది. నీ ముందు ఉన్న లోయ పూద్చబడుతుంది. నీకంటే ముందుగా ఆయన ప్రయాణము చేస్తున్నాడు అంటే దాని ఉద్దేశ్యము, సరాళము చేయడానికే. గనుక ఇది కృంగిపోయే సమయము కాదు గానీ, సంతోష భరితులయ్యే సమయము. నీవు కన్నవాటిని, విన్నవాటిని బట్టి స్తోత్రము చేయుదువు. దేవుని ఆత్మ చేత వెల్లడిపరచబడేవి ఖచ్చితముగా నెరవేరబడతాయి.

ఈ దినము నేను నీవాడను దేవా అని మనము ప్రకటించాము. “నేను నీ వాడను దేవా” అనే ఈ మాట ఎంతో శక్తి గలది. చిన్న కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, సమస్తము కోల్పోయాడు. అయితే తండ్రి వద్దకు తిరిగి కుమారుడు వచ్చి, నేను నీ కుమారుడనుగా అనిపించుకోవడానికి యోగ్యుడను కాను అని చెప్పాడు. అయితే ప్రేమగలిగి, ఆ కుమారుడి కొరకు ఎదురు చూసిన తండ్రి అతనిని అక్కున చేర్చుకున్నాడు, ఇంతకు ముందు ఆ తప్పిపోయిన కుమారుడు ఎలా ఉండేవాడో, అదేవిధముగా తిరిగి సిద్ధపరచి, అతడికి నూతన వస్త్రములు ధరింపచేయుడు, ఉంగరము తొడుగుడి, చెప్పులు తొడుగుడి అని ప్రకటిస్తున్నాడు. అంటే తన పూర్వపు మంచి స్థితికి తాను తీసుకువెళ్ళబడ్డాడు. మరొకలా చూస్తే, తండ్రి గౌరవమునకు తగినట్టు, ఆ తండ్రి మహిమ పరచబడే విధముగా సిద్ధపరచాడు. ఒక గొప్ప విందు అక్కడ జరిగించబడింది.

ఈ దినము మనము నేను నీవాడను అని ప్రకటించాము. ఈ ప్రకటన ఎంతో శక్తివంతమైనది. మన ఎదుట ఇద్దరే ఉన్నారు. ఒకరు దేవుడు, మరొకరు అపవాది. అయితే మనము దేవుని వారము అని ప్రకటించాము. దేవుడు జీవాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు, అపవాది మరణమునకు తీసుకువెళ్ళేవాడిగా ఉన్నాడు. ఈరోజు మనము చేసిన ప్రకటన బట్టి మనము మరణమును దాటి జీవములోనికి ప్రవేశించాము.

నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹ -యోహాను 5:24

ఆయన వారమైన మనము మరణములోనుండి జీవములోనికి దాటియున్నాము. మరణము అనగా అపజయమును సూచిస్తుంది. అంటే అపజయమునుండి మనము విజయమునకు దాటి ఉన్నాము. ఈ దినము మనము “నేను నీ వాడను” అని ఒప్పుకున్నాము, ఇప్పుడు ఆ ప్రకటన యొక్క ఫలము స్థిరపరచబడుతుంది. ఎందుకంటే, నేను నీవాడను నీవు చేసిన ప్రకటనకు, పరిశుద్ధాత్మ దేవుడే సాక్షిగా ఉన్నాడు. ఈ సత్యమునకు నీవు సాక్షిగా ఉండబోతున్నావు, దాని కొరకైన మార్గములు దేవుడే తెరచేవాడుగా ఉన్నడు. దేవుడు దానికొరకి చేయబోయే కార్యములు నీవు కన్నులారా చూచెదవు.

పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. -యెషయా 45:3

ఇదిగో, నేనును, యెహోవా నా కిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యములకధిపతియగు యెహోవావలని సూచనలుగాను, మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయులమధ్య ఉన్నాము. -యెషయా 8:18

యెహోవా వలన దీవించబడినదానివిగా సూచనగా నీ జీవితము సాక్ష్యముగా ఉంటుంది. “నేనును నా పిల్లలును ఇశ్రాయేలీయుల మధ్య మహత్కార్యములకొరకైన మాదిరిగా, సూచనగా, సాక్ష్యముగా ఉండబోతున్నాము”, ఈ మాట నీవు నమ్మి స్వీకరించు! ఇశ్రాయేలీయులు అనగా దీవించబడినవారు, వారి మధ్య సూచనగా ఉండబోతున్నారు.

“సీయోను కొండ” పరిశుద్ధమైన పర్వతము, దేవుని పర్వతము. ఆ సీయోను కొండమీద నివాసము చేయబోతున్నావు. దేవుని యొక్క సన్నిధి నిత్యము నీకు తోడై ఉన్నది.

తప్పిపోయిన ఈ నా కుమారుడు తిరిగి వచ్చాడు అని ప్రకటిస్తున్నాడు. నీవు నీ జీవితములో ఏదైతే ఆశపడి పోగొట్టుకొన్నావో, ఈ సంవత్సరము ప్రభువే నీకిచ్చి నీ జీవితములో మహిమపరచబడబోతున్నాడు. నూతన కార్యములు దేవుడు చెయ్యబోతున్నాడు, నీవు దేవుని సొత్తై ఉన్నావు. నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లిపోతుంది అనే అనుభవమునకు నీవు సాక్షిగా ఉండబోతున్నావు.

మహిమ వెంబడి మహిమ, కార్యము వెంబడి కార్యము, సంతోషము వెంబడి సంతోషము, సమాధానము వెంబడి సమాధానము నీవు పొందుతున్నావు. ఈ సంవత్సరము ప్రత్యేకమైనదానిగా ప్రభువు ముద్రించాడు.

విత్తువాడు విత్తుటకు బయలుదేరాడు, విత్తనము నాటబడి ఉన్నది. ప్రభువే నాటినవాడై ఉన్నాడు. ఆ విత్తనము వేయకమునుపే నేల శుభ్రపరచబడింది. అయితే ప్రభువు విత్తనములు నాటినవాడుగా ఉన్నాడు. విత్తనములు జీవము గలవి.

విత్తనములు ముప్పదంతలుగాను, అరువదంతలుగాను, నూరంతలుగాను ఫలించబడ్డాయి. ఈ సంవత్సరము నిర్ణయించబడినది. అనేకమైన కార్యములు నీ జీవితములో కలుగును గాక! 2025 మంచి నేల. విత్తువాడు ప్రభువే, ఆయన బయలుదేరాడు. విత్తనాలు చల్లుతూ పొలమంతా వెళుతున్నాడు. ఈ 2025 ఆ పొలము అయి ఉన్నది, దినములు గడిచే కొద్దీ జీవము గలిగిన విత్తనములు చల్లబడుతూ ఉంటాయి, ఫలములు పొందుకొంటూనే ఉంటావు. ఈసారి మిస్స్ అవ్వకూడదు.

యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుచేసి కొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచు చున్నాను ఆయనకొరకు నేను కనిపెట్టుచున్నాను. -యెషయా 8:17

అయితే చెప్పబడిన వాగ్దానములు నీవు స్వతంత్రించుకోవాలి అంటే, యెహోవాను నమ్ముకొని ఎదురుచూసేవారిగా ఉండాలి. “యెహోవాను నమ్ముకొనునేను ఎదురుచూచు చున్నాను ఆయనకొరకు నేను కనిపెట్టుచున్నాను”. దినములు గడుస్తూ ఉండగా నీవు జ్ఞాపకము చేసుకోవలసిన సత్యము ఏమిటి అంటే, అద్భుతమునకు నీవు దగ్గరవుతున్నావు. వర్షము లేకపోయినా, గాలి వీచకపోయినా నీళ్ళు ఉండకమానవు. ఈ సంవత్సరము ఎలీషా సంవత్సరము, రెండింతల ఆశీర్వాదపు సంవత్సరము. నీవును నీ ఇంటివారును ఈ వాగ్దానము స్వతంత్రించుకొందురు.

అయితే మనము ఎలా ఎదురుచూడాలి?

నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను – కీర్తన 63:2

ఈ సంవత్సరము మన శక్తిని బట్టి కాదుగాని, దేవుని ఆత్మచేత సూపర్ నేచురల్ ఆశీర్వాదములు, కార్యములు జరిగించబడతాయి. యెరుషలేములోను, యూదయలోను, సమరయలోను ప్రభువుకే సాక్ష్యముగా నీవు ఉందువుగాక! నీ కష్టమును బట్టికాదుగానీ, యేసు ముద్ర నీపై ఉన్నందుకే నీ జీవితములో కార్యములు జరుగుతాయి.

నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు -కీర్తనలు 63:4
దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకు దును -కీర్తనలు 63:1

రాత్రి పడుకొనే ముందు ఖచ్చితముగా నీవు ధ్యానము చేసుకోవాలి. అలాగే వేకువనే నీవు లేచినతరువాత ఆయనను నీవు జ్ఞాపకము చేసుకొని, ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. రాత్రి ప్రార్థన చేయాలి, ఉదయమున కృపకొరకు కనిపెట్టుకోవాలి.

ఈ ప్రమాణవాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యుల కప్పగింపుము. -యెషయా 8:16

రాత్రికాలములో దేవుడు చేసిన ప్రమాణ వాక్యమును జ్ఞాపకము చేసికొని, దానికొరకు ప్రార్థలో ముద్రించాలి. వేకువన లేచి ఏ కార్యము జరుగుతుందో అని కనిపెట్టాలి. అలా కనిపెట్టినపుడు, దేవుడు చెప్పిన మాట నెరవేర్పు చూస్తావు.

ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు.౹ -యెషయా 8:20

ఒకవేళ ఆ ప్రమాణ వాక్యమును విచారించి, ఆ వాక్య ప్రకారము బోధించిన యెడల అరుణోదయము కలుగుతుంది అనే కదా! మీరు ముద్రించిన ప్రమాణ వాక్యము బట్టి మీకు అరుణోదయము కలుగుతుంది.